ఇందుమతి గుండె నిండా గాలి పీల్చుకుంది.
"థాంక్యూ రవీ!"
"థాంక్సెందుకూ? అతడు నా అన్నయ్య. నా రక్తం పంచుకుని పుట్టినవాడు. కొన్ని అపార్ధాలు మా మధ్య ఉన్నా ప్రేమ ఎక్కడకు పోతుంది?"
"మీ అన్నయ్య ఈ పని చెయ్యలేడని నమ్ముతున్నావు గదూ?"
"చెయ్యలేదని ఎలా నమ్మను? చేశాడంటే నమ్మబుద్ది కావడంలేదన్నాను. కాని, చేశాడు."
"రవీ!"
"అవును, ఇందూ! నాకు ఓ అనుమానం ఉంది."
"ఏమిటది?"
"అన్నయ్యకు మానసికమైన రుగ్మత ఉందేమోనని!"
"రవీ!" బాధగా అన్నది.
"మరి నీ ఉద్దేశంలో ఆ పని చేసింది ఎవరు? మీ వంటమనిషి అబద్దం చెప్పిందా? లేక అరుణ అబద్దం చెప్పిందా?"
"వాళ్ళు అబద్దం చెప్పలేదు."
"నువ్వనేదేమిటో నాకు అర్ధం కావడం లేదు. నువ్వూ షాక్ తిన్నావు. నీ మనసు సరిగా పనిచేస్తున్నట్లు లేదు."
"నా మనసు కేం దివ్యంగా ఉంది. అందుకే ఆ పని చేసింది మీ అన్నయ్య కాదంటున్నాను."
"అంటే ఏ దేవతో, దయ్యమో, రాక్షసుడో అన్న రూపం ధరించి వచ్చాడంటావా?"
"దేవతా కాదు దయ్యమూ కాదు."
"మరెవరు?"
"రాక్షసుడు___ రాక్షసుడి లాంటి మనిషి అచ్చం మీ అన్నయ్య రూపం గలవాడు."
రవి తుళ్ళి పడ్డాడు. అంతలోకి తమాయించుకున్నాడు.
"బాగుంది. ఇది కథ కాదు. సినీమా అంతకంటే కాదు."
"నీ ఉద్దేశంలో ఇద్దరు వ్యక్తులు ఒకలాంటి వాళ్ళుండరనా? ఎంత మంది కవలల్ని మనం చూడటం లేదు!"
"మా అన్నయ్య కవలపిల్లల్లో ఒకడు కాడు."
"అది చెప్పాల్సింది ఆంటీ. అందుకే ఆంటీతో మాట్లాడాలని వచ్చాను."
"అంటే అమ్మ ఇద్దర్ని కని ఒకడ్ని రహస్యంగా పెంచుతున్నదని నీ ఉద్దేశమా?" తీవ్రంగా ఉంది రవి కంఠం.
"రవీ! నన్ను అపార్ధం చేసుకోకు."
"నువ్వు అనే మాటలకు అర్ధాలు ఏమిటి? అమ్మకు ఏం తెలుసు నంటావ్? ఇదంతా అమ్మ ఆడిస్తున్న నాటకమా నీ భావం!"
"అవేం మాటలు రవీ!"
"మరి!"
"కాస్త తాపీగా ఆలోచించు. మనం ఇందులోని నిజానిజాలు తెలుసుకోవాల్సిన వాళ్ళం. మీ అన్నయ్య నిరపరాధి అని ప్రూవ్ అయితే నీకు సంతోషం కాదా?"
"సంతోషమా? నాకంటే సంతోషించే వాళ్ళు మరొకరు ఉండరు."
ఇందుమతికి ఒళ్ళు మండింది.
కాని, అది సమయం కాదని ఊరుకుంది.
"రవీ, మీ అన్నయ్యలాంటివాడే మరొకడున్నాడని కచ్చితంగా చెప్పగలను."
రవి ఓ క్షణం తడబడ్డాడు.
"ఎలా చెప్పగలవు?" తడబాటును అణుచుకుంటూ అన్నాడు.
"ఆ రాత్రి గుర్తుందా? మీ అన్నయ్యలాంటి మనిషే నాకు కనిపించాడు. అతణ్ణి చూసే ఆంటీ షాక్ అయింది. ఆ షాక్ నుంచి ఇంత వరకూ పూర్తిగా కోలుకోకోనే లేదు. మళ్ళీ మరో షాక్! పాపం! కన్నతల్లి ప్రాణం ఎంత తల్లడిల్లి పోయిందో!"
ఆ రాత్రి కనిపించింది అన్నయ్య కాదని నేనూ నీతోబాటు నమ్మాను."
"మరి ఇప్పుడు?"
"మా అన్నయ్యేనని ఇప్పుడు దృఢంగా చెప్పగలను!"
