సాలోచనగా బయటి చీకటిలోకి చూసింది ఏకాంత.
వశిష్ట ఆమెకి అంత ఆత్మీయుడా...
ఆమె ఆదేశంపై ఏదన్నా చేయటానికి సంశయించనంత బంధమా వారిది?
కొన్ని క్షణాల క్రితం అతను చేసిన గాయం గుర్తుకొచ్చి ఆమెను ఎంత ఉద్విగ్నతకి గురిచేసింది అంటే, తనను కాదని నిరసించిన అతను మరో ఆడపిల్లకి అంత ప్రాముఖ్యతని యివ్వడం ఆమెకు సహించరాని విషయమైపోయింది.
ఏమిటి ఆశ్రితలో తనకన్నా అతన్ని అమితంగా ఆకర్షించిన విషయం....అందమా...తనూ అందగత్తేగా... తెలివా... అమాయకంగా నమ్మి మోసగించబడిందే తప్ప తన చురుకుదనాన్నీ ఒకనాడు అభినందించినవాడేగా...
అసలు...
ఆశ్రితనే ఈ ఆడపిల్ల కోసమే వశిష్ట తనని వదిలించుకోవాలని తండ్రితో కలిసి పథకం వేశాడా?
అసూయతో ఆలోచనాశక్తిని కోల్పోయిన ఎంత తెలివైన ఆడపిల్ల అయినా ఎలా కుంచించుకుపోయి తనకో ఆర్గ్యుమెంటుని సృష్టించగలదో, సరిగ్గా ఏకాంత కూడా అలాంటి స్థితిలోనే చాలా చాలా ఊహించేసుకుంది.
నిన్న మొన్నటిదాకా కేవలం సవ్యసాచిపై వున్న అనుమానం ఇందాక వశిష్టదాకా విస్తరిస్తే ఇప్పుడది ఆశ్రితదాకా వ్యాపించింది.
ఒక డజనుమంది తెలివైన వాళ్ళు ఒక గంటలో తీసుకోగలిగే గొప్ప నిర్ణయాలకన్నా, అసూయపరుడైన - అసాధారణమైన మేధావి అరనిమిషంలో అంతకుమించి సంకుచితమైన నిర్ణయానికి రాగలడన్న ఉదాహరణకి ఏకాంత అతీతురాలు కాలేకపోయింది.
"ఈ లెక్కన వశిష్ట మీకు అల్లుడు కావటం అసాధ్యమే..." అంది ఉక్రోషాన్ని అదిమిపెట్టుకుంటూ.
చురుక్కుమనిపించినా అరక్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు సూర్నారాయణ "అలాంటి ప్రమాదం వుందని నేను అనుకోవడం లేదు ఏకాంతా! ఎందుకంటే- ఆశ్రితకి బలమైన గుణపాఠం చెప్పే పథకం ఇప్పటికే అమలు జరుగుతోంది కాబట్టి."
ఆమె ఇప్పుడు పోలీసు కస్టడీలో వుందన్న విషయాన్ని వివరంగా చెప్పాడు సూర్నారాయణ.
అది ఆనందమో, వశిష్ట అభిమానించే ఓ అమ్మాయికి అలా పరాభవం జరిగినందుకు తాత్కాలికంగా మనసు చెందిన వూరటకు ఉదాహరణో మరి అమాంతం సూర్నారాయణ్ణి చుట్టేసింది వుత్సాహంగా.
"ఏమైంది నీకు?"
"పగ మనసుకి ఆనందాన్నిస్తే... సెగ శరీరానికి సుఖాన్నిస్తుంది గురూ" పట్టలేని ఆనందంతో వున్నప్పుడు సూర్నారాయణ్ణి 'గురూ' అని ముద్దుగా పిలవడం ఆమెకి అలవాటు. "హెచ్చరించినా గాని మొండికేసిన ఆమెకి గుణపాఠం చెబుతున్నందుకు సంతోషంగా వుంది."
సరిగ్గా అదే రాత్రి తెల్లవారేక...
సుమారు ఉదయం ఆరున్నర గంటలకు వశిష్ట ఇంటిలోని అతడి పర్సనల్ ఫోన్ రింగయింది అలారంలా.
బడలికగా నిద్రలేచిన వశిష్ట కిటికీలోనుంచి ఏటవాలుగా దూసుకొస్తున్న సూర్యకిరణాల్ని చూస్తూ బెడ్ పైనుంచి రిసీవర్ని అందుకున్నాడు.
"వశిష్ట హియర్"
"రోమన్ సామ్రాజ్యం తగలబడిపోతుంటే నీరోచక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట" బొంగురుగా వినిపించింది.
"ఎవరు మాట్లాడుతున్నది?"
