Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 34


                                        ఎక్కడ సత్యం
                                 *రచన :సెజార్ వల్లేజో

 

    

సత్యం శవాన్ని చూదామని
వచ్చాడొక మనిషి
"చచ్చిపోకు నేస్తం" అన్నాడు
"వొస్తున్నా" నన్నాడు"నిన్ను ప్రేమిస్తున్నా" నన్నాడు
కాని పాపం శవం
కదల్లేదు నిజం
ఇద్దరు మనుష్యులు వచ్చారు
ఏదో అర్జీ తెచ్చారు
"వదలొద్దు మమ్ము" ల్నన్నారు
"వదలొద్దు ధైర్యం" అన్నారు
మళ్లీ రమ్మన్నాను
కాని పాపం శవం
కదల్లేదు నిజం
ఇరవై,ముప్ఫై వందా, వెయ్యి
యాభైలక్షల మంది వచ్చారు
ప్రేమ బావుటా తెచ్చారు
ప్రాధేయపడ్డారు బతిమాలాడారు
"ఇంత ప్రేమకూడా
ఏమీ చేయ్యలేదా మృత్యువుని"
అని ప్రశ్నించారు
కన్నీరు వర్షించారు
కాని పాపం శవం
కదల్లేదు నిజం
లక్షలు పెరిగాయి కోట్లుగా
శవం చుట్టూ జనం
అందరిదీ ఒకటే మననఁ
అందరికీ శత్రువు మరణం
అందరిది ఒకే కీర్తన
అందరిదీ ఒకే ప్రార్థన
"అన్నయ్యా! బతికి రావయ్యా" అని
కాని పాపం శవం
కదల్లేదు నిజం

ప్రపంచ ప్రజలంతా
బయటికొచ్చి నిలబడ్డారు
అబద్ధంతో కలబడ్డారు
శవం ఒళ్లు కదిలింది
జనం కళ్లు తెరిచింది
శవం నడిచింది
తొలి మనిషిని పిలిచింది
అతన్ని చుంబించింది
ప్రేమని ప్రతిబింబించింది
అసత్యం చితికింది
సత్యం బతికింది
                                     (1938లో మరణించిన పెరూ మహాకవి వల్లేజోకి కృతజ్ఞతలతో)
                                   ముద్రణ: జయశ్రీ మాసపత్రిక సంక్రాంతి సంచిక - జనవరి, 1971,
                                           పునర్ముద్రణ: మరో ప్రస్థానం, విరసం ప్రచురణ-మే,1980.

1.Cesar Vallejo సేజార్ వల్లేజొ (1895-1938) సామాజిక న్యాయం కోసం కంకణం కట్టుకున్న ఈ కవి తర్వాత యూరప్ లో స్థిరపడి మార్క్సిస్టు అయ్యారు. స్సానిష్ అంతర్యుద్ధంలో కమ్యూనిస్టుల తరపున పోరాడి చనిపోయారు.

                                   ఫిడెల్ కోసం పాట
                                    *రచన : చేగువేరా*

    

పదపోదాం
ప్రభాతానల ప్రవక్తా
మెలికలు తిరిగే దారులు దిగి
నీ ప్రేమాస్పదమైన ఆకుపచ్చనేల విముక్తికి
పద పోదాం
పగతీర్చుకుందాం ఎన్నో అన్యాయాలమీద
మన ఫాలభాగాల నిండా తిరుగుబాటు తారలు
విజయమో మరణమో అని ప్రమాణం చేస్తూ
    
తొలిసారి పేలిన తుపాకిగుండు చప్పుడికి
నిద్రాభంగం చెందిన బాలికలాగ నేలతల్లి
మేల్కొన్నప్పుడు
మేము నీ పక్కనే ఉంటాం ప్రశాంత సైనికులం
మేము నీ పక్కనే
    
భూసంస్కరణ న్యాయం తిండి స్వాతంత్ర్యం
అంటూ నీ గొంతుక నాలుగు గాలులకీ
ప్రకటించేప్పుడు
మేం అక్కడే ఉంటాం నీ పలుకుల్ని ప్రతిధ్వనిస్తూ
నీ పక్కనే ఉంటాం
గురిచూసి విమోచనం కోసం పేల్చిన
మనగుండు దెబ్బకి
క్రూరమృగం డొక్కలో గాయపడినప్పుడు
మేం నీతోనే ఉంటాం గర్జించే హృదయాలతో
మేం అక్కడే ఉంటాం
    
వాళ్లు మనల్ని హడలకొడతారనుకోకు
లంచాలతో బిరుదాలతో
మాకు తుపాకి కావలి తూటాలు కావాలి లాఠీ కావాలి
అంటే మరేం వొద్దు
వాళ్ల ఆయుధాలు మనల్ని ఊచకోతకోస్తే
క్యూబన్ కన్నీళ్లను మాత్రమే కోరుకుంటాం
చరిత్ర ప్రవాహంలో కొట్టుకుపోతున్న వీరులకు
కాటిగుడ్డల్లా కప్పడానికి
అంతే మరేమీ అడిగేది లేదు.


                                                     ముద్రణ: ఎరుపు, విరసం బులిటెన్,1971.
                                  పునర్ముద్రణ: మరో ప్రస్థానం, విరసం ప్రచురణ -మే , 1980.

 Previous Page Next Page