Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 33


    ఈ హఠాత్పరిమాణానికి అతని మిత్రులంతా చిత్తరువుల్లా నిలబడిపోయారు మండలాధ్యక్షుడు రామ్మూర్తిని ఎందుకంత కసిగా కొట్టాడో వాళ్ళకు అర్ధం కాలేదు.
    బయట ఏదో జరుగుతూ వుందని అనిపించడంతో సుధాకర నాయుడు ఎమ్మెల్యే తదితరులు అంతా అక్కడికి వచ్చారు.
    "వీడు ఈ బాస్టర్ మనల్ని డిస్టర్బ్ చేస్తాడా!" మండలాధ్యక్షుడు వచ్చిన వాళ్ళతో అంటున్నాడు.
    జగదీష్ ఇక తట్టుకోలేక పోయాడు "మత్రిగారూ! అతను రామ్మూర్తి మీ ఫ్రండ్" అని అరిచాడు."
    దీంతో సుధాకరనాయుడు రామ్మూర్తి దగ్గరకు వచ్చాడు. తల లేపి చూసి "ఛీ ఛీ వీడు నా ఫ్రండ్ అంటారేమిటి? వీడ్ని ఎప్పుడూ చూడలేదు."
    మిత్రులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పటికి వాళ్ళకు ఏదో కొంత అర్ధమవుతూ వుంది.
    సుధాకరనాయుడు కూడా తెలియదనడంతో మండధ్యక్షుడు మరింత రెచ్చిపోయాడు. పిచ్చి పట్టినవాడిలాగా వూగిపోతూ మరో రెండు దెబ్బలు కొట్టాడు రామూర్తిని. చివరి సారన్నట్టు శక్తినంతా కాళ్ళలోకి తెచ్చుకుని గట్టిగా తన్నాడు.
    రామ్మూర్తి కింద పడిపోయాడు.
    అవమానంతో అతని ముఖం ముడుచుకుపోయింది. కళ్ళు వర్షిస్తున్నాయి. నాలుక పిడచకట్టుకుపోయింది. పెదవులంతా దుమ్మును పీల్చుకొని బండబారాయి.
    మండలాద్యక్షుడు ఆయాసాన్నంతా దిగమింగుకొని "వీడ్ని వెంటనే ఇక్కడి నుంచి తీసుకుపొండి! వీడెవడో మిమ్మల్ని మోసంచేసినట్టున్నాడు పార్టీ కార్యకర్త కాకపోయినా పార్టీలోని పెద్ద మనుషులంతా తెలుసుకొని తాము అడిగితే కాదనకుండా పనులు చేస్తారని చెప్పుకొంటూ జేబులు ఆపుకొంటూ వుంటారు. ఇలాంటి వాళ్ళు అబద్దాలు చెప్పుకొంటూ బతికేస్తుంటారు. వీడ్ని నాకుగానీ, ఎమ్మెల్యేకి  గానీ, మంత్రికిగానీ తెలీదు..వీడ్ని పార్టీ మీటింగ్ ల లో గానీ, బహిరంగసభల్లో గానీ చూడలేదు కాబట్టి ఇక నుంచి వీడు మమ్మల్ని తెలుసుంటే చెప్పు తీసుకొని కొట్టండి. డబ్బులడిగితే పోలీసులకి పట్టివ్వండి సరేనా" అని జగదీష్ ను చూసి "రండి వీడ్ని తీసుకుపొండి" అని పిలిచాడు.
    మిత్రులంతా దిగులుగా లోపలికి వచ్చారు. తప్పంతా రామ్మూర్తి దేననిపిస్తోంది. తనకి తెలియకపోయినా తెలిసినట్టు చెప్పడం తప్పే ననిపించింది. అందుకే వాళ్ళు మౌనంగా మిత్రుడ్ని లేపారు. రామ్మూర్తి వాళ్ళ ముఖాల్లోకి చూడలేక తలదించుకొన్నాడు.
    మెల్లగా వాళ్ళు అక్కడి నుంచి బయల్దేరాడు.
    తిరిగి పాపానాయుడు పేటకి వచ్చాడు.
    దారిలో కూడా వాళ్ళు రామ్మూర్తిని ఏమీ ప్రశ్నించలేదు. ఏమయినా అడగటానికి అది సమయం కాదనిపించింది ఇంటివరకూ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు.
    చాలాసేపటి వరకు రామ్మూర్తి అలా వీధిలో నే నిలబడిపోయాడు. ఏం చెయ్యాలో చప్పున తోచలేదతనికి. ఎక్కడికో దూరంగా పారిపోవాలనిపించింది. ఇంత అవమానం జరిగాక బతకడం వృధా అనిపించింది.
    ఏదో నిర్ణయానికి వచ్చినట్టు వడివడిగా ఇంట్లోకి నడిచాడతను.
    ఆంజనేయులు ఆరుబయట నులక మంచం మీద పడుకుని తన ఆలోచనల్లో తానున్నాడు. అతను రామ్మూర్తి లోపలికి రావడం గమనించాడుగానీ పలకరించలేదు.
    రామ్మూర్తి ఇంట్లోకి వచ్చాడు. ఎవరూ లేరక్కడ.
    "అన్నయ్యా! అమ్మావాళ్ళు ఎక్కడ?" అని అడిగాడు.
    "దేవాలయం దగ్గిర హరికథ వుందట....అందరూ అక్కడికి వెళ్ళారు" ఆంజనేయులు సమాధానం చెప్పాడు.
