"మీరు కుర్చీలోంచి లేచారుగా, కొడతారు."
"కొడతానికి తప్ప కుర్చీలోంచి నాకు లేచే పనిలేదా?" నవ్వుతూ అడిగాడు ఇన్ స్పెక్టర్ కన్నారావు.
"వుంది...వుంది" ఓఅడుగు వెనక్కి వేస్తూ భయంతో అన్నాడు పాపన్న.
"వన్ నాట్ వన్" అతను గట్టిగా పిలిచాడు.
వన్ నాట్ వన్ పరుగెత్తుకుంటూ వచ్చాడు. వస్తూనే "ఎస్ సార్" అన్నాడు.
"వీడిపేరు పాపన్నట...వీడి ప్రవర్తన చూస్తుంటే పాపాల భైరవుడు గుర్తుకొస్తున్నాడు. చూస్తుంటే పెద్ద కేటు గడిలా వున్నాడు...అర్జంట్ గా బయటికి వెళుతున్నాను. వచ్చి కేసు చూస్తాను. వేడిని లోపలి తొయ్యి" అన్నాడు అతను.
"బాబోయ్ నాకుజైలంటే భయం__అయ్యా ఇన్ స్పెక్టర్ గారూ! ఇంకెప్పుడూ యిటురాను....నన్ను వదిలెయ్యండి" పాపన్న ప్రాధేయపడుతూ అన్నాడు.
అతను కోపంగా చూసి బయటికి వెళ్ళిపోయాడు.
వన్ నాట్ వన్ పాపన్న రెక్కపుచ్చుకుని లాక్కెళ్ళి నాలుగో నెంబర్ సెల్లో పడేశాడు పాపన్నని.
"దొంగనాకొడుకులు" నెమ్మదిగా తిట్టుకుని తలఎత్తి అక్కడే వున్నా నలుగురు ఖైదీలను చూశాడు పాపన్న.
ఆ గదిలోనే గోపన్న కూడా వుంది.
"ఎవరిని తిడుతున్నావు తమ్ముడూ?" ఓ ఖైదీ అడిగాడు.
"మిమ్మల్ని కాదులే..."
"ఆ సంగతి మాకూ తెలుసు కొత్తోడా? నీవు తిట్టింది ఎవరిని అన్నది కావాలి."
"మనం ఏమీ చేయక పోయినా మనలాంటి వాళ్ళని ఈ కూపంలోకి నెట్టే ఎర్రటోపీలవాళ్ళు దొంగనాకొడుకులు కాక దేముళ్ళా? నాకు పనిబడి నాలుగుసార్లు ఈ వీధిలో తిరిగాను. అది తప్పయింది లాక్కొచ్చి యిక్కడ పడేశారు" పాపన్న చెప్పాడు.
"అయితే నువ్వేమి చేయలేదంటావ్?" అవతలివాడు రెట్టిస్తూ అడిగాడు.
"లేదు"
"నమ్మమంటావ్!"
"అది నీ యిష్టం అన్నా....నమ్మితే నమ్ము లేకపోతే లేదు."
"చూస్తుంటే గట్టివాడివి లాగానే వున్నావు....నేను నమ్మను. ఫర్వాలేదు తమ్ముడూ! మనలో మనకేమిటి ఏం చేశావో చెప్పు."
"ఏదైనా చేస్తేనే యిక్కడికి వస్తారా?"
"మన దృష్టిలో ఏదైనా తప్పు కాకపోవచ్చు...ఈ ఎర్రటోపీగాళ్ళ దృష్టిలో మాత్రం వెధవ పనికింద లెక్క."
"నువ్వేం చేసి యిక్కడకు వచ్చావ్ అన్నా?"
"అయిదుకోళ్ళు దొంగిలించాను...దానమ్మ కడుపుకానా వాటిని చూసేసరికి పంచపాండవులు గుర్తొచ్చారు. ఛీ....అనిపించియింకో కోడిని దొంగిలించబోయి పట్టుబడ్డాను. అంతే నన్ను తీసుకువచ్చి నాలుగుగోడల మధ్య కూలేశారు. వాళ్ళేమో పంచపాండవులని కోసి మసాలాకూర చేసుకుతిన్నారు...అది తిన్నప్పటినుంచే ఇన్ స్పెక్టర్ అలా మారిపోయింది."
"మారాడు అంటే?"
"కొక్కొరకో అంటున్నాడు."
వాడు ఆ మాట అనంగానే పాపన్న పగలబడినవ్వాడు మరో ఖైదీకూడా యికయిక లాడాడు....గోపన్న మాత్రం యిదేమి పట్టనట్లు ముఖం పక్కకు తిపుకుని కూర్చున్నాడు.
"అదీ విషయం తమ్ముడూ! నేను కోళ్ళదొంగను....చీరలదొంగ మరి నీ విషయం కూడా చెపితే విని ఆనందిస్తాను."
"నేను ఏ దొంగతనం చేయలేదు."
"నీలాంటివాడే యిక్కడొకడున్నాడులే" వ్యంగ్యంగా అన్నాడు కోళ్ళదొంగ.
"నాలాంటివాడా!" పాపన్న ఆశ్చర్యంగా అడిగాడు.
"ఊ....వీడిపేరు గోపన్న. నేను ఏ పాపం చేయలేదు. నా యజమాని దొంగతనం నేరంమోపి నన్ను జైలులో పెట్టించాడు, అనిరాత్రింబవళ్ళు తెగ బాధపడిపోతున్నాడు. అది కాదులే అసలు విషయం ఏదో వుండివుంటుంది. పెద్దాళ్ళతో వ్యవహారం అంటూ ఆకుకు అందని పోకకి చెందమాటలు పలుకుతుంటాడు. ఏమి చేయంది ఈ స్వర్గానికి ఎవరయినా ఎలా రాగలరు?" కోళ్ళ దొంగ తమాషాగా కనుబొమలెగరేసి అన్నాడు.
"గోపన్న అంటే అతనా?" అన్నాడు పాపన్న.
"అంటే అర్ధం ఏమిటి? గోపన్న పేరు ప్రఖ్యాతులున్న గజదొంగా?" కోళ్ళదొంగ కుతూహలంగా అడిగాడు.
అంతవరకు పెదవి కదపని గోపన్న మొదటిసారిగా నోరు తెరచి "నా కేమి తెలియదు. నన్ను మాటలతో బాధ పెట్టవద్దు" అన్నాడు.
"ఇదీ వరస" ఈ తఫా చీరలదొంగ అన్నాడు.
వీళ్ళిలా మాట్లాడుకుంటుంటే సెల్ దగ్గరకు వన్ నాట్ వన్ వచ్చాడు...."ఏంటి గుసగుస లాడుకుంటున్నారు ఇన్ స్పెక్టర్ సాబ్ విన్నాడంటే మాకు చివాట్లు మీకు బడితపూజ జరుగుతుంది నోరుమూసుకుని కూర్చోండి..." అన్నాడు.