Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 34

 

    చటుక్కున అడిగాడు రాజా.


    "మిమ్మల్ని క్లయివ్ పంపాడా?"


    ఒక్కక్షణం ఆశ్చర్యానికి లోనయి, అంతలోనే నవ్వేసింది మే ప్లవర్స్.


    "అబ్బో! అవలించాకుండానే పేగులు లెక్క పెట్టె రకం! అవును! మమ్మల్ని క్లయివ్ పంపించాడు. మేం పాలెస్ లోనే ఉండి నిన్ను ఓ కంట కనిపెట్టి ఉండబోతున్నాం. నువ్వు గనక క్లయివుకి ఎదురు తిరిగి ఏమన్నా తమాషాలు చేయ్యబోయావో తక్షణం నీ ఒళ్ళు తూటాలతో తూట్లు పడిపోతోంది!" అంది.


    మాట్లాడకుండా భుజాలు ఎగరేశాడు రాజా.


    ఇది టిపికల్ బ్రిటీష్ టెక్నిక్!


    కారట్ అండ్ స్టిక్ పాలసీ!


    బ్రిటీష్ వారు ఇక్కడ అధికారం చలాయించినన్నాళ్ళు ఇక్కడి, మహారాజుల, మహారాణుల, మహారావుల తదితర సంస్థానాదీశుల అదుపులో వుంచుకోవడానికి ప్లే చేసిన ట్రిక్కే ఇది!


    కారట్ అండ్ స్టిక్!


    అంటే ఏమిటి?


    ఒక గుర్రాన్ని బండికి కట్టేస్తారు.


    ఒక పొడుగాటి కర్రకి ఒక కారట్ కట్టి గుర్రానికి కనబడేలా దాని ముందు పట్టుకుంటారు. ఆ కారత్ ని అందుకోవడానికి గానూ గుర్రం ముందుకు పరిగెడుతుంది. గుర్రంతో బాటు కారట్ కూడా ముందుకి వెళ్ళిపోతూ వుంటుంది. పరిగెత్తి పరిగెత్తి గుర్రానికి అలుపురావచ్చు - అది ఇంక పరిగెత్తలేనని మొరాయించవచ్చు -


    అప్పుడింక స్టిక్ ఎలాగూ ఉండనే వుంటుంది!


    కర్రతో బడితే పూజ చేస్తే సరి! చచ్చినట్లు పరిగెడుతుంది గుర్రం!


    కారట్ అండ్ స్టిక్!


    మన రాజా మహారాజాలని ఇలాగే ట్రీట్ చేసేవాళ్ళు బ్రిటీష్ వాళ్ళు - సంస్థానాధీశులకి కొన్ని సౌకర్యాలు కలగజేసేవాళ్ళు, కొన్ని ఆశలు పెట్టేవాళ్ళు, ఇంకొన్ని ప్రలోభాలు కలిగించేవాళ్ళు, కానీ ఆ రాజులు మరీ పవర్ ఫుల్ అయిపోయి తమకి ఎదురు తిరగకుండా వాళ్ళ మీద అంకుశం లాగా తమ రెసిడెంట్ ని నియమించే వాళ్ళు. పేరుకి ఫలానా అయన రాజు. కానీ అసలు అధికారం రెసిడెంట్ చేతుల్లోనే ఉండేది.


    దాదాపు సర్వస్వతంత్రుడిగా ఉండి తన స్వంత రైల్వే, తన సొంత కరెన్సీ ఉండిన, ఘనత వహించిన నైజాము కూడా బ్రీటీష్ రెసిడెంట్ ఎలా ఆడిస్తే అలా ఆడాల్సి వచ్చేది. పాలెస్ లో నైజాం వుంటే, కోఠీ దగ్గర ఉమెన్స్ కాలేజీ భవంతిలో బ్రీటీష్ రెసిడెంట్ ఉండేవాడు. ఆ భవంతినే ఒరజినల్ గా రెసిడెన్సీ లేక కోఠీ అనేవాళ్ళు. (కోఠీ రెసిడెన్సి అనే పేరు కొన్నేళ్ళ క్రితం వరకూ కూడా చలామణిలో ఉండేది) కోఠీ లో రెసిడెన్సి ఉండి నైజాం మీద అంకుశంలా అధికారం చలాయించేవాడు. బ్రీటీష్ బలగాలు సికింద్రాబాద్ కంటోన్ మెంట్ లో ఉండేవి. మింగలేక, కక్కలేక ఇదంతా భరిస్తూ ఉండేవాడు నైజాం!


