జనంలో కాస్త కలవరం ప్రారంభం అయింది.
'గుడిసెల డబ్బు మింగిండు. సార పోయిస్తున్నడు ' మస్తాన్ అరిచాడు.
'మందికి కడుపు చేసుకున్న ముండ' యాదగిరి , శేషయ్య అరిచారు.
జనమూ కొందరు అరచారు. ఎక్కణ్ణుంచొ ఒకరాయి మంగమ్మ దాకా వచ్చి పడ్డది.
మల్లయ్య ఉద్రేకం పెరిగింది. 'రాళ్ళు కొడ్తాన్రు. రాళ్ళు కొడ్తాన్రు' అని కేకలు వేసి శేషయ్య మీదికి ఉరికాడు.
జనంలో కల్లోలం లేచింది.
మంగమ్మ మీద రాళ్ల వర్షం కురిసింది.
జనంలో కొందరు సీసాలందుకొని పరిగెత్తారు. ఇండ్లకు. కొందరు మరింత సారాయి కోసం దుకాణం మీద పడ్డారు. కొందరు రాళ్ళను చూసి పారిపోయారు. మిగిలిన వాళ్ళు తమలో తాము పోట్లాడుకున్నారు.
మంగమ్మ తలకు బలంగా రాయి తగిలింది. సోడసోడా రక్తం కారింది. ఆమె కెవ్వున కేక పెట్టింది. ఎక్కడి వారక్కడ పారిపోయారు. గప్ చిప్ సాంబారు బుడ్డి. ఎక్కడి దొంగలక్కడే నక్కారు. మిగిలింది ముగ్గురే. వార్త తెలిసి పరిగెత్తుకొని వచ్చాడు వీరభద్రం. మంగమ్మను తీసికెళ్ళి తలకు కట్టు కట్టారు.
బాబు కేర్ మని ఏడ్చాడు.
మంగమ్మ పాపను ఒళ్ళోకి తీసుకుంది. వలవలా ఏడ్చింది.
ఓదార్చాడు వీరభద్రం. ఓదార్పు మరింత ఎడ్పించింది. బాబు ఏడ్చాడు. మంగమ్మ ఏడ్చింది. ఓదారుస్తున్న వీరభద్రం కళ్ళు చెమ్మగిల్లాయి. మల్లయ్య, మస్తాన్ కన్నీరు కార్చారు.
"మన సభ ఏమైనట్లు?" అడిగాడు మస్తాన్.
"సభ కంటే సారాయి ఎక్కువోలె ఉన్నది' అన్నాడు మల్లయ్య.
వీరభద్రం నిర్విన్నుడై చూచాడు.
మంగమ్మ చాకితురాలై చూచింది.
బాబు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు.
ఆ రాత్రి రామయ్య సంబరాలు చేసుకున్నాడు. యాదగిరి, శేషయ్య తందనాలాడారు.
తెల్లావారి వీరభద్రం కలెక్టరు దగ్గరికి వెళ్ళాడు. పేదలకు అందాల్సిన డబ్బు రామయ్య మింగాడని చెప్పాడు. కలెక్టరూ కాస్త తికమక పడ్డాడు. ఫైలు తెప్పించి చూశాడు. అన్నీ సక్రమంగానే ఉన్నాయి. డబ్బు అందరికీ అందినట్లు రశీదులు ఉన్నాయి.
"ఇవన్నీ దొంగ రశీదులు. కొంపలు కూలినవారు డబ్బు అందలేదంటున్నారు." అన్నాడు వీరభద్రం.
"అందలేదంటే మేమేం చేయగలం? రశీదులున్నాయి. మాకు కావాల్సింది అవి."
'అయితే మీరేం చేయలేరు?"
"మాకు అధికారాలు అంతవరకే వున్నాయి."
"మీ అధికారం రశీదుల వరకేనా? ప్రజలకు అందాల్సిన సొమ్ము మింగి సారాయి సంతర్పణలు చేస్తుంటే మీరేం చేయలేరా?"
రూల్సు ప్రకారం చేసేవాణ్ణి మేమేం చేయగలం చెప్పండి? ప్రభుత్వం దూల్స్ రూల్స్ రూల్స్. రూలు లోపల మీరేం చేసిన మాకు అభ్యంతరం లేదు. రూలు దాటితే అది దాటినట్లు రుజువయితే మేమేమైనా చేయగలిగేది. అయినా మీరు అసెంబ్లీలో లేవతీయకూడదూ.?"
'అవును అంతే చేయాలి" అని లేచిపోయాడు వీరభద్రం.
