ఆ వీధిలో రాజారాం మాస్టారి ఇల్లు అందరికీ సుపరిచితమైన దేవాలయం నిన్నటిదాకా...ఇప్పుడు దేవుడూ లేడూ, అర్చనా లేదు... చివరగా ధ్వజస్తంభమంత ధీమాగా బ్రతికే ఆశ్రితనీ తీసుకువెళ్ళిపోతున్నారు. ఒక పటిష్టమయిన వ్యవస్థ ఓ ఆడపిల్లని అద్భుతమైన పథకంతో ఇరికించి లాక్కుపోతున్నారని తెలిసినా ఎవరూ జోక్యం చేసుకోలేకపోయారు. అసలు అలాంటి సహాయాన్ని ఆశ్రిత కోరదు కూడా.....తనకు తానుగా పోరాదే ఈ కదనరంగంలో ఆమె సైన్యం ఆమెకున్న ఆత్మస్థయిర్యం ఒక్కటే...
జీపులో కూర్చుంటూ ఆలోచించింది.
ప్రత్యర్ధులు మొదటి పావుని బలంగా కదిపారు... అది అనూహ్యం కాకపోయినా తాను మానసికంగా ప్రిపేర్ కావాలి.
మృత్యుగుహరంలోకి ప్రయాణిస్తున్నట్టు జీపు వెళుతుంటే సమీపంలో కూర్చున్న ధనంజయ అన్నాడు చిరుగర్వంగా "పెద్ద వాళ్ళతో పెట్టుకోవద్దంటే వినకుండా రెచ్చిపోయి పేపర్లలో ఇంటర్వ్యూ దాకా వెళ్ళావు బేబీ.... చిత్రం చూశావా... రేపు ఉదయం డెయిలీలో నీ అరెస్ట్ వార్త కూడా ప్రచురించబడుతుంది. గంటక్రితమే పేపరులో బాక్స్ ఐటమ్ లా ప్రింటయిపోయింది కూడా అంటే మేం అంత అడ్వాన్స్ డ్ గా వుంటామన్నమాట."
అప్పుడు చూసింది ఆశ్రిత మృదు మందహాసంతో.
ఒక అసాధారణమైన ఆధారం దొరికినట్టుగా "థాంక్స్ మిస్టర్ ధనంజయా" అంది ప్రశాంతంగా.
* * *
అదే రాత్రి...
మృత్యునాదంలా బజర్ మోగడంతో బడలికగా నిద్రలేచిన ఏకాంత ముందు కలేమో అనుకుంది.
ఇంకా బజార్ మోత స్పష్టంగా వినిపిస్తుంటే బెడ్ మీద నుంచి పైకి లేచింది.
ఓ అరగంట క్రితమే నిద్రలోకి జారిపోయిన సూర్నారాయణలో చలనం లేదు.
'పాపం మానవుడు' అనుకుంది ఈమధ్య మామూలు కన్నా మరో రెండు పెగ్గులు బిగించడం అలవాటు చేసుకున్న సూర్నారాయణకేసి చూస్తూ.
ఎందుకో బజర్ మోత కొంచెం ఆందోళనని కలిగిస్తుంటే నైటీని సర్దుకుంటూ నడిచి ద్వారం తెరిచింది.
అంతే...
ఎక్కడో గుండె లోతుల్లో ఓ విస్ఫోటనం ఉబికిన ఊపిరి లిపి పగిలిరాలిన స్వప్న పారావతం... ముకుళించిన కాలం రగిల్చిన కలకలం - వాంతి కాబోతున్న అంతఃస్వర లహరి...
"మీరా" అంది ఎదురు నిలబడ్డ వశిష్టని చూస్తూ...
వశిష్ట పరిస్థితీ అలానే వుంది.
ఇన్నేళ్ళ తర్వాత యిక్కడ ఇలా ఏకాంత ఎదురుకావడం ఎదుర్కోలేని సన్నివేశం.
"రండి" సాదరంగా ఆహ్వానించబోయి ఆగిపోయింది.
ఎవరమ్మా! ఎవరితను? అతనెవరైనా గాని ఇప్పుడు అప్పటిలా మాట్లాడటానికి తనెవరని... అసలు ఇప్పటి స్థితిలో తను ఎలా ఆహ్వానించగలదని...
జుగుప్సగా ఆమె నేత్రాలు సజలాలవుతుంటే గడిచిన ఏ ఘోరకలి గుర్తుకు వచ్చిందో, తానీ క్షణాన స్మశానంలోని అఘోరీగానే అనిపించిందో నిస్త్రాణగా కళ్ళు మూసుకుంది సన్నగా కంపిస్తూ.
