"ఆ కనబడుతున్న పడవలన్నీ యిళ్ళే! అని బోట్ హౌస్ లు...." అన్నాడు రమణ.
"మనం బోట్ హౌస్ లో ఉంటామా?" అంది హాస ఉత్సాహంగా.
"ఇక్కడ మనుషులు నీళ్ళలోనే కాపురముంటారా? నేలమీదుండరా?" అంది సుభద్ర నిరుత్సాహంగా.
"నేలమీదా వుంటారు. నీళ్ళలోనూ వుంటారు."
"అయితే మనం నేలమీదకే పోదాం....ఈ నీళ్ళలో అన్నింటికీ యిబ్బందే...."
రమణ మాట్లాడలేదు.
ఈ లోగా షికారా వాళ్ళని బోట్ హౌసుకు చేర్చింది.
* * * *
బోట్ హౌస్ చూశాక సుభద్ర అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.
పడవ లోపల అంత చక్కటిల్లు వుంటుందని ఆమె ఊహించలేదు.
రెండు విశాలమైన గదులు ప్రతి గదిలోనూ అందమైన తివాచీలు పరిచి వున్నాయి. చక్కటి డబల్ కాట్సు, మెత్తటి పరుపులు, డ్రస్సింగ్ టేబుల్, బీరువాలు.
భాగ్యవంతుడి ఖరీదైన బెడ్ రూమ్స్ లాగున్నాయాగదులు.
రెండు గదులలో వేర్వేరుగా అటాచ్డ్ బాత్స్ ఉన్నాయి.
రమణ, పురోహితుడు ఓ గదిలో తల్లీ కూతుళ్ళిద్దరూ ఇంకో గదిలో సెటిలయ్యారు.
* * * *
"అమ్మా? ఇది కలా, నిజమా?" అంది హాస.
"నిజమే!" అంది సుభద్ర.
"ఇదంతా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది?" అంది హాస.
"నీకు కాశ్మీరు చూడాలనుందని ఇలా వచ్చాం."
"చూడాలనుందని చాలాసార్లన్నాను, కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు, ఇప్పుడెందుకు వాయిదా వెయ్యలేదు?"
వాయిదా వెయ్యడానికి టైమెక్కడిది? ఈ మాట అనలేక సుభద్ర కన్నీళ్ళు తుడుచుకుంది.
హాస తల్లిని చూడలేదు. ఆమె మంచం మీద వెల్లకిలా పడుకుని కప్పుకు చెక్కిన నగిషీలు చూస్తోంది. తల్లి నుంచి జవాబు రాకపోవడంతో, "ఇప్పుడెందుకు వాయిదా వెయ్యలేదు?" అంటూ తన ప్రశ్నను రెట్టించింది.
"నువ్వో నిజం తెలుసుకోవాలి...." అంది సుభద్ర.
అప్పుడు హాస తల్లిని చూసింది. ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
"ఏమయిందమ్మా?"
"హాసా....నువ్వు నా బంగారు తల్లివి."
"నేను కాదనలేదుగా?"
"ఆ రమణకు నువ్వంటే ప్రాణం. నీ ఆరోగ్యానికి తాత్కాలికంగా గాలి మార్పు అవసరమంటే అతను వెంటనే అన్ని ఏర్పాట్లూ చేశాడు.... అతడ్ని పెళ్ళి చేసుకోమ్మా!"
"నేను కాదనలేదుగా...."
"అవతల అతడిబ్బందులేవో అతడికున్నాయి. పెళ్ళి వాయిదా వేయడానికి లేదు? నువ్వు వూఁ అంటే ఇక్కడే నీ పెళ్ళి జరిగిపోతుంది."
హాస ఆశ్చర్యంగా, "నాన్నగారు లేకుండానా?" అంది.
"ఈ పెళ్ళికి నాన్నగారొప్పుకున్నారు. ఆయనకు నీ పెళ్ళికి దగ్గరుండాలన్న కోరిక కంటే నీకు పెళ్ళి కావాలన్న కోరికే ఎక్కువగా వుంది."
"అమ్మా! నువ్వేదో దాస్తున్నావు...." అంది హాస.