అన్నట్లుగానే అసెంబ్లీలో నోటీసిచ్చాడు . మూడు నెలల తరువాత జరిగిన ఆ అసెంబ్లీ సమావేశంలో ఆ ప్రశ్న వచ్చింది. అన్నీ సక్రమంగానే జరిగాయని మంత్రిగారు సమాధానం చెప్పారు. ప్రతిపక్షాల వారు విచారణ జరిపించాలని ఏకగ్రీవంగా కోరారు. విచారణ జరపడానికి కలెక్టరును నియమించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనిని ప్రతిపక్షాల వారి ఘన విజయంగా ప్రతికలు ప్రకటించాయి.
* * *
బాలరమయ్యకు తల తెగినట్లయింది - తాను ఓడినందుకు కాదు - వీరభద్రం నేగ్గినందుకు . అతని గెలుపు తమ అధికారానికి గొడ్డలి పెట్టులా అనిపించింది. అయినా ఏం చేయలేక విలవిల్లాడాడు. అసలు ఈ ఎన్నికలలోనే లోపం ఉందనీ ఎన్నికలు రద్దు చేయాలని అందామనుకున్నాడు. అన్నాడు కూడా. కొందరితో మన రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఉందని, అలా అనకూదదనీ వారికి సలహా ఇవ్వబడింది . అనగూడదు కాని అలాగా జనమంతా అధికారంలోకి వస్తుంటే వారికీ మండుతుంది. ఒక్కడూ దొరతనం చేసినవాడు కాదు. ఏ పొలం దున్నుకునేవాడో కూలి చేసుకునేవాడో ఎన్నిక అయితే తాను గోళ్ళు గిల్లుకుంటూ కుర్చోవాలా? తోటి దొరలు కొందరు ఎన్నికయినారు, మంత్రులు కూడా అయినారు. తాను ఎందుకూ పనికిరాని వాడైనాడు. ఏం చేయాలో అర్ధం కాలేదు. తాను చలాయించిన అధికారం మాయమై పోయింది. తనను అడ్డిన వాడేవాడు? అడిగిన వాడెవడు? తన ఊరికి తాను రాజు. ఊళ్ళో మనుషులున్నారని తానెప్పుడూ భావించలేదు. అంతా పురుగుల్లా ప్రవర్తించారు. తనకు నచ్చనివాణ్ణి పురుగును చంపినట్లు చంపేశాడు. అంటా తన అడుగులకు మడుగులోత్తారు. అవున్నది ఎవరూ కాదనలేదు. తాను వలచినది తన ఇంటికి రాక మానలేదు. అప్రతిమానమైన ప్రభుత్వం చలాయించాడు తాను. వీరభద్రం అక్కడ పుట్టిన పురుగే! పులియైనాడు - తుపాకి పట్టి తనను బెదిరించాడు. ప్రాణాలు అరచేతలలో పెట్టుకొని పారిపోయాడు తాను. ఆ తరవాత అంతా అంధకారం. వీరభద్రం తన భూములు పంచాడు. తనను బికారిని చేశాడు. మళ్ళీ తన ఊరు చూడననుకున్నాడు. భార్య పోయింది. కొడుకుని పొట్టన పెట్టుకున్నారు. మళ్ళీ ఏదో వెలుగు కనిపించింది. తాను ఊరికి వచ్చాడు. అధికారం నిలబెట్టుకోవడానికి ఖద్దరు కట్టాడు. అధికారం విస్తృతంగానే తన చేతికి అందినట్లయింది. వీరభద్రం పట్టుబడ్డాడు. తన పీడ విరగడఅవుతుందనుకున్నాడు. కాని వీరభద్రం విడుదలైనాడు. అప్పుడే అనుకున్నాడు తాను ఈ విధానంలో ఏదో లోపం ఉందని. కాని ఎన్నికలు చూసి ఆశ పడ్డాడు. డబ్బు చిమ్మడు. అయినా ఓడిపోయాడు తాను- కాదు వీరభద్రం నెగ్గాడు !
వీరభద్రం నెగ్గడంతో విచారం పట్టుకుంది. బలరామయ్యగారికి. మానసికంగా కృంగిపోయాడు. మంచం పట్టాడు. అతని మంచం చుట్టూ ప్రభుత్వం చేరింది. అతనిని ఓదార్చింది. అతనికి కావలసింది మందు కాదు అధికారం. అతనికి అధికారం ఇవ్వడానికి ప్రభుత్వమూ తహతహ లాడింది. అయినా మార్గం కనిపించలేదు. పార్టీకి అధ్యక్షునిగా ఉండమన్నారు. తనకు అనుభవం లేదని ఉండననీ అన్నాడు బలరామయ్య. అతని అనుయాయులు పట్టుపట్టారు. అందువలన అంగీకరించక తప్పలేదు.
