Previous Page Next Page 
సుహాసిని పేజి 32


    బయట ఎముకలు కొరికే చలి ఇంటి తలుపులు తీయడానిక్కూడా భయంగా వుంది. వున్నట్లుండి మా నాన్నగారికి గుండెపోటు వచ్చింది. అప్పుడు నా భవిష్యత్తుకాయనే ఆధారం. నేను బైటకు వెళ్ళి డాక్టర్ని పిల్చుకుని వచ్చాను. చలి నాకు తెలియలేదు. అంటే నా మనసు శరీరం నుంచి వేరు పడిందన్న మాట. మా నాన్నగారి ప్రాణాలు రక్షించుకోవాలన్న తపన, నా భవిష్యత్ గురించిన స్వార్ధం నా మనసును శరీరం నుంచి వేరు చేశాయి. స్వార్ధం, భయం, లక్ష్యం, ఆశయం, ప్రేమ__ ఇవన్నీ మనిషి శరీరాన్నీ మనసునీ వేరు చేయగలవు...."

    "నాది భ్రమ కాదు...."

    "భ్రమ కాదు సరే, ఇంతకీ నీ సమస్యేమిటి?"

    "ఇప్పుడు నేనేం చేయాలన్నదే సమస్య!"

    "ఆమె తను ప్రేమించినవాణ్ని పెళ్ళి చేసుకుంటుంది. నువ్వు వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకో...."

    "ఆమె ప్రేమించిన వ్యక్తి మోసగాడని నా అనుమానం...."

    "నా స్నేహితుడొకడు చాలా అందమైన అమ్మాయిని ప్రేమించాడు. ఆమె పెళ్ళి వేరే అతడితో జరిగింది. ఇది జరిగి పదిహేనేళ్ళయింది. ఆ అమ్మాయి సుఖపడ్డంలేదనీ, మొగుడామెను వేధిస్తున్నాడనీ ఇప్పటికీ నా స్నేహితుడు బాధపడుతూంటాడు...."

    "అయితే!"

    "తను ప్రేమించిన అమ్మాయి తన్ను పెళ్ళి చేసుకుంటేనే సుఖపాడుతుందని ప్రతీ ప్రేమికుడూ నమ్ముతాడు...."

    "కానీ ఈ యువకుడు మోసగాడనడానికి చరితే ఋజువు...."

    "అయితే ఏం చేస్తావు?"

    "కొంతకాలం పాటు వాళ్ళిద్దర్నీ అనుసరించి తిరుగుతాను."

    "సరే_ ఆ తర్వాత!"

    "ఆమెకు తరచుగా ధైర్యం చెబుతూంటాను."

    "చెప్పు!"

    "ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆమెను నా జీవితంలోనికి ఆహ్వానించడానికి సిద్ధంగా వున్నానని చెబుతాను...."

    "అప్పటికామె వివాహం అయిపోతే!"

    "అయినా సరే...."

    "ప్లీజ్.... అంత పని చేయకు.... అది మన సంప్రదాయం కాదు"

    గౌతమ్ ఆశ్చర్యంగా ఆయనవంక చూసి "నేను సంప్రదాయానికి భయపడనని మీకు తెలుసుగా!" అన్నాడు.

    "భయపడనని అంటున్నావు. అది నీ భ్రమ కావచ్చు. ఇంతవరకూ సంప్రదాయం తప్పే పని నువ్వే చేయలేదు. నువ్వు ప్రేమించానంటున్న అమ్మాయి మీ వాళ్ళే అయుంటారని నా అనుమానం...."

    గౌతమ్ చటుక్కున తలవంచుకుని "మీరు చెప్పింది నిజమే! కానీ ఇది యాక్సిడెంటల్ గా జరిగింది. నేను కావాలనిలా చేయలేదు. ఆ అమ్మాయిని తొలి చూపులో ప్రేమించాను. నాకప్పుడామె కుటుంబ వివరాలు తెలియవు" అన్నాడు.

    "అది నీ భ్రమ కావచ్చు. ఏది ఏమైనా వివాహిత స్త్రీని తరచుగా కలుసుకుని నేనున్నానంటూ ధైర్యం చెప్పకు. అదే ఆమె తప్పటడుగుకు కారణం కావచ్చు. ఆ విధంగా తప్పటడుగు వేసిన స్త్రీతో నువ్వూ సుఖపడలేవు. నీకులా కులం చూసుకుని ప్రేమించే అబ్బాయిలు రెండో పెళ్ళి అమ్మాయిని భరించలేరు...."

