Previous Page Next Page 
షా పేజి 33

 

    నేను వెళ్ళి తలుపుకొట్టాను. అయన తలుపు తీశారు. "కావాలా" అనడిగాను. అయన జవాబు చెప్పకుండా తలుపేవేసుకున్నారు. ఆ తరువాత రెండు రోజులకే ఆయనను ఎవరో చంపెశారనీ చెప్పారు మావాళ్ళు -"
    "అయన గురించి ఇంకేం చెప్పారు మీ వాళ్ళు" ఆత్రుతగా అడిగాడతను.
    "ఏమీ చెప్పలేదు. అసలేవరికీ ఏమీ తెలీదు కదా! ఈశ్వరవర్మ గారే ఆయనను ఈ హోటల్లో వుంచారని అనుకున్నారందరూ. అందుకే అయన జోలికి పోయేవాళ్ళు కాదు ఎవరు?" సృజన్ ఆశ్చర్యంగా ఆమె పక్కన కూర్చున్నారు. ఆ పేరు ఇంతకూ ముందేక్కడో వినిపించినట్లనిపించిందతనికి. కానీ ఎక్కడ విన్నాడో గుర్తురావటం లేదు.
    "ఈశ్వర్ వర్మగారెవరు?"
    ఈసారి ఆమె ఆశ్చర్యపోయింది.
    "ఈశ్వర్ వర్మగారు తెలీదా నీకు?"
    "తెలీదు ఆ పేరెక్కడో విన్నట్లుంది! అంతే!"
    "అంటే మీది ఈ ఊరు కాదా?"
    "కాదు"
    "అదీ! అందుకే తెలీదు. ఈశ్వర్ వర్మగారంటే కోటీశ్వరుడు. ఈ హోటల్ ఆయనదే. ఇదే కాదు ఇంకా పెద్ద పెద్ద హోటళ్ళు , ఫ్యాక్టరీలూ, సినిమాహాళ్ళు, ఎన్నో ఉన్నాయ్ ఆయనకు, ఈ పట్నంలో ఇంకెవరయినా అయన తర్వాతే."
    "అంత గొప్పవాడు మా అన్నయ్యను ఈ హోటల్లో ఉంచాడా"
    "అని అందరూ అనుకునేవారు గానీ అది నిజమో కాదో తెలీదు."
    "ఎందుకుంచాడనీ అనుకునేవారు?"
    "అదీ తెలీదు."
    సృజన్ మళ్ళీ ఆలోచనలో మునిగిపోయాడు.
    ఆ పేరుని ఇంతకుముందు ఎక్కడ విన్నాడో ఎంత ఆలోచించినా గుర్తురావటం లేదు.
    "పాపం - ఎందుకు హత్య చేశారో?" అడిగిందామె కొద్ది క్షణాలాగి.
    "అదే తెలీదు. ఎవరు చంపారో? ఎందుకు చంపారో? ఏమీ తెలీటం లేదు. నీకు తెలీదు. మా అన్నయ్య నిజంగా దేవుడిలాంటి మనిషి. ఎవరికి చీమంత హాని కూడా చేయడు. అలాంటి అన్నయ్యను చంపిన వాడెవడో కనుక్కుని వాడిని నేనే స్వయంగా చంపాలని నా కోరిక" ఆవేశంగా అన్నాడతను. అతని మాటలు విని కలవరపడిందామే.
    "అలా ఆలోచించడం తప్పు" అందామె అతనివంక జాలిగా చూస్తూ. " మా అమ్మను ఆ జర్మనీ వాడు చంపేసినపుడు కూడా నేనలాగే అనుకున్నాను వాడిని వెతికి పట్టుకొని చంపాలని. కానీ తర్వాత నింపాదిగా ఆలోచిస్తే అదెంత కష్టమో , ఎంత తప్పో , తర్వాత మనం జైలు కెళ్ళి ఎన్ని బాధలు పడాలో ఆలోచించుకుని వాడిని మరో విధంగా చంపాను.'
    సృజన్ అదిరిపడ్డాడు.
    "మీ అమ్మను చంపెశాడా?"
    "అవును......"
    "ఎందుకు?"
    "సెక్స్ పిచ్చాళ్ళు ఒకేసారి నలుగురు మీదపడితే ఏమవుతుంది అసలే అంతకు ముందు వారం రోజులనుంచీ తిండీ తిప్పలూ లేవు పాపం!"