బలరామయ్య అద్యక్షుడయింది ఆస్పత్రిలోనే. సమావేశానికి అయన హాజరె కాలేదు. అయినా అద్యక్షుడైనాడు. సమావేశంలో ప్రతిపాదించబడింది. ఒక్క బలరామయ్య పేరు మాత్రమే కాదు. కాని ముఖ్యమంత్రి గారు జోక్యం కలిగించుకొని మిగతా పేర్లు ఉపాసంహరించుకునేట్లు చేశారు. కొందరిని బెదిరించడం కూడా జరిగిందని పదంతులు వ్యాపించాయి. మొత్తం మీద బలరామయ్య ఏకగ్రీవంగా ఎన్నిక అయినారు. ఆ వార్తతో ఆస్పత్రి నిండిపోయింది. బలరామయ్యగారి గది పూల దండలతో పూడిపోయింది. నగరంలోని పెద్దలంతా ఆస్పత్రికే చేరారు. దాంతో బలరామయ్య ఆస్పత్రి వదిలారు. ఒక పెద్ద కార్ల ఊరేగింపుతో వారు ఇల్లు చేరుకున్నారు. ప్రభుత్వం ఆ రాత్రి బలరామయ్య ఇంట్లోనే విందు కూడినది.
తెల్లవారి పత్రికల్లో బలరామయ్య పటాలు ప్రచురించబడ్డాయి. వారి జీవిత విశేషాలు వివరంగా ప్రచురించారు. వారు చేసిన దేశ సేవను ఘనంగా కీర్తించాయి పత్రికలు. వారు కొంతకాలం గాంధీజీ ఆశ్రమంలో గడిపారనీ ఒక పత్రిక రాస్తే, గాంధీజీ స్వయంగా వారిని ఆశీర్వదించారని వేరే పత్రిక రాసింది. దాంతో బలరామయ్య జబ్బు పారిపోయింది. బలం పుంజుకున్నాడు. అయినా డాక్టర్లు ఆయన్ను వదలడం లేదు. వారు రోజూ పరీక్షిస్తూనే ఉన్నారు. సూదులు గుచ్చుతూనే వున్నారు.
బలరామయ్య అధ్యక్షుడయిం తరువాత అతని ఇంటికి ఒక జాతర సాగింది. వచ్చే పోయే వారితో ఇల్లు కలకల లాడింది. ఉద్యోగాలు , బదిలీలు , ప్రమోషన్లు పర్మిట్లు పరిష్కారాలు వీటన్నింటికీ ఆ ఇల్లు విపణి వీధి అయింది.
దొరలంతా బలరామయ్యను బలపరచారు. దొరలు కానివారు ప్రభుత్వంలో ఉండరాదని రహస్యంగా పనిచేయసాగారు. శాసనసభ్యుల ఖరీదు చేశారు. అక్కడి బలం తలక్రిందులు చేశారు. పార్టీ చెప్పినట్లు ప్రభుత్వం వినాలన్నారు. మంత్రులను మార్చాలని ఆదేశించాడు బలరామయ్య. ముఖ్యమంత్రి మండిపోయాడు. అతడే అధ్యక్షుడ్ని చేసింది బలరామయ్యను! అతని మీదనే సవారీ చేస్తున్నాడు! బలరామయ్యను పదవి నుంచి తొలగించే ప్రయత్నం చేశాడు ముఖ్యమంత్రి. కాని సఫలీకృతుడు కాలేకపోయాడు. దాంతో వేరే పార్టీ పెట్టి తనదే అసలు పార్టీ అన్నాడు. రాష్ట్ర మంతటా ఉభయ పార్టీలకూ హోరాహోరీ పోరాటాలూ జరిగాయి. అసలు ప్రభుత్వం క్షీణించి ప్రతిపక్షాలు బలపడే దశకు వచ్చింది. అప్పుడు డిల్లీలో నాయకులూ మేల్కొన్నారు. ఉభయులనూ అక్కడికి పిలిపించారు.
బలరామయ్య డిల్లీ ప్రయాణం రోజు, ఉదయాన పత్రిక చదువుకుంటూ వాలుకుర్చీలో కూర్చున్నారు. నమస్కారం అనే పదం విని పత్రిక ముడిచి చూశాడు. ఒక అమ్మాయి కనిపించింది. ఆమె న్డంగా ఉంది. వయసులో ఉంది. అలా చూస్తూ ఉండిపోయాడు బలరామయ్య. రెప్ప సైతం వాల్చడం లేదు.
ఆమె సిగ్గు పడింది. తల వంచుకుంది .
'నమస్కారమండీ'
ఆ ధ్వని విని లోకంలోకి వచ్చాడు బలరామయ్య.
'కూచో' అని కుర్చీ చూపించాడు.
'అక్కరలేదండీ . నా పేరు సరస్వతి'