ఆమె అతడి చూపుల్తో తన చూపుల్ని కలపలేనట్టు కళ్ళు దించుకుంది.
"అరుణమీద అఘాయిత్యం చెయ్యడానికి ముందు రోజు లక్ష రూపాయలు బాంకునుంచి తీసుకున్నాడు. ఎలిబి కోసం నీతో ఊరికి వెళ్తున్నానని చెప్పాడు."
ఇందుమతి తల పైకెత్తలేదు.
"పోనియ్ ఇదైనా చెప్పాడా?"
ఇందుమతి రవిని చూసింది ప్రశ్నార్ధకంగా! ఆమెకు గొంతు ఎండిపోతున్నట్లుగా ఉంది.
"ఏం పనిమీద వెళ్తున్నాడో చెప్పాడా?"
"లేదు" అన్నట్టుగా తల ఊపింది.
ఇందుమతికి నాలుక పిడచకట్టుకపోతున్నది. పెదాలు ఆరిపోయాయి.
"మంచినీళ్ళు...." గొంతు పెగుల్చుకుంటూ అన్నది.
రవి చివ్వున లేచాడు. చరచర డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. ఫ్రిజ్ లో మంచి నీళ్ళబాటిలూ, గ్లాసూ తెచ్చాడు.
బాటిల్ మూత తీస్తుంటే అంతవరకూ ఆగలేనట్టు ఇందుమతి బాటిల్ లాక్కొంది. మూత తీసి గటగటా బాటిల్ నీళ్ళూ తాగేసింది.
పోతున్న ప్రాణం వచ్చినట్టు అయింది.
"ఇంకా కావాలా?"
"వద్దు." నుదురుకు పట్టిన చెమట తుడుచుకుంటూ అన్నది ఇందుమతి.
"బాధపడకు, ఇందూ!" అంటూ రవి ఆమె భుజం మీద చెయ్యి వేశాడు.
ఇందుమతి ఆ చేతిని ఏదో జుగుప్సాకరమైన పురుగును విదిలించి నట్టుగా విదిలించింది.
"సారీ! నీ పరిస్థితి చూస్తుంటే జాలి వేసింది. అంతేకాని, వేరే ఉద్దేశం లేదు.
"నన్ను చూసి నువ్వేం జాలి పడనక్కరలేదు." కోపంగా అని లేచి నిల్చుంది ఇందుమతి.
రవి అదోలా నవ్వాడు.
"ఎందుకు నవ్వుతున్నావ్?" రోషంగా అన్నది.
ఆ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో. ఆ ముఖం చూస్తే ఎంత దుర్మార్గుడికైనా జాలి వేస్తుంది."
ఇందుమతికి కోపం వచ్చింది. అతి బలవంతం మీద కోపాన్ని అణచుకుంది.
"ఫరవాలేదు మనః స్థిమితం లేని మనిషి చేసిన పనులకు శిక్ష పెద్దగా ఉండదు."
ఇందుమతి గతుక్కుమంది.
"పరారీలో కాకుండా వెంటనే వచ్చి సరెండర్ అయితే మంచిది."
"రవీ! స్టాప్ నాన్ సెన్స్. గౌతమ్ పరారీలో ఉండటం ఏమిటి? స్నేహితుడి పనిమీద ఊరికి వెళ్ళాడు. ఆ పని అయిపోగానే వస్తాడు."
"ఇన్ని వినికూడా అన్నయ్యే ఇవన్నీ చేశాడనే నమ్మకం నీకుకలగడం లేదా? ఐ పిటీ యూ!"
"నీ పిటీ ఎవడి క్కాలి-బోడి పిటీ!" ఒళ్ళు మండిన ఇందుమతి అన్నది.
రవి అదోలా నవ్వుకున్నాడు.
"అసలు నువ్వు మనిషివేనా?"
రవి తుళ్ళి పడ్డాడు.
"ఒకవైపు నీ భార్య ఆసుపత్రిలో ఉంది. ఆమెలో జీవం పోసుకుంటున్న నీ బిడ్డ ఉంటుందో పోతుందో తెలియనిస్థితి. అరుణ మతిచలించిన దానిలా మాట్లాడుతోంది. ఒకవైపు పేపరు న్యూస్ మీ ఇంటిపరువు తీసేదిగా వచ్చింది. మీ అన్నయ్య పెద్ద కష్టంలో చిక్కుకున్నాడు. తల్లి చావుబతుకుల్లో ఉంది. అయినా నీకు నవ్వు వస్తోంది." ఆవేశంగా అని ఆగి రవి ముఖం లోకి చీదరగా చూసింది.
రవి కళ్ళు అప్పగించేశాడు.
"నువ్వు ఇంత స్థిమితంగా ఉన్నావంటే నాకో అనుమానం కలుగుతోంది.
"ఏమిటి?"
"అసలు ఈ కుట్రంతా నువ్వు నీ స్నేహితుడు ఆ విశ్వంగాడు కలిసి చేస్తున్నారు. మీ అన్నయ్య పోలికలున్న మనిషిని అడ్డు పెట్టుకుని నాటకం ఆడుతున్నారు. నేను మీ కుట్రను బట్టబయలు చేస్తాను. మీ బ్రతుకుల బండారాన్ని బద్దలు కొడ్తాను. గౌతమ్ ను సేవ్ చేస్తాను. హిస్టీరియా వచ్చిన దానిలా అరిచి చరచర బయటికి వెళ్లిపోయింది ఇందుమతి.
