అది అసలే చీకటి సందు ! అందులోను నిర్జనంగా వుంది! డానికి తోడుగా , ఒక తాగుబోతు తూలుతూ ఆటే వస్తున్నాడు.
వాడి చూపులు నేలమీద కుప్పపోసిన అందంలా ఉన్న మీనాక్షి మీద పడ్డాయి. తన కళ్ళని తనే నమ్మనట్లు ఒక్కసారి కళ్ళు నులుముకుని చూసి, తర్వాత ఆశగా పెదిమలు తడిచేసుకుని, మీనాక్షిని సమీపించి సందేహంగా తాకబోయాడు.
తక్షణం - వాడి చెవి పేలిపోయేటట్లు బలంగా తాకింది ఒక చెప్పు -
అదిరిపడి తిరిగి చూశాడు వాడు.
అక్కడ - అపరకాళికలా నిలబడి ఉంది డాక్టర్ లత!
ఆమె ఎడమ చేతిలో చెప్పు ఉంది.
"లేవరా!" అంది లత కఠినంగా.
భయపడుతూ లేచి నిల్చున్నాడు వాడు.
అంతే!
పటపటమని పదిసార్లు తన ఎడమకాలి చెప్పుతో వాడి దవడలు వాయించింది లత.
"చెప్పు తెగిపోయినట్లుంది! ఇంక చాల్లే!" అన్నాడు లత భర్త అలోక్. అంటూనే, కొసరుగా తన కాలితో తను కూడా ఒక్కటి వాడి నడ్డిమీద వడ్డించాడు.
దెబ్బకి నిషా దిగిపోయినట్లయింది తాగుబోతుగాడికి!
"చచ్చాన్రోయ్!" అని చావు కేక పెట్టి, లేచి పరిగెత్తడం మొదలెట్టాడు.
వెంటనే మీనాక్షి పక్కన కూర్చుండిపోయారు లతా, అలోక్.
డాక్టర్ లత బాగ్ లో స్మెలింగ్ సాల్టు సీసా వుంది. అది తీసి, మీనాక్షికి వాసన చూపించింది.
నెమ్మదిగా మూలిగింది మీనాక్షి. తల అటూ ఇటూ తిప్పి, తర్వాత చటుక్కున లేచి కూర్చుంది. విహ్వలంగా చూసింది.
"భయపడకు! మేమే!" అంది లత నవ్వుతూ.
"ఇంత రాత్రప్పుడు ......మీరు ...........ఇక్కడ!" అంది మీనాక్షి ఆశ్చర్యంగా.
"మా వాళ్ళెవరికో అర్జెంటుగా ఏదో అవసరం వస్తే వెళ్ళి విచారించి వస్తున్నాంలే గాని, ముందు నీ సంగతి చెప్పు! నువ్వు ఇక్కడ .........ఇలాంటి స్థితిలో ..........ఏమిటదీ?" అంది లత.
ఏదో చెప్పబోయింది మీనాక్షి. కానీ మాట బయటికి రాలేదు. ...పెదిమలు వణికాయి. "నేను....." అని ఆగి కళ్ళు తుడుచుకుంది.
మీనాక్షి తత్వం లతకి బాగా తెలుసు - ఆ అమ్మాయి తనంతట తానుగా ఏదన్నా చెప్పాలే తప్ప , ఆమెకి ఇష్టం లేకుండా బ్రహ్మరుద్రులయినా సరే ఒక్కమాట కూడా బయట పెట్టించలేరన్నది లతకి బాగా అనుభవమే!
అందుకనే లత ఇంక ఏమీ మాట్లాడలేదు ......
ఈలోగా .........
అలోక్ అర్జెంటుగా వెళ్ళి అంతరాత్రప్పుడు ఎక్కణ్ణుంఛి ఎలా \తెచ్చాడో గానీ ఒక ఆటోని పీల్చుకొచ్చేశాడు! అలాంటి అద్భుతాలు అతను అరనిమిషానికి అరడజను చొప్పున చేసేస్తూ ఉండగలడు!
ముగ్గురూ కలిసి అటో ఎక్కి ఇల్లు చేరారు.
"పొద్దున్నే వచ్చి చూస్తాను. ఈ లోగా హాయిగా నిద్రపో!" అంది లత.
మీనాక్షికి తను పక్కమీద ఎప్పుడూ పడుకుందో తెలీదు ........ఎలా నిద్ర పట్టేసిందో కూడా తెలియదు.
సొమ్మసిల్లిపోయి నిద్రపోతూ ఉండగా ......
తలుపు దబదబ కొట్టారు ఎవరో , ఉలిక్కిపడి లేచి, తలుపు తీసింది మీనాక్షి.
అక్కడ నిలబడి ఉన్నాడు అతను!
