పదకొండు గంటల పదినిముషాలకి డైమండ్ రాజా మల్ హోత్రా కి వార్నింగ్ ఇస్తే అతని పన్ను రాలగొట్టాడు.
పదకొండు గంటల ఇరవై నిమిషాలకి ట్రస్టీ సుందరం తనకి ఐదు లక్షల ఆఫర్ ఇచ్చి డైమండ్ రాజాతో ప్రేమ నటించామన్నాడు.
పదకొండు గంటల ముప్పయ్ నిమిషాలకి తను సుందరంతో ఒక అగ్రిమెంట్ కి వచ్చి ప్రేమ నాటకానిక నాంది పలికింది.
పదకొండు గంటల నలబై నిమిషాలకి తను డైమండ్ రాజా కారులో ఉంది.
పదకొండు గంటల నలబై ఐదో నిమిషంలో దేశ్ పాండే గ్యాంగ్ రావడం - డైమండ్ రాజా వాళ్ళకి బుద్ది చెప్పడం -
పదకొండుగంటల యాభై నిమిషాలకి "ఇది దొంగ" అన్న పచ్చబొట్టు నుదుటవున్న సరోజ నగ్నంగా తమకు కనబడటం!
ఆ తర్వాత పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి డైమండ్ రాజా తన గుండెల్లో తల పెట్టుకుని దుఃఖించడం - తను అతని మంచి తనానికి దాసురాలయిపోయి తనకు తెలియకుండానే ఈ ప్రపంచంలో ఇంతకుముందు లేదు సుమా!" అన్నంత తీవ్రమైన ప్రేమలో పడిపోవడం!
దేవుడిలీల అంటే ఇదేనా -
ఒకే ఒక్క గంటలో అతనిపట్ల ఏహ్యభావం కలగడం, అతనిపట్ల కసితో నాటకం అడబోవడం - అతనిపట్ల వైముఖ్యం తగ్గి న్యూట్రల్ గా అయిపోవడం, అతనితో అతి తీవ్రమైన ప్రేమలో పడిపోవడం, అతనికి తను నిజంగా దగ్గరవుతే అతను అపారమైన అస్తిపాస్తులకి దూరమైపోతాడని గ్రహించి, అతనికి తనే దూరమై పోవడానికి నిశ్చయించుకోవడం!
తన ప్రేమ చరిత్ర గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కవలసిన ఒక దౌర్భాగ్యపు విశేషం కాదూ? అతి తక్కువ కాలంలో వర్ధిల్లిన ప్రేమ అని!
మీనాక్షి కన్నులవెంట అశ్రువులు ధారాపాతంగా వర్షిస్తూ ఉండడం చూసిన డైమండ్ రాజా జంకుగా అడిగాడు.
"మీనాక్షి..........నా వల్ల తప్పు జరిగి ఉంటే క్షమించు!"
"కారు ఆపండి" అంది మీనాక్షి.
"ప్లీజ్ ఎక్సుజ్ మీ మీనాక్షి! నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. ఆర్తిగా మీ గుండెల్లో తల దాచుకున్నానే తప్ప వేరే తప్పు ఉద్దేశంతో కాదు.........."
"కారు ఆపండి" అంది మీనాక్షి మళ్ళీ.
"మీ ఇంటి దగ్గర దింపుతాను" అన్నాడు రాజా.
"అవసరం లేదు"
నిట్టూర్చి కారు ఆపాడు రాజా.
"మీరు వెళ్ళిపోయే ముందు మీతో ఒక్క విషయం చెప్పవచ్చునా మీనాక్షి.........అన్నాడు మృదువుగా.
వినిపించుకోకుండా త్వరత్వరగా కిందికి దిగింది మీనాక్షి. అతను చెప్పబోయేది ఏమిటో, అతను చెప్పకముందే తెలుసు ఆ అమ్మాయికి.
"ఐ లవ్ యూ మీనాక్షి! ఐ లవ్ యూ! ఐ లవ్ యూ సో మచ్! అన్నాడు రాజా సిన్సియర్ గా.
అప్పటికే త్వరత్వరగా అడుగులు వేస్తూ అతనికి దూరమైపోతోంది మీనాక్షి.
ఆమెని అనుసరిస్తూ తను కూడా కారు దిగాబోయాడు రాజా.
కానీ అంతలోనే అతనికి ఆమె తాలూకు ఆత్మగౌరవమూ, స్థిరచిత్తమూ గుర్తు వచ్చి, నిస్పృహగా భుజాలు చరిచి, కారు ఎక్కి, స్టార్ట్ చేశాడు.
కారు దూరమైపోయిన తర్వాత ఒక్కసారిగా వెనక్కి తిరిగ, కారు వెళ్ళిన వైపు చూసింది మీనాక్షి.
"ఐ టూ లవ్ యూ రాజా డియర్! కానీ ఏం లాభం! ఎప్పటికి కలవని పట్టలాంటి జీవితాలు మనవి. సమాంతరరేఖలు! నన్ను మర్చిపో! ప్లీజ్!" అనుకుంది మనసులోనే. ఆమె పెదవులు వణుకుతున్నాయి.
అప్పుడు కనబడింది ఆమెకి. ఒక టెలిఫోన్ బూత్. ఎస్. టి.డి. లోకల్ కాల్స్ ఫెసిలిటి కూడా ఉంది అక్కడ.
గ్లాస్ కేబిన్ లోకి వెళ్ళి తలుపులు వేసుకుంది మీనాక్షి.
ట్రస్టీ సుందరం నెంబరు డయిల్ చేసింది.
కలత నిద్రలో లేచిన గొరిల్లా లాగ పలికాడు సుందరం.
"అల్లో"
"సుందరం గారా?"
"అవును!"
