Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 33

 

    ఆ సుబ్బిరాజ్ నోట్లో గుడ్డలు కుక్కి అతన్ని కట్టిపడేయ్యడానికి!" ఆన్నాడు జస్వంతరావు నవ్వుతూ.


    "వెరీ ఫన్నీ!" అంటూ యధాలాపంగా జస్వంతరావు మొహంలోకి చూశాడు డైమండ్ రాజా.


    జస్వంతరావు మోహంలో ఇతమిద్దంగా ఇదీ అని చెప్పలేని భావం ఒకటి మెదుల్తోంది.


    అతను చెప్పలేనంత హాపీగానూ కనబడుతున్నాడు.


    వర్ణనాతీతమైన దుఃఖాన్ని అనుభవిస్తున్న వాడిలాగా కూడా కనబడుతున్నాడా!!


    అమృతం హాలాహలం కలిపి కాక్ టెయిల్ లాగా తాగితే ఎలా ఉంటుందో -


    లేదా ఒక కాలు నిప్పు మీద, ఒక కాలు మంచుగడ్డమీదా పెట్టి నిలుచున్న మనిషి ఎలా ఫీలవుతాడో అలా ఫీలవుతున్నట్లు కనబడుతున్నాడు జస్వంతరావు.


    ఏమయింది ఈయనకి?


    ఏం జరిగింది?


    నిన్న తనూ క్లయివ్ మాట్లాడుకుంటూ ఉండగా హటాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఈ జస్వంతరావు!


    అంత హటాత్తుగా ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు?


    అదే అడిగాడు డైమండ్ రాజా.


    దాని సమాధానంగా ఒక్కనవ్వు నవ్వేశాడు జస్వంతరావు - తర్వాత ఏదో అలోచించి మళ్ళీ అన్నాడు.


    "యంగ్ మాన్! డోంట్ రన్ యువర్ ఇమాజినేషన్ వైల్డ్! నాకేం కాలేదు - నేను మాములుగానే ఉన్నాను. ఐయామ్ ఒకే!" అన్నాడు.


    కానీ జస్వంతరావు ఏదో దాచి పెడుతున్నాడని డైమండ్ రాజాకి బాగా అర్ధం అయింది.


    అయితే -


    అతను దాస్తున్న విషయం ఏమిటి?


    ఈయన ......ఈ జస్వంతరావు......


    నిజంగా తనవైపే ఉన్నాడా అసలు! తనలాగే దేశభక్తుడేనా? ఈ పాలెస్ లో అందరూ మిస్టిరియాస్ కారెక్టర్లలాగానే కనబడుతున్నారు!


    నిజంగానే !


    ప్రయత్నపూర్వకంగా తన మొహానికి ఒక మాస్క్ తగిలించుకున్నట్లు ఏ భావం కనబడకుండా ఉండిపోయాడు జస్వంతరావు.


    తర్వాత అన్నాడు.


    "తెల్లవారిపోతోంది! నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది రాజా!"


    నాకు విశ్రాంతి అక్కరలేదు. ఐయామ్ అల్ రైట్!" అన్నాడు రాజా.


    అప్పుడు హటాత్తుగా రంగప్రవేశం చేశాడు బట్లర్ యంగ్ హజ్బెండ్.


    "మీకోసం ఇద్దరమ్మాయిలు అర్ధరాత్రి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు సర్!" అన్నాడు రాజాతో.


    "ఇద్దరమ్మయిలా?" అన్నాడు రాజా ఆశ్చర్యంగా.


    "అవును సర్! వాళ్ళు ఇద్దరూ కవలపిల్లలు! వాళ్ళ పేర్లు కూడా తమాషాగానే ఉన్నాయ్!"


    "ఏం పేర్లు?"


    "సర్! ఒకమ్మాయి పేరు ఏప్రిల్ షవర్స్! రెండో అమ్మాయి మే ప్లవర్స్!" అన్నాడు యంగ్ హజ్బెండ్.


    చిత్రంగా చూశాడు రాజా.


    "ఏమిటి? ఏప్రిల్ షవర్స్, మే ప్లవర్స్?"


    "అవును సర్!"


    యంగ్ హజ్బెండ్ మాట పూర్తీ కాకముందే ట్విన్స్ అయిన ఆ ఇద్దరూ అమ్మాయిలూ అక్కడికొచ్చేశారు. ఇద్దరూ అచ్చు గుద్దినట్లు ఒకేలాగా ఉన్నారు!