ఆమె వెళ్ళినవైపే చూస్తూ నిల్చుండిపోయాడు రవి.
12
ఇందుమతి ఆటోవాడికి డబ్బులిచ్చి పరుగులాంటి నడకతో ఇంట్లోకి వచ్చింది. వంటమనిషి టిఫిన్ చెయ్యమన్నది. ఆవిడ మాటలు ఆమెకు విని పించలేదు. తన గదిలోకి వెళ్ళి దిండులో తల దూర్చింది.
ఒక్కసారిగా దుఃఖం పెల్లుబికింది.
వెక్కి ఎక్కి ఏడవసాగింది.
కళ్ళకు కన్నాలు పడ్డట్టుగా కన్నీరు కారిపోతోంది.
అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియదు.
గుండెలోకి గుబులు వెల్లువలా వ్యాపించి, ఉప్పెనలా కళ్ళలోకి పొంగింది. కన్నీరుగా కారింది. మనసు బరువు తగ్గింది. ఇప్పుడు ఆ మనసులో ఏ బాధా లేదు. ఏదో నిర్లిప్తత.
ఇందుమతి మంచం దిగింది. సింక్ దగ్గరకు వెళ్ళి అద్దంలో ముఖం చూసుకుంది. రవి అన్న మాట గుర్తొచ్చింది. తన ముఖం చూస్తే తనకే జాలి వేసేలా ఉంది అనుకుంది. పంపు తిప్పింది. చల్లటి నీళ్ళను దోసిళ్ళతో పట్టి ముఖంమీద చల్లుకోసాగింది. హాయిగా సేద తీరినట్టుగా అనిపించింది. కళ్ళమీద చల్లటి నీళ్ళ దోసిళ్ళు అద్దుకుంది.
తల దువ్వుకొని పౌడర్ వేసుకొని బయటికి వచ్చింది. డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. వంటమనిషిని పిలిచి టిఫిన్ తీసుకురమ్మని పురమాయించింది.
"భోజనం టైమ్ అయింది కదమ్మా!"
అన్నదేకాని ఇందుమతి ముఖం చూసి సమాధానానికి ఎదురు చూడకుండా లోపలకు వెళ్ళి టిఫిన్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది.
టిఫిన్ కారియర్ లో భోజనం తీసుకొని ఆసుపత్రికి బయలుదేరింది. ఎండ నెత్తి మాడుస్తోంది. నర్సింగ్ హోమ్ కు వచ్చింది. గది ముందు వరండాలో సునందా, విమలా నిల్చుని ఉన్నారు.
"ఇక్కడున్నారేం?" అని అడగబోయి దగ్గరకు వేసి ఉన్న గది తలుపుల్ని చూసి ఆగిపోయింది.
కారియరు అందుకుంటూ సునంద కూతురి ముఖంలోకి చూసింది.
ఆమె చూపుల్ని ఎదుర్కొలేనట్టు తన చూపుల్ని విమల కేసి తిప్పింది ఇందుమతి.
"ఆంటీ! ఎలా ఉంది?" అన్నది మూసిఉన్న గది తలుపుల్ని చూస్తూ.
"డాక్టర్ గీత వచ్చింది. ఎగ్జామిన్ చేస్తోంది. ఎలాగయినా ఎబార్షన్ జరక్కుండా చూడాలని వాళ్ళ ప్రయత్నం" అన్నది విమల."
"మెడికల్ రిపోర్టు....." అంటూ ఆగిపోయింది.
"అరుణమీద కేవలం దౌర్జన్యం మాత్రమే జరిగింది. రేప్ జరగలేదు. సమయానికి వంటమనిషి తలుపుకొట్టడంవల్ల గౌతమ్ పారిపోయాడు."
"ఆంటీ!" బాధగా అనుకోకుండానే ఇందుమతి కంఠం నుంచి వెలువడింది.
"కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయేవరకూ కనీసం మనమైనా గౌతమ్ ను నిరపరాధిగా గుర్తిద్దాం ఆంటీ!"
సునంద కళ్ళలో నీరు తిరిగింది.
విమల ఇందుమతి తల నిమిరింది. ఆమె కళ్ళలో ఎంతో జాలి. ఇంకెంతో ఆవేదన.
"అరుణ రెస్పాన్సు ఎలా ఉంది?"
"ఇంకా మన లోకంలో పడలేదు. పిచ్చి చూపులూ, పిచ్చి మాటలూ తగ్గలేదు. అయితే అప్పుడప్పుడు ఆ కళ్ళలో గుర్తింపు. ఏదో చెప్పాలనే ఆరాటం కనిపిస్తోంది. పెదవులు కదిలి చెప్పాలనుకున్నది చెప్పగల శక్తి లేనట్టుగా ఆగిపోతున్నాయి" అన్నది విమల.
అంతలో తలుపులు తెరుచుకున్నాయి.