    అలాగే -


    ఇవాళ, ఈ మారిన పరిస్థితులలో తన మీద రెసిడెంట్ లలాగా ఈ చైనీస్ అమ్మాయిలని పంపించాడన్నమాట క్లయివు!


    ఏప్రిల్ షవర్స్!


    మే ప్లవర్స్!


    గుడ్ గుడ్!


    టేక్ దిస్ రైఫిల్, ఫర్ యువర్ సెల్ఫ్ డిఫెన్స్!........" అంది ఏప్రిల్, ఒక ఏకే 47 అతనికి అందిస్తూ.


    నిర్లక్ష్యంగా నవ్వాడు రాజా.


    "నాకు దాని అవసరం ఉంటుందనుకొను" అన్నాడు.


    "మరి?" అంది మే.


    బలిష్టంగా వున్న తన రెండు చేతులూ ముందుకి జాచాడు రాజా.


    "ఈ రెండు చేతులూ చూశావా? ఈ ఎడం చెయ్యి వుందే - ఇది ఒక ఏకే 47 కి సమానం అన్నమాట! ఇంక ఈ కుడి చెయ్యి వుందే - ఇది ఏకే 67 -లేటెస్ట్ అస్పాల్ట్ రైఫిల్ అన్నమాట. దేవుడిచ్చిన ఈ రెండు చేతులు చాలు నాకు! నో థాంక్స్! ఐ కెన్ లుక్ ఆప్టర్ మై సెల్ఫ్!" అన్నాడు.


    ఒక్కసారిగా ఒళ్ళు పులకరించినట్లయింది ఆ ఆడపిల్లలిద్దరికీ!" ఇది మగతనం అంటే!" అనిపించింది. ఏప్రిల్, మే ఇద్దరూ కూడా తమ డ్రెస్సుల తాలూకు జిప్పులు ఇంకా పైకి లాక్కొనే లేదు - కాంక్షగా అతని వైపు చూస్తూ అలాగే నిలబడి వున్నారు .


    కానీ -


    బంగారం రంగులో ఉన్నవాళ్ళ నగ్న సౌందర్యం అసలు రాజా మనసులో రిజిస్టర్ కావడమే లేదు.


    అప్పటికే అతని ఆలోచనలు మీనాక్షి మీదికి వెళ్ళిపోయాయి.


    ఎందుకంత హటాత్తుగా కారుదిగి వెళ్ళిపోయింది మీనా? ఏమయింది?


    ఆ అమ్మాయి తన ప్రవర్తనని తప్పుగా అర్ధం చేసుకుందా?


    ఒకవేళ అదేగనుక జరిగి వుంటే - ఆమె అపోహలని  దూరం చెయ్యడం ఎలా?


    ఎలా? ఎలా? ఎలా?

 


                                                * * *


    పాలెస్ లోనే -


    గాడ నిద్రలో ఉన్న అయేషాని సమీపించాడు ఆమె తండ్రి సద్గుణం.


    "లేమ్మా! బంగారుతల్లి! వరాల మూటా! లే! లే!" అన్నాడు గారభాన్నంత గొంతులో పలికిస్తూ.


    బద్దకంగా ఇటునుంచి అటుపొర్లింది అయేషా.


    "నా వెండి కొండా! లేమ్మా! లే! డ్యూటీ టైమయింది!" అన్నాడు సద్గుణం మళ్ళీ.


    "ఓహు! ఏం డ్యూటీ డాడీ!" అంది అయేషా చెయ్యి నోటికి అడ్డం పెట్టుకుని ఆవలిస్తూ.


