"అలా అనుకున్నాము కదా, కడుపుకాయ యింకా అలాంటిది ఏమి రాలేదు. ముందే జాగ్రత్త పడదల్చుకున్నాను. రేపే డాక్టర్ దగ్గరకు వెళదాము పదండి, వక ఏడాది దాకా ఎవరం మాట్లాడవద్దు."
రామకృష్ణకి యింకా ఆశ చావక "ఇప్పటిదాకా యింకా ఆ యిది లేదంటావా సీతా!" అన్నాడు.
"ఆ యిదీ లేదు ఈ యిదీ లేదు."
"మరి మామిడికాయ ముక్కలు పర పర నమలటం......"
"వెనుకటికి మీలాంటి వాడొకడు ఆ వీధిలోకి వెళ్ళే వాళ్ళంతా అందుకే అన్నాడుట సానివాడని ఉద్దేశించి. అలా వుంది మీ వరస. నాకు మామిడికాయ ముక్కలు యిష్టం. అసలు పుల్లగ వుండే ప్రతిది మహా యిష్టం."
"అంతే అంటావా?"
"అంతే ననటమే కాదు, కావాలంటే పందెం అతి పుల్లని మామిడికాయలు అరడజను మీ కళ్ళముందు పర పర నమిలి తింటాను."
"వద్దు వద్దు చెప్పొద్దు నా పళ్ళు పులుస్తున్నాయి." రామకృష్ణ నవ్వుతూ అన్నాడు.
సీతా మనోహరి మధురంగా నవ్వింది.
14
మూడు నెలలు తర్వాత.
రామకృష్ణకి మళ్ళి తలనొప్పి వచ్చింది. అదే తల అదే తలనొప్పి, అంతా అదే.
"సాయంత్రం ఓ ఫ్రెండ్ ప్రమోషన్ వచ్చిన సందర్భంలో పార్టీ యిస్తున్నాడు. ఆఫీసు నుంచి అటే వెళ్ళి ఓ గంట ఆలశ్యంగ యింటికి వస్తాను" అని ఉదయం ఆఫీసుకెళుతూ సీతకి చెప్పి వెళ్ళాడు రామకృష్ణ.
ఆ సాయంత్రం.
రామకృష్ణ రానందుకు సీత కంగారేమి పడలేదు. అలా అలా ఎనిమిదయిపోయింది. అయినా సీత కంగారులాంటిది పడలేదు. ఫ్రెండ్స్ సినిమాకి రమ్మని వుంటారు. వీరు వాళ్ళమాట తీసేయలేక వెళ్ళి వుంటారు. అనుకుంది సీత.
తొమ్మిదిన్నర.
సీతకి తోచలేదు. నాలుగొందల పేజీల నవల తీసుకుని కాలక్షేపంగ వుంటుందని చదవటం మొదలుపెట్టింది.
వరండాలో లైటు వేసుకుని మధ్య మధ్య వీధి గేటు చూస్తూ నవల చదువుతున్నది. పావుగంట నవల చదివేసరికి పరిసరాలు మరచిపోయేటంతగ నవల చదవటంలో మునిగిపోయింది.
పది నలభై.
వీదిగేటు చప్పుడయింది.
రామకృష్ణ వచ్చాడు.
"నేను అనుకున్నదే - సినిమాకి వెళ్లివచ్చారు" అనుకుంది సీత నవల మూసేస్తూ.
రామకృష్ణ స్కూటర్ లాక్ చేసి వస్తుంటే "ఏ సినిమా!" అంది సీత నవ్వులాంటి పలకరింతో
"తలనొప్పి!" అని చెప్పి - ఎవరో తరుముతున్నట్లు యింట్లోకి వెళ్ళిపోయాడు రామకృష్ణ.
"సినిమా పేరు తలనొప్పా? తనకి తలనొప్పా?" అనుకుంటూ సీత యింట్లోకి వచ్చింది.
షరా మామూలే అన్నట్లు - మూడు నెలలక్రితం రామకృష్ణ తలనొప్పి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాడో, ఇప్పుడూ అలాగే.
గుడ్డలైనా మార్చకుండా -
నిండా దుప్పటి ముసుగు బిగించి-
మంచం మీద పడుకుని వున్నాడు.
భర్తకి మళ్ళి అదే రకం తలనొప్పి వచ్చింది అనుకున్న సీత కంగారుపడింది. ఆదుర్దాగా వెళ్ళి అతని పక్కనే మంచం మీద కూర్చుంది.