    ఇంట్లో ఎవరూ లేకపోవడం తన అదృష్టంగా భావించాడతను. లైట్ కూడా వేసుకోవడం మరిచిపోయాడు. ఆ చీకట్లోనే తనకు కావలసిన దాని గురించి వెతకడం మొదలుపెట్టాడు.
    మరో అయిదు నిమిషాలు అతనికి కావలసింది దొరికింది- అది ఫ్యూరడాన్ గుళికలున్న డబ్బా - పంట తెగుళ్ళు పడ్డప్పుడు కొట్టే క్రిమి సంహారక మందు. గుప్పెటనిండా వాటిని ఎత్తుకున్నాడు. వంట గదిలోకి వెళ్ళి గ్లాసుతో నీళ్ళు ముంచుకున్నాడు. ఫ్యూర డాన్ ను అందులో కలిపాడు.
    ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. కళ్ళు అదురుతున్నాయి. కాళ్ళు వణుకుతున్నాయి. ఇంకోక్షణం అలా వుంటే పడిపోతాననిపించి చేతిలోని గ్లాసును నోటి దగ్గరకు తెచ్చుకున్నాడు.
    మండలాధ్యక్షుడు తనను కొట్టడం ఫ్లాష్ వెలుగుల్లో కనిపిస్తోంది అంతే కళ్ళు మూసుకుని గబుక్కున మందు తాగేశాడు.
    మరుక్షణంలో గొంతు మండింది. కడుపులో వికారం మొదలైంది. నరాలు తెగిపోతున్న భావన. కడుపులోని పేగులు లుంగలు చుట్టుకుపోతున్నట్టు బాధ.
    "అమ్మా...." అంటూ అరిచి కింద పడిపోయాడు.
    ఈ కేకకు ఆంజనేయులు ఉలిక్కిపడ్డాడు. ఎవరో అరిచారో, ఎక్కడి నుంచి అరిచారో ఒక్క క్షణం అర్ధం కాలేదతనికి. ఆ తరువాత శబ్దం ఇంట్లోంచి వచ్చి నట్టనిపించింది మంచం దిగి లోపలికి వురికాడు.
    ఇంట్లోకి కాకుండా చీకటి గుహలోకి వచ్చినట్టనిపించింది. ఏదో తెలియని భయం నరాలను లాగుతుండగా పట్టుతప్పకుండా వుండడానికి గోడను పట్టుకున్నాడు.
    చెత్తో తడిమి స్విచ్ వేశాడు.
    ఇల్లంతా కలయ జూశాడు.
    ఓ మూల లుంగలు చుట్టుకుపోతూ చావుతో యుద్ధం చేస్తున్నట్టు కాళ్ళూ చేతులూ ఆడిస్తూ రామ్మూర్తి కనబడ్డాడు.
    ఒక్క గంతుతో అక్కడికి చేరుకున్నాడు.
    "ఏమైందిరా?" అప్పటికే ఏడుపు గొంతులోంచి బయటకు దూకింది.
    "అన్నయ్యా!" సన్నగా పిలిచాడు అతను.
    "ఏమిట్రా ఇది? ఏమైంది?"
    "మందు తాగేశానన్నయ్యా- చచ్చిపోవడానికి."
    "ఎంత పని చేశావురా?" తమ్ముడి తలను తొడపై ఆనించుకుని బావురమన్నాడు ఆంజనేయులు.
    "అవునన్నయ్య! బతుకు చేదుగా వున్నప్పుడు చావు తియ్యగా వుంటుంది."
    "రేయ్.....ఏమిట్రా" భోరున ఏడుస్తున్నాడు ఆంజనేయులు.
    "అవునన్నయ్యా అవమానం భారం మోస్తూ బతకలేక....."
    "ఏమైందిరా?"
    "ఇంతవరకు సంఘంలో గౌరవంగా బతుకుతున్న నేను ఈ రోజు భరించలేని అవమానాల పాలయ్యాను ఇంతకాలం నేను అపురూపంగా నిర్మించుకున్న అబద్దాల భవనం కూలిపోయింది. నేను పైసా విలువ చేయనన్న నిజం జనానికి తెలిసిపోయిందన్నయ్యా...."
    ఆంజనేయులకు అతని వేదన తప్ప ఏమీ అర్ధం కావడంలేదు.
    "......అర్ధం కాలేదా అన్నయ్యా. మధ్యాహ్నం వరకు నేను పార్టీలో తిరుగులేని మనిషిని నాకు మండలాధ్యక్షుడి నుంచి మాజీమంత్రి వరకు అందరూ నాకు స్నేహితులే. ఏర్ పోర్ట్ కు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మొదట పూలమాల వేసేది నేనే. నేను మీటింగ్ కు రాకపోతే ఎమ్మెల్యే చిన్నబుచ్చుకుంటాడు. నిరసన ప్రదర్శనలో నేను ముందు నడవకపోతే మండలాధ్యక్షుడు మండిపడతాడు. పదవులు ఎవరికి ఇవ్వాలో నేను సజెస్ట్ చేయకపోతే మాజీ మంత్రి నొచ్చుకుంటాడు ఇది నేను నీకిచ్చిన పిక్చర్... నీకే కాదు జనానికంతా తెలిసేటట్టు చేసుకున్నాను కానీ అవన్నీ అబద్దాలన్నయ్యా. అమ్మమీద ఒట్టు.... ఆ పార్టీలో కనీసం సభ్యుడ్ని కూడా కాను. సుధాకర్ నాయుడ్ని, ఎమ్మెల్యేని. మండలాధ్యక్షుడ్ని ఫోటోలో తప్ప నేనెప్పుడూ చూడలేదు....."

 Previous Page Next Page