నిన్నటి నా ప్రియనేస్తం... నన్ను అంతగా అభిమానించిన నువ్వు వేల కోట్ల బాసలతో బాసటగా వున్నావనుకున్నానే... ఏమయ్యావు నువ్వు? అందరి వెనకా నీడల మాటున దాగుని నాకెందుకు దూరమయ్యావు... ఎంత ఎదురుచూశాను నీకోసం? పచ్చిక మీద కూచుని నిరీక్షించడం అలవాటైన నేను జైలుగోడలకి గోదుని వినిపిస్తూ, నువ్వు వస్తావన్న ఆకస్మిక వైభవం కోసం ఎన్ని నిద్రలేని రాత్రుల్ని గడిపానో నీకెలా చెప్పను? నా ముఖాన్ని ప్రపంచానికి చూపించలేక ముష్టిదాని మల్లే ఏ దివ్యక్షణంలో అయినా దోసిలిలోకి రాలిపడే నీ ప్రేమభిక్ష కోసం అహోరాత్రులు ఎంత తపించానో నీకెలా వివరించను?
ఇప్పుడెందుకయ్యా! ఇంత జరిగాక నాకెందుకు కనిపించావు? నిన్నూ, నీ ఉనికిని కాదనుకున్న నేను దుమ్ముతో నిండిన రాజబాటపై చాలా ముందుకు సాగిపోయానే! నీకు మాత్రమే నైవేద్యం కావాలనుకున్న బ్రతుకుని అంగడిలో పెట్టి అమ్ముకుంటూ బ్రతకడం అలవాటు చేసుకున్నానే... అన్ని పూలూ అమ్ముడు పోయేక ఈ ఖాళీ పూలసజ్జలో ఏముందని ఇలా వచ్చావు.
"అడ్డులే" ఉక్రోషంతో అన్నాడు వశిష్ట.
అర్ధంకానట్టు చూసింది.
"నేను వచ్చింది నిన్ను చూసి తరించాలని కాదు. ఒక బ్రోతల్ ఇంటిని రెయిడ్ చేయాలని".
ఆమె నేత్రాలు విస్ఫారితాలయ్యాయి.
కోరి కొండ కోనలదాకా వచ్చిన ప్రియుడికి పోయిన జీవితం గురించి కొమ్మల సాక్షిగా, రెమ్మల బాసటగా జరిగింది పాటలా చెప్పి పారిపోదామనుకుంటే తప్పు తనదే అన్నట్టు, తనో తప్పుడు స్త్రీ నన్నట్టు మాట్లాడతాడేం...
"అసలు జరిగింది..." తనను నిరసించినా గాని అంతా చెప్పాలని వుంది ఏకాంతకి.
అతడి తండ్రి వారి ప్రేమకథ తెలిసి ఏమన్నాడో తెలియచేయాలని వుంది. వశిష్ట ట్రైనింగ్ కని వెళ్ళాక, తనను ట్రేస్ చేసి వేశ్యగా సంఘం ముందు ఎలా నిలబెట్టాడో, ఆ తర్వాత తనకు పరిచయం లేని ఓ వ్యక్తి శవాన్ని తన గదిలో వుంచి హంతకురాలిగా మార్చి, జైలుకెలా పంపించాడో వివరంగా, నిజాయితీగా తెలియచెప్పాలని వుంది... వినడేం... అంతా నిజమే అని నమ్మేశాడా?
"వశిష్టా! ఒక్కసారి జరిగింది నీకు చెప్పాలని వుంది."
"కాని నాకు వినాలని లేదు" కర్కశంగా అన్నాడు.
"ఎందుకని?" ఏకాంత కళ్ళలో పేరుకున్న నీటిపొరలు అతడ్ని కదిలించలేక పోయాయి. "ఎందుకు వినకూడదనుకుంటున్నావు?"
"కులటగా బ్రతకడం నీ కేరక్టరని నీకు నువ్వే నిరూపించుకున్నావు కాబట్టి."
"మిస్టర్ వశిష్టా!" అరిచింది ఉద్వేగంగా.
"అరిస్తే నీ గొంతునాళాలు పగిలిపోతాయి తప్ప, నువ్వు పతితవి కావని నిరూపించుకోలేవు."
"ఆ తండ్రికి సరైన కొడుకువి".
"కాదు ఏకాంతా... పోని అదే నిజమైతే నీ అసలు రూపం ఆదిలోనే తెలుసుకునేవాడ్ని."
"నేను కులటని కాను."
"అప్పుడు ఏమో నాకు తెలీదు కాని ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చెక్ చేయాలనుకుంటున్నాను".
ఆవేశంగా ముందుకి నడవబోయిన వశిష్టకి అభిముఖంగా నిలబడి అరిచింది "ఆగు"
"ఏం?"
"ఏమిటి వెదకాలనుకుంటున్నావ్?"
"గదిలో వున్న నీ విటుల్ని."