Previous Page Next Page 
జనపదం పేజి 35

 

    'ఎందుకు వచ్చినవు'
    ఎన్నో చెప్పుకుందామనుకుంది సరస్వతి. కానీ ఏమీ చెప్పలేకపోయింది. 'ఉద్యోగమేమన్న చుపుతారేమోనని ....'
    'చదువుకున్నావా?"
    'బి.ఏ. వరకు చదివానండి'
    'అంగ్రేజు బాగా వస్తదా?'
    'వస్తుం\దండి.'
    'నాకు సెక్రటరీ కావాల్ననుకుంటున్న. ఉంటానంటే ఉంచుకొంట. ఏరే కొలువులు ఇప్పట్ల దొరకెటట్లు లేవు, ఏమంటావ్'
    'మంచిదండీ. ఎప్పటినుంచి చేరమంటారు?"
    'ఇయ్యాళ నుంచే చేరు. నేను డిల్లీ పోతున్న. పొద్దుగూకే యాళ. నా ఎంబడి రావాలే. ఉత్తరాలు గిన జరా అంగ్రేజులో వ్రాసి పెట్టాలె. ఏమంటావ్?"
    'వస్తానండీ. సాయంకాలం రమ్మంటారా?'
    'పగటిపూట రా. జర కాగితాలు గిన చూడాలె.'
    'అట్లనే , వస్తానండీ' అని వెళ్ళిపోయింది సరస్వతి.
    మధ్యాహ్నానానికి వచ్చింది సరస్వతి. ఈ తడవ ఆప్యాయంగా పిలచారు బలరామయ్యగారు.
    'ఎవ్వరు లేరా నీకు?'
    'అందరూ పోయారు. ప్రస్తుతం ఎవ్వరూ లేరు' అని కంటతడి పెట్టింది సరస్వతి.
    ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. బలరామయ్యకు.
    'భోజనం చేసినావా?' అడిగాడు.
    'సర్లే కూచో ' అని కొన్ని కాగితాలు తెచ్చి ముందలేశాడు. 'ఇయాన్ని చదువు. జవాబు రాయాలె. నువ్వే రాయి. మరి నా ఎంబడి డిల్లీ రావాలే. తయారుగున్నావా? బట్టలు గిన తెచ్చుకున్నవా? నేను జర అరాం చేస్త' అని లేచాడు బలరామయ్య.
    'మంచిదండీ' అని కుర్చీలోంచి లేచిన సరస్వతి బలరామయ్య నిష్క్రమించగానే కూర్చొని ఉత్తరాలు చూడసాగింది. అన్నీ మాములు ఉత్తరాలే. దేశం నలుమూలల నుంచి వచ్చాయి. కొన్ని బలరామయ్యను పొగుడుతూ వ్రాసినవి. కొన్ని అతనితో ఏదో పని వుండి వ్రాసినవి. ఒకటి సుదీర్ఘమైన ఉత్తరం ఉంది. దాంతో పాటు ఏవో కరపత్రాలు అవీ వున్నాయి. ఉత్తరాన్నీ, కరపత్రాలనూ చదివింది. వాటిలో ఏదో ఆసక్తి ఏర్పడింది ఆమెకు. అవి భూదానానికి సంబంధించినవి.
    'హింస  మనిషిని పశువుగా మారుస్తుంది. మనిషిని బాధించడం, ఘోష పెట్టడం మనవత్వ లక్షణాలు కావు. మనిషికి మనసు ప్రధానమైంది. మనసు మార్చడం అవసరం. మానవులంతా సమానులే. వారిలో కొందరు అదృష్టవంతులు. వారికీ సంపద చాలా ఉంది. భూమిలో చాలా భాగం వారికే ఉంది. మానవులలో చాలా మంది దురదృష్టవంతులు. వారికి తిన తిండి లేదు. కట్ట బట్ట లేదు. వారంతా దరిద్ర నారాయణులు. ఈ దరిద్ర నారాయణులు అదృష్టవంతులను చూచి సహించలేకపోతున్నారు. వారి మీద తిరుగుబాటు చేసి వారిని హింసిస్తున్నారు. హింసకు ప్రతిక్రియ హింస. ఉభయ పక్షాలు హింసకు తలపడుతున్నాయి. దాంతో మానవత నశిస్తున్నది. శాంతి లోపించింది.  కార్పణ్యమూ, ఈర్ష్యం , ద్వేషం ఎక్కువయినాయి. మానవజాతిని ఈ హింసనుండి రక్షించాలంటే సంపన్నులలో ఔదార్యం పెంపొందాలి. వారు దరిద్ర నారయణులను గుర్తించాలి. తమకు ఉన్న దానిలో కొంత పేదలకు పంచాలి. వారిని ఆదుకోవాలి. సంపన్నులు తమ ఆస్తికి తాము ధర్మకర్తలము మాత్రమే అనుకోవాలి. తమ సంపదనంతా దరిద్ర నారాయణులకు వెచ్చించాలి. అలా జరిగిన్నాడు రామరాజ్యం వెలుస్తుంది. శ్రేయోరాజ్య పాలన జరుగుతుంది.
