Previous Page Next Page 
హిమసుందరి పేజి 33

      "ఉహూ!"

    "టాబ్ లెట్ యివ్వనా ?"

    "ఉహుహు!" అన్నాడు రామకృష్ణ దుప్పటి ముసుగులోంచి.

    "తలనొప్పి అయితే దుప్పటి దేనికి - తీయండి." దుప్పటి లాగుతూ అంది సీత.

    "చలిగా వుంది సీతా! పైత్య జ్వరం వస్తుందేమో!" దుప్పటి తీయకుండా అన్నాడు రామకృష్ణ.

    సీత దుప్పటిలోంచి చెయ్యిపోనిచ్చి, రామకృష్ణ నుదుటి మీద చెయ్యి వేసింది.

    నీళ్ళలో ముంచినట్లు చెమట కారిపోతున్నది.

    "జ్వరం లేకుండా చలిగా వుండటం - ఈ చెమట, తలనొప్పి నాకేదో అనుమానంగా వుంది. కొంపముంచి యిదేదన్నా పెద్ద వ్యాధి అయితే?- డాక్టర్ దగ్గరకు వెళదాం పదండి!"

    "నాకు ఓపిక లేదు. నేను రాను."

    "డాక్టరుని పిలుచుకురమ్మంటారా?"

    "ఏమివద్దు. నన్ను విసిగించక వెళ్ళి టాబ్లెట్, వేడి కాఫీ లాంటిది యివ్వు."

    "అలాగే! ముందా ముసుగుతీసి మాట్లాడండి."

    "చలి. ముందా అమృతాంజనం యిచ్చివెళ్ళు."

    "అది రాచుకుంటే మీకు వాంతులవుతాయి."

    "ఏం ఫరవాలేదు. విసిగించక యివ్వు సీతా!"

    "మీకు రాచుకోటం రాదు. నేను రాస్తాను."

    "వద్దు. ముందు వేడిగా ఏదన్నా యివ్వు."

    "మాయదారి తలనొప్పి కాదుగాని - ఈయన ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది" అనుకుంటూ సీత లేచి వెళ్ళింది.

    వంట గదిలోకి వెళ్ళంగానే సీతకి అనుమానం వచ్చింది- కాఫీ కావాలో, హార్లిక్స్ కావాలో అని.....

    ఆ విషయం రామకృష్ణని కనుక్కోటానికి బెడ్ రూమ్ లోకి వచ్చింది సీత.

    రామకృష్ణ అలమర దగ్గర అటుతిరిగి నుంచుని ఉన్నాడు.

    సీతకి ఏదో అనుమానం వచ్చి కిటికీ పక్కకి తప్పుకుంది.

    రామకృష్ణ అలమరలో చేయిపెట్టి కంగారుగా ఏదో వెతుకుతున్నాడు. చివరికి ఓ డబ్బా తీశాడు.

    ఆ డబ్బా గుర్తుపట్టింది సీత.

    ఏలకులు, లవంగాలు పోసి పెట్టిన చిన్న స్టీలు డబ్బా.

    రామకృష్ణ చెంచాడు ఏలకులు, లవంగాలు చేతిలో వంపుకుని, మొత్తం ఒకేసారి నోట్లో పోసుకుని పరపర నమిలాడు. ఆ తర్వాత ఇష్ అనుకుంటూ గబగబా చెమట అద్దుకున్నాడు. అమృతాంజనం డబ్బాని తీసుకున్నాడు ఆ తర్వాత.

    రామకృష్ణ అమృతాంజనం సీసాని చేతులోకి తీసుకున్న విధానం ఎలా వుందంటే- తప్పనిసరి పరిస్థితులలో ఆశుద్ధాన్ని చేత్తో ఎత్తిపట్టుకున్న తీరుగా.

    రామకృష్ణ నాటకం ఆడుతున్నట్లు సీతకి అర్ధమయిపోయింది. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా భద్రకాళి బెడ్ రూమ్ లో అడుగుపెట్టినట్లు - సీత బెడ్ రూమ్ లోకి వచ్చింది.

    సీతని చూడంగానే గతుక్కుమన్నాడు రామకృష్ణ చేతిలో ఉన్న అమృతాంజనం సీసా జారి కిందపడింది.

    గబుక్కున ఆ సీసాని తీసుకుంది సీత.

    "నీవు యివ్వమంటే యివ్వలేదు. అందుకని నేనే లేచి.....ఉహుహు..... చలి- చలి....." అంటూ రామకృష్ణ మంచం దగ్గరకు రాబోయాడు.

    సీత మంచానికి అడ్డుగా నిలిచి "ఆ కుర్చీలో కూర్చోండి. మాట్లాడాలి" అంది గాంభీర్యంగా ముఖంపెట్టి.

    "అదికాదు సీతా!" అన్నాడు రామకృష్ణ. ఓ పక్క చెంచాడు లవంగాలు నమిలేసరికి నోరంతా మండిపోతున్నది. దీనికితోడు నిజం బైటపడి పోతుందేమోనని నాలుక పిడచకట్టుకుపోతున్నది.

    "ముందు మీరు కూర్చోండి!" అంది సీత.

    ఉస్సూరుమంటూ రామకృష్ణ ఓ కుర్చీలో కూర్చుండిపోయాడు.

    "మీకు బాగా తలనొప్పిగా వుందికదూ?" గుచ్చి చూస్తున్నట్లుగ చూస్తూ అడిగింది సీత.

    "అదేం ప్రశ్న సీతా!" రామకృష్ణ అమాయకంగా ముఖం పెట్టాడు.

    ""మీకు బాగా తలనొప్పిగా వుందికదూ! అని అడుగుతున్నాను."

    "బాగా ఏమిటి - మహా బాగా వుంటేను. తలకాయ నెప్పితో తల చిట్లిపోతున్నది. అసలీ తలనొప్పి తలకాయకి రావాల్సింది కాదు. తలనొప్పి...."

 Previous Page Next Page