    గౌతమ్ మాట్లాడలేదు.

    "నేనిలాగంటున్నానని ఏమీ అనుకోకు. నీకు నిశ్చితాభిప్రాయం లేదు. ప్రేమ పేరు చెప్పి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోకు. తలిదండ్రులు చూసిన పిల్లని పెళ్ళి చేసుకో. హాయిగా వుండు."

    "మీరు నన్ను సరిగ్గా అర్ధం చేసుకోలేదు. నేను సామాన్యంగా జీవించడానికి పుట్టలేదు. ఏది ఏమైనా మీ సలహాను గుర్తించుకుంటాను."

    "నువ్వు సామాన్యుడివి కాదని నాకూ అనిపిస్తోంది. కానీ నిన్ను నువ్వే సామాన్యుడిగా మార్చుకుంటావేమోనని నా భయం...."

    అది తనకు హెచ్చరిక అని గుర్తించాడు గౌతమ్.


                                                                             28


    హాసను కాశ్మీరు పంపడానికి నిర్ణయించాడు కోదండపాణి. అయితే కూడా ఎవరు వెళ్ళాలా అన్నది తేలలేదు.

    దక్షిణామూర్తి, పార్వతమ్మ అంత దూర ప్రయాణం చేయలేరు, ఆ చలికి తట్టుకోలేరు- అని తేలిపోయింది.

    గిరిధర్ కుర్రాడు. అదీకాక వాడికింకా పరీక్షలవలేదు.

    కోదండపాణికి ఆఫీసులో సెలవు లేదు.

    సుభద్ర మాత్రమే ఆమె కూడా వెళ్ళడానికి వీలవుతుంది. కానీ వాళ్ళకు వేరే మగతోడుండాలి.

    ఆ మగతోడుగా రమణ తనుంటానన్నాడు.

    హాసకు కాశ్మీరు చూడాలని చాలా కాలంగా కోరిక. అంతా కలిసి వెడదామని వాయిదా వేశారు. ఖర్చుకూడా ఎక్కువని కోదండపాణి భయం.

    ఆయుషెంతో లేని హాస కోర్కె అర్జంట్ గా తీర్చాలని ఆయననుకున్నాడు.

    అయితే రమణ కాశ్మీరు ట్రిప్పు ఖర్చంతా తను భరిస్తానన్నాడు. ఆ కుటుంబాన్నంతనీ విమానంలో తీసుకెళ్ళి తీసుకొస్తానన్నాడు. అతడి ఖర్చు మీద అంతమందికి ప్రయాణం చేయడం ఇష్టం లేదు.

    రమణ కోదండపాణితో తన కోరిక చెప్పాడు. "నేను మీ అమ్మాయిని ప్రేమించాను. నాది నిజమైన ప్రేమ. నా ప్రేమ బలంతో ఆమె బ్రతకాలి. లేదా ఆమె నా భార్యగానే మరణించాలి. అనుక్షణం ఆమెనే అనుసరించి వుంటాను. ఏ బలహీన క్షణంలోనో ఆమెకు వివాహేచ్చ కలక్కపోదు. వెంటనే మా వివాహం జరిగిపోతుంది."

    అతడి పట్టుదలకు కోదండపాణి ఆశ్చర్యపోయాడు. సుభద్ర ఇది విని, "అతడు దేవుడండీ...." అంది.

    "వాళ్ళ పెళ్ళి మన పద్ధతి ప్రకారం జరగాలి. ఎందుకైనా మంచిది, కూడా పురోహితుణ్ణి తీసుకుని వెళ్ళండి" అన్నాడు కోదండపాణి.

    "కన్యాదాత లేకుండా పెళ్ళి చేయడం మన సంప్రదాయం కాదు" అంది సుభద్ర.

    "మన సంప్రదాయంలో మనుషులకంటే మంత్రాలే ముఖ్యం. కూడా పురోహితుణ్ణి తీసుకెళ్ళండి" అన్నాడు కోదండపాణి.

    పురోహితుడ్ని చూసే బాధ్యత రమణ తీసుకున్నాడు. అయితే హాసకు అనుమానం రాకూడదని పురోహితుడికి విగ్గు పెట్టి ఆధునికంగా తయారుచేశాడు. విగ్గు పెట్టినప్పుడతడు హిప్పీలా వుంటాడు. విగ్గు లేనప్పుడసలు సిసలు పురోహితుడు.

