"శారదా!" అంటూ వెనకాలే వెళ్ళాడు శంకర్రావు. ఏమిటన్నట్లు చూసింది శారద.
"శారదా! ఒక్కమాట చెప్పనా?"
చెప్పమన్నట్లు చూసింది శారద.
"నువ్వు నా ప్రాణానివి, శారదా! కాన్పు అంటే ఆడవాళ్ళకి మరో జన్మ ఎత్తడమే అంటారు. అలాంటప్పుడు శశివదన లాంటి డాక్టరు డెలివరీ చేస్తానంటే ఎలా వద్దనను? నీ ఆరోగ్యం ముఖం శారదా? ఎవరితోనో మొహమాటమనీ, ఇంకెవరో మొహం చిట్లించుకుంటారనీ నేను లక్ష్యపెట్టను. శశివదన నిజంగా చాలా మంచిది. ఆమె ఏం అనుకోదు. ఒకవేళ అనుకున్నా......నేను ఆమె చేతులూ గెడ్డం పట్టుకుని బతిమాలి, ఏం అనుకోవద్దని చెబుతాను."
"మీకు నిజంగానే చాదస్తం ఎక్కువండీ!" అంది శారద నీరసంగా నవ్వుతూ- "నా మాట వినండి..."
శంకర్రావు పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. "అంతేగానీ మొహమాటాలకు పోయి నీకు మంచి ట్రీట్ మెంట్ లేకుండా చేస్తానా? శశివదన లాంటి డాక్టర్ ని చేతిలో పెట్టుకుని..."
"ఆమెను చేతిలో కాదు. నెత్తిమీద పెట్టుకుంటున్నారు" అంది శారద, ఇంకేమనాలో తోచక.
7
పొద్దున్నే త్వరత్వరగా స్నానం ముగించింది శశి. చకచక డ్రెస్సయిపోయింది.
"వాట్, డాక్టర్! వెరీ బిజీ?" అంది సుధీర్ వైపు తిరిగి వెక్కిరింపుగా.
అతను బిజీగా లేడు. బద్దకంగా పడుకుని, డన్ హిల్ సిగరెట్ కాలుస్తూ, మధ్య మధ్యలో కప్పులోని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు. ఒక న్యూస్ ఐటమ్ అతని దృష్టిని ఆకర్షించింది. తమిళనాడులో ముదుమలై ఫారెస్టు సమీపంలో ఉన్న ఒక పల్లె మీదకి ఏనుగుల గుంపు దాడి జరిపి పంటలు నాశనం చెయ్యడమే గాక, ఇద్దరు రైతులని కాళ్ళతో తొక్కేసి చంపేశాయి. వాళ్ళతోనే ఉన్న ఒక పిల్లవాడు మాత్రం తప్పించుకుని పారిపోగలిగాడు.
మళ్ళీ మొదట్నుంచీ చదివాడు ఆ వార్త.
ముడుములై ఫారెస్టు సమీపంలో ఉన్న ఒక పల్లె మీదకి ఏనుగుల గుంపు... పిల్లవాడు మాత్రం తప్పించుకుని పారిపోగలిగాడు.
అతనికి హుషారొచ్చింది.
లేచి కూర్చొని సిగరెట్ గట్టిగా దమ్ము పీల్చాడు.
ఆ రోజు పేపర్ లో ముఖ్యాతి ముఖ్యమైన వార్తలెన్నో ఉన్నాయి. పతాక శీర్షికల్లో పడ్డ సంచలన వార్తలున్నాయి. కాన్సరు ట్రీట్ మెంటుకి కొత్త సింథెటిక్ మందు కనుక్కున్న విశేషం వుంది. ఎలక్ట్రానిక్స్ లో, కంప్యూటర్ సైన్సులో కొత్త కొత్త అధ్బుతాలు కనుక్కున్నారన్న వార్త వుంది.
అవేమీ చదవలేదు సుధీర్. ఇద్దరు రైతులు ఏనుగు పాదాల కింద పడి, నలిగి గుజ్జయి చనిపోయిన వార్త మళ్ళీ మళ్ళీ తనివి తీరేదాకా చదివాడు. అంత పెద్ద ఏనుగుల మందని తప్పించుకుపోగలిగిన పిల్లాడి చాకచక్యాన్ని తలుచుకుని వుర్రూతలూగాడు.
"అబ్బ, లేవండీ! ఎంతసేపు మంచంమీద?" అంది శశి.
"ఇంకా పదవ లేదుగా! పది దాటాక ఒక్క ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తే నన్నడుగు."
"ఇవాళ బహుశా శారదకి డెలివరీ చెయ్యాల్సిరావచ్చు." అంది శశి.
"శారదా?"
"బావుంది! ఎన్నాళ్ళు పోయినా పరగడుపేనా?? శంకర్రావు భార్యండీ?"
"ఒహ్! ఆ శారదా! అప్పుడే తొమ్మిది నెలలయిందా?" అన్నాడు మొహం వెగటుగా పెడుతూ.
అతని మొహంలోకి పరీక్షగా చూసింది శశి. అతని మొహంలో ఆదుర్దా లేదు. కంగారు లేదు. పశ్చాత్తాపం లేదు. 'ఇలా జరిగిందే!' అన్న చింత లేదు.
తప్పు చేసిన దోషిలా లేడతను. నిబ్బరంగా వున్నాడు.
కోర్టులో కొన్ని నేరాలకి సూటిగా రుజువులూ, సాక్ష్యాలూ దొరకవు. కానీ సర్ కర్ స్టాన్షియల్ ఎవిడెన్స్ అని వుంటుంది. అంటే చుట్టూ వున్న పరిస్థితులని బట్టి జరిగింది వూహించడం. దానిమీద ఆధారపడాల్సి వస్తుంది.
తను ఇప్పుడు సర్ కమ్ స్టాన్షియల్ ఎవిడెన్స్ ని బట్టి ఊహిస్తూంది. ఇలా వూహించడానికి తను మహా ఇంటెలిజెంట్ కానక్కర్లేదు.
కానీ తను ఇంటెలిజెంట్ కూడా!
అలా వూహించడం యిష్టం లేదు తనకి. అయినా మరోలా వూహించడం కుదరటం లేదు.
సుధీర్...శారదని...
అవును! ఇంకోలా జరిగి ఉండడానికి వీల్లేదు. ఏదో తెలియని అదృశ్య శక్తి తన మనసుకి నొక్కి చెబుతున్నట్లనిపిస్తుంది. బహుశా ఇదే ఇన్ ట్యూషన్ కావచ్చు.
మరి ఇప్పుడేం చెయ్యాలి తను? ఇలాగే సహించి వూరుకుంటూ వుంటుంది తను. ఆ అమ్మాయిమీద జాలిపడుతూ వుంటుంది. అంతకు మించి తనేమీ చెయ్యదు, చెయ్యలేదు.
తప్పు చేశాడని మొగుడ్ని మొగసాల కెక్కిస్తే బయటపడేది తన కాపురమే.