Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 33

    "మీరంతా ఒకటయ్యారు. నన్ను వేరుచేసి పారేస్తున్నారు. నాకు కళ్ళారా చూడాలని వుంది అందుకని అలా అంటున్నాను. ఈ వార్త మాయికి తెలిసి ఆమెకి కోపం వచ్చి నన్ను లాక్కెళ్ళి ఆమె ముందు ఆమె అనుచరులు పడేశారానుకో ఆ దెబ్బతో హాయిగా చూడొచ్చుకదా" అన్నాడు రామ్ దేవ్.
   
    "వెనుకటికి నీలాంటివాడే దేముడూ నాకు కనపడతావా లేక నా చేతిలో వున్నా దుడ్డుకర్రలో బుర్ర బద్దల కొట్టమంటావా అన్నాడుట అలా ఉంది నీవు చెప్పేది"
   
    ఆనందయ్య అలా అనంగానే అందరూ నవ్వారు.
   
    ఆ తర్వాత ప్రశాంతంగా చర్చించుకోవటం మొదలుపెట్టారు.
   
    ఉన్నట్లుండి అడవిలో సోదెమ్మ ప్రత్యక్షం కావటం ఏమిటి? శక్తిమాయికి వార్త వెళుతుందిలే గోపన్న విడుదల అవుతాడులే అని చెప్పటం ఏమిటి? కణుపుల జోస్యం అన్నమాట ఇంతవరకూ ఎవరూ వినలేదు. అదంతా హంబక్ గాలిలో బాణాలువేసి మాటల్లో పెట్టి చామంతి నుంచి విషయం లాగింది సోదెమ్మ. ఆ విషయం తేట తెల్లంగా అర్ధమయిపోతూనే వుంది.
   
    ఇంకా ఆలోచించాల్సిన విషయం-
   
    సోదెమ్మ ఎవరు?
   
    శక్తి మాయేనా?
   
    శక్తిమాయి అనచరులారా!
   
    ఏమో!
   
    పనికావటం ముఖ్యం.
   
    గోపన్న తేలికగా జైలునుంచి గనుక విడుదల అయితే శక్తిమాయి వుంది. అనటానికి తిరుగులేని సాక్ష్యం. బండ గుర్తు. ప్రతి ఆపదకి అన్యాయానికి ఎదురుకనే శక్తి అక్షరాలా వున్నట్లు కలియుగ ప్రత్యక్ష దేవత.
   
    అక్కడున్న అందరూ ఈ మాట అనుకున్నారు.
   
    ఆ తర్వాత శక్తిమాయి గురించి మాట్లాడుకుంటూ వుండిపోయారు.
   
    "చామంతీ! నీ కష్టం ఎలాగో తీరుతుంది. అమ్మని నమ్మావు కదా, గోపన్న వస్తాడు. గోపన్నతో నీ పెళ్ళి అవుతుంది. నాలుగు రోజులు నీవు మౌనంగా ఉండు. మీ అయ్యతో ఏమి అనకు" అంది బాలమ్మ.
   
    "మా అయ్య మారకపోతే ఎలా?" దిగులుగా అంది చామంతి.
   
    "మీ అయ్యనికూడా శక్తిమాయి మార్చేస్తుంది." రామ్ దేవ్ చిరునవ్వుతో అన్నాడు.
   
    "మీరు నిజంగా అంటున్నారో ఎగతాళిగా అంటున్నారో గాని నాకైతే తెలియటంలేదు. శక్తిమాయి తల్చుకుంటే వాళ్ళ అయ్యని మారుస్తుంది మిమ్మల్ని మారుస్తుంది" అంది గుణవంతి.
   
    "జరగబోయేది అదేలే" అన్నాడు ఆనందయ్య.
   
                                                          21


    "నాకేం తెలియదు బాబో" అంటూ మొరపెట్టుకున్నాడు పాపన్న.
   
    "ఏమి తెలియదా?" రెట్టించి అడిగాడు ఇన్ స్పెక్టర్.
   
    "తెలియదు సాబ్."
   
    "తింటం తెలుసా?"
   
    "ఆ..." అని నాలుక కొరుక్కున్నాడు పాపన్న.
   
    "దొంగ గాడెదకొడకా, కొట్టానంటే మక్కెలు విరిగి పోవాలి. నిజం చెప్పు నాలుగు రోజుల బట్టీ స్టేషన్ చుట్టుపట్ల ఎందుకు తారట్లాడుతున్నావు?"
   
    "దొంగలు ఎలా వుంటారో ఎప్పుడూ చూడలేదు. పోలీస్ స్టేషన్ లో దొంగలు ఉంటారని విన్నాను. వాళ్ళు కనబడితే కళ్ళారా చూద్దామని...అంతే అంతకుమించి నాకేం తెలియదు బాబో"
   
    "నేను కొట్టానా?"
   
    "లేదు బాబో!"
   
    "మరి ఎందుకు అలా శోకాలు పెడుతున్నావ్?"
   
    "పోలీసులకి చిక్కితే తంతారని ఎవరో చెప్పారు."
   
    "అంతేనా యింకేమీ చెప్పలేదా?"
   
    "ఉహూ!"
   
    "నీకు నీ వాళ్ళంటూ ఎవరూ లేరా?"
   
    "ఉహో!"
   
    "మరి ఎక్కడ వుంటున్నావ్?"
   
    "రైల్వేస్టేషనులో పడుకుంటాను. పగలంతా పనిచేసి ఆ డబ్బులతో ఏదోవకటి తిని...కొని..."
   
    "మంచిది మరి నాలుగురోజుల బట్టీ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నావురా దొంగలమిడి కొడుకా" ఇన్ స్పెక్టర్ కుర్చీలోంచి లేస్తూ అన్నాడు.
   
    "బాబోయ్ నాకేమీ తెలియదు....నాయనోయ్ నన్ను కొట్టొద్దు" అంటూ అరిచాడు పాపన్న.
   
    "నిన్ను కొట్టానురా!"
   
    "లేదు బాబోయ్!"
   
    "మరెందుకు అరుస్తావ్?"

 Previous Page Next Page