"నువ్వు ఎవరితో ఈరాహస్యం జెప్పవద్దు. ఆఖరికి మీ అయ్యా దగ్గరకూడా అడవికి వెళ్ళు శక్తిమాయిని పిలువు. నీకు జరిగిన కష్టం జెప్పుకో.....ఆ తల్లి కళ్ళు తెరిస్తే నీ కష్టం తీరుతుంది."
గుణవంతి జెప్పింది చామంతి విని అడవికి వెళ్ళింది. ఏ మనిషి కనపడంది జెట్టుకి పుట్టకి ఎలా చ్జేపుతుంది? అటూ యిటూ తిరిగి చివరికి చాతగాని తనంతో ఏడుస్తూ కూర్చుని వుండగా ఎటునుంచో అటు వస్తున్న సోదెమ్మ మాట్లాడించి కణుపుల జోస్యం చెప్పి వెళ్ళిపోయింది. శక్తిమాయి కనపడకపోయినా సోదెమ్మ కనపడినందుకు సంతోషిస్తూ తిరిగి వచ్చిన చామంతి అక్కడ జరిగింది యధాతధంగా గుణవంతికి చెప్పింది.
"అంటే!" అర్ధంగాక అడిగింది చామంతి.
"నీ గోడు శక్తిమాయి వింది. గోపన్న జైలునుంచి వస్తాడు."
"విందా ఎలా?"
"సోదెమ్మద్వారా!"
"ఆమె సోదెమ్మకదా!"
"అక్కడే వుంది పరమరహస్యం..." ఆనందయ్య నవ్వుతూ నెమ్మదిగా అన్నాడు.
"పరమరహస్యమో దేవరహస్యమో మా కేవరికీ అర్ధంకాలేదు. అర్ధమయ్యేటట్లు చెప్పు" అంది బాలమ్మ.
"సోదెమ్మ ఎవరనుకుంటున్నావ్?"
"నాకేం తెలుసు అదేమన్నా మా అప్పకూతురా ఫలానా అని జెప్పటానికి."
బాలమ్మ ముచ్చటగా మూతి తిప్పుతూ అనేసరికి అందరూ నవ్వారు. సరీగ అప్పుడే రామ్ దేవ్ కున్నా నెత్తుకుని లోపలికి వచ్చాడు.
"తండ్రీ కొడుకులు చాంద్రాయణం చేయటం పూర్తి అయిందా?" గుణవంతి అడిగింది కున్నాని వడిలోకి తీసుకుంటూ.
"ఏమయింది. మీరంతా ఏమిటి ఇక్కడ సమావేశం అయ్యారు?" రామ్ దేవ్ మంచం చివరగా కూర్చుంటూ అడిగాడు.
మొదటినుంచీ జరిగిందంతా జెప్పింది బాలమ్మ.
"పరమరహస్యం ఏమిటి?" రామ్ దేవ్ అడిగాడు.
"అది నేను జెపుతాను. సోదెమ్మ ఎవరనుకున్నావ్ శక్తిమాయి మనిషి__" ఆనందయ్య చిరునవ్వుతో జెప్పాడు.
"ఆ...." అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచింది చామంతి.
"ఇంకా నయం శక్తిమాయి సోదెమ్మ వేషంలో వచ్చింది అనలేదు" రామ్ దేవ్ ఎకసెక్కంగా అన్నాడు.
రామ్ దేవ్ అనంగానే అందరూ ఉలిక్కిపడ్డారు.
అవును.
అలా ఎందుకు జరగకూడదు.
శక్తిమాయి రూపు రేఖలు యింతవరకూ ఎవరికీ తెలియదు. ఆమె ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో ఏ రూపం దాల్చి ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏ వేషంలో ఉంటుందో దేముడికి తెలియాల్సిందేగాని మానవ మాత్రుడికి తెలియదు. సోదెమ్మ వేషంలో ఉన్నది శక్తిమాయి కావచ్చు. లేక శక్తిమాయి తాలూకా వేగు మనిషి కావచ్చు. చెప్పలేము.
"శక్తిమాయి అంటూ అసలు ఒకామె ఉందా....?" రామ్ దేవ్ అన్నాడు.
"అదిగో ఆ కూతే కూయొద్దు అంటున్నా. నే వెళ్ళి ఆ దేవతని తలుచుకోబట్టే కదా మన బంగారు కొండకున్నా మనింటికి క్షేమంగా వచ్చాడు. బన్సీలాల్ కూడా మన జోలికి రాకుండా వున్నాడు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆపదలో ఆదుకునే ఆది దుర్గాలాంటి అమ్మ వుంది. దుష్టుల పాలిట ఆమె కలకత్తా కాళి మన కష్టం గట్టెక్కినందుకు అమ్మని ప్రతిక్షణం తలుచుకోవాల్సిందిపోయి ఏక సక్కెలాడటం మంచిదికాదు" చిర్రుబుర్రు లాడుతూ అన్నాడు ఆనందయ్య.
"ఓర్ నాయనా! మనకి మంచి జరిగినప్పుడు నమ్మాలి. చెట్టుని నమ్ముతున్నాము పుట్టని నమ్ముతున్నాము. మన పాలిట చల్లని తల్లిని నమ్మకపోవటం పాపం. పెద్దాళ్ళు చూడబోతే వాళ్ళ సుఖాలు తప్పించి మనలాటి వాళ్ళగోడు పట్టించుకోరు. పోలీసుల దగ్గరకెళ్ళి న్యాయం అడుగుదామా అంటే వాళ్ళ చేతిలోని లాఠీ కర్ర మన బుర్ర వాయగొడుతున్నది" ఆవేదనగా అంది బాలమ్మ.
"మీరు నమ్మినా నమ్మకపోయినా మేమంతా ఆ దేవతని నమ్ముతున్నాము. శక్తిమాయి అడవిలో ఎక్కడో వుందని ఊరు వాడ నమ్ముతున్నది. అమ్మని తలుచుకున్న వాళ్ళ బతుకులు ఆనందంగా మారాయి. ఎదురువచ్చి అమ్మ కనపడాలా? ఎవరైనా వింటే నవ్విపోతారు. కున్నా కనపడక పోతే మనం ఏం చేశాము? ఈ పెద్దోళ్ళు సాయం చేశారా? పోలీసులు సాయంచేశారా? ఆ తల్లి చేసింది. అమ్మని కాదంటే ఆ అమ్మకి కోపం వచ్చిందంటే మళ్ళీ మన పని నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చోటమేగా?" చిరుకోపంతో అంది గుణవంతి.