"నేను మీనాక్షిని"
"నేను ఈ నాటకం ఇంక ఆడట్లేదు" అంది మీనాక్షి.
కోపంగా , ముక్కుతో బుర్రుమని శబ్దం చేశాడు సుందరం.
"వేషాలేస్తున్నావా? ఐదు లక్షలు అడ్వాన్సు తిసుకున్నవన్నా సంగతి మర్చిపోకు!"
"అందుకే ఫోన్ చేస్తున్నాను" రేప్రోద్దున్నే మా యింటికి వచ్చి మీ అయిదు లక్షలూ పట్టుకెళ్ళిపొండి"
"నీకు డబ్బు విలువ బొత్తిగా తెలినట్లుందే!"
"కానీ మానవత్వం విలువ పూర్తిగా తెలిసింది" అంది మీనాక్షి.
"నీ ఖర్మ" అన్నాడు సుందరం.
"కాదు! నా అదృష్టం!" అంది మీనాక్షి.
"నీలో హటాత్తుగా వచ్చిన ఇంత పెద్ద మార్పుకి కారణం తెలుసు కోవచ్చా! పెద్దోళ్ళతో వ్యవహారం అని భయపడ్డావా ఏమిటి? అన్నాడు సుందరం.
"నేను అతన్ని త్రికరణ శుద్దిగా ప్రేమిస్తున్నాను. అందుకని." అంది మీనాక్షి నిజాయితీగా.
అయితే ఇంకేం! రోగి కోరింది, వైద్యుడు చెప్పింది, ఒకే పద్యమన్నట్లు ఇంక ఇద్దరూ లావ్వాడేస్కుంటూ, చెట్టపట్టాలు వేసుకుని పార్కుల్లో, పరిగెత్తి డ్యూయెట్లు పాడుకుని ఆ తర్వాత పెళ్ళి చేసుకుని 'శుభం' కార్డులేస్కోవచ్చుగా!"
"ఏం తెలీనట్లు మాట్లాడకండి! నన్ను పెళ్ళి చేసుకుంటే అతని ఆస్తి పోతుంది."
"అది నాకు దక్కుతుంది."
"అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. రాజా ఆస్తి రాజాకే దక్కాలి. గోతికాడ నక్కలకి, గుంటదగ్గర కుక్కలకి దక్కకూడదు. అందుకనే అతనికి దూరంగా ఉండదలుచుకున్నాను నేను" అంది మీనాక్షి స్థిరంగా.
"బాగా ఆలోచించుకో!"
"ఇక అలోచించేదేమిలేదు" అని పెద్దగా చప్పుడు వచ్చేటట్లు ఫోన్ పెట్టేసింది మీనాక్షి.
కాల్ కి డబ్బులు పే చేసి బయటికి వచ్చింది. ఒక వంద గజాల దూరం నడిచింది. ఒక చీకటి సందులోకి మళ్ళింది.
అప్పుడు అప్పటిదాకా తొక్కిపెట్టి ఉంచిన దుఃఖం ఒక్కసారిగా పైకి తన్నుకు రాగా వివశురాలయి రోదిస్తూ ఒక లైటు స్తంభానికి అనుకుని నిలబడిపోయింది మీనాక్షి.
అలా రోదిస్తూ ఉండగానే .........
ఆమెకి స్పృహ తప్పింది.
అలా అర్ధరాత్రి.....
ఆ చీకటి సందులో .........
ఫెయింట్ అయిపోయి విరుచుకు పడిపోయింది మీనాక్షి.
* * *
తెలతెలవారుతుండగా -
డైమండ్ రాజా డ్రయివ్ చేస్తున్న కారు విసురుగా పాలెస్ లోకి ప్రవేశించింది.
తక్షణం - ఒక చావుకేక అతనికి వినబడింది! ఆ వెనకనే ఒక ఆర్తనాదం! ఆ తర్వాత తారాస్థాయిలో ఎవరో ఏడుస్తున్న సవ్వడి! ఆదుర్దాగా అటూ, ఇటూ చూశాడు రాజా.
ఈలోగా -
కొంతమంది మనుషులు "అయ్యో! అయ్యో! అయ్యో!" ఎంతపని జరిగిపోయింది! అంటూ ఆర్తనాదాలు వస్తున్నా వైపు పరిగెత్తి వెళుతున్నారు. తన శరీరాన్ని ఉక్కు ముక్కలా చేసి తను కూడా అటువైపు పరిగెత్తబోయాడు.
అంతలోనే -
ఒక హస్తం వచ్చి అతన్ని వారించింది!
తిరిగి చూశాడు రాజా.
అక్కడ జస్వంతరావు నిలబడి వున్నాడు.
"ఏమిటా కలకలం?" అన్నాడు డైమండ్ రాజా ఆదుర్దాగా!
మరేం కంగారు పడకు! అదక్కడ మాములే! అన్నాడు జస్వంతరావు తేలిగ్గా.
"అంటే?" ఆన్నాడు రాజా అనుమానంగా చూస్తూ.
ఏం లేదు! ఆస్థాన గాయకుడు సుబ్బిరాజ్ ఉరఫ్ తాన్ సెయిన్ ప్రభాతగీతం అలపిస్తున్నట్లున్నాడు" అన్నాడు జస్వంతరావు.
నమ్మశక్యం కానట్టు చూశాడు రాజా.
"ఏమిటి?" ఆ దారుణమైన ఏడుపు లాంటిది పాట అంటారా?" అన్నాడు విస్మయంగా.
"ప్రభాతగీతం!" "అందులో సందేహం లేదు!": అన్నాడు జస్వంతరావు.
"మరి ఆ జనం అంతా అయ్యో అయ్యో అనుకుంటూ పొలోమని పరిగెడుతున్నారు ఎక్కడికి?"