Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 32


    తనూ, మైనస్ సంగీతం ఆమెకేమీ కాదు. కాని ఇలాంటి పరిచయాల్లో ఓ విచిత్రం వుంది. ఓ మనిషిలో ఏ ప్రత్యేకత చూసి ఒకరు దగ్గరవుతారో, పరిచయం పెరిగినకొద్దీ ప్రత్యేకతకు ప్రాధాన్యత యివ్వటం మరచిపోయి మనిషే దగ్గరవుతుంటాడు. ప్రత్యేకత మనిషిలో ఒక  భాగంమాత్రమే అవుతుంది.        
    
    ఆమెని చూస్తోంటే ఓ ఆప్యాయత.
    
    ఓ ఆత్మీయత.
    
    అది ఆకర్షణ?
    
    తెలియడంలేదు.
        
    ముందుకు వంగి కిరణ్మయి వంటిమీద చెయ్యివేశాడు జ్వరం యిందాకటి కన్నా తగ్గినట్టుగా అనిపించింది.
    
    మళ్ళీ చిన్మయి ముఖంలోకి చూశాడు.
    
    ఆ ముఖాన్ని తాకాలనిపించింది. చేతిని తలపైన వేసి నిమిరాడు.
    
    చిన్మయి నిద్రలో కదిలి, కిరణ్మయిమీదనుంచి చెయ్యి తీసి ప్రక్కకి ఒత్తిగిలింది.
    
    పమిట ప్రక్కకి తొలగింది.
    
    ఆనందమోహన్ చెయ్యివెనక్కి తీసుకుని ఆమెచెయ్యి సర్ది హాల్లోకి వెళ్లి పోయాడు.
    
                                                              * * *
    
    తెల్లవారుఝామున నాలుగింటికీ చిన్మయికి మెలకువ వచ్చింది. కిరణ్మయి వంటిమీద చెయ్యివేసి చూసింది. చల్లగా వుంది.
    
    ఆమెకు ఆనందమోహన్ గుర్తువచ్చాడు. తలత్రిప్పి చూసేసరికి హాల్లో లైటు వెలుగుతూ కనిపించింది.
    
    ఆనందమోహన్ పెద్దసోఫాలో పడుకునే వున్నాడు. సోఫా పొడవు సరిపోకపోవడంచేత కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. దగ్గరకు వెళ్లి చూసింది. తెరచివున్న కిటికీలోంచి వీస్తున్న చలిగాలికి అతని శరీరం ఒణుకుతూ వుండటం కనిపించింది.
    
    "అయ్యో!" అనుకొంటూ లోపలకు వెళ్లి దుప్పటి తీసుకొచ్చి అతనిమీద కప్పింది.
    
    చాలా విషయాలు మన మనస్సు అంగీకరించినంత మాత్రాన, తప్పు కాదని అనుకున్నంత మాత్రాన సంఘం అంగీకరించదు. అసలు మంచినే సంఘం అంగీకరించడానికి ప్రయత్నించదు. అలాంటిది ఏ మాత్రం విపరీతంగా కనబడుతున్నా అసలు ఒప్పుకోదు.
    
    ఆనందమోహన్ ఎప్పుడు పడితే అప్పుడు చిన్మయి ఇంటికి రావటం అందరూ వికృతంగానే చూపులు చూసేవారు. అందులో చిన్మయి, ఇన్ని సంవత్సరాలుగా ఎవరివంకా కన్నెత్తి చూడని స్త్రీ ఆమె ప్రవర్తనలో హఠాత్తుగా ఇంత పరివర్తన రావటం అందరికీ విడ్డూరంగా వుంది.
    
    మనస్సు ఓ విచిత్రమైన వస్తువు. మనం మంచిది అనుకుని స్థిరంగా నమ్మితే ఎవరెన్ని వ్యాఖ్యానాలు చేసినా, మనిషి ఒదులుకోక తనను తాను సమర్ధించుకుంటూ వుంటాడు. తనని అనవసరంగా వ్యాఖ్యానిస్తున్నారన్న భావన వస్తే రెచ్చిపోతూ వుంటారు కూడా.
    
