ఆమె నవ్వేసింది. :నీలాంటి పిచ్చాడిని నేనెక్కడా చూళ్ళేదురా నయినా! సరే! నువ్విక్కడే నిలబడు! నేను వెళ్లి ట్రై చేసి వస్తాను--
ఆమె కౌంటర్ వేపు నడిచింది వయ్యారంగా. సృజన్ ఆమె వేపే చూస్తున్నాడు ఆశ్చర్యంగా. ఆమె కౌంటర్ మీదకు పూర్తిగా ఒరిగిపోయి పైట జారవిడచి కౌంటర్ వెనుక నున్న వ్యక్తితో నవ్వుతూ , కవ్వింపుగా పై పంటితో , కింది పెదాన్ని నొక్కిపడుతూ మాట్లాడుతోంది. కౌంటర్ దగ్గరున్న వ్యక్తీ కూడా ఆమెతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. చివరికి అతను ఓ క్షణం అలోచించి ఆమెతో ఏదో చెప్పాడు. ఆమె తిరిగి సృజన్ దగ్గరకొచ్చింది.
"రూమ్స్ నిజంగానే ఖాళీ లేవంటున్నాడు. కానీ మనం ఒకటి రెండుగంటలు గడపడానికయితే ఒక రూమ్ ఇస్తానంటున్నాడు."
సృజన్ లో ఆశ పుట్టుకొచ్చింది.
ఒకటి రెండు గంటల వ్యవధిలో తనకు అన్నయ్య రూమ్ లోపలికెళ్ళే అవకాశం దొరుకుతుందా? ఏమో! దొరికినా దొరక్కపోయినా తన ప్రయత్నం తను చేయాలి.
"సరే! అలాగే - కానీ రెండుగంటలు చాలదు. ఇప్పడు టైమ్ తొమ్మిదిన్నరయింది. కనీసం రెండుగంటలకయినా పర్మిషన్ తీసుకో."
"ఇంకో రెండుగంటలదేముంది లే పద! పెద్ద మొగడిలా మాట్లాడుతున్నావ్ అరగంటలో నువ్వే పారిపోతావ్" నవ్వేస్తూ అందామె...
సృజన్ ఆమె వెనుకే నడిచాడు.
ఆమె కౌంటర్ దగ్గరకెళ్ళి తాళం చెవి తీసుకుని మెట్లెక్కసాగింది. అతను ఆమె వెనుకే నడవసాగాడు. సరిగ్గా రూమ్ నెంబర్ ఇరవై రెండు దగ్గర ఆగిందామె. సృజన గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఒకవేళ తమకు అదే రూమ్ ఇవ్వలేదు కదా! అదే ఇచ్చినట్లయితే మాత్రం తన పంట పండినట్లే తన ధ్యేయం చాలా తేలికగా నెరవేరిపోతుంది.
ఆమె సృజన్ వేపోసారి చూసి చిరునవ్వు నవ్వింది.
"ఏమిటలా దొంగలాగా మెల్లిగా నడుస్తున్నావ్? త్వరగా రా" అంటూ తాళం చెవితో అదే గడితలుపు తెరిచింది. సృజన్ మనసంతా ఆనందంతో నిండిపోయింది. "కాకతాళీయం ' అనే పదం ఇవాళ ప్రప్రదమంగా అనుభవమయింది తనకు. ఆమె వెనుకే లోపలకు నడిచాడతను. ఆమె వెంటనే తలుపు మూసివేసింది. సృజన్ చకచకా గదంతా పరీక్షగా చూసేస్తున్నాడు. ఆ యువతి మంచం మీద వాలిపోయింది ఆనందంగా.
"అలా గది ముఖం ఎప్పుడూ చూడనట్లు చూస్తున్నావేమిటి?" అందామె అతని వాలకం చూసి హేళనగా . సృజన్ స్పృహలో కొచ్చి సూట్ కేస్ ఓ మూలగా వున్న టేబుల్ మీద పెట్టాడు. తను చాలా త్వరగా గదంతా వెతికేయాలి. టైం చాలా తక్కువుంది.
"అలా చూస్తావేమిటోయ్---రా ఇక" చేతులు చాస్తూ అందా యువతి.
సృజన్ ఆమె చేయి అందుకుని ఆమెను లేపి కూర్చోబెట్టాడు. మంచం మీద . అతను కౌగిట్లో ఎత్తుకుంటాడని ఊహించిన ఆ యువతి నిరాశ చెందింది.
"ఏమిటి సంగతి! ఎయిడ్స్ వుందని భయపడుతున్నావా?" అనుమానంగా అడిగింది.
"చెల్లాయ్! నిజం చెప్తున్నాను. నేను గది తీసుకుంది నీ కోసం కాదు. నాకు వేరే పనుంది.'
ఆమె "చెల్లాయ్" అన్న సంభోధన వింటూనే నిశ్చేష్టురాలయింది.
"ఏమిటి? నేన్నీకు చెల్లాయ్ నా!"
"అవునమ్మా! నువ్వు నిజంగా నాకు చెల్లాయ్ వే! నువ్ ఇప్పుడు నాకు చేసిన మేలు జన్మలో మరిచిపోలేను."
ఆప్యాయంగా అన్నాడతను.
"నాకు డబ్బివ్వకుండా ఎగ్గొట్టడానికి చెల్లాయ్ అంటున్నావ్ కదూ?" అనుమానంగా అడిగిందామె.
"కాదమ్మా! నీకు కావాలంటే డబ్బు ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇదిగో ----ఎంతకావాలో చెప్పు-" అంటూ జేబులోంచి నోట్లు తీశాడతను.
"యాభై" అందామె ఇంకా అపనమ్మకంగానే.
అతను వెంటనే వందరూపాయలు తీసి ఆమె కిచ్చాడు.
"ముందు అనుకున్న ప్రకారం యాభై, నువ్ నా చెల్లాయ్ వి కాబట్టి మరో యాభయ్---చాలమ్మా!" నోటు తీసుకుని జాకెట్లో పెట్టుకుందామె. అంతవరకూ ఆమె మోహంలో కనిపించిన భావాలన్నీ మాయమైపోయినాయ్. సీరియస్ గా ఏదో ఆలోచిస్తున్నట్లు చూస్తోందతనివంక.
"నిజం చెప్పు ! ఎందుకిలా చేస్తున్నావ్ నువ్వు?" అడిగిందామె మంచం దిగి నిలబడుతూ.
"ఈ గదిలో నాకు కొంచెం పని వుంది. అందుకే ఈ హోటల్ కొచ్చానసలు---" అన్నాడతను.
"ఎమిటాపని?"
"ఈ గదిలో మా అన్నయ్య దిగాడు వారం క్రితం."
"ఆమె ముఖంలో ఏదో సంశయం కనిపించింది.
"మా అన్నయ్యను ఎవరో హత్య చేశారు !"
"అయన మీ అన్నయ్యా?" కలవరపాటుతో అడిగిందామె.
"అవును! నీకు తెలుసా అయన?"
"ఊహు! తెలీదు గానీ ఓసారి - అంటే ఆయనీ గదిలో దిగిన నాలుగో రోజు రాత్రనుకుంటాను .