Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 33

   

     ఆ మాటకు మయూష వళ్ళు కుతకుతలాడిపోయింది. అతనిమీద అసహ్యంతో ఆమె ముఖం నల్లగా మాడిపోయింది. పళ్ళు పటపటమని కోపంగా కొరికింది.
   
    సరిగ్గా అదే సమయంలో కారు కంత్రీ క్లబ్ లోకి ప్రవేశించింది.
   
                                              *    *    *    *
   

       కారులోంచి ఠీవీగా దిగాడు జ్వాలాముఖీరావు. అతని వెనకే దిగుతున్న మయూష కొంచెం దూరంలో నిలబడిన వ్యక్తుల్లో భుజంగపతిని గుర్తించి అసహ్యంగా అతనివేపు చూసింది.
   
    ఆ రోజు తిరుపతిలో, తర్వాత పిస్టల్ వుంటే కాల్చి చంపెయ్యాలన్నంత కోపంగా ఉందామె.
   
    భుజంగపతి పక్కన ప్రకాష్ సింగ్, ఆ పక్కన కుటుంబరావు అతని పక్కన రవళి.....ఇంకొంతమంది నుంచున్నారు.
   
    ఒక్కొక్కర్నీ మయూషకు పరిచయం చేసాడు జ్వాలాముఖిరావు.
   
    కంట్రీక్లబ్ మిస్ ఇండియాగా సెలక్టయిన అమ్మాయిని సత్కరించే ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ జ్వాలాముఖిరావు.
   
    "నిన్నక్కడకు ఎందుకు తీసికొచ్చానో తెలుసా? మోసం చేసి పెళ్ళి చేసుకున్నా, నువ్వు నా భార్యవే గదా. బోర్డాఫ్ డైరెక్టర్స్ కి, బిజినెస్ ఫ్రెండ్స్ కీ, హై సొసైటీలోని వ్యక్తులకూ నిన్ను పరిచయం చెయ్యాలిగదా.....మిస్ ఇండియా కంటే నువ్వే అందగత్తెవని అందరూ వప్పుకోవాలి గదా.....అందుకు....." నెమ్మదిగా అన్నాడు జ్వాలాముఖిరావు.
   
    నిర్వాహకులు, జ్వాలాముఖిరావు దంపతుల్ని ఆహ్వానించి స్పెషల్ సీట్స్ లో కూర్చోబెట్టారు.
   
    జ్వాలాముఖిరావు వరసగా ఒక్కొక్కర్నీ పరిచయం చేస్తున్నాడు మయూషకు.
   
    అందరి పరిచయాలూ అయిపోయాక నలువేపులా చూసి_
   
    "నువ్విక్కడ నా భార్యగా చక్కగా యాక్టివ్ గా వుండాలి. ఎవరితోనయినా మాట్లాడొచ్చు. కానీ నా కళ్ళు నిన్నే గమనిస్తాయని మరిచిపోకు" అతని మాటింకా పూర్తికాలేదు.
   
    రవళి మయూష దగ్గరకొచ్చింది.
   
    "మేడమ్. ఈ క్లబ్ కు రావడం ఇదే ఫస్ట్ టైమనుకొంటాను. క్లబ్ చూద్దురుగాని రండి" నవ్వుతూ ఆహ్వానించింది.
   
    తల తిప్పి చూసింది జ్వాలాముఖిరావు వేపు మయూష.
   
    "డోన్ట్ బీ షై....గో....అండ్ ఎంజాయ్" నవ్వును నటిస్తూ అన్నాడతను. సీట్లోంచి లేవక తప్పింది కాహ్డు మయూషకు.
   
    అందర్నీ చూస్తూ రవళి వెనక నడుస్తోంది మయూష. దారిలో ఎవరో మిస్ ఇండియాగా సెలక్ట్ అయిన అమ్మాయిని పరిచయం చేసారు.
   
    ఒక పక్క ప్రోగ్రామ్ స్టార్టయింది.
   
    "ప్రతిరోజూ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మీరు డ్రెస్ డిజైనింగ్ లో ఎక్స్ పర్ట్ గదా చైర్మన్ గారు అదే మీ శ్రీవారు చెప్పారు. హి ఈజ్ నైస్ జెంటిల్మేన్ కదూ" అంది రవళి.
   
    ఏం మాట్లాడలేదు మయూష జెంటిల్ మేన్ అన్న పదం విని విస్తుపోయింది.
   
    సరిగ్గా అదే సమయంలో భుజంగపతి అక్కడ కొచ్చాడు.
   
    "హలో మయూషా.....సారీ ఇప్పుడు మేడమ్ అని పిలవాలేమో గదా. అంతేలే. అదృష్టం తంతే కొంతమంది బంగారు టబ్ లో పడతారని.....నన్ను నువ్వు ఎనిమీగా చూస్తావని నాకు తెలుసు. ఏం జరుగుతుందో చివరి వరకూ నాకు తెలీదు. నువ్వు నమ్మాలి మరి. పోనీలే కోట్లకు అధిపతి వయ్యావు ఆ సెక్రటేరియట్ క్లర్క్ కూతురుగా ఉంటె నీకీ అదృష్టం దక్కేదా నేను చెప్పేదీవిటంటే పాత ఇన్ సిడెంట్లన్నీ మరిచిపోదాం. జ్వాలాముఖిరావు నాకు బావ. అంటే నువ్వు నాకు సిస్టర్ వి అవుతావు.
   