    "ఇకనుంచి నీకు ఒక్కటే డ్యూటీ అమ్మా! అ డైమండ్ రాజాని నీ దార్లోకి తెచ్చుకోవాలి! అర్ధమయిందా? అతగాడు ఇప్పుడు పాలెస్ లో ఉన్నాడు. మళ్ళీ ఏ క్షణంలో ఎక్కడికి పోతాడో ఎవ్వడికి తెలీదు. ఈ లోపల నీ పని నువ్వు మొదలెట్టాలి! లేలే!" అన్నాడు.


    అతని మాట పూర్తీ కాకుండానే -


    ఎక్కణ్ణుంచొ పెద్దగా అరుపులు వినబడ్డాయి.


    ఉత్త అరుపులే కాదు - తిట్లు , బెదిరింపులు కూడా తారా స్థాయిలో వినబడ్డాయి.


    ఎవరో కొట్టుకుంటున్నారని అర్ధం అయింది.


    సద్గుణం ఆదుర్దాగా అటువైపు పరిగెత్తాడు. అతన్ని అనుసరించి త్వరత్వరగా వెళ్ళింది అయేషా.


    ఒక గదిలో నుంచి వినబడుతున్నాయి ఆ గొంతులు.


    కాట్లకుక్కలు పోట్లాడుకుంతున్నట్లే ఉంది!


    అప్పటికే అగది ముందు రాజా, ఏప్రిల్, మే, బట్లర్, యంగ్ హజ్బెండ్, సుందరం అందరూ నిలబడి వున్నారు. అందరి మొహాల్లోనూ ఆదుర్దా కనబడుతోంది.


    లోపల్నుంచి కేకలు వినబడుతున్నాయి.


    "నరికేస్తా! అంటోంది ఒక గొంతు.


    "నీ తరంగాదు!" అంటోంది రెండో గొంతు.


    "రేయ్ రక్తం తాగుతా!"


    "నీ బొంద!"


    "ఇంత పని జేస్తావుట్రా!"


    "ఏడ్చావులేవోయ్!"


    "ఇంత నమ్మకద్రోహమా!"


    "పోరా పుస్కి!"


    "పేగులు పీకేస్తారోయ్!"


    ఆ తర్వాత దబదబ శబ్దాలు! ఇంక ఆలస్యం చెయ్యదలచుకోలేదు రాజా.


    నాలుగు అడుగులు వెనక్కి వేసి, విసురుగా వచ్చి భుజంతో తలుపుని డీ కొట్టాడు.


    అవి ఇప్పటి నాజూకు తలుపులు కావుకదా! పాతకలంతో చేసిన దిట్టమైన తలుపులు! అందుకే అవి చెక్కుచెదరలేదు.


    ఈసారి ఇంకాస్త వెనక్కి వెళ్ళాడు రాజా. పరిగెత్తుకువచ్చి గాల్లోకి ఎగిరి, రెండు కాళ్ళతో తలుపులని కొట్టాడు.


    అలా అరడజను సార్లు అయ్యాక -


    భారంగా మూలిగి, తలుపులు విడిపడ్డాయి.


    తక్షణం లోపలికి వెళ్ళిపోయాడు రాజా.


    అతని వెనకే అందరూ గదిలోకి పోయారు.


    లోపల ఏం ఘతకం చూడాల్సివస్తుందో అని బెదిరిపోతూ వెళ్ళారు వాళ్ళు.


    కానీ - లోపల కనబడుతున్నది చూశాక - వాళ్ళకి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు!


    ఆ గదిలో అసలు ఇద్దరూ మనుషులు లేనేలేరు!


    సామంత్ ఒక్కడే ఉన్నాడు!