"నేను దాచిన విషయ మొకటుంది...." అంది సుభద్ర__ "రమణ చాలా గొప్పవాడు. బాగా ఆస్తిపరుడు. అతడికి మామూలు పద్ధతిలో వివాహమైతే దానికి తన వాళ్ళందర్నీ ఆహ్వానించాలి. గొప్ప విందివ్వాలి. అందుకు లెక్కవేస్తే ఎంత ఖర్చు తేలిందో తెలుసా?"
"ఎంత?"
"విందుతో సహా పెళ్ళి ఖర్చు లక్ష...."
"వూఁ...."
"పెళ్ళికి రమణ బంధువు లొస్తారు. వాళ్ళ బుద్ధి మంచిది కాదుట. వాళ్ళల్లరి చేస్తే అదుపు చేయడం రమణ వల్ల కాదుట!"
"వూఁ...."
"అందుకని అతడే ఈ ఉపాయం చెప్పాడు."
"ఏ ఉపాయం?"
"మీ యిద్దరి పెళ్ళికీ అటూ యిటూ పెద్దలు ఒప్పుకోలేదు కాబట్టి మీరిద్దరూ పెద్దల్ని మోసం చేసి రహస్యంగా పెళ్ళి చేసుకుంటారు. ఆ విధంగా పెళ్ళి ఖర్చు తప్పుతుంది. పెళ్ళి సక్రమంగా అవుతుంది. వధూవరులొకర్నొకరు ఇష్టపడ్డాక ఆ పెళ్ళికి ముఖ్యమైనది తంతుకాదు."
"చాలా బాగుంది ఉపాయం. పెళ్ళయ్యాక ఈ కాశ్మీర్లో అతను మన్ని వదిలిపోతే, అప్పుడేం చేస్తావు?"
"రమణ గురించి నాన్న అన్నీ తెలుసుకున్నారు. వాళ్ళది చాలా మంచి కుటుంబం."
"మనవాళ్ళు కూడా, అవునా?"
సుభద్ర నవ్వి, "అవన్నీ నీకెందుకు? పెద్దాళ్ళు చూసుకుంటారు" అంది.
"అయితే మనమిక్కడికి నా పెళ్ళి కోసం వచ్చాం"
సుభద్ర నవ్వింది.
"స్వర్గానికొచ్చినా ఏదో పోరు తప్పలేదుట" అని "అన్నట్లు మనమిప్పుడు స్వర్గానికే కదూ వచ్చాం. అమ్మా! అసలు స్వర్గమెలాగుంటుందో" అంది హాస.
"ఏమో, నేనేం చూశానా?"
"పోనీ, నేను చూసి రానా?"
"ఛీ ఊరుకో, అవేం మాటలు? మనకీ స్వర్గమే మంచిది. ఇది చూసి మనం మళ్ళీ యింటికి పోవచ్చు.... ఆ స్వర్గం నుంచి వెనక్కు రాలేం...."
"అమ్మా! నా ఆరోగ్యానికేమయింది? నన్ను కాశ్మీరెందుకు తీసుకొచ్చారు?"
హాస తెలివైనదనీ ఇలాంటి ప్రశ్నలు వేస్తుందనీ సుభద్ర ముందే తెలుసు. అన్నింటికీ తగిన కథలల్లుతుందామె. అల్లుకుందుకు భర్త సాయం కూడా తీసుకుంది.
ఎంతోకాలం బ్రతకదని తెలిసీ హాసను పెళ్ళి చేసుకుందుకు ముందుకొచ్చిన రమణ ఓ అద్భుత ప్రేమికుడు. ఆమె పెళ్ళి అతడితో జరిగిపోతే ఆ తర్వాత చివరి రోజులు ఇంట్లో గడిచిపోతాయి. కాశ్మీర్ ప్రయాణం అందుకేనని ఇంట్లో అందరికీ తెలుసు.
"నీ ఆరోగ్యానికేం కాలేదు. నిన్ను గాలి మార్పుకు మన పల్లెటూరికి తీసుకుపోయినా సరిపోతుంది. కానీ కాశ్మీర్ గురించి నువ్వు అడిగావు, రమణా పట్టుబట్టాడు."
"తాతగారూరికే అనలేదు, నాది ఇతిహాస్ కళ్యాణం కావాలని!" అంది హాస నవ్వి.