    అంచేత నన్నెప్పుడూ పరాయి వాడిగా భావించొద్దని మనవి. నీ సంగతి ఎప్పటికప్పుడు మన కుటుంబరావు చెపుతున్నాడు. బావ మనసు ఐస్ ముక్కనుకో రెండ్రోజులయ్యాక పూర్తిగా మారిపోతాడు. డోన్ట్ వర్రీ బీ హేపీ అలా అంటున్న అతనివేపు పరమ అసహ్యంగా చూసింది మయూష.
   
    ఇంతలో అక్కడికి ప్రకాష్ సింగ్ అతనితోపాటు రామానుజం అనే వ్యక్తి వచ్చాడు.
   
    "ఇదంతా మన ట్రూప్ అంటే మా బావకు వెత్ విషర్స్ అన్న మాట మేమందరం అహోరాత్రులు కష్టపడితేనే బావ కోటికి పడగలెత్తాడు. ఈ ట్రూప్ లో నువ్వూ జేరిపోయావు. ఉయ్ ఆర్ హేపీ" అన్నాడు భుజంగపతి ఏ భావమూ లేకుండా.

    అప్పుడే మీటింగ్ స్టార్ట్ అయింది.

    మిస్ ఇండియా కు భారీ ఎత్తున సన్మానం జరిగాక జ్వాలాముఖిరావు ఉపన్యసించటం ప్రారంభించాడు.
   
    ప్రపంచంలో అందంగా ఉన్న వాళ్ళు చాలా పనులు మామూలు వాళ్ళకన్నా ఎక్కువగా సాధించగలరు అందంగా మనకు కన్పించే వాళ్ళు అందంగా ఆలోచించగలరు కూడా ప్రాచీన చరిత్ర దగ్గర్నుంచీ మనం చూస్తే అందానికి విలువ ఎప్పుడూ వుంది. బాగా చదువుకున్న అమ్మాయి యావరేజి అందంగా ఉంటే మనం పట్టించుకోం ఇంటర్ మీడియట్ ప్యాసైన అమ్మాయి అందంగా ఉందనుకోండి, మన కళ్ళను ఇట్టే ఆకర్షిస్తుంది" జ్వాలాముఖిరావు స్పీచ్ కి అందరూ చప్పట్లు కొడుతున్నారు హుషారుగా.
   
    "ఫర్ ఎగ్జాంపుల్ నా మొదటి భార్య చనిపోయాక పదిహేనేళ్ళ పాటు నా కళ్ళకి న అవ్యపార మొక్కటే అందంగా కన్పించింది. కానీ ఎన్నాళ్ళు చేస్తాం వ్యాపారం? కోతి రూపాయలు-ఇంకో కోటి రూపాయల్ని అవలీలగా సంపాదిస్తున్న దశలో వ్యాపారం మన కళ్ళకు అందంగా కన్పించదు. అలాంటి సమయంలోనే నాకు మా మయూష కన్పించింది. మయూషంటే నా భార్య రెండో భార్య నా కళ్ళకు నా భార్య చాలా అందగత్తే మీ కళ్ళక్కూడా అలాగే కన్పించిందనుకోండి నే నెప్పుడో మోసపోతాను" అని జోక్ వేసేసరికి వేలాది జనం ఉక్కిరి బిక్కిరయిపోతూ నవ్వడం ప్రారంభించారు.
   
    "ఏవిటీ చెయిర్మెన్ గారు మిమ్మల్నలా పొగిడేస్తున్నారు మిమ్మల్ని చాలా బాగా ప్రేమిస్తున్నట్టున్నారే" మయూష కళ్ళల్లోకి చూస్తూ అంది రవళి.   
   
    "పొగిడితే ప్రేమ ఉన్నట్టా?" ఆ ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేకపోయింది రవళి.
   
    వాళ్ళిద్దరికీ కొంచెం దూరంలో కూర్చున్నారు భుజంగపతి, రామానుజం.
   
    "ఏవిటిదంతా ఏదో రహస్యంగా కక్ష తీర్చుకోడానికి పెళ్ళి చేసుకున్నాడనుకుంటే.....ప్రపంచం ముందు భార్యని పొగుడుతున్నాడు. రోజు రోజుకీ ఏదో ఉక్కుముడి గట్టిగా బిగుసుకుపోతోందని అనుమానం ఉక్రోషంగా అన్నాడు భుజంగపతి.
   
    "ఎవరికి?" అడిగాడు రామానుజం.
   
    "ఎవరికీ....మనకు?" అరిచినట్టుగా అన్నాడతను.
   
    "నా దృష్టిలో సౌందర్యమే భగవంతుడు. భగవంతుడి సృష్టే ఈ ప్రపంచం అంచేత ప్రపంచాన్ని, ప్రపంచంలోని ప్రతి సౌదర్యాన్నీ మనం ప్రేమించాలి. నువ్వు ప్రపంచాన్ని ప్రేమిస్తే, ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది ఇప్పుడు మీరందరూ ప్రేమిస్తున్న మిస్ ఇండియాను నేను కూడా ప్రేమిస్తున్నాను" నవ్వుతూ ఉపన్యాసం ముగించాడు జ్వాలాముఖిరావు.

 Previous Page Next Page