* * *
కొందరు మనుషులు జీవితాలని ఒక్క కుదుపుతో పెద్ద మలుపు తిప్పేసి ఇంకొందరు మనుషులు వీళ్ళకి తెలియకుండానే ఇంకెక్కడో జీవిస్తూ ఉండవచ్చు. సమయం, సందర్భం వచ్చేదాకా వాళ్ళెవరో వీళ్ళకీ వీళ్ళేవరో వాళ్ళకి తెలియకపోవచ్చు. అసలు కలుసుకునే అవకాశమే రాక పోవచ్చును కూడా!
నటరాజన్ ఇలాంటి కేటగిరిలోకే వస్తాడు. అతను సినిమా మనిషి తనవల్ల ఇప్పుడు కొందరి జీవితాలు చాలా సినిమాటిక్ గా మలుపు తిరగబోతున్నాయని అతనికి తెలియు!
నటరాజన్ సినిమా మనిషి అని తేలిగ్గా చెప్పేసి ఊరుకోవడానికి వీల్లేదు. తమిళంలో అతనొక భారీ ప్రొడ్యుసర్ అని చెబితే తప్ప విషయం పూర్తిగా అర్ధం కాదు. నిజానికి అతని జీవితమే ఒక గొప్ప సెంటిమెంటల్ సినిమా కధలాంటిది.
అతనికి మంచి దేహ దారుడ్యం వుంది. చిన్నప్పటి నుంచి కూడా మంచి తిండి పుష్టి ఉంది. కానీ కడుపు నిండా తినడానికి తిండి మాత్రం ఉండేది కాదు. అతనికి తల్లికి అతనంటే పంచ ప్రాణాలు! తను తిన్నానని కొడుకుని మభ్య పెట్టి తను అర్ధాకలితో ఉండి తన ముద్ద కూడా తన ముద్దుల కొడుకుకే తినిపించేది!
పట్టెడు మేతుకులతోనే పొట్టనింపుకుని రొజూ కసరత్తు చెయ్యడానికి వెళ్ళేవాడు నటరాజన్. వ్యాయామం అంటే అతనికి మొహమోజు.
నటరాజన్ వ్యాయమశాలకి ఎట్లా వెళ్ళేవాడు!
వెళ్ళేటప్పుడు అతని భుజం మీద ఒక కోతి కూర్చుని కిచకిచలాడుతుండేది.
అతని మెళ్ళో ఒక పెద్ద పాము వెళ్ళాడుతుండేది.
అతని కాళ్ళ వెనకే ఒక కుక్క పరిగెత్తుకు వస్తూ ఉండేది.
నటరాజన్ కి జంతువులంటే విపరీతమైన ప్రేమ! అతని తల్లి తన కడుపు మాడ్చుకొని అతనికి అన్నం పెడితే, అతను అందులో సగం తన కుక్కకీ పెట్టేవాడు. ఎలా సాధించేవాడో కానీ మొతానికి రోజూ కాసిని పాలు తెచ్చి పాముకు పోసేవాడు.
ఆ వయసులోనే అతనికి ఒక సింహాన్ని కాని, ఏనుగుని గానీ పెంచాలని ఉండేది గానీ ఎట్లా కుదురుతుంది!
తన పేదరికాన్ని వదిలించుకుని తను అనుకున్నవాన్నే సాధించాలంటే అందుకు గాను తనకి ఉన్న ఒకే ఒక మార్గం సినిమాల్లో చేరడం అని నటరాజన్ కి తోచింది. మెడ్రాసు బయలుదేరాడు నటరాజన్.
అతను ఇల్లు వదిలి వెళ్ళేముందు ఆ విషయం తన తల్లితో చెప్పలేదు. చెబితే ఆమె పోనివ్వదని అతనికి బాగా తెలుసు. నిజానికి తన తల్లి మనసు కష్టపెట్టాలని ఏ కోశానా లేదు. సినిమాల్లో చేరి, ధారాళంగా డబ్బు సంపాదించి, ఆతర్వాత తన తల్లిని భోగభాగ్యాలతో ఓలలాడించాలని అతని కోరిక! ఒకవేళ ఆ కోరిక తీరిన తిరకపోయిన కూడా తను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం వల్ల తల్లికి తన పోషణ భారం తగ్గుతుంది. ఆ విధంగా తల్లికి తను శ్రమ తగ్గించిన వాడవుతాడు. అలా ఆలోచించాడు నటరాజన్.
కానీ ఏ సమస్యకయినా సరే కనీసం రెండు కోణాలు ఉంటాయి.
ఉదాహరణకు నటరాజన్ ఇల్లు వదిలి పోవడం అనే సమస్యని తీసుకుంటే నటరాజన్ కోణంలో నుంచి చూస్తే అతను సరైన పనే చేశాడు. తను ఇల్లు వదిలి వెళ్ళిపోయి , ఆవిధంగా తన తల్లికి ఇంక ఏ బాధలేకుండా చేస్తున్నాననుకున్నాడు.
కానీ అదే సమస్యను అతని తల్లి దృక్పధంలో నుంచి చూస్తే ....
