Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 34

   

   జ్వాలాముఖిరావులో అంత సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుందని అనుకోలేదు మయూష అతనిలోని విరుద్దమయిన మానవ ప్రకృతికి ఆశ్చర్యపోతోందామె.
   
    అందరూ రిథమ్ గా చప్పట్లు కొడుతున్న దశలో నలువేపులా చూస్తున్న మయూష కార్నర్ లో గోడ పక్కన ఒక వ్యక్తి తదేకంగా తన వేపే చూస్తుండడం గమనించింది.
   
    ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్టుగా అనిపించిందామెకు.
   
    ఒక్కక్షణం ఆమె బ్రెయిన్ చురుగ్గా పనిచేసింది.
   
    మసక చీకట్లోకి మరోసారి పరీక్షగా చూసింది.
   
    నవనీత్! ఎస్.....నవనీతే!
   
    అవును అదే జుత్తు అదే ముఖం అదే ముక్కు పెదవులవే.
   
    అంతవరకూ గాల్లో ఎగురుతున్న నీటి బుడగ టప్ మని పేలిపోయినట్టుగా అయిపోయింది మయూష మనసు.
   
    నెమ్మదిగా లేచి నిలబడిందామె.
   
    "ఎక్కడికి మేడమ్?" అడిగింది రవళి.
   
    "టాయ్ లెట్ కు" ఒకింత విసురుగా అంది మయూష.
   
    "నేను రానా"
   
    "వద్దు......నేను వెళ్ళగలను" కరకుగా జవాబు చెప్పి ముందుకడుగేసింది.
   
    జనం మధ్యనుంచి నడుస్తోంది. మయూష తనవేపు రావడాన్ని ఆ వ్యక్తి గమనించి గబగబా ముందుకు నడిచాడు దాదాపు పరుగులాటి నడకతో.
   
    దాంతో మయూష కూడా తన వేగాన్ని పెంచింది.
   
    ఆ వ్యక్తి జనం మధ్యలోంచి బయటికెళ్ళి టెన్నిస్ కోర్టు పక్కగా చీకట్లో చెట్లలో కలిసిపోయాడు.
   
    అక్కడివరకూ పరుగు పరుగున వచ్చిన మయూష అక్కడ ఎవరూ కనిపించక పోవడంతో ఆగిపోయింది.
   
    ఒక్కసారిగా ఆమెకు దిగులు, కోపం, నిరాసక్తత, ఆసక్తత అన్నీ ఆక్రమించేసాయి. కళ్ళలోంచి పెల్లుబుకుతున్న కన్నీరు-అయిదు నిమిషాల సేపు అక్కడే నిలబడి, వెనక్కి తిరిగిన మయూష భుజంమీద సడన్ గా ఒక చెయ్యి పడటంతో ఉలిక్కిపడి పక్కకి తిరిగింది.
   
    ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయిందామె.
   
    గాయత్రి......!
   
    "మీరు....ఇక్కడ...." గాయత్రిని అక్కడ ఆ సమయంలో చూడటంతో తల్లిని చూసినట్టుగా అయిందామెకు.
   
    ఒక్కక్షణంఆమె అక్కడుండే పరిసరాలని మరిచిపోయింది.
   
    నిలువెల్లా దుఃఖం కమ్మేయగా భోరుమని ఏడ్చేసింది చిన్న పిల్లలా.
   
    గాయత్రి గుండెలమీద తలపెట్టుకుని మరీ ఏడ్చేసింది.
   
    "ఏడవకు మయూషా! ఇదంతా భగవంతుని రాత. మన చేతిలో ఏముంది చెప్పు?"
   
    "మా అమ్మ, అన్నయ్య, వదిన అందరూ బాగున్నారా?"
   
    "అందరూ నిన్ను తలచుకోని రోజు లేదనుకో మయూషా నువ్వు బెంగుళూర్ లో ఉంటున్నావని ఎవరో అన్నారు బాగున్నావు కదూ! అయిపోయిందేదో అయిపోయింది మంచికో, చెడ్డకో కోటీశ్వరుని భార్యావయ్యావు" ఏదో లొడ లొడా చెప్పుకుపోతోంది  గాయత్రి.
   
    "అసలు మీరెలా వచ్చారు ఈ క్లబ్ కి? వస్తుంటారా? మీ ఆయన ఏరీ?"
   
    "అసలు కధ ఇప్పుడు అడిగావు గదా! చెపుతాను విను. అసలు మేము వచ్చింది నిన్ను చూడటానికే. మిస్ ఇండియా ఇవాళ ఈ క్లబ్ కి వస్తోందని పేపర్ లో చూసారట మావారు. ఆ పక్కన చీఫ్ గెస్ట్ ల పేర్లు చూస్తే శ్రీ అండ్ శ్రీమతి జ్వాలాముఖిరావు అని వుందట. వాళ్ళాఫీస్ లో వాళ్ళ  సెక్షన్ హెడ్ కి ఈ క్లబ్ లో మెంబర్ షిప్ వుందట ఆయనతో పాటు గెస్ట్ లుగా వచ్చాం. నిన్నెలగయినా చూడాలని మా ఆయనెంత తాపత్రయపడ్డారో తెలుసా?" ఆ విషయం చెపుతుంటే మరింతగా బాధ పడింది మయూష.
   