    "నా పేరు ఏప్రిల్ షవర్స్" అంది ఒకమ్మాయి.


    "నేను మే ప్లవర్స్" అంది రెండో అమ్మాయి.


    "ఐసీ! ఎవరు మీరు?" అన్నాడు రాజా.


    "మేం ఎవరిమో చెప్పేబదులు మా విజిటింగ్ కార్డ్స్ చూపిస్తే బాగుంటుంది కదా! అంది ఏప్రిల్.


    "ఇటీజ్ ఓకే!" అన్నాడు రాజా.


    "అయితే ముందు వీళ్ళిద్దరిని బయటకు వెళ్ళమనండి!" అంది మే.


    జస్వంతరావునీ, యంగ్ హజ్బెండ్ నీ బయటకు వెళ్ళమన్నట్లు సైగ చేశాడు డైమండ్ రాజా.


    వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు.


    వెంటనే అక్కచెల్లెళ్ళు అయిన ఏప్రిల్, మే ఇద్దరూ కూడా తాము వేసుకుని ఉన్న పాదాల దాకా జీరాడే పొడుగాటి డ్రెస్సుల తాలూకు ప్రంట్ జిప్పులని సర్రునా లాగేశారు! వాళ్ళ డ్రెస్సులు మెడ దగ్గర్నుంచి కాళ్ళదాకా ఓపెన్ అయ్యాయి!


    వాళ్ళ డ్రెస్సులు అలా ఓపెన్ కాగానే కనబడ్డ ఊహతీతమైన దృశ్యం చూసి నిశ్చేష్టుడయిపోయాడు డైమండ్ రాజా!!


    తమ విజిటింగ్ కార్డ్స్ చూపిస్తామని చెప్పిన ఆ చైనీస్ ఏప్రిల్, షవర్, మే ప్లవర్స్ , తాము వేసుకుని వున్న పొడుగాటి వదులైన డ్రెస్సుల ఫ్రంట్ జిప్పులు ఓపెన్ చెయ్యగానే ........


    రెండు కింగ్ కోబ్రా పిల్లలలాంటి రైఫిల్స్ వాళ్ళ ఒంటికి అతుక్కుని కనబడ్డాయి!


    నైలాన్ బెల్టుతో వక్షానికి, నడుముకి కట్టేసి వున్నాయి ఆ రైఫిల్స్!

    
    రాజా మోహంలో కనబడుతున్న ఆశ్చర్యం చూసి నవ్వింది ఏప్రిల్.


    "మిస్టర్! ఇవేమిటో గుర్తుపట్టావా"


    "ఎకె 47!" అన్నాడు.


    "యా! ఏకే 47 ! తేలిగ్గానే గుర్తు పట్టశావే! అయితే వీటి పవర్ కూడా నీకు తెలుసా? అంది మే.


    సంతోషం లేకుండా నవ్వాడు రాజా.


    "ఈ దారుణ మారుణాయుధం పవరేమిటో మీకు తెలిసి వుండవచ్చు! నాకు దీని పుట్టు పూర్వోత్తరాలు కూడా బాగా తెలుసు! వినండి! అంటూ ఏకే 47 రైఫిల్ నిమిషానికి ఆరొందల బుల్లెట్స్ పైర్ చేస్తున్నట్లుగా గబగబ చెప్పడం మొదలెట్టాడు రాజా.


