"ఏయ్ శశీ! 'ఇప్పుడే పిల్లలొద్దు' అనే నీ వ్రతం ఇంక చాలు. మనం కూడా పిల్లల్ని కందాం ఇంక! పెళ్ళయి అయిదేళ్ళవుతోంది. ఇంకెన్నాళ్ళోయ్?"
"ఇంట్లో వేరే పిల్లలెందుకూ? మీరున్నారుగా పసి పాపాయి!"
"సరే! మళ్ళీ ఇప్పుడు లెక్చరు మొదలెట్టకు."
శశి లేచి, ముందు చీర కట్టుకుని, తర్వాత పక్క దులిపి వేసి, "లెక్చరే! ఇవాళ ప్రైవేట్ క్లాసు తీసుకుని చెవి పిండుతాను. అప్పటిగ్గాని....."
సుధీర్ భయం నటించాడు.
శశి అల్లరిగా చెవి పట్టుకుంది.
"అసలు లేవండి మీరు!"
లేచాడు.
చెవి పట్టుకునే డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిపించుకు పోయింది. సుతారంగానే అతన్ని కుర్చీలో కూలేసింది.
"అల్లరబ్బాయి! ఎప్పుడు మీరు పెద్దమనిషయ్యేది?"
"నేను పెద్దమనిషి నెలా అవుతాను?" అన్నాడు సుధీర్ అమాయకంగా మొహం పెట్టి.
అతని మాటలు లెక్క చెయ్యకుండా, "ఇవాళ మీరు సినిమా కెళ్ళిపోతే నా కెంత ఇదిగా అనిపించిందో తెలుసా? మనమింక చిన్న పిల్లలం కాదు, సుధీర్! మనుషుల ప్రాణాలకు రెస్పాన్సిబుల్ అయిన డాక్టర్లం!" అంది.
"వాళ్ళ ప్రాణాలకు మనం రెస్పాన్సిబులా? సరేలే! హిప్పోక్రైట్ చెప్పిందంతా మనం వల్లించేస్తే, ఎలా? మన ప్రాణాలు కొరికేస్తున్నారు పేషెంట్లు వేళాపాళా లేకుండా! ఎరక్కపోయి చదివాను మెడిసన్! మిరపకాయ బజ్జీల బండీ పెట్టుకున్నా బావుండిపోయేది."
నవ్వింది శశి.
"మీరు మారరు!"
"సినిమా లొద్దంటావ్- బానే ఉంది. మరి పిల్లలు కూడా వద్దంటావే! ఇది భావ్యమా, డాక్టర్?"
కొద్దిగా సీరియస్ గా అయింది శశి మొహం.
"సుధీర్! మీకు చాలాసార్లు చెప్పాను. పెద్ద పెద్ద డైలాగులు వల్లించేస్తున్నానని అనుకోకండేం. మనం అయిదేళ్ళపాటు మెడిసన్ చదివాం. ఒక స్టూడెంట్ మెడిసిన్ చదివి డాక్టరవాలంటే బోలెడంత ఖర్చు అవుతుంది. ఆ స్టూడెంట్ ని చదివించడానికి గవర్నమెంట్ కీ చాలానే ఖర్చవుతుంది. మనం మెడిసిన్ చదివాం అంటే గవర్నమెంటు గ్రాంట్లు, ప్రజల సొమ్ము తిన్నామనే అర్ధం! అంటే ప్రజలకి ఋణపడి వున్నామన్నమాట. ఆ భావం నా మనసులో గట్టిగా నాటుకుపోయింది. అయిదేళ్ళపాటు చదివాం. కనీసం అయిదేళ్ళపాటు నిద్రాహారాల్లేకుండా మనుషులకి సర్వీస్ చెయ్యాలనిపించేది నాకు."
"హిప్పోక్రైట్...."
"వినండి! మనం సర్వీస్ కూడా నిస్వార్ధంగా ఏమీ చెయ్యడం లేదు. ధారాళంగా డబ్బు తీసుకునే చేస్తున్నాం. ఆ చేసేది నిర్విరామంగా, మనఃస్ఫూర్తిగా చెయ్యాలనుకున్నాను. జీవిత కాలమంతా అలా చెయ్యగలనో, లేదో గానీ కనీసం అయిదేళ్ళు- ఎన్ని రోజులు చదివానో అన్ని రోజులు- చెయ్యాలని నిశ్చయించుకున్నాను. అప్పటిదాకా పిల్లలుండకూడదనుకున్నాను. పిల్లలుంటే రాత్రి పగలూ అని లేకుండా పేషెంట్లమీద ఇంత శ్రద్ద చూపించలేనేమో అనిపించింది. అలాగే పేషెంట్లు ఉంటే పిల్లలమీద చూపించాల్సినంత శ్రద్ద చూపించలేనేమో! అందుకని పిల్లలు పుట్టాక ఇంకో ఇద్దరు అసిస్టెంట్సుని వేసుకుని, డాక్టర్ శశి కాస్తా మాతృశ్రీ శశి అయిపోతుంది."
"ఎప్పుడిదంతా?" అన్నాడు సుధీర్ అపనమ్మకంగా.
"ఇవాళ్టితో నా అయిదేళ్ళ వ్రతం అయిపోయింది. భక్తా! ఇంక నువ్వేమి వరము లడిగిననూ ప్రసాదించబడును" అంది అన్నం కలిపి అతనికి గోరుముద్దలు తినిపిస్తూ.
* * *
తొమ్మిది నెలలు గడిచాయి.
"ఇంక ఇవ్వాళో రేపో...." అన్నాడు శంకర్రావు శారదతో నవ్వుతూ.
ఆ సంభాషణ ఇష్టం లేనట్లు మొహం పెట్టింది శారద.
"అబ్బ!" ఎంత సిగ్గో అన్నాడు శంకర్రావు.
శారద మాట్లాడలేదు.
"నొప్పులు రాగానే నిన్ను తీసుకొచ్చెయ్యమన్నారు అమ్మగారు. లేదా ఇప్పుడే వచ్చి నర్సింగ్ హోమ్ లో చేరి పోయినా తనకేమీ అభ్యంతరం లేదుట. నువ్వింక మొండితనం చెయ్యకు, శారదా!"
"మొండితనమేమీ లేదు. ఆమెకి అభ్యంతరం లేకపోయినా మనకి ఉండాలి."
"ఎందుకు?"
"ఎన్నిసార్లో చెప్పాను.....వాళ్ళు బంధువులు, వాళ్ళని మొహమాట పెట్టడం బావుండదని!"
"ఛ! ఛ! శశివదనే ఎన్నిసార్లో చెప్పింది. నిన్ను తన దగ్గరికి తీసుకురమ్మని, మొహమాటపడ వద్దనీనూ! శశివదన అలాంటి మనిషి కాదు."
తన అయిష్టాన్ని సూచించడానికి శారద లేచి అక్కన్నుంచి వెళ్ళబోయింది.