     తెలంగాణలో జరిగిన హింసాకాండ కంతటికీ మూలం భూమి. భూమినంతటినీ కొద్దిమంది ఆక్రమించుకున్నారు. భూమి లేని వారు ఉన్న వారిమీద తిరగబడుతున్నారు. భూమి ఎవరి సొత్తు కాదు. భగవంతుడు యిచ్చింది. కాబట్టి భూస్వాములు దాన్ని అక్రమించికోవడం మంచిది కాదు. తమ భూమిని లేని వారికి పంచి ఇవ్వడం సబబు. మొత్తం భూమిని ఇవ్వగల ఉదారులు, ఉత్తములు. అలా కాకున్నా ఉన్నదానిలో కొంత దానం చేస్తే అది పేదలకు పంచబడుతుంది. దానం చేసిన వారికి ఇహ పర సౌఖ్యాలుంటాయి. అందుకే భూదానోద్యమం ప్రారంభించాం. తాము కొంత భూమిని దానం చేసి సహకరించగలరు.
    ఇది ఆ కరపత్రాల సారాంశం. సరస్వతి దానిని రెండు, మూడు సార్లు చదివింది. కరపత్రం ఆమె మీద ఏదో ప్రభావం వేసింది. సరస్వతికి తన గత జీవితం కళ్ళముందు కనిపించినట్లయింది. గతం వర్తమానంగా గబగబా తనముందు నుంచి పరిగెత్తుతున్నట్లనిపించింది.
    సరస్వతి తండ్రి  విశ్వనాధం హైదరాబాద్ లో లెక్చరర్. అతడు ఊర్దులో ఎం.ఏ చేశాడు. ఉర్దూ అతని అభిమాన బాష. కవిత కూడా ఎంతో అందంగా చెప్పేవాడు. అతనికి పరిచయస్తుల్లో మహామ్మదీయులే ఎక్కువ. అతని జీవన విధానంలో కూడా మహ్మదీ సంస్కృతే గూడు కట్టుకుంది. 1947 లో భారతదేశానికి స్వాతంత్యం రావడంతో నైజాం నవాబు స్వాతంత్యం ప్రకటించాడు. తన స్వాతంత్య పరిరక్షణకు మహమ్మదీయ మతాన్ని ఆయుధంగా ఉపయోగించాడు. హైద్రాబాద్ రాజ్యాన్ని దక్షిణ పాకిస్తాన్ చేయాలనుకున్నాడు. ఖాసిమ్ రజ్వీని ఉసికొల్పాడు. రజాకార్ల దండు రాజ్యామంతటా వీరవిహారం చేశాయి. ఈ హింసకు ప్రతిక్రియగా ప్రజలు మేల్కొన్నారు. సాయుధలై తిరగబడ్డారు. ఈ ఉప్పెన వచ్చింది ముఖ్యంగా విద్యార్ధులలో . ఆచైతన్యం నుంచి సరస్వతి దూరంగా ఉండలేకపోయింది. అందరితో బాటు ఆమె కూడా కాలేజీ వదిలేసింది. రహస్య దళాలతో సంబంధాలు ఏర్పర్చుకుంది. బాంబులు తయారు చేయడం నేర్చుకుంది. దాంతో తండ్రీ కూతుళ్ళకు కొంత బెడిసింది. అయినా విశ్వనాధానికి కూతురంటే ప్రాణమే. ఒక్కొక్కసారి అర్ధరాత్రి కూడా ఆమె వచ్చేది కాదు. విశ్వనాధ దంపతుల గుండెలు దడదడలాడేవి. ఏం ప్రమాదం సంభవించిందోనని వణికిపోయేవారు. కళ్ళల్లో వత్తులు వేసుకొని ఆమె వచ్చేదాకా ఎదిరి చూస్తుండేవారు.  ఆమె రావడం ఆలస్యం అయితే విశ్వనాధం కాలుకాలిన పిల్లిలా తిరిగేవాడు.
    ఆ కాలంలోనే సరస్వతి వీరభద్రంతో పరిచయం అయింది. వీరభద్రం మాట్లాడుతుంటే నిప్పులు చేరిగేవి. అతడు లోకాన్నంతా మారుస్తానన్నట్లు మాట్లాడేవాడు. అతని ధోరణి సరస్వతికి ఎంతో నచ్చింది. వారు గంటల తరబడి మాటాడుకునేవారు. పరిచయం ప్రణయంగా మారింది. ఏవేవో బాసలు చేసుకున్నారు. ఇద్దరూ భవిష్యత్ గురించి బంగారు బాటగా కలలు కన్నారు.
    ఒకనాడు వీరభద్రం అమాంతంగా మాయం అయినాడు. అండర్ గ్రౌండ్ లోకి పోయాడని తెలిసింది సరస్వతికి. ఏదో చేతికందిన స్వర్గం కూలిపోయినట్లనిపించిందామెకు. కొన్నాళ్ళు పిచ్చిపిచ్చిగా తిరిగింది. తరవాత మళ్ళీ కార్యక్రమంలో మునిగిపోయింది.
