Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 33


                                  తుది పయనం : తొలి విజయం

  

 

ఊగరా, ఊగరా, ఊగరా!
ఉరికొయ్య అందుకొని ఊగరా!
ఉరికొయ్య అంటుకొని ఊగరా!
ఉయ్యాలలాగ బాగా ఊగరా!
సోదరా, సోదరా, సోదరా!
చావన్నది నీకు లేనే లేదురా!
వీరుడా! ధీరుడా! శూరుడా!                                     ఊగరా!

ఉక్కుమనిషి నువ్వు, ఉగ్రనరసింహుడివి!
ఒక్కదెబ్బకు దిక్కుదిక్కులే పగిలించి,
అశ్శరభ శరభలూ, అట్టహాసాలతో
అడవి అడివంతాను పిడుగులే కురిశావు!
అందుకే,                                                               ఊగరా!

బరిసెలూ, కొడవళ్లే పాళుపతాస్త్రాలు
గురి తప్పనిది నీది శ్రీరామబాణమే!
నీ విల్లు గాండీవం, నీ యిల్లు భూలోకం
నీ గోళ్లు గొడ్డళ్లు, ఈ ప్రజలు నీ వాళ్లు
అందుకే                                                                  ఊగరా!

బరిసెలూ, కొడవళ్లే పాళుపతాస్త్రాలు
గురి తప్పనిది నీది శ్రీరామబాణమే!
నీ విల్లు గాండీవం, నీ యిల్లు భూలోకం
నీ గోళ్లు గొడ్డళ్లు, ఈ ప్రజలు నీ వాళ్లు
అందుకే                                                                  ఊగరా!

ఎండనక, వాననక - తిండి సరిగ్గా తినక,
ఉన్నచోటఉండకుండ ఊళ్లెన్నో చుట్టేవు!
పగబట్టిన, పడగెత్తిన పాములాగా బుసకొట్టి
ప్రజావంచకాధములకు సమాధులే కట్టేవు
అందుకే,                                                                    ఊగరా!

నువు వేసిన కత్తిగంట్లు గంటల్లా మోగేయి!
నువు వేసిన పోలికేకలు మంటల్లా రేగేయి
బుద్ధి తక్కువ గాడిదలకు పోటాసియం సైనేడువి!
అభిమానుల గుండెల్లో ఆరిపోనీ హైలేటువి!
తొత్తుకొడుకు లెవ్వరికీ దొరక్కుండ తిరిగేవు!
కత్తి దూసి కామాంధుల కుత్తుకలే తరిగేవు!
పేద ప్రజానీకానికీ, పీడితులకు, తాడితులకు
చేదోడుగ, వాదోడుగ, సైదోడుగ మెలిగేవు

అందుకే ఊగరా, ఊగరా, ఊగరా
ఎన్నటికీ ఆరనిదీ కాగడా!

పువ్వులాంటి యవ్వనాన్ని నిగ్గబట్టి నిలిచావు!
నిప్పులాంటి నిజాయితీ నెత్తి కెత్తి నడిచావు!
కార్యదీక్ష కదిలిస్తే కదనానికి దూకేవు!
పద్మవ్యూహంలోని అభిమన్యుడి వైనావు!
అందుకే,                                                                       ఊగరా!

నెత్తురుకార్చిన కళ్లే నిప్పులు చెరుగుతాయి!
వంకర టింకర రాళ్లే గుళ్లయి ఎగురుతాయి!
శ్రీకాకుళం అడవుల్లో చీమలు పాముని చంపుతాయి!
సింహాద్రి శిఖరంమీద చిలుకలు పిల్లిని చెండుతాయి!
స్వాతంత్ర్యపు మారుపేరు సామ్యవాదమే సత్యం!
చావులేని ఆ సత్యం  జ్వలిస్తుంది అనునిత్యం
సామ్యవాద రథసారథి మార్క్సు చూపెనదె తీరం!
తూర్పుదిక్కు మందారం! ఆర్పరాని అంగారం!

ఊగరా, ఊగరా, ఊగరా!
ఎన్నటికీ వాలనిదీ బావుటా!

మాంచాలను1 కొలుస్తారు, మల్లమ్మను2 తలుస్తారు,
ఝూన్సీలక్ష్మీబాయికి3 బాష్పధార విడుస్తారు,
సరోజినీదేవి4 ఫోటో పటంకట్టి పొగుడుతారు,
పంచాద్రి నిర్మలంటే5 భయంపుట్టి వణుకుతారు!
తెల్లవాడు నిన్నునాడు భాగత్సింగు అన్నాడు
నల్లవాడు నువ్వునేడు నక్సలైటు వన్నాడు
ఎల్లవారు నిన్ను రేపు వేగుజుక్క అంటారు
అల్లూరికి వారసుడా! శ్రీశ్రీ కవిత్వ లాలసుడా!

ఊగరా, ఊగరా, ఊగరా!
నువ్వూగుతుంటే శత్రువులకి గాభరా

నీ ధాటికి అడ్డులేదు నీ త్యాగం వృధాకాదు!
నీ ఆదర్శం ఎప్పుడూ నీతోనే ఆగిపోదు!
ఇది ప్రపంచ పర్యాప్తం జనశక్తికి పరమాప్తం!
ఈ పోరాటం అంతిమ విజయంతోనే సమాప్తం!

ఏ దేశంలోనైనా ఎకాకివి కావు నీవు!
వీర వియత్నాంలోన విజయగీతి పాడినావు!

అదిగదిగో, బంగ్లాలో అగ్గివాన కురుస్తోంది!
ఇదిగిదిగో సిలోన్ లోను ఎర్రసేన కదుల్తోంది!
ఇది ప్రపంచ కుగ్రామం! ఇది గ్లోబల్ సంగ్రామం
ఎడతెగనిది సంక్షోభం! ముందున్నది సంక్షేమం!

ఉప్పెనలా ఉవ్వెత్తుగ యువకశక్తి లేచింది!
ప్రతినపట్టి, తొడలుకొట్టి, తిరుగుబాటు చేసింది!
హింసకు ప్రతిహింసతో ఎదురుదెబ్బ తీసింది!
పాపాత్ముల ప్రాణాలకు పరమాణువు బాంబులాగ
ఒక మాటగ, ఒక బాటగ, ఒక పాటగ సాగింది!

ఇంక్విలాబ్ ఇంక్విలాబ్  జిందాబాద్!
జిందాబాద్ జిందాబాద్ ఇంక్విలాబ్!
ఇంక్విలాబ్ జిందాబాద్!
ఇంక్విలాబ్ జిందాబాద్!
ఇంక్విలాబ్ జిందాబాద్!
                                             ముద్రణ: సృజన మాసపత్రిక - జూన్ - జూలై, 1971
                                       పునర్ముద్రణ: మరో ప్రస్తానం, విరసం ప్రచురణ- మే,1980.
1.మాంచాల (పల్నాటి యుద్ధం)
2.మల్లమ్మ(బొబ్బిలి రాణి)
3.సరోజిదేవి (జాతీయోద్యమం)
4. పంచాది నిర్మల శ్రీకాకుళ రైతాంగ పోరాట కార్యకర్త. పాతికేళ్ల వయస్సులోనే తూటాలకు వొరిగిన వీరవనిత.

 Previous Page Next Page