    "మరి నువ్వెలా చంపావ్ వాళ్ళను?"
    "వాళ్ళందరినీ కాదు. మా అమ్మను మోసం చేసి బీచ్ కి తీసుకువెళ్ళిన వాడినోక్కడినే చంపాను.'
    "ఎలా చంపావ్?"
    "వాడు చాలా రోజుల తర్వాత మళ్ళీ షిప్పులో వచ్చినప్పుడు డేయిసీ ని అప్పజెప్పాను."
    "డెయిసీ ఎవరు?"
    "ఇక్కడే వుండేది. నాలాంటి బ్రతుకే దానిదికూడా?"
    "ఆ అమ్మాయి ఎలా చంపింది వాడిని?"
    "దానికి అంతకు ముందు కొద్దిరోజుల క్రితమే ఎయిడ్స్ వచ్చింది. అదే వాడికి అంటించింది. ఆ తర్వాత కొద్ది నెలలకే వాడు చనిపోయాడని తర్వాత ఆ షిప్ లో వచ్చినవాళ్ళు చెప్పారు" సృజన్ ఒళ్ళు జలదరించింది ఆ సంఘటన వింటుంటే.
    "అందుకని నువ్వు తొందరపడకూడదు. చాలా జాగ్రత్తగా ఉపాయం ఏదన్నా పన్ని ప్రతీకారం తీర్చుకోవాలి. అంతేగానీ వాడిని చంపి మనం జైల్లో కెళ్ళకూడదు. అది తెలివితేటలున్న వాళ్ళు చేసే పని కాదు."
    సృజన్ లేచివెళ్ళి అల్మారా తెరచాడు. అన్నయ్య సూట్ కేస్ ఇంకా అక్కడే వుంది. తాళం వేసిలేకపోవడం వల్ల మూత తెరిచాడతను. లోపల అన్నయ్య బట్టలన్నీ చిందరవందరగా గుట్టగా పడివున్నాయ్. త్వరత్వరగా అన్నీ బయటకు తీసాడతను. అన్నయ్య షేవింగ్ బాక్సు, హెయిర్ క్రీము, టూత్ పేస్టూ అన్నీ అలాగే ఉన్నాయ్. అన్నిటినీ మళ్ళీ సూట్ కేస్ లో వేసాడతను. మూత మూయబోతుంటే హటాత్తుగా గుర్తుకొచ్చిందతనికి. ఆ సూట్ కేస్ కి ఓ దొంగ అర ఉండాలి. అది తనకూ వదినేకూ చూపించాడోసారి!
    సూట్ కేస్ లోని బట్టలన్నీ కింద గ్రుమ్మరించి పెట్టి అడుగున ఉన్న సన్నని బటన్ నొక్కడతను. చటుక్కున అర తెరచుకుంది. దాని లోపల వున్న కొంచెం స్థలంలో క్రిక్కిరిసినట్లున్న ఓ ప్లాస్టిక్ స్త్రిప్టు బయటికొచ్చింది. ఆశ్చర్యంగా దానిని తీసుకుని చూసాడు సృజన్. అది మెడిసిన్ స్త్రిప్టు అందులో సరిగ్గా పది నల్లరంగు కాప్యుల్స్ ఉన్నాయ్. వాటిమీద "డాక్సీ సైక్లిన్ విత్ విటమిన్ 'సి' అని రాసి వుంది ఇంగ్లిషులో. అది అన్నయ్య దగ్గర .......అందులోనూ ఆ సీక్రెట్ అరలో ఎందుకుందో అర్ధం కావడం లేదతనికి. ఆ కాప్యుల్స్ అన్నయ్య కంపెనీ ఎప్పుడూ తయ్యారు చేయలేదు. దానిని తీసి జేబులో ఉంచుకుని ఆ అరమూసేసి మళ్ళీ అన్నయ్య వస్తువులన్నీ సూట్ కేస్ లో వేసి పెట్టి మూసేశాడు. అల్మారా క్లోజ్ చేస్తుంటే వెనుకనుంచీ ఆ యువతి ఏడుస్తున్న చప్పుడు వినిపించిందతనికి. ఆశ్చర్యంగా ఆమె దగ్గరకు నడిచాడు.

 Previous Page Next Page