    "మనవ చరిత్రలో ఈ ఏకే 47 అస్సాల్ట్ రైఫిల్ అంత విరివిగా వాడబడిన మారణాయుధం మరొకటి లేదు! మైకేల్ టి. కాలాష్ నికోవ్ అనే రష్యన్ 1947 లో డిజైన్ చేశాడు ఈ రైఫిల్ ని! అయన పేరు మీదే ఆ అస్సాల్ట్ రైఫిల్ ని "అటో మాట్ కలాష్ నికోవా 1947 " అని పిలవడం మొదలెట్టారు. క్రమంగా దాని తాలూకు పొడి అక్షరాలే ఏకే 47 గా మారాయి! ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా హీనపక్షం అయిదు కోట్ల ఏకే 47 రైఫిల అమ్ముడుపోయి ఉంటాయి. వియాత్నం, నికారాగువాలోని గేరిల్లాలకి , లాస్ ఏంజెలెస్ లోని గ్యాంగులకీ అనేకానేక దేశాలలోని టెర్రరిస్టులకి, రకరకాల తీవ్రవాదులకి కూడా ఈ రైఫిల్స్ అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ తుపాకులు ఇప్పటివరకు, ఎంత విద్వంసం సృష్టించాయో, చెప్పలేం! జర్మన్ లో జరిగిన యుద్దంలో గాయపడి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ అస్సాల్ట్ రైఫిల్ ని డిజైన్ చేశాడు కలాష్ నికోవ్. బురదలో నుంచి ఈడ్చుకెళ్ళినా కూడా చెడిపోకుండా పనిచేసే ఏకే 47 లో కలాష్ నికోవ్ కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది! అయితే అతనికి ఈ తుపాకుల అమ్మకం ద్వారా వచ్చే లాభాలలో వాటా మాత్రం రాలేదు. రష్యన్ ప్రభుత్వం ఇచ్చిణ కొన్ని మెడల్సు తప్ప! తను సృష్టించిన "అటో మాట్ చేయిస్తున్న భీభత్సాన్ని చూశాక, ఒకప్పటి రైతు కోడకయిన కలాష్ నికోవ్ "నేను తుపాకులు డిజైన్ చేసే వృత్తిలోకి రాకుండా వ్యవసాయపనిముట్లు డిజైన్ చేసే ఇంజనీరుగా అయి వుంటే ప్రపంచంలో శాంతి భద్రతలు ఇంతగా క్షీణించి ఉండేవి కావు" అని వాపోయాడు ఈ మధ్య!" ఆన్నాడు రాజా.


    నోరు తెరచి కళ్ళు అప్పగించి స్టన్ అయిపోయి వింటున్న ఏప్రిల్ షవర్స్, మే ప్లవర్స్ ఇద్దరూ కూడా ఒక్కసారిగా తేరుకుని, ఒక్కళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు.


    "నువ్వు ఉద్దండపిండానివి అని అందరూ అనుకుంటూ ఉంటే మేం నమ్మలేదు. ఇప్పుడింక నమ్మక తప్పడంలేదు" అన్నారు. ఇద్దరూ ఒకే సారిగా.


     "ఇంతకీ మీరు ఎవరు?" అన్నాడు రాజా.


    "కనుక్కోలేవా?" అంది మే నవ్వుతూ.


    వాళ్లావేపు ఒక్కసారి పరిశీలనగా చూశాడు రాజా. వాళ్ళు చైనీస్ ట్విన్స్. బాగా పొడుగ్గా ఉన్నారు. దాదాపు ఐదుడుగుల పది అంగుళాల ఎత్తు ఉండవచ్చును.


    సాధారణంగా చైనీస్ అందరూ పొట్టిగా ఉంటారు. వాళ్ళలో పొడుగ్గా ఉండేవాళ్ళు చాలా చాలా అరుదు! అందులోను చైనీస్ ఆడపిల్లలు ఇంత ఎత్తు అసాధారణమే!


    అంతటి టెన్షన్ లోనూ రాజాకి ఒక చమత్కారం గుర్తు వచ్చింది!


    మనిషి తలుచుకుంటే అసాధ్యమైన అనేక విషయాలని సుసాధ్యం చెయ్యవచ్చుట! మరుగుజ్జులలో ఆరడుగుల అజానుభాహువుడిని వెదికి వెదికి ప్[పట్టుకోవచ్చుట! వయసు వచ్చినా శీలం పోగొట్టుకుని డేనిష్ వర్జిన్ ని వెదికి పట్టుకోవచ్చుట! ఇలాగే ఎన్నెన్నో కష్టమైనా పనులు సాధిచవచ్చును గానీ- తెలుగు అంటే ప్రాణం పెట్టె తెలుగువాడిని మాత్రం లోకమంతా గాలించినా ఒక్కడిని కూడా చుడలేమట!


    తెలుగువాడి తెలుగు వ్యతిరేకత అంతగా జగత్ప్రసిద్దమయిపోతోంది!


    ఈలోగా -


    ఏప్రిల్ తన వక్షానికి నడుముకి వున్న నైలాన్ బెల్టులు వదులు చేసి , ఏకే 47 రైఫిల్ ని తీసింది.


    "ఇది నీకు! నీ సెల్ఫ్ ప్రొటెక్షన్ కి!" అంది రాజాతో!


    "మరి ఆ రెండో రైఫిల్ ఎవరికి?" అన్నాడు రాజా మే వైపు చూస్తూ.


    "ఇది మాకు! మా ప్రొటెక్షన్ కి!" అందామె.

 Previous Page Next Page