Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 33

                                 


                   
    
    చాలా పవర్ ఫుల్ బాంబ్ పేలినట్లు పేలిందా వార్త- మా అపార్ట్ మెంట్స్ లో! ముఖ్యంగా మగాళ్ళంతా ఆ షాక్ నుంచి తేరుకునేసరికి చాలా టైమ్ పట్టింది. కొంతమందయితే ఆ వార్త పేలి 72 గంటలయినా ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ముఖ్యంగా విజయ్ యాదవ్! ఎవరయినా పలుకరిస్తే చాలు బెదిరిపోయి ఎగిరి గంతేస్తున్నాడు. ఆ వార్త వల్ల అపార్ట్ మెంట్స్ లో మగాళ్ళు- అందరూ ఎంతోకాంత గాయాల పాలయినప్పటికీ, బయటకు మాత్రం ఆ విషయం ఎవరికీ తెలీకుండా చాలా నార్మల్ గా కనబడటానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
    ఎప్పుడూలేంది మా సొసైటీ ప్రెసిడెంట్ హమీద్ మియా సినిమా ట్యూన్స్ హమ్మింగ్ చేయటం మొదలు పెట్టాడు.    
    కల్చరల్ సెక్ర్రటరీ శంకరమూర్తి ఉండుండి. మా మీటింగ్ ప్లేస్ కొచ్చి అటూఇటూ కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్నాడు.
    ఇక కృష్ణమూర్తి సంగతి సరేసరి- జీవితమంతా మిథ్య' అంటూ ఆథ్యాత్మిక గురువు లెవల్లో ఫోజులిస్తున్నాడు.
    ఇంతకూ ఆ వార్తేంటంటే మా అపార్ట్ మెంట్స్ తాలూకు లేడీస్ వింగ్ ప్రెసిడింగ్ షైనీ తమ సభ్యులకోసం 'లై' డిటెక్టర్ కొనబోతోంది.
    వెంటనే మా ఆఫీస్ బేరర్స్ అందరినీ పిలిచి అర్జంటుగా మీటింగ్ ఏర్పాటు చేశాడు హమీద్ మియా!.
    అది సీక్రెట్ మీటింగ్ అవడంతో తనింట్లోనే ఏర్పాటు చేశాడు.
    "భాయియో ఔర్ బెహనో-" అంటూ మొదలెట్టగానే విజయ్ యాదవ్ అడ్డుతగిలాడు.
    "ఇక్కడ 'బెహనో' ఎవ్వరూ లేరు-"
    "సారీ - సారీ - భాయియో! మన మగజెంటిల్మెన్- ఇస్ వక్త్- చాలా ప్రాబ్లెమ్ లో ఉన్నయ్! క్వోంకి- షైనీ మన అపార్ట్ మెంట్స్ లో లేడీస్ గురించి లైడిటెక్టర్ కొంటున్నయ్. మన అపార్ట్ మెంట్స్ లో లేడీస్ అన్నీ ఆ లై డిటెక్టర్ ని యూజ్ చేస్తయ్. అలా యూజ్ చేస్తే  మనందరికి ప్రాబ్లెమ్స్ వస్తయ్- ఇసీలియే - అపన్ సబ్ లోగ్- ఏదొకటి చేసి ఆ లైడిటెక్టర్ ని మన అపార్ట్ మెంట్స్ కి రాకుండా చేయాలె-"
    కొందరు హమీద్ మియా వేపు అనుమానంగా చూశారు.
    "లైడిటెక్టర్ కొంటే మనకేం ప్రాబ్లెమ్స్ వస్తయ్?" డౌటుగా అడిగాడు మొహిందర్ సింగ్.
    ప్రక్కనే ఉన్న విజయ్ యాదవ్ అతని భుజం తట్టాడు.
    "కొంచెం బ్రెయిన్ ఉపయోగించు బ్రదరూ! అఫ్ కోర్స్ అది నీకుంటేనే-"
    "అంటే నీ ఉద్దేశ్యం-" కోపంగా అడిగాడు మొహిందర్-