"నేనెవరైతేనేం వశిష్టా! ఈ రోజు పేపర్లు చూశావా? పేపర్లూ అని ఆ బహువచనం ఎందుకు వాడుతున్నానూ అంటే ఓ తెలుగు దినపత్రికలో ఆశ్రిత ఇంటర్వ్యూ పడింది. అందులో పోలీసులు తలుచుకుంటే తనను ఓ రేడికల్ గా ముద్రవేయచ్చు. లేదూ ఏ ఆర్ డి ఎక్స్ లాంటిదో తన ఇంటిలో వుంచి తననో టెర్రరిస్టుగా టాడా కింద అరెస్ట్ చేయచ్చని ఆశ్రిత చెబితే మరో ఇంగ్లీషు డెయిలీలో ఆర్ డి ఎక్స్ తో రెడ్ హేండెడ్ గా ఆశ్రిత పోలీసులకి పట్టుబడినట్లు పబ్లిష్ చేయబడింది."
"వ్వాట్?" వశిష్ట మొహంలో రంగులు మారాయి.
"రెండు డెయిలీస్ నీ చూడు వశిష్టా...! చూసి ఆమె చెప్పిందాన్ని అమాయకంగా నిజం చేసిన మీ డిపార్ట్ మెంట్ తెలివితక్కువతనానికి ఆ జాతికి చెందిన మనిషిగా జేజేలు పలుకు లేదూ మగాడివైతే కనీసం మనిషివైతే రియాక్ట్ కా..."
ఆవలి వైపు నుంచి ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు వినిపించడంతో ఒక్క ఉదుటున బెడ్ పై నుంచి క్రిందికి దిగాడు వశిష్ట.
ఇప్పుడు అతన్ని నిద్రలేపి అతడి బాధ్యతని గుర్తుచేసిన వ్యక్తి ఎవరో కాదు....
నిన్న ఆశ్రితని కలిసిన తాగుబోతు తాతయ్య.
కొన్ని సంవత్సరాల క్రితందాకా ప్రముఖ జర్నలిస్టుగా వెలిగి మనసుకి అయిన గాయాల్ని తాగుడుతో చల్లార్చుకుంటున్న వృద్దుడు... ఇప్పుడు ప్రపంచం అంతగా పట్టించుకోని మేఘనాథ్...
* * *
ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలు కావస్తూంది.
పొగమంచు చీల్చుతున్న సూర్యకిరణాలు మొదలుకాబోతున్న ఏ సంఘర్షణకో సాక్షుల్లా నేలని తాకుతున్నాయి.
అధికార పదఘట్టనల నిమ్నోన్నతాలకి సాక్షీభూతంగా నిలిచిన 'పోలీస్' కంట్రోల్ రూం బయట గుంపులుగా నిలబడి వున్నారు కొందరు.
వాళ్ళు జనం కాదు.... జనానికి పత్రికాముఖంగా వాస్తవాలని అందించే శస్త్రకారులైన విలేఖర్లు.... ముఖ్యంగా 'నేడు' పత్రికకి చెందిన వ్యక్తులు.
వేగంగా దూసుకొచ్చిన జీపులో నుంచి దిగిన వశిష్టని చుట్టుముట్టారు.
"సో... మేం రాత్రి రాసింది తెల్లవారకముందే నిజం చేశారు."
"ప్లీజ్ లీవ్ మీ" వశిష్ట అసహనంగా అన్నాడు.
"లేదు మీరు జవాబు చెప్పాలి" ఓ విలేఖరి నిలదీశాడు.
"మీ సంగతి అటుంచండి..." వశిష్ట ఉద్రేకంతో అడిగాడు "మరో ఇంగ్లీషు డెయిలీలో ఆమెకి వ్యతిరేకంగా రాశారు."
"అది రూలింగ్ పార్టీకి సపోర్టు చేసే పత్రిక."
అతను అందర్నీ తోసుకుంటూ "గివ్ మి సమ్ టైమ్" అనేసి వేగంగా కంట్రోల్ రూంలో అడుగుపెట్టాడు.
పోలీసుల మధ్యగా నడుస్తూ చూశాడు...ఆశ్రిత ఓ సెల్లో కూర్చుని వుంది నేలచూపులు చూస్తూ.
అధికారులంతా ఎసిపి. వశిష్టకి శాల్యూట్ చేశారు.
"ఆమెను ఎవరు అరెస్ట్ చేసింది?" అడిగాడు వశిష్ట.
"నేను సర్" ఇన్ స్పెక్టర్ ధనంజయ అన్నాడు అటెన్షన్ లో నిలబడి.
అప్పటికే ఇంగ్లీషు డెయిలీలో అంతా చదివిన అతను ఇన్వెస్టిగేషన్ లా అడిగాడు 'ఏం జరిగింది. వివరంగా చెప్పండి?"