ఆమెకి ఇప్పుడున్న కష్టాలు కలిగిస్తున్న బాధకన్నా కూడా కన్న కొడుకు కనబడకుండా పోయాడే అన్న కడుపుకోత కలిగించిన దుఃఖం కనీసం లక్షరెట్లు ఎక్కువ!
కొడుకు కోసం శోకించి ఆ నిస్త్రాణలో కొడుకుని నిందించుకుంది. అసహయురాలయిన ఆ తల్లి - కొడుకు తన కష్టాలని అర్ధం చేసుకోకుండా తనకి కడుపులో చిచ్చుపెట్టి వెళ్ళిపోయాడని.
సినిమాల్లో సంపాదించి తన తల్లిని సుఖపెట్టవచ్చనే ఉహతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు నటరాజన్. కానీ మద్రాసు వెళ్ళిన కొద్దిరోజులకే అతనికో దుర్వార్త తెలిసింది - షాక్ ని తట్టుకోలేని తల్లి మరణించిందని.
అంతే! ఆ అఘాతం నుంచి ఇంక ఇప్పటి దాకా తేరుకోలేదు నటరాజన్! అప్పుడతను మొదటిసారిగా సమస్యను తన తల్లి దృక్పధంలో నుంచి చూశాడు. అది పెద్ద కనువిప్పు అయింది అతనికి!
చిత్రంగా ఆ తర్వాత అదే అతనికి పెద్ద బాక్సాఫీసు ఫార్ములాగా మారింది కూడా!
తల్లి సెంటిమెంటు!
తల్లిని కోల్పోయిన దుఃఖంలో , తల్లి పిల్లలు సెంటిమెంట్ గురించి నిరంతరం , పరిపరి విధాల ఆలోచించేవాడు నటరాజన్. ఆ సమస్యని సాగరమధనం చేసినట్లు మధించాడు. అలా మధించగా మధించగా ఆ అంతర్మధనంలో నుంచి ఆ సెంటిమెంట్ కి సరిపడే సంఘటనలు వందలు, వేలసంఖ్యలో పైకి వచ్చాయి.
అతనికి ఉన్న తెలివి తేటలతో వాటన్నిటిని తన సినిమాలలో ఇరికించాడు నటరాజన్.
ఆ సెంటిమెంట్ జనానికి పట్టింది. ప్రేక్షకులు నటరాజన్కి, బ్రమ్మరధం పట్టారు. అతను తీసిన ప్రతి పిక్చరుకీ కనకవర్షం కురిపించారు. అలా అతను తల్లి సెంటిమెంటుని మదిస్తున్నప్పుడే ఆ ఎవర్ గ్రీన్ సెంటిమెంటుతో వరసపెట్టి సినిమాలు తిస్తున్నప్పుడే నటరాజన్ కి అందులోని అసలు పాయింటు ఏమిటో అర్ధం అయింది.
మన చుట్టూ జరుగుతున్నది ఏమిటి?
మన సొసైటీలో సమిష్టి కుటుంబం అన్నది క్రమంగా అదృశ్యమైపోతోంది.
"భార్య భర్తలు, వాళ్ళకి ఓ బిడ్డా: అనే న్యూక్లియర్ ఫామిలిలు ఎక్కువైపోతున్నాయి. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తప్పడం లేదు.
క్ర్రమక్రమంగా ఈ సుక్ష్మ కుటుంబాలు అన్నది కామన్ అయిపోతున్నా కూడా మనుషులకి మొన్న మొన్నటిదాకా తమకి అనుభవంలో ఉన్న ఉమ్మడి కుటుంబాలలోని భద్రత , ఆప్యాయతలూ, అనురాగాలు, అనుబంధాలు అంత త్వరగా మరపుకు రావడం లేదు. ఆ ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ఉన్నప్పుడు దానిలో ఎన్ని రకాల అగచాట్లు, ఇబ్బందులు అసూయలు, ఎక్స్ ప్లాయిటేషన్ ఉన్నా కూడా ఆ వ్యవస్థలోని అనుబంధాలని, అనురాగాలని మాత్రమే అంతర్లీనంగా గుర్తు పెట్టుకుంటున్నారు మనుషులు.
ఇలా గుర్తు పెట్టుకోవడానికి కారణం ఇప్పటి న్యూక్లియర్ ఫామిలిలలో ఉండే అభద్రతా భావమే కారణం అయి వుండవచ్చు.
అందుకే ఒక ప్రేక్షకుడు నిజమైన జీవితంలోకి వచ్చేసరికి వృద్దప్యంలో ఉన్న తల్లిని, తండ్రిని తన దగ్గర ఉంచుకుని పోషించడానికి సిద్దపడకపోయినా, సినిమాలలో మాత్రం తల్లిదండ్రుల కోసం (ముఖ్యంగా తల్లి కోసం) తన సర్వస్వం త్యాగం చేసే కారెక్టర్ ని చూడడానికి ఇష్ట పడతాడు.