    "లేకపోతే ఏంటి? నువ్ మీ ఆవిడకి రోజుకో కథ చెప్పి మందు కొడతానికెళ్తూంటావ్ కదా! మీ ఆవిడ ఆ లై డిటెక్టర్ నీకు తగిలించి 'ఎక్కడి వెళ్తున్నావ్?' అనడిగిందనుకో - నువ్ అలవాటు ప్రకారం మా కజిన్ లోక్ సింగ్ దగ్గరకెళ్ళివస్తా! వాడికి వంట్లో బాగోలేదని తెలిసింది అని ఏదో నోటికొచ్చిన అబద్దం చెప్పావనుకో-
    వెంటనే లై డిటెక్టర్ 'నువ్ చెప్పేదంతా అబద్దం' అని ఇండికేట్ చేస్తూ పెద్ద సైరస్ మోగిస్తుంది. దాంతో మీ ఆవిడ నీ కాలర్ పట్టుకుంటుంది-
    ఈ సీన్ ఒక్కసారి విజువలైజ్ చేసి చూసుకో-"
    మొహిందర్ సింగ్ ఆ సీన్ అంతా గాల్లో చూసి గావుకేక పెట్టాడు.
    "ఓర్నాయనో! ఆ మిషన్ చాలా డేంజరస్-" అన్నాడు గాబరాగా.
    "కానీ ఆ మిషన్ షైనీ కొనబోతోన్నప్పుడు మనం ఎలా అడ్డుకోగలుగుతాం?" అడిగాడు శంకరమూర్తి.
    "అదే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తయ్" అన్నాడు హమీద్ మియా.
    బోసు అనుమానంగా లేచాడు.
    "అంటే- నేను ప్రతినేలా నా జీతంలో వెయ్యి రూపాయలు సీక్రెట్ గా మా నాన్నకి పంపిస్తున్నా విషయం మా మిసెస్ కి తెలిసిపోతుందంటారా?" అడిగాడతను.
    "అవును బ్రదరూ! ఆ సీన్ నువ్వే ఒకసారి గాల్లోవేసి చూసుకో - ఒకటో తారీఖు జీతం తీసుకొచ్చి మీ మిసెస్ కిస్తావ్ - ఆవిడ లెక్కబడుతుంది -ఏంటి పన్నెండొందలు తక్కువుంది?" అనడుగుతుంది.
    "అదా-అదీ- ఆ - ఇన్ కమ్ టాక్స్ కట్ చేశార్లే-అనగానే మిషన్ లో పెద్ద ఎత్తున సైరన్ మోగుతుంది-అది లైడిటెక్టర్ సైరన్ అన్నమాట! దాంతో మీ మిసెస్ మీ కాలర్ పట్టుకుంటుంది.
    "నిజం చెప్పండి! ఆ డబ్బు ఏం చేశారు?" అని నిలదీస్తుంది.
    అప్పుడు మీరు దిక్కులేక ఇంకో అబద్దం చెప్పేస్తారు.
    "సంగతేంటంటే మా ఫ్రెండ్ రంగారావ్ అప్పడిగాడు. అందుకని ఇచ్చాను" అంటావ్ లైడిటెక్టర్ మళ్ళీ సైరన్ మోగిస్తుంది.
    ఇలా నాలుగయిదుసార్లు అబద్దాలు చెప్పాక చివరకు నిజం వప్పుకోక తప్పదు.
    నిజం ఏమిటంటే- మా నాన్న డబ్బుకావాలని ఫోన్ చేశారు- అందుకని పంపాను" అంటారు. అప్పుడు మిషన్ సైలెంట్ గా ఊరుకుంటుంది.
    తమాషా ఏంటంటే అక్కడితో మిషన్ నిన్ను వదిలేస్తుందిగానీ మిసెస్ నిన్ను వదలదు.
    "ఇలా ఎంతకాలం నుంచి సాగుతోంది?" అంటుంది అనుమానంగా.
    "ఛ- ఎంతకాలం నుంచేమిటే? ఇదే మొదటిసారి" అంటారు!
    అనగానే మళ్ళీ సైరన్ మోగుతుంది.
    బోస్ గాబరా పడిపోయాడు.
    "వద్దు! చెప్పకు- వినడానికే భయంగా ఉందా పరిస్థితి..."
    "అయితే ఇప్పుడర్దమయిందా- లై డిటెక్టర్ మన కెంత ప్రమాదమో..."
    "చాలా ప్రమాదం! ఎంత ప్రమాదమంటే పచ్చని సంసారాలు కూలిపోతయ్..."వప్పుకున్నాడు బోసు.
    "అంతేకాదు! మన అపార్ట్ మెంట్స్ లో కొంతమంది జైలుకి భీ పోతయ్" ఇంకా భయపెట్టాడు హమీద్ మియా.

 Previous Page Next Page