Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 34


    తమ్ముడు ఏ పరిస్థితుల్లో చిక్కుకుపోయాడో ఆంజనేయులకు బోధపడుతుంది. "....కానీ వాళ్ళంతా తెలుసన్నట్టు ప్రచారం చేసుకున్నాను ఎందుకనుకుంటున్నావ్ అన్నయ్యా? డబ్బు కోసం కాదు - పిడికెడు ప్రేమ కోసం. నేను ఈ నాటకం ప్రారంభించక ముందు నన్నెవ్వరూ గుర్తించేవాళ్ళు కాదు నేనొక మనిషినన్న స్పృహతో ప్రవర్తించేవాళ్ళు కాదు. మనసారా మాట్లాడే వాళ్ళు కాదు. ప్రేమగా దగ్గరకు రమ్మనే వాళ్ళు కాదు. అభిమానంతో చూసేవాళ్ళు కాదు. అదిగో ఆ గుర్తింపు కోసమే నేను అబద్దాలు చెప్పడం ప్రారంభించాను. నాకు గొప్ప గొప్ప వాళ్ళు తెలుసు అనీ ప్రచారం చేసుకున్నాను. ఇక అప్పట్నుంచి అంత వరకు నాకు లేని వ్యక్తిత్వం వచ్చింది. సంఘంలో  గుర్తింపు లభించింది. ఏదో కొంత విలువ ఇవ్వడం నేర్చుకున్నారు జనం. నేను వెళ్ళగానే కూర్చోమనేవారు. ప్రేమగా పలకరించేవారు. తమ పనులు చేసిపెట్టమని అడిగేవారు -"
    "రామ్మూర్తీ ... రామ్మూర్తీ... నా పిచ్చి తండ్రీ... నీకు దక్కని కాసింత ప్రేమను పొందడానికి ఇంత కష్టపడ్డావా కన్నా, అబద్దాలు చెబుతున్నప్పుడు, అవి జనం నమ్ముతున్నప్పుడు నువ్వెంత క్షోభకు గురయ్యావో తెలుసుకోగలను నాన్నా" ఆంజనేయులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు.
    "నిజమే అన్నయ్యా, నేను తప్పు చేస్తున్నానన్న గిల్టీఫీలింగ్ నన్ను వెంటాడేది. అబద్దాలు చెబుతున్నానన్న బాధ మనసును పిండేసింది. ఇదంతా చేసింది భవనాలు, భవంతులు సంపాదించాలని కాదు - మణులు మాన్యాలు స్వంతం చేసుకోవాలని కాదు - వజ్రవైడూర్యాలు దాచుకోవాలనీ కాదు - వేలు లక్షలు కూడబెట్టాలనీ కాదు - కేవలం చిన్న పలకరింపు కోసం.... అది ఈ రోజు బెడిసికొట్టింది. నిజం తెలిసిపోయింది? అందుకే చచ్చిపోతున్నాను - అన్నయ్యా! అమ్మను, చెల్లెళ్ళను జాగ్రత్త......"
    రామూర్తి తల అచేతనమైంది.
    ఆంజనేయులు బిగ్గరగా కేకలు పెట్టాడు.
    