    ఆనాడు ఇంట్లో పండగని ఉండమన్నాడు విశ్వనాధం సరస్వతిని. సరస్వతికి ఉండాలని లేకున్నా ఉండిపోయింది. తలంటి స్నానాలు వగైరా అయినాయి. ఏదో పుస్తకం చుడువుతా కూర్చుంది సరస్వతి. ఒక స్నేహితురాలు వచ్చింది. వీరభద్రం వచ్చాడు, ఎదిరి చూస్తున్నాడని చెప్పింది. సరస్వతి వెంటనే బయలుదేరింది. తలిదండ్రులు భోజనం చేసి పొమ్మన్నారు. భోజనానికి వస్తానంది. తాను వచ్చేదాకా భోజనాలు చేయవద్దని చెప్పి మరీ వెళ్ళింది.
    సరస్వతి తల్లి వంటల్లో మునిగిపోయింది. రకరకాల పిండివంటలు చేసింది. కూతురుతో కలిసి భోజనం చేయాలనుకున్నారు దంపతులు. పొద్దు గడిచిపోతుంది. మధ్యాహ్నం అయింది. ఒంటిగంట రెండు, సరస్వతి రాలేదు. వంట ముగించి వచ్చి కూర్చుంది భార్య. విశ్వనాధం బయటికి వెళ్ళి చాలాసార్లు చూశాడు. సరస్వతి వస్తున్నా జాడ కనిపించలేదు. భోజనానికి వస్తానని వెళ్ళింది, ఇంకా రాలేదు. విశ్వనాధం దంపతుల్లో ఆందోళన ఎక్కువైంది. చిరాకుపడ్డారు. తరవాత ఇద్దరు భయం భయంగా ఒకరిని ఒకరు చూసుకున్నారు.
    'పిల్ల జిమ్మేదారి లేకుండా తిరుగుతాంది సమజ్జవస్తలేదు. పొద్గాల పోయే. పత్తా లేదాయే. మీరేమో గప్ చుప్ గుంటరు. జర గద్మయించకుంటే ఎట్ల?" మాతృ హృదయం పలికింది.
    'సియాసత్ల తిరుగుతాండే . చెప్తనే ఉంటిని. దాని దిమాగ్ కు ఎక్కుత లేదు. సర్కారేమో శాన సఖ్త గున్నది. పిల్లేమో చెప్తే దిమాగ్ ల ఉంచుతలేదు. ఏమ్ చేతు, ఇయ్యాళ రానియ్యి, ఏదో ఒకటి ఫైస్లా చేస్త. అది చేత్లా ఉండేటట్లు లేదు' అన్నాడు విశ్వనాధం. అన్నారే గాని అంత గట్టిగా కూతురును అనలేడనే విషయం భార్యకు తెలుసు. ఎంతకూ సరస్వతి రాలేదు. ఇద్దరు ఏదో ఎంగిలి పడ్డారు. బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. ఒక్కతే కూతురు, ఆవిడా వారితో భోజనం చేయలేదు. వారి గుండెలు శూన్యంగా ఉన్నాయి. నిరీక్షణతో కళ్ళు పీక్కు'పోయాయి. ఇంటిలో నిరాశ నిండిపోయింది. నిరామయంగా ఉంది. నిశ్శబ్దం ఆవహించింది. రెండు ప్రాణాలూ బిక్కుబిక్కుమంటున్నాయ్ ఆ ఇంట్లో. అయినా సాయంకాలం అయింది. సూర్యునికి గుండె లేదు. ఉంటె ఆ ఇంటిమీదికి వచ్చి ఆగిపోయేవాడు.
    ఆ సాయంకాలం నిజాం నవాబు మీర్ ఉస్మానలీ ఖాన్ మక్కా మసీదుకు వెళ్తున్నాడు. ఆ సాయంకాలమే కాదు ప్రతి సాయంకాలం మసీదుకు వెళ్తాడతను. అతనికి భక్తీ మెండు. అదీ ప్రజలకే చిక్కు నవాబు బయలుదేరాడంటే రోడ్ల మీద రాకపోకలు బంద్. పోలీసులు వరుసగా రోడ్డు మీద నుంచుంటారు. విజిల్ మీద విజిల్స్. బాటంతా సాఫ్ నవాబు వచ్చే వైపు చీమ సైతం ఉండరాదు. మరొక ప్రక్కన జనం గోడలా నుంచున్నారు. మోటార్లు , సైకిళ్ళు, బస్సులు ఇతర వాహనాలు నిలిచి పోయాయి. అంతా ఆ వచ్చే వాహనాల కోసం ఎదిరిచూస్తున్నారు. అది కాస్తా దాటిపోతే గాని వారు కదలడానికి వీల్లేదు.
    పోలీస్ విజిల్స్ మోగుతున్నాయి. రోడ్లు కాళి అయినాయి. కారు ఒకటి దాటి పోయింది. రెండవది వస్తుంది. అందులోనే నవాబు ఉండేది. అది సాగిపోతుంది.

 Previous Page Next Page