"ఆయన మాట నిజం చేయమ్మా!"
"ఎమ్మే కావాలిగా అందుకు...."
సుభద్ర మాట్లాడకుండా వూరుకుంది.
* * * *
తల్లీ కూతుళ్ళు స్నానం చేసేసరికి ఓ కాశ్మీరీ యువకుడు ట్రేలో ఆవిర్లు కక్కుతున్న కాఫీ కప్పులతో వచ్చాడు.
ఇద్దరూ కాఫీ తాగేదాకా అతడక్కడే వున్నాడు.
"చాలా బాగుంది" అంది సుభద్ర.
కాశ్మీర్ యువకుడామె వంక ప్రశ్నార్ధకంగా చూశాడు.
"అతడికి తెలుగు రాదమ్మా" అని, "అచ్చాహై, కాఫీ బహుత్ అచ్చా" అంది హాస నవ్వుతూ.
"షుక్రియా" అని ఆ యువకుడు కాఫీ చేయడంలో తనకున్న ప్రావీణ్యత గురించి హిందీలో చాలా చెప్పాడు. హాసకతడి మాటలర్ధం కాలేదు కానీ చెబుతున్నప్పుడతడి భావలాస్యాలు గమనిస్తూ ఉన్నట్లుండి పకపకా నవ్వింది.
ఎదుటి మనిషి చెప్పేది మనకేమీ అర్ధంకానప్పుడు, ఆ విషయం ఆ మనిషికి తెలియకే మనకేమేమో చెప్పుకుపోతుంటే, అతడి మాటలు వినకుండా అతడినే చూస్తుంటే ఎవరికయినా నవ్వు రావడం తథ్యం.
ఆ యువకుడామె ఎందుకు నవ్వుతోందో తెలియక తానన్న మాటల్లో హాస్యాన్ని నెమరు వేసుకుందుకు ప్రయత్నిస్తూ ఆమెనే చూస్తూ తెల్లబోయి నిలబడ్డాడు.
"అలా చూస్తాడేమిటే?" అంది సుభద్ర.
"ఏమో నాకేం తెలుసు, నువ్వే అడిగి తెలుసుకో...."
"ఎలా అడగనే, భాష రాదు...."
"ఏమిటీ అనడం కూడా రాదా." అంది హాస సవాలుగా.
వెంటనే సుభద్ర. "క్యా" అంది అదో రకం వుచ్చారణతో.
కాశ్మీర్ యువకుడు వులిక్కిపడి ప్రశ్నార్ధకంగా సుభద్ర వంక చూశాడు.
"క్యా" అంది సుభద్ర అదోరకం వుచ్చారణతో.
కాశ్మీర్ యువకుడికెందుకో నవ్వొచ్చింది. వాడు మాట్లాడకుండా కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకుంటూంటే మళ్ళీ, "క్యా" అంది సుభద్ర.
"అచ్చాహై, బహుత్ అచ్చాహై" అంటూ కాశ్మీర్ యువకుడక్కడి నుంచి వెళ్ళిపోయాడు తనలో తనే నవ్వుకుంటూ.
"క్యా అంటే నవ్వుతాడేమిటే?" అంది సుభద్ర.
"నువ్వు క్యా అంటే నాకే నవ్వొస్తోంది. భాష బాగా తెలిసినవాడు. వాడు నవ్వితే ఏమాశ్చర్యం?" అంది హాస.
* * * *
ఆ రోజుకు విశ్రాంతి తీసుకున్నారు హాస, సుభద్ర.
వాళ్ళు కాఫీలు తాగిన కాసేపటికి రమణ, పురోహితుడు వచ్చి వాళ్ళను పలకరించి బయటకు వెడుతున్నామని చెప్పి వెళ్ళారు.
తర్వాత తల్లీ కూతుళ్ళకు వళ్ళు తెలియని నిద్రపట్టింది.
రాత్రి ఎనిమిదింటికి రమణ వచ్చి తలుపు తట్టేవరకూ వాళ్ళకు మెలకువ రాలేదు. అంతగా నిద్రపోయినందుకు ఇద్దరూ సిగ్గుపడ్డారు.