"విటులూ అంటూ లేరు. ఉన్నది ఒక్కడే... కాని నువ్వతడ్ని తాకలేవు."
"నువ్వు అంత ఖరీదైన బ్రోతల్ వా?"
"చూడాలనుందా?" ఉన్మాదిలా రెండడుగులు ముందుకేసి ఓ కిటికీ తెరిచింది. "చూడు..."
బెడ్ రూంలో ఆదమరచి నిద్రపోతున్న హోంమినిస్టర్ని చూస్తూ హతాశుడయ్యాడు.
"ఏం... ఆగిపోయావ్... వెళ్ళి అరెస్ట్ చెయ్ వశిష్టా! చట్టం నన్ను వేశ్య అంది కాబట్టి నువ్వూ నన్ను కులట అనగలిగావుగా.... దమ్ముంటే నీ చట్టంతో ఆయన్ని అరెస్ట్ చెయ్ వెళ్ళు."
ఉక్రోషంతో పిడికిలి బిగుసుకుంది.
ఏకాంత ఎదురుపడి మనసుని సగం గాయపరిస్తే యిప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయస్థితి అతడ్ని అనూహ్యమైన టెన్షన్ కి గురిచేసింది.
ఏదో చేయాలని వుంది. చట్టరీత్యా అతడ్ని అరెస్ట్ చేయడానికి తన పరిధి గాని, నిబంధనలు గాని అనుకూలంగా లేకపోయినా కనీసం పదిమంది ముందూ ఆ పెద్దమనిషి పరువు తీయాలనుంది. అది కూడా కాదు. ఒకనాడు తను అమితంగా ప్రేమించిన ఆడది ఇక్కడ ఈ రూపంలో సాక్షాత్కరించడాన్ని అతడు తట్టుకోలేక పోతున్నాడు.
మరో రెండు నిమిషాలు వుంటే ఏకాంతనీ, ఆమె విటుడ్నీ షూట్ చేసి హంతకుడైపోతాడు.
అంతే...
వెనక్కి తిరిగాడు ఉద్వేగంగా.
"ఏం...ఓడిపోయావా?" అంది ఏకాంత వ్యంగ్యంగా.
చురుక్కుమందేమో...ఆవేశంగా రెండడుగులు ముందుకేశాడు.
నవ్వింది విరాగినిలా "కొట్టాలని వుందా? కోరిక పుడుతుందా?"
"కాదు....అసహ్యంగా వుంది."
"అలాగా!"
"నిన్ను బ్రోతల్ గా నిరూపించి కటకటాల వెనక్కి పంపించాలని వుంది"
"అసంభవం వశిష్టా! ఇప్పుడు నేను అంత చిన్న స్థాయిలో లేను."
"చూస్తాను".
"నేనూ చేసి చూపిస్తాను" అంది.
"ఏమిటి?"
"ప్రయోగం వశిష్టా!" మొండిగా, దృఢంగా చెప్పింది ఏకాంత. "నన్ను కులటనన్నావుగా... కులటతోనే నువ్వు ఓ రాత్రి గడిపేట్టు చేస్తాను. అది పదిమందికీ తెలిసేట్టు చేసి నిన్ను రొంపిలోకి నెట్టి నీ తండ్రిని మానసికంగా చిత్రవధ చేస్తాను. ఎప్పుడో కాదు... త్వరలోనే"
అతడి మొహంమీదే దభేలున తలుపులు మూసింది.
ఆమె కనురెప్పలు మూసుకోగానే రెండు నీటిబొట్లు ఉబికి ఆమె చెంపలపైకి జారాయి.
* * *
"ఎవరది?"
బెడ్ రూంలో అడుగుపెట్టిన ఏకాంత ఉలిక్కిపడింది.
ఎప్పుడు నిద్రలేచాడో సూర్నారాయణ ఆమె వైపు తదేకంగా చూస్తూ అడిగాడు.
టెన్షన్ని అదిమిపెట్టుకుంటూ అతడి వారగా పడుకుని చేతి వేళ్ళను అతడి జుట్టులోకి జొనిపింది.
ఇతడెవరైతేనేం...
ఎలాంటి వాడైతేనేం...