                                                                 *    *    *
    
    "ఏమిటండీ ఆంజనేయులుగారూ! మీకళ్ళు అంత ఎర్రగా వున్నాయి. మీ పెద్దతమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడటగా ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను చాలా రోజులుగా ఈ విషయమై మిమ్మల్ని పరామర్శించాలనుకున్నాను." కానీ కుదరలేదు - సారీ" మహాలింగం ఇంత కాలానికైనా సానుభూతి చూపించాడు. మిగిలిన వాళ్ళకు విషయం కూడా తెలిసే అవకాశం లేదు. తన గురించి ఎవరు ఆరా తీస్తారు? తనను ఓ స్నేహితుడిగా భావించేవాళ్ళే లేరు, ఒక్క మహాలింగం తప్ప అనుకుంటే తనకు అలవాటైపోయిన నిరాశా నిస్పృహలు ఆవహించాయి ఆంజనేయులుకు.
    "రాత్రి నిద్రతక్కువైంది. అందుకే కళ్ళు మండుతున్నాయి" అంతకంటే ఎక్కువ చెప్పలేక పోయాడు.
    "ఈ రోజూ జీతాలు. అన్ని రోజులకంటే ఈ రోజు ఎక్కువ టెన్షన్" అన్నాడు మహాలింగం అదో గుర్తొచ్చినట్టు.
    "అవును చేతికి వచ్చేదానికంటే రెట్టింపు అప్పులున్న వాళ్ళ పరిస్థితి అది."
    "అందుకే సార్ మనం బతుకుతున్నట్టు కనిపించదు. ఈ అప్పులు తీరడానికి గొడ్డుచాకిరీ చేస్తున్నట్టనిపిస్తుంది."
    "నిజమే."
    "ఈ రాత్రికి సాహసం చేద్దాం ఆంజనేయులుగారూ ఆఫీసు అయిపోగానే అలా ఏదైనా హోటల్ కెళ్ళి కాస్తంత విస్కీ తాగుదాం, ఏమంటారు?"
    ఆంజనేయులుకు ఎందుకో ఠక్కున వెళ్ళాలనిపించింది. రొటీన్ గా నిస్సారంగా వున్న బతుకులో కొంత బ్రేక్ అప్ ఇవ్వాలనిపించింది. తమ్ముడి మరణం అతన్ని కుంగదీస్తోంది. అదేమిటో కసి ఎవరిమీదో కోపం. తన జీవితాన్ని అమ్రింత ధ్వంసం చేసుకుని తన కోపాన్ని, కసిని వెళ్ళగక్కాలనిపించింది.
    "వస్తాను."
    మహాలింగం ఓ క్షణంపాటు అతని వంక ఆశ్చర్యంగా చూసి ఆ తరువాత చిన్నగా నవ్వుకున్నాడు.
    ఆఫీసు అయిపోయాక బయటకొచ్చిన ఆంజనేయులకు అప్పుల వాళ్ళు కనిపించారు. అతనిని వెదుక్కుంటూ ప్రతి నెలా ఫస్ట్ తారీఖున అప్పులవాళ్ళు వస్తారు. అమ్మ పంపించిన నాగరాజు కూడా వాళ్ళలో ఒకడు.
    అందరికీ తలా కొంత ఇచ్చి, మిగిలింది నాగరాజు చేతిలో పెట్టాడు. తన కోసం వందరూపాయలు వుంచుకున్నాడు. మామూలుగా అయితే ఏ అయిదో, పదో మిగుల్చుకునేవాడు.
    మహాలింగం చేయి భుజంమీద పడడంతో ముందుకు కదిలాడు.
    సంజె చీకట్లు ముసురుకుంటున్నాయి. తమ విధ్యుక్తుధర్మాన్ని నెరవేర్చడానికి ఒళ్ళు విరుచుకుంటున్నట్టు వీధి దీపాలు ఆరి, ఆరీ వెలుగుతున్నాయి. దుకామాలు లైట్లతో మెరిసిపోతున్నాయి. అందమైన అమ్మాయిలు సీతాకోక చిలుకలు పూలతోటలో తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి.
    స్కూటర్ల పై వెళుతున్న జంటల్ని చూసినప్పుడంతా ఆంజనేయులకు గుండెల్లో కలుక్కుమంటోంది.
    తను ఎప్పుడైనా ఓ ఆడపిల్లతో ఇలా స్కూటర్ పై వెళ్ళగలడా? కొత్త స్కూటర్ పై తనూ, ఓ అమ్మాయి వెళుతుంటారు. తను ఆరడుగుల పొడవుతో. చక్కగా డ్రస్ చేసుకుని వుంటాడు వెనుకనున్న తన భార్య కుడిచేయిని తన నడుంపై బిగుస్తుంది తను స్కూటర్ పై షడన్ బ్రేక్ వేసినప్పుడు ఆమె తూలిపడుతుంది. అప్పుడామె గుండెలు తన వీపుకు మెత్తగా తగుల్తాయి. తనలో శతకోటి విద్యుత్ ప్రకంపనలు గుండెను ఝళ్ళుమనిపిస్తాయి. వెనుక నన్ను ఆమె అందంగా సిగ్గుపడటం స్కూటర్ మిర్రర్ లో చూస్తాడు. అప్పుడు తను కొంటెగా నవ్వుకుంటాడు.
    ఆంజనేయులు కలల్లో తేలిపోతున్నాడు.
    పక్కగా మల్లెపూల అంగళ్ళు ఒక్కసారిగా సువాసనలను కుమ్మరించాయి అతని మీద.
    అతని కలలు టర్న్ అయ్యాయి.
    తను, ఆమె ఇంటికి బయల్దేరుతారు. తను మల్లెపూల అంగడి దగ్గర స్కూటర్ ను ఆపుతాడు. రెండు మూరల మల్లెపూలు అంటాడు. ఎందుకండీ అవన్నీ మీ నవ్వులే ఎప్పటికీ వాడిపోని సన్నజాజులు అంటుంది ఆమె. తను సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతాడు.
    ఎదురుగ్గా వస్తున్న ఓ వ్యక్తి ఢీ కొనడంతో ఆంజనేయులు కలచెదిరింది. మరో అయిదు నిముషాలకు మహాలింగం, ఆంజనేయులు ఓ హోటల్ కు చేరుకున్నారు. దాని డాబా మీద అనధికారంగా బార్ ను నిర్వహిస్తున్నారు. మహాలింగం, ఆంజనేయులు మెట్లెక్కి డబ్బా మీదకు వెళ్ళారు.
    విస్కీ గొంతులోకి దిగుతున్న కొద్దీ ఆంజనేయుల గుండెల్లోని మంట మరింత ఎక్కువైంది. తన జీవితం అసహ్యంగా కళ్ళముందు కదులుతోంది. తన రూపమే వికృతంగా కనిపిస్తోంది.
    శరీరమంతా మచ్చలు ముఖమంతా మశూచి చుక్కలు పెదవులు పగిలి రక్తాన్ని స్రవిస్తున్నాయి. పిసిపట్టిన కళ్ళు చెదలపుట్టల్లా వున్నాయి. కాళ్ళూ, చేతులంతా పుండ్లు. వాటిలోంచి చీము కారుతోంది. వేళ్ళన్నీ వంకర్లు తిరిగిపోయాయి.
    ఇక భరించలేక ఆంజనేయులు ఒక్కసారి తల విదుల్చుకున్నాడు! ఆ రూపం అంతర్దానమైంది.

 Previous Page Next Page