    "ఏరీ శివాజీగారూ....." అనడిగిందామె.
   
    అలా అడుగుతున్నప్పుడు ఒక్కసారి తమ తమ ఇంటి మేడ మీంచి చూసినప్పుడు కనిపించిన దృశ్యాలు, గాయత్రి చూడకుండా తనకు శివాజీ చేసిన సంజ్ఞలన్నీ గుర్తుకొచ్చాయి.
   
    ఏదో తెలియని మధురిమతో మయూష మనసంతా పులకించి పోయింది కొద్ది క్షణాలు.
   
    "హలో...." సరిగ్గా అదే సమయంలో ఎక్కడినుంచో వచ్చి పక్కన కూర్చున్నాడు శివాజీ.
   
    "బావున్నారా?"
   
    వెంటనే జవాబు చెప్పలేదు శివాజీ.
   
    అతని కళ్ళనిండా మంచుమీద వెన్నెల తుంపర పడిన అనుభూతి.
   
    అభిమానంగా, ఆరాధనగా, ఆప్యాయంగా చూస్తున్నాడు కళ్ళప్పగించి మయూషవేపు శివాజీ.
   
    "ఇప్పుడే వస్తాను" పక్కకెళ్ళింది గాయత్రి.
   
    "నన్నెలాగయినా చూడాలని ఎందుకనుకున్నారు?" ఆ ప్రశ్న ఎందుకడిగిందో తెలీదు మయూషకు.
   
    "ఎందుకా.....మా ఆవిడ కూడా పక్కన లేదు కాబట్టి చెప్పేస్తున్నాను. ఏవీ అనుకోకండి ఐ లవ్ యు...మయూషా....మీరంటే మొదట చూపులోనే నాకిష్టం__ఆ ఇష్టానికి ఫలానా కారణమని లేదు. నాకు పెళ్ళి కాకపోతే మిమ్మల్ని ఎలాగోలా పెళ్ళిచేసుకుని వుండే వాడిని. అంతిష్టం మీరులేని పక్కింటి మీ డాబా పాడుబడిన హంపీ సిధిలంలా నాకు కనిపిస్తోంది. అదేంటో నా పిచ్చిగానీ పై డాబామీద నుంచి చూడటానికి మీరు లేరని తెలిసిపోయింది గదా. గోడచాటు ముద్దులకు మా ఆవిడ్ని పిలవాలని ధ్యాసేలేదు. ఎప్పుడూ మీ ధ్యాసే" గబ గబా చెప్పుకుపోతున్నాడు శివాజీ.
   
    అంతలో మూడు కూల్ డ్రింక్స్ తో వచ్చింది గాయత్రి.
   
    "తీసుకో మయూషా! నాకిప్పుడు ఎంత ఆనందంగా వుందో తెలుసా?"
   
    ఒక బాటిల్ ను చేతిలో పెట్టి__
   
    "ఏమిటి లొడలొడమని వాగేస్తున్నారు?" అని భర్తను అడిగింది గాయత్రి.
   
    "అదా...హుస్సేన్ సాగర్ గురించి"
   
    "హుస్సేన్ సాగర్ గురించి ఇప్పుడెందుకూ?" దీర్ఘంతీస్తూ అడిగింది గాయత్రి.
   
    "హుస్సేన్ సాగర్ ను మట్టితో కప్పేయాలంటే ఎన్ని లారీల మట్టి కావాలోనని అడుగుతున్నాను మయూషను" అన్నాడు శివాజీ ఒకింత చిరాగ్గా.
   
    "చాలా రోజుల తర్వాత మనిషి కనిపిస్తే ఇలాంటి ప్రశ్నలే వేసేది బాగుందండీ" అని భర్తతో అనేసి.....
   
    "మయూషా ఇక్కడే ఉంటావ్ కాబట్టి మా ఇంటికెప్పుడొస్తావ్? ఇలాగే మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటావ్?" అనడిగిందామె.
   
    ఏం జవాబు చెప్పాలో తెలీక తొట్రుపాటు పడింది మయూష.
   
    "నెలకు రెండురోజులు మాత్రమే ఇక్కడుంటున్నాను. ఆయన్తో బిజినెస్ ట్రిప్పులు ఎక్కువయ్యాయి. నేను వచ్చే నెలొస్తాను. మా అమ్మ, అన్నయ్య, వదినల్తో ఈ విషయం చెప్పండి" అంది మయూష.
   
    ఆ తర్వాత డయాస్ కు కొంచెం దూరంలో చెట్టుకింద గాయత్రి మయూష హాయిగా కబుర్లు చెప్పుకున్నారు.
   
    ఇరవయ్ నిమిషాల తర్వాత__
   
    "మేడమ్! చైర్మన్ గారు మీకోసం వెతుకుతున్నారు. మీరిక్కడ వున్నారా?" అంటూ రవళి వచ్చింది.
   
    "వస్తాను.....మరి...." లేచి నిలబడి గాయత్రి భర్త శివాజీ కళ్ళల్లోకి చూసింది.

 Previous Page Next Page