"అదేమిటి? ఆ రోజు మీ అన్నయ్య బెంగుళూర్లో ఉన్నాడు. తెల్ల వారుఝామున ఫోన్ చెయ్యలేదూ?"
ఆ ఫోన్ ఇక్కడ్నుంచే చేసి ఉండొచ్చు___ఆ రాత్రికే హైద్రాబాద్ వచ్చి ఉండొచ్చు."
"ఎలా? గాల్లో ఎగిరా?"
"అవును! అంతే! విమానంలో వచ్చి ఉంటాడు.
"అబద్దం!"
"అప్పుడు నేనూ అలాగే అనుకున్నాను. కాని, ఈమధ్య కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిని బట్టి అన్నయ్య వ్యక్తిత్వం రెండుగా విడిపోయి ఉంటుందనీ. ఆ రెండో మనిషి బయటికి వచ్చి చేస్తున్న పని మొదటి మనిషికి తెలియడం లేదనీ నా భావం!"
"అంటే?"
"అన్నయ్య స్ప్లిట్ పర్సనాలిటీ! వయసుతో పాటు అవీ పెరిగాయి. ఒక దాన్నొకటి ఓవర్ టేక్ చెయ్యాలనే ప్రయత్నంలో ఇవన్నీ జరుగుతున్నాయి."
"స్టాపిట్!" అరిచింది ఇందుమతి.
"అవును ఇందూ! ఆఫీసువాళ్ళకుకూడా అదే అనుమానం వస్తోంది. ఒకసారి వచ్చి వెళ్ళింది రెండోసారికి గుర్తుండటం లేదట. ఎగ్రసివ్ గా వచ్చినప్పుడు డబ్బు తీసుకెల్తాడట. రెండోసారి మామూలు సౌమ్యమూర్తిగా వస్తాడట. ముందు వచ్చిన సంగతి గుర్తుండటం లేదట."
"అబద్దం ఇవన్నీ ఆ రెండో వాడే చేస్తున్నాడు. మీ అన్నయ్యకు అలా డబ్బు తియ్యల్సిన పని ఏమిటి? వాడెవడో డబ్బు కోసమే ఇవన్నీ చేస్తున్నాడు."
"మా డాడీ ఏడేళ్ళనాడు మా ఇద్దరి పేరుమీద చెరో లక్ష రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశాడు. మరో మూడేళ్ళకు కాని ఆ ఎకౌంట్ మెచ్యూర్ కాదు. మొన్నను బాంకుకు వెళ్ళి ఆ డబ్బంతా తీసేశాడట."
ఇందుమతి రవి ముఖంలోకి పరిశీలనగా చూసింది.
"ఆ విషయం నీకెలా తెలిసింది ఇంత త్వరగా?" ముఖంలోకి లోతుగా చూస్తూ అడిగింది.
"ఆ రోజే నేను బాంకుకు వెళ్ళాను. ఆ మేనేజరు ఆశ్చర్యంగా మీరూ ఫిక్స్ డ్ డిపాజిట్ తీసుకోవడానికే వచ్చారా అని అడిగాడు. ఎందుకలా అడిగావంటే ఉదయం మీ అన్నయ్య ఎకౌంట్ క్లోజ్ చేశాడని చెప్పాడు. బాంకు వాళ్ళుకూడా పొరబాటు పడ్డారంటావా? సంతకాలు ఒకేలా ఎలా ఉన్నాయి?"
ఇందుమతికి తను గౌతమ్ తో కలిసి పెట్రోల్ బంకుకు వెళ్ళిన విషయం గుర్తొచ్చింది.
ఆ నాడు గౌతమ్ సంతకం చూశాక పలక్కుండా లేచి బయటికి వచ్చేశాడు.
అంటే? అంటే?
ఇందుమతికి లోతు తెలియని అగాధంలోకి పడిపోతున్నట్లుగా ఉంది.
"గౌతమ్! కాదు! మరొకడు ఉన్నాడు!" అగాధంలోకి పడిపోతున్న వాడు జారుడుమెట్టు సహాయంతో నిలదొక్కుకోవడానికి చేసే ప్రయత్నంలా అన్నది ఇందుమతి.
"ఇప్పుడు అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పగలవా?"
"ఊరికి వెళ్ళాడు."
"ఏ ఊరు?"
"తెలియదు."
"నువ్వు అడగలేదా?"
ఇందుమతి ఆలోచనలో పడింది.
"మాట్లాడవేం?"
ఇందుమతి రవి ముఖంలోకి బేలగా చూసింది.
"పోనియ్ ఎప్పుడెళ్ళాడు?"
మొన్నను."
"అంటే బాంకులో డబ్బు తీసిన రోజు...." ఆగి ఇందుమతి ముఖంలోకి చూశాడు.