వేదవతి మాత్రం " అయ్యోరు వచ్చేవరకు కుర్రజంట అగుతుందా? దీనికి మంత్రాలు, జపమాలలు తిప్పడం ఎందుకు? ఆ ముచ్చట జరగడానికి కావల్సింది పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు గానీ అయ్యోరు కాదు " అని అప్పుడప్పుడూ అంటూనే వుంది. కానీ భానుమతి తండ్రి మాత్రం ఒప్పుకోవపడం లేదు. ఆయన పద్దతి మనిషి. అన్నీ శాస్త్ర్రోక్తంగా జరగాలని అంటాడు. దాంతో అందరం పురోహితుడి కోసం చూస్తున్నాం.
"కాళహస్తి నుంచి లాస్ట్ బస్ పదకొండు గంటలకి, దానికి వస్తాడేమో " భానుమతి తండ్రి తనకు తెలిసిన సమాచారం చెప్పాడు.
"అయితే వెయిట్ చేద్దాం "
మాకిదంతా సరదాగానే వుంది. మధ్యాహ్నం బాగా నిద్రపోయాం కాబట్టి నిద్రకూడా రావడం లేదు. ఇదేదో మంచి కాలక్షేపంలా అనిపించి ఎంజాయ్ చేస్తున్నాం.
సురేష్ ఆ అలస్యాన్ని భరించలేకపోతున్నాడేమో దూరంగా ఓ నులకమంచం వాల్చుకుని పడుకున్నాడు. మంచం ముందు గడ్డివాము వుండడం వల్ల ఓ పక్కవున్న నాకే కనిపిస్తున్నాడు.
భానుమతి ఇంటి వెనుక దొడ్డి తలుపు దగ్గర కూర్చుని పిలుపుకోసం ఎదురుచూస్తోంది. మరో పది నిముషాలకి నాకు సురేష్ కనిపించలేదు. ఎటు వెళ్ళాడో?
పురోహితుడు పదకొండు గంటలకి బస్కుకి రాలేదు.
"అయనకి టీవి ఎస్ ఫిప్టీ వుంది అందులో వచ్చేస్తాడు " భానుమతి తండ్రికి మాత్రం నమ్మకం పోలేదు.
స్నానం చేసాక బాత్ రూమ్ లో చీరా జాకెట్టు వదిలిపెట్టాను. అవి తీసి లోపల పెడదామని వెళ్ళాను. విచిత్రం.... అక్కడ భానుమతి లేదు.
ఇంట్లో కూడా ఎక్కడా కనిపించలేదు.
నాకేదో అనుమానం వేసింది. వేదవతి చెవిలో నా అనుమానం ఊదాను.
"మరి వాళ్ళు అవురావుమంటూ వున్నవాళ్ళు. అయ్యోరు వచ్చేవరకు అగుతారా?" అంది అమె.
పన్నెండు గంటలప్పుడు పురోహితుడు రావడం రావడం హడావుడి చేశాడు.
"పెళ్ళికొడుకు- పెళ్ళికూతురు ఎక్కడ? అర్చెంట్ " అని ఒంటికాలు మీదున్నాడు పురోహితుడు.
అందరూ సురేష్ కోసం వెదికారు.
వాళ్ళిద్దరూ ఎక్కడా కనపడలేదు.
అందరిలోనూ అందోళన ప్రారంభమైంది.
తలా ఓ మూలకు వెళ్ళి వెదకడం ప్రారంబించారు.
"వీళ్ళ కంగారుగానీ వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళుంటారు? పురోహితుడి అలస్యం భరించలేక ఇద్దరూ ఎక్కడో ఏకాంతాన్ని వెదుక్కుని వుంటారు " వేదవతి చాలా కూల్ గా చెబుతోంది. నాకూ అదే నిజమనిపించింది.
వెదకడానికి వెళ్ళినవారు వచ్చారుగాని అసలు కధానాయకుడుగానీ, కధానాయకిగానీ రాలేదు.
భానుమతి తల్లిదండ్రులు మాత్రం ఏడుపు మొఖాలు పెట్టారు. అయినా అందరికి ఒకటే ధైర్యం...... ఇద్దరూ కనబడకపోవడం.
ఇంత జరిగినా అబ్బాయిలు మాత్రం తమ అల్లరి అపలేదు. ఏవేవో జోకులు వేస్తూ నవ్వుకుంటున్నారు.
మెల్లగా ఒక్కొక్కరే నిద్రలోకి జారుకుంటున్నారు. అంత రాత్రప్పుడు ఎవరు మాత్రం మేల్కొని వుంటారు?
"శేఖర్ వచ్చుంటే బావుండు ఫస్ట నైట్ కోసం అలంకరించిన గది వేస్టుగా వుంది. దాన్ని మేమైనా పావనం చేసుండే వాళ్ళం " అంది వేదవతి.
"మీ ఇద్దరికి ఆ గది ఎందుకు ఉపయోగపడుతుంది..... నిద్రపోవడానికి తప్ప " సుందరి ఎద్దేవా చేసింది.
"అదీ నిజమే. ఆ విషయమే మరచిపోయానున వేదవతి నిజాయితీగా ఒప్పుకుంది.
భానుమతి తల్లిదండ్రులు కూడా ఓ మూల సర్దుకుంటున్నారు.
"ఇప్పుడు టైం రెండయింది. ఇక మేల్కొని వుండటం నావల్ల కాదు. మనమూ ఎక్కడైనా నా నడుం వాల్చుదాం " సుందరి అంటూవుండగా ఎవరో ఇద్దరు ఇంట్లోకి మలుపు తెరిగినట్లనిపించింది. పరిశీలనగా చూశాం.
సురేష్. భానుమతి కలిసి వస్తున్నారు. హమ్మయ్య అనుకున్నాం. అంతవరకూ అదురుపాటుతో కొట్టుకుంటున్న గుండెలు శాంతించాయి. భానుమతి తండ్రి ఒక్క ఉదుటున వెళ్ళి కూతుర్ని కౌగలించుకున్నాడు.
"ఎటెళ్ళావమ్మా?" భానుమతి తల్లికి ఆనందం ఎక్కువైపోయి కన్నీళ్ళ రూపంలో కొట్టుకొస్తోంది. భానుమతి వాలకం చూస్తుంటే వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో తెలుస్తోంది. అమె ముఖం మీద కుంకుమబొట్టు చెమటతో తడిసి ముక్కుమీదకి మరి కుంకుమరాశిని కాలితో తన్నితే లేచిన కుంకుమధూళిలా కనపడుతోంది.