అలసిపోయిన ఒక బాటసారికి ఆసరాగా నిలబడ్డవాడు. కాలం తన రెక్కల్ని ముక్కలు చేసి ఆడుకుంటూ వుంటే నిర్గమ్య గమనంలో నేనున్నానని హామీ ఇచ్చిన మనిషి... పునరావాసం కోసం ఆర్తిగా ఎదురుచూస్తుంటే చీకటి రహస్యాల పాంథశాలలో సహవాసిగా మారినవాడు... పరిచిత హిమతల్పం అగ్నికీలల సమాధిగా మారినప్పుడు అణువంత ప్రేమని వర్షించి జ్యోత్స్నవల్లరిలా నక్షత్రాల కళ్ళకొసలతో చెక్కిళ్ళపై రాయగలిగినవాడు...
"పుడమిలోన మిగిలి లేరు నన్ను కన్నవారు
ఎంత వెదికినా కానరాదు నా అన్నవారు
ఊరు ఊరంతా ఓరిమితో నా కథంతా విన్నారు.
ఎందుకూ పనికిరావు పో పొమ్మన్నారు"
అదిగో....సరిగ్గా అలాంటి వేళ కదూ ఇతడు తనకు అంతా కాగలిగింది...
"ఏమిటి ఆలోచిస్తున్నావ్?" అడిగాడు సూర్నారాయణ.
"నిన్నే....వచ్చిందెవరు?"
"వశిష్ట" చెప్పటానికి సంకోచించలేదు.
సూర్నారాయణ నొసలు చిట్లించాడు. "నిజమా! ఎందుకు?"
అతడికీ తనకీ మధ్య వున్న సంబంధం ఏమిటో ఆమె చెప్పలేదు. "నన్ను అరెస్టు చేయాలని."
సూర్నారాయణ ఉత్కంఠగా పైకి లేచాడు. "దేనికి?"
"నేను ఇక్కడ బ్రోతల్ గా బ్రతుకుతున్నానని తెలిసిందట."
కాబోయే అల్లుడైనాగానీ, కమీషనరు కొడుకైనాగానీ ఏకాంతనిలా అవమానించడాన్ని అతడు సహించలేకపోయాడు.
"మరి వెనక్కి వెళ్ళిపోయాడేం?"
"మిమ్మల్ని చూశాడు."
మామూలుగా అయితే సూర్నారాయణ అదిరిపడేవాడే.... కానీ అతను రాష్ట్ర పోలీసు డిపార్ట్ మెంట్ కి అధిపతి అయిన మంత్రి. అంతకు మించి కమీషనర్ నైనా బయట కాపలాగా వుంచి లోపల వ్యభిచారం సాగించగల సత్తా వున్నవాడు..... పత్రికలకి కాస్త జంకుతాడేమోగాని పోలీసులంటే చాలా చిన్నచూపుగల వ్యక్తి కావడంతో వెంటనే ఫోన్ అందుకుని ఎక్కడికో ఫోన్ చేశాడు.
ఏకాంత రెప్పలార్చకుండా చూసింది రెండు నిమిషాలపాటు.
ఫోన్ క్రెడిల్ చేస్తూ అన్నాడు. "అంటే.....దాని ప్రోద్బలంమీద ఇదంతా చేడాడన్నమాట."
ఆమె నేత్రాలు విస్ఫారితాలయ్యాయి.
ఇప్పుడు సూర్నారాయణ ఫోన్ చేసింది. తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఇన్స్ పెక్టర్ ధనంజయకి. కొన్ని గంటలక్రితం ఆశ్రిత వశిష్టకి ఫోన్ చేసి మాట్లాడింది కాబట్టి బహుశా ఆమె ప్రోద్భలం మీదనే ఏకాంత దగ్గరికి వచ్చి వుంటాడని తేల్చేశాడు ధనంజయ. అది నమ్మకుండా వుండలేకపోయాడు సూర్నారాయణ.
ధనంజయ అనుమానాన్ని వివరంగా చెప్పిన సూర్నారాయణ "వశిష్ట ఆశ్రిత ప్రేరణమీదనే ఇలా వచ్చి వుంటాడు."
అవుననిపించింది ఏకాంతక్కూడా....
ఉదయం ఆశ్రిత తనతో ప్రవర్తించిన తీరు, ఆమెలోని నిబ్బరం ఖచ్చితంగా వశిష్టలాంటి వాడి అండ మూలంగా సంక్రమించి వుంటుందని అనుకోటానికి ఏకాంతకీ అభ్యంతరం లేకపోయింది.
అయితే...