    ప్రస్తుతం చిన్మయికూడా ఇదే స్థితిలో వుంది. తాను ఓ మనిషి మరబొమ్మ కాదు. మనకు కొన్ని అభిరుచులుంటాయి. తనకో వ్యక్తిత్వ ముంటుంది. తన అభిరుచిని ప్రదర్శించినంత మాత్రాన తప్పుకాదు.
    
    ఒక్కొక్కరోజు.... వారం... నెల గడుస్తోన్న కొద్దీ ఆమె ఓ ట్రాక్ లో కొట్టుకుపోసాగింది.
    
                                                               * * *
    
    రాజీవ్ ఉత్తరాలు రాస్తున్నాడు. అతని దగ్గర్నుంచి ఉత్తరమొచ్చిన రోజున ఆమెకు పండుగలాగుంటుంది. ఎంతో శ్రద్ధతో ఆ ఉత్తరాన్ని పదిసార్లు చదువుకుంటుంది.
    
    "చిన్మయీ నువ్వంటే నా ప్రాణం" అని అతడు ఒక వాక్యం రాస్తే మురిసిపోయి ఆ వాక్యానికి అనేక రాగాలు కట్టి 'నువ్వంటే నా ప్రాణం' అని సంతోషంగా పాడేసుకుంటుంది.
    
    ఎంతో ఆప్యాయంగా వెన్నెలలు కురిపిస్తూ అయిదారు పేజీల ఉత్తరం రాసేసేది.
    
    ఆ ఉత్తరాలనిండా రంగు రంగుల పువ్వులు.
    
                                                            * * *
    
    చిన్మయి, ఆనందమోహన్ ల మధ్య చనువు పెరుగుతోంది.
    
    "మోహన్! నిన్న కనిపించలేదేం?"    

    "ఆఫీస్ లో నిన్న క్లాసెస్ జరుగుతున్నాయి. ఇంటికి వచ్చేసరికి ఆలస్యమై పోయింది."
    
    ఓ రోజు ఆనందమోహన్ అనుకోకుండా వూరు వెళ్ళాల్సి వచ్చింది. అయిదారు రోజులదాకా రాలేదు.
    
    చిన్మయికి పిచ్చెక్కిపోయినట్లయింది. పగలంతా ఇంటిపనితో వ్యాపకం కల్పించుకుంటూ గడిపేది. రాత్రుళ్ళు కొంత అవస్థపడినా నిద్రపట్టేదికాదు. ఒంటిగంటదాకా క్రిందా మీదా అటూ ఇటూ దొర్లి, చివరకు రెండు కాంపోజ్ వేసుకోవడం, ఆమెకు సరదా కాదు, అలవాటఉతుందని భయంకూడా వుంది. ఐనా చివరకు తప్పేదికాదు.
    
    ఆరవరోజు సాయంత్రం ఆనందమోహన్ వచ్చాడు. వస్తూనే సూట్ కేస్ ఇంటిలో పడేసి చిన్మయి దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు.
    
    చిన్మయి సోఫాలో కూర్చుని టి.వి. చూస్తోంది. అతను రావటం గమనించింది గాని పట్టించుకోనట్టు ఊరుకుంది.
    
    "చిన్మయీ!" అని పిలిచాడు.
    
    ఆమె మాట్లాడలేదు.
    
    "ఆలస్యం చేశానని కోపమొచ్చిందా?"
    
    ఆమె అతనివైపు తలతిప్పి మాట్లాడలేదు.
    
    "చిన్మయీ! ప్లీజ్! నువ్వలా కోపంగా వుంటే నేను భరించలేను."
    
    "నువ్వెవరివనయ్యా నీమీద కోపం? అయినా ఏం చేశావని?"

 Previous Page Next Page