"అదిగో అలా అంటే నిజంగా కోపమొచ్చేసిందనే అర్ధం."
"వస్తే వచ్చింది. దానివలన నీకేమిటో నష్టం."
"నష్టంకాదా? నువ్వాగ్రహిస్తే నాకు నష్టంకాదా?"
ఆమె ఏమీ మాట్లాడలేదు.
అతను దగ్గరకొచ్చి ఆమె భుజంమీద చెయ్యివేశాడు.
అతని చెయ్యి విసురుగా తోసేసింది. "ప్లీజ్! డోన్ట్ టచ్ మీ."
అతను చిన్నబుచ్చుకొని చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు.
రెండు నిముషాలలాగే గడిచాయి. ఇద్దరూ చాలా నిశ్శబ్దంగా వుండి పోయారు. చివరకు ఏమనుకున్నాడో అతను బయటికి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి పదైంది, పదకొండైంది. ఆనందమోహన్ ఇంటిలోంచి ఎటువంటి ధ్వనీ వినరావడంలేదు. లేచి నిలబడి కిటికీలోనుండి అటుకేసి చూసింది. లైట్లన్నీ ఆర్పేసి వుండి చీకటిగా కనిపించింది.
ఇంటిలో వున్నాడా? బయటికి వెళ్ళాడా? సినిమాకేమైనా వెళ్ళాడా?
చిన్మయికి తన ఆలోచనలు తనకే మళ్ళీ సిల్లీగా అనిపించాయి.
అతనెవరో! తనెవరో! అతన్ని గురించి తానింత ఆలోచించటమేమిటి? నోనో! దిసీజ్ వెరీ బ్యాడ్.
లేచి హాల్లోకి వెళ్లి లైటువేసుకుని ఫోన్ దగ్గరకి నడిచింది. అమెరికా ఫోన్ చేయాలి. వోవర్సీస్ కాల్ బుక్ చేస్తే ఒకపట్టాన రాదు. రాజీవ్ తో మాట్లాడాలి, అతని గొంతు వినాలి. ఎస్.టి.డి. ప్రయత్నించింది. అరగంటసేపు అవస్థ పడినా కనెక్షన్ రాలేదు. చివరకు విసుగుపుట్టి కాల్ బుక్ చేసి తలంతా వేడెక్కి పోతున్నట్టుగా వుంటే రెండు కాంపోజ్ టాబ్లెట్స్ వేసుకొని పక్కమీదకొచ్చి పడుకుంది.
ఓ అరగంట తర్వాత నిద్రపట్టేసింది. తెల్లవారుఝామున ఐదింటికి ఫోన్ మ్రోగుతుంటే మెలకువ వచ్చింది.
లేచి తూలుకుంటూ చీకట్లో తడుముకుంటూ నడిచి ఫోన్ దగ్గరకెళ్ళింది.
రిసీవర్ చేతిలోకి తీసుకొని "హలో" అంది.
మీరు అమెరికా కాల్ బుక్ చేశారు కదూ" ఆపరేటర్ గొంతు.
"యస్."
"మాట్లాడండి."
"చిన్మయీ!" అవతల్నుండి రాజీవ్ గొంతు.
"రా....జీ.....వ్..." ఎంతో ప్రేమతో పిలిచింది.
"చిన్మయీ ఏమిటి?"
"నాకు పదే... పదే గుర్తొస్తున్నావు రాజీవ్. నిన్ను విడచి వుండలేకపోతున్నాను..."
"చిన్మయీ! నీ గొంతలా వుందేం?"
"ఎ... లా... వుంది?"
"తడబడుతూన్నట్టు."
"నిద్రలో... లేచి... వచ్చాను..."
"కాదు, అలా లేదు... ఏదో తేడా వుంది."
"లే...దు..."
"సెడషన్ కోసం టాబ్లెట్స్ ఏమైనా వేసుకున్నావా?"
చిన్మయి ఉలికిపడింది.
"లే...దు..."
"నిజం చెప్పు."
"నిజమే... అవును... నిజమే."
"కాదు అబద్దం ఇన్ని వేల మైళ్ళనుండీ నీ గొంతులో మార్పు గమనించగలుగుతున్నాను."
చిన్మయి మాట్లాడలేదు.
"అవునా?"
"ఊ"
"ఏం వేసుకున్నావు?"
"కాంపోజ్."
"ఎందుకు అలవాటు పడ్డావు?"
"అలవాటు పడలేదు. మనసు.... అలజడిగా వుంటే..... డాక్టర్ గారు.... చెబుతే... అప్పుడప్పుడూ వేసుకుంటున్నాను."
"ఎందుకు మనసులో అలజడి?"
"మీకోసమే."
"చిన్మయీ! మరీ అంత పసిపిల్లలాగానా? వచ్చేస్తున్నాగా? ఇంకో మూడు నాలుగు నెలలు..."
"ఒక్కరోజు... కూడా....వుండలేకపోతున్నాను."
"ప్లీజ్! బేరిట్ చివరికి వచ్చేశాంగా మరీ అంత సెన్సిటివ్ గా వుండకూడదు."
చిన్మయి నవ్వింది. ఆ నవ్వులో త్రాగిన మనిషి నవ్వులోని మైకం వుంది.
"మీరే... నన్ను సెన్సిటివ్ గా తయారుచేశారు. మరీ అంత ఎక్కువగా ప్రేమించి..."
రాజీవ్ కూడా నవ్వాడు. "ఈసారి వచ్చినప్పుడు అంత ఎక్కువగా ప్రేమించనులే."
"అమ్మో" అంది చిన్మయి. "ఒక్కక్షణంకూడా... నేను వుండలేను."
"ఐతే టాబ్లెట్స్ వేసుకోవటం మానెయ్."
"మానేస్తాను."
"ప్రామిస్?"
"ప్రామిస్."
"చిన్మయీ! మనసు విస్కీలాంటిది. మనం దిగజారిన కొద్దీ అది వెర్రితలలు వేస్తూ వుంటుంది."
"నా మనసు... నాకు శత్రువు..."
"ఆ శత్రువే మనల్ని ఇంకా ఇంకా దగ్గరకి చేరుస్తుంది."