అయినా తను యెందుకు బయట పడిపోవాలి? అంత జరగరానిది జరిగినా శారద సర్దుకుపోవడం లేదూ?
శారదకి వున్నపాటి విచక్షణ లేదా తనకి? శారద ఎక్కువ చదువుకోని పిల్ల!
మరి తనో! డాక్టర్ శశివదన! బి.ఎస్.సి., ఎమ్.డి., డి.సి. హెచ్., ఎట్సెట్రా..ఎట్సెట్రా.
శారద కన్నా గంభీరంగా ఉండగలదు తను, ఈ చేదు నిజం తన గుండెని కాల్చేస్తున్నా.
కాల్చేసిన సిగరెట్ నిర్లక్ష్యంగా ఆష్ ట్రేలో వేసి రాచి ఆర్పేశాడు సుధీర్.
"శారదా! డెలివరీనా? డబ్బులిస్తారా? దయా, ధర్మమా?"
'తప్పు!' అన్నట్లు చూసింది శశి, బాధగా.
"హు!" అంటూ నవ్వాడు సుధీర్.
"వాళ్ళివ్వాల్సిన అయిదొందలకో, వెయ్యిరూపాయలకో నేను భ్రమ పడతాననుకోకు. అసలు మాటిమాటికీ నీ దగ్గర కొచ్చేస్తే ధైర్యం వాళ్ళకెలా వచ్చేసిందంటాను. ఇలాంటి వాళ్ళందరికీ చనువిచ్చేస్తున్నావ్. నర్సింగ్ హోమ్ ధర్మాసుపత్రి లాగా మారిపోతోంది. అట్ మాస్ ఫియరే మారిపోతోంది. రేపట్నుంచీ ఎల్లమ్మలూ, పుల్లమ్మలూ తప్ప మంచి వాళ్ళెవళ్ళూ రారు మన నర్సింగ్ హోమ్ కి!"
శశికి విచిత్రమైన దిగులు కలిగింది.
ఇతను తన భర్త! నిజమే! కాని ఆ అమ్మాయి ఇవాళ డెలివరీకి వస్తూందంటే దానికి కారణం కూడా ఇతనే!
అయినా జాలీ, సానుభూతీ లేకుండా ఆ అమ్మాయిని ఎందుకంత తక్కువ చేస్తూ మాట్లాడుతున్నాడు? ఎలా మాట్లాడగలుగుతున్నాడు?
మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి తను? తిరగబడి పోట్లాడాలా? 'మీ సంగతంతా నాకు తెలుసు' అని చెప్పెయ్యాలా? 'నా దారిన నేను పోతాను!' అని వెళ్ళి పోవాలా?
ఉహూ! ఏం చెయ్యలేదు తను.
ఆడది నోరు మెదిపితే ఏం జరుగుతుందో పదో క్లాసు దాకా చదువుకున్న శారదకే అంత బాగా తెలిసి మవునంగా ఉండిపోతే, చదువుకున్న ఆడదైన తనకి ఇంకెంత బాగానో తెలుసు. అందుకే ఏం జరగనట్లు ఉండిపోయింది.
స్టెత్ పట్టుకుని నర్సింగ్ హోమ్ లోకి వెళ్ళిపోయింది శశి.
ఇంకో అరగంట తర్వాత స్నానం చేసి, ట్రిమ్ గా తయారయి వచ్చాడు సుధీర్.
వరండాలో ఒక బల్లమీద కూర్చుని వుంది దుర్గ.
పరీక్షగా చూశాడతను. చీటీ గుడ్డతో కుట్టిన పరికిణీ, వాళ్ళమ్మ పాతచీరెని సగం చేసి వేసుకున్న వోణీ చెత్త కుప్పమీద పూసిన పువ్వులా ఉంది దుర్గ. పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా చూసింది అతని వైపు. ఇంకాస్త దూరంలో శంకర్రావు కాలు గాలిన పిల్లిలా అటూ ఇటూ చేతులు నులుముకుంటూ పచార్లు చేస్తున్నాడు.
ముందుకు సాగిపోయాడు సుధీర్. బాండేజు క్లాత్ ను కత్తెరతో కత్తిరించి, డ్రెస్సింగ్ మార్చాల్సిన పేషెంటు దగ్గర కెళ్ళాడు. క్లాత్ ని కత్తిరిస్తున్నప్పుడు అతనిలో ఉద్వేగం!
పక్కనే ఉన్న లేబర్ రూమ్ లో పొడుగ్గా ఉన్న బల్లని చూపించి "పడుకో" అంది శశి.
శారద పడుకుని ఆయాసంగా కళ్ళు మూసుకుంది.
రొటీన్ గా టెస్ట్ చేసింది శశి.
విచిత్రంగా ఉంది ఈ అనుభూతి!
శారద కడుపులో పెరుగుతున్నది తన భర్త బిడ్డ!
ఈ భయంకరమైన నిజం తెలిసి కూడా ఎలా మామూలుగా ఉండగలుగుతూంది తను?
ఆశ్చర్యంగానే వుంది!
ఎత్తుగా వున్న శారద పొట్టమీద అరచెయ్యి ఆనించి తడిమి చూసింది.
లోపల బిడ్డ కాళ్ళు కదుపుతోంది.
ఆ కాళ్ళు కదుపుతోంది తన భర్త బిడ్డ!
"ట్రీట్ చేస్తూంది తను" - ఆ బిడ్డ తండ్రికి భార్య!
ఊహాతీతమైన ఈక్వేషన్!
నిర్లిప్తంగా స్టెత్ స్కోప్ శారద పొట్టమీద ఆనించి, దడదడలాడే గుండెతో బిడ్డ గుండె శబ్దం విన్నది శశివదన.
సాయంత్రమయింది.
శశి ముందర డెట్టాల్ తో, తరవాత సోప్ తో చేతులు శుభ్రంగా కడుక్కుని, లేబర్ రూమ్ లోంచి బయటికి వచ్చింది.
ప్రపంచంలోని ఆదుర్దా అంతా తన కళ్ళలోనే గూడు కట్టుకున్నట్లు చూస్తున్నాడు శంకర్రావు.
"మగపిల్లాడు! కంగ్రాట్స్" అంది. 'కంగ్రాట్స్!' అంటున్నప్పుడు అప్రయత్నంగా సుధీర్ వైపు చూసింది.
ఆమెకి చిత్రమైన భావం కలిగింది.
కంగ్రాట్స్ శంకర్రావుకి చెప్పాల్నా? సుధీర్ కి చెప్పాల్నా? తను డెలివరీ చేసింది సుధీర్ బిడ్డనే? అనుమానం లేదు. అదే పోలిక అంతా!
శంకర్రావు శరీరంలోని రక్తం వరదలా ప్రవహించింది.
"థాంక్సండీ అమ్మగారూ! థాంక్స్, అయ్యగారూ!" అన్నాడు మెలికలు తిరిగిపోతూ.
సుధీర్ అతడ్ని వింత పశువుని చూసినట్లు చూశాడు.
* * *


