Previous Page
Next Page
మరో ప్రస్థానం పేజి 32
ఓ మనిషీ!
ఓ మనిషీ! అయ్యో మనిషీ
బాణం గురి పెట్టినవాడా!
మందుగుండు కనిపెట్టినవాడా!
ఎందుకు నీ ఆరాటం!
ఇక చాలును పోరాటం!
ఓ మనిషీ! ఓహో మనిషీ!
అపారమైనది నీ అధికారం!
విశిష్టమైనది నీ విజ్ఞానం!
చేయకు దుర్వినియోగం!
దూరకు పద్మవ్యూహం!
ఓ మనిషీ! మేల్కో మనిషీ!
నిన్నటి స్వప్నం నేటి యధార్థం!
అసాధ్యమన్నది అతి సామాన్యం!
ఇరు తెరలలో ఉంది భయం!
ఎదిరిస్తేనే దిగ్విజయం!
ముద్రణ: జ్యోతి మాసపత్రిక - ఫిబ్రవరి, 1983
కదలి రండి నవభారత
నారీమణులారా!
కదలి రండి నవభారత
నారీమణులారా! ఓ వీరాంగనలారా!
అలముకొనే చీకటిపై
అరుణారుణ కిరణాలై
కులమత భేదాల గొడవ
వరశుల్క పిశాచి బెడద
కుళ్లగించి పెళ్లగించి
కొత్తబతుకు సాధించగ
కదలి రండి నవభారత
నారీమణులారా!
ఆర్ధిక జీవితములోని
అసమానతలణగించగ
అగణిత విశ్వాసముతో
ప్రగతిబాట పయనించగ
కదలిరండి నవభారత
నారీమణులారా!.....
ఆడది మగవాని చేతి
ఆటవస్తువని ఎంచే
పాతపడిన భావాలను
లోతుగ పాతర వేయగ
కదలిరండి నవభారత
నారీమణులారా!.....
ముద్రణ: ప్రజాసాహితి మాసపత్రిక జనవరి - పిబ్రవరి, 1984
Previous Page
Next Page