    విమానంలో ప్రయాణం.

    ప్రయాణం రోజున ప్రతిభ వచ్చి హాసను కలుసుకుంది.

    మంచి ముహూర్తం కోసం ఆమె వివాహం తాత్కాలికంగా వాయిదా పడింది. కానీ ఆమె సీరియల్ మాత్రం అప్పుడే ప్రారంభమయింది. అది తీసుకుని వచ్చిందామె హాసకు చూపడానికి. అందులో ఆమె ఆరోగ్య వివరాలున్నాయి. రక్తపరీక్ష, ఎక్స్ రే ఫలితాలున్నాయి. "ఆదర్శ వివాహానికి ముందిదీ ఆమె పరిస్థితి. వివాహానంతరం ఆమె శరీరారోగ్యంతో ఎటువంటి మార్పులు వస్తాయో వేచి చూద్దాం" అని వ్రాశారా పత్రికలో.

    "పెళ్ళి కాకుండానే గొప్ప ప్రచారం నీకు_" అని నవ్వింది హాస.

    "ఈ ప్రచారం వల్ల ఇలా బియ్యే ఫలితాలు రాగానే అలా జాబ్ దొరకొచ్చు. అన్ని విధాలా నేను మీ రణమగారికి ఋణపడి వున్నాను" అంది ప్రతిభ.

    హాస మనసులో గర్వపడింది.


                          *    *    *    *


    హాస, సుభద్ర, పురోహితుడు మొదటిసారిగా ఫ్లేనెక్కారు. లోపల వారికి అంతా కొత్తగానే వుంది. అన్నీ వింతగానే ఉన్నాయి. రమణ గర్వంగా అన్నీ వారికి వివరించి చెప్పాడు. అతడి మాటలర్ధం కాకపోయినా ఓపికను మెచ్చుకుంది సుభద్ర.

    ఇంతా చేస్తే ఎక్కినంత సేపు పట్టలేదు. విమానం ఢిల్లీ చేరుకుంది. ఢిల్లీలో విమానం మారి శ్రీనగర్ చేరుకున్నారు.   
    "మనూర్నించి హైదరాబాదు ట్రయిన్లో వెళ్ళడమే అసలు ప్రయాణం. మిగతాదంతా ప్రయాణంలాగే లేదు" అంది సుభద్ర.

    హాస మాట్లాడకుండా చుట్టూ వాతావరణం చూస్తోంది.

    "భూతల స్వర్గం" అన్న మాటలో ఆశ్చర్యం లేదు.

    రమణ టాక్సీ ఏర్పాటు చేశాడు.

    ఏం జరుగుతున్నదీ ఆమెకు తెలియదు. ఉత్సాహంగా ఆ భూతల స్వర్గాన్ని చూస్తోంది.

    పచ్చటి చెట్లు, దబ్బ పండు ఛాయ మనుషులు, చల్లని గాలి, చెమట తెలియని వాతావరణం.

    సుభద్ర ఆంధ్రా ఎండల్ని తల్చుకుని ఇది ఎండాకాలమేనా అని ఆశ్చర్యపడింది.

    టాక్సీ దార్ సరస్సు పక్కన ఆగింది.

    రమణ అక్కడో నావలోకి అందర్నీ ఎక్కమన్నాడు.

    "ఇప్పుడేం బోటు షికారు? ముందు మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాం....ఏదైనా గది చూస్తే...." అని సుభద్ర అంటూంటే....

    "ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకుందుకే వెడుతున్నాం" అన్నాడు రమణ.

    అంతా నావ ఎక్కారు.

    హాస తమాషాగా ఉన్న నావ అలంకరణను చూస్తోంది.

    "వీటిని షికారా అంటారు" అన్నాడు రమణ.

    "నాకు ఈ నావా తెలుసు, ఈ మనిషీ తెలుసు" అంది హాస.

    రమణ ఆశ్చర్యంగా "ఎలా?" అన్నాడు.

    "సినిమాలో చూశాను...." అంది ఆమె.

    గంభీరమైన రమణ ముఖంలో చిరునవ్వు కనబడింది.

    నావ ఊగుతూంటే సుభద్ర కంగారుపడుతూ అటూ యిటూ చూసి, "మనం వెడుతున్న వేపు ఇళ్ళేం కనబడ్డంలేదు" అంది.    

 Previous Page Next Page