    గది మధ్యలో కార్డ్స్ టేబుల్ వుంది. దానికి రెండు వైపులా రెండు కుర్చీలు వేసి ఉన్నాయి. టేబుల్ మీద పేక ముక్కలు పంచి వున్నాయి. ఇద్దరి ఆటగాళ్ళకి బదులుగా సామంత్ ఒక్కడే రెండు వైపులా అడేస్తున్నాడు! ఒక వైపుకి వచ్చి ముక్కలు చూస్తున్నాడు. కొంప మునిగిపోయినట్లు అరుస్తున్నాడు. అంతలోనే రెండో వైపుకి వెళ్తున్నాడు. ముక్కలు చూస్తున్నాడు. కోపంతో వణికిపోతూ కేకలు పెడ్తున్నాడు. మళ్ళీ మొదటివైపుకి వస్తున్నాడు. అక్కడి ముక్కలు చూసి పూనకం వచ్చినవాడిలా పెడబొబ్బలు పెడుతున్నాడు.


    "రేయ్! పవిత్రమైన పేకాటలో మోసం చేస్తావుట్రా! నీకు పుట్టగతులుండవోరోయ్!" అంటున్నాడు ఒక వైపు నిలబడి. అంతలోనే రెండో వైపు వచ్చేసి , ఇష్టం వచ్చినట్లు వాగావంటే నాలిక పీకేస్తా అంటున్నాడు.


    "పోరా! ఇస్పేట్ జాకీలా మొహం నువ్వునూ!"


    "పోబే! కళావరు ఏడు లాగా ఏడుపు మొహం నువ్వునూ!"


    "అరె! చుప్!


    "అరె ! తూచుప్!


    తెగ ఆయాస పడిపోతూ , రెండువైపులా తనే ఆడుతూ, తనే పోట్లాడేస్తున్నాడు సామంత్.


    ఠప్  ఠప్ మని నెత్తిమీద కొట్టుకుని, సామంత్ జబ్బ పట్టుకుని ఆపేశాడు సుందరం.


    "ఏంట్రా తింగరి పీనుగా! ఎంటిదీ?"


    "అరె! పరమ పవిత్రమైన పెకాట్లో మోసం చేస్తే ఉర్కొవాలా నాన్నా?"


    "ఎవర్రా మోసం చేసింది?"


    "వాడే! సత్రకాయ్!"


    "సత్రకాయ్ ఎవడూ?"


    "పేకాటాకి పార్టనర్ ఎవరూ రెండో వైపు నేనే సత్రకాయ్ గా ఉండి ఆడుకుంటున్నా!


    "నీ ....." అని మిగతా తిట్టు మింగేసి, "ఇప్పుడంత అర్జెంటుగా సత్రకాయ్ ని పెట్టుకుని పేకాడాల్సినంత అవసరం ఏమొచ్చిందిరా?" అన్నాడు సుందరం కోపంగా.


    "రాత్రంతా నిద్రపట్టలేదు నాన్నా! దిగులు!


    "ఏం రోగమో?"


    "రాత్రి నీ పెళ్ళి ఫోటో ఆల్బం చూశాను నాన్న!"


    "అయితే?"


    "నీ పెళ్ళి ఫోటోల్లో నేను లేనేంటి నాన్నా! మీ పెళ్ళికి నువ్వూ అమ్మా మాత్రమే వెళ్ళారా? నన్ను తీసుకెళ్ళలేదా? ఫో నాన్నా! నువ్వెప్పుడు ఇంతే!" అన్నాడు ఆరోపణగా.


    అది వింటూనే కోయ్యబారిపోయాడు సుందరం.


    ఒక్కసారిగా ఉద్రుతమైన నవ్వు వచ్చింది అయేషాకి. ఫక్కుమని నవ్వేసి, ఇంక అక్కడ ఉండలేక చేతుల్లో మొహం దాచుకుని పరిగెత్తి వెళ్ళిపోయింది తను.


    "నా పరువు నిలువుగా తీశావు గదరా పాపిష్టి వెధవా!" అని పళ్ళు పటపట కోరుకున్నాడు సుందరం.

 


                                              * * *

 

    నిస్సత్తువుగా లైటు స్తంభాన్ని అనుకుని, నేలమీదికి జారిపోయి, ఫెయింట్ అయిపోయిన మీనాక్షి నిస్సహాయంగా నేలమీద పడి వుంది.

 Previous Page Next Page