Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 31

    "నిజంగానా!" చామంతి సంతోషంగా అడిగింది.
   
    "నిజంగా. నీవే చూస్తావుకదా?"
   
    "మరి అమ్మకి ఈ విషయం....?"
   
    "ఎలాగో అలా తెలుస్తుంది లే. ఆమె నీకు సాయం చేస్తుంది. ఈ విషయం మనసులో ఉంచుకో నీ వేళ్ళమీద ముడతలవలన ఇదంతా గ్రహించాడు. మరీ చీకటిపడితే అడవి దగ్గర ఉండటం మంచిదికాదు. ఇంకలేచి వెళ్ళు" అంది సోదెమ్మ.
   
    "నీవు చెప్పిందంతా నిజమేకదూ?" వెళ్ళేముందు మరోసారి అనుమానంగా అడిగింది చామంతి.
   
    "నీవు చెప్పకముందే నీ జాతకం మొత్తం కణుపులెక్కలు చూసి చెప్పానా లేదా?"
   
    "చెప్పావు."
   
    "కనుక నీ కథ మొత్తం నాకు తెలుసు. నే చెప్పింది ఎప్పుడూ అబద్దం కాదు. త్వరలో గోపన్న జైలునుంచి వస్తాడు. నీ మెడలో తాళికడతాడు. సరేనా?"
   
    "అమ్మ చాలా మంచి మనిషట. అమ్మకి కూడా తెలిస్తే నాకు కొండంత బలం వస్తుంది."
   
    "నీకు కొండంత అండ ఎప్పుడూ ఉంటుంది చూస్తావుగా."
   
    ఆ తర్వాత సోదెమ్మ వక దోవన చామంతి మరోదోవన వెళ్ళారు.
   
    ఇంటికొచ్చే లోపల దోవ పోడుగూత చామంతి ఆలోచిస్తూనే వుంది...."సోదెమ్మ బాగానే చెప్పింది... అమ్మకి ఈ విషయం అందితే బాగుండును ఎలా అందుతుందబ్బా?"
   
    అప్పటికే...
   
    శక్తిమాయికి వార్త అందింది.
   
    చామంతికి ఈ విషయం తెలీదు. అదంతే.
   
                                                                                     20
   
    "ఏది మళ్ళీ చెప్పు" అంది గుణవంతి.
   
    "కణుపుల మీదవున్నా చారలనుబట్టి సోదెమ్మ అంతా చెప్పింది నీవు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అక్కా" చామంతి చెప్పింది.
   
    "అంతకుక్రితం నీవు నీ గురించి అసలు ఏమీ చెప్పలేదా?"
   
    "పిసరంతకూడా చెప్పలేదు."
   
    "చాలా వింతగా వుందే"
   
    "నాకు అంతే చాలా విచిత్రంగా వుంది..." అంది చామంతి.
   
    బయట వసారాలో నులక మంచంమీద మేనువాల్చి చుట్ట తాగుతున్న ఆనందయ్య పక్కనే కింద కూర్చుని బియ్యం ఎరుతున్న బాలమ్మ వీళ్ళ గుసగుసలు విని లేచి లోపలికొచ్చారు.
   
    "మధ్యలో రెండు రెండు ముక్కలు నా చెవిలో దూరకపోలేదు....విషయమే పూర్తిగా అర్ధంకాలేదు. అడవికి వెళ్ళావు ఏం జరిగింది చామంతి?" ఆనందయ్య అడిగాడు.
   
    "నువ్వు చెప్పు" చామంతి గుణవంతితో అంది.
   
    "ఇంత సిగ్గయితే ఎలా?" గుణవంతి అంది.
   
    "సిగ్గా పాడా, నువ్వయితే బాగా చెపుతావని చెప్పమన్నాను" అంది చామంతి.
   
    మొదటినుంచీ ఏం జరిగిందో చామంతి చెప్పిందంతా వివరంగా చెప్పింది గుణవంతి.
   
    అది విని ఆనందయ్య ఆలోచనలో పడ్డాడు.
   
    ఇంటికి పెద్దాయన ఆనందయ్య కళ్ళు మూసుకొని దీర్ఘాలోచన చేయటం చూసి ఎవరికీ వారే మౌనం వహించారు...
   
    ఆనాడు మనవడు హఠాత్తుగా మాయం అయితే దిక్కూ దివాణం తోచక ఆనోటా ఆనోటా విన్న మాటలను పట్టుకుని తన గోడు వెళ్ళబోసుకోటానికి అడవికి వెళ్ళాడు ఆనందయ్య పిలిచి పిలిచి నోరు నెప్పి పుట్టిందిగాని శక్తి మాయి దర్శనం కాలేదు...అయినా క్షేమంగా మనవడు కున్నా యింటికి వచ్చాడు....ఆ తల్లి కనబడినా కనబడక పోయినా చల్లని చూపు ఆ తల్లిదే అని యింట్లో అంతా నమ్మారు....కనపడని ఆ దేవతపేరు తలచుకుని దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు....ఆ తర్వాత బాకీ గురించి బన్సీలాల్ కూడా పల్లెత్తుమాట అన లేదు. చూడగా ఇదంతా శక్తిమాయి యొక్కమాయ అనిపిస్తున్నది.
   
    సూరప్ప ఆనందయ్యళ ఇళ్ళు పక్క పక్కలనే వున్నాయి....సూరప్ప కూతురు చామంతి ఆనందయ్య కోడలు గుణవంతి మంచి స్నేహితురాళ్ళు....గుణవంతి వయస్సులో అయిదేళ్ళు పెద్దకావడంతో అక్కా! అని పిలుస్తుంది చామంతి.
   
    చామంతి ప్రేమకథ మొత్తం గుణవంతికి తెలుసు. గోపన్నని జెయిల్లో పెట్టారు...ఇంకా తిరిగి రాడు నేను చచ్చిపోతాను....నా కెవరూ సాయం చేయరు?" అని చామంతి ఏడుస్తుంటే ఆ బాధ చూడలేక గుణవంతి సలహా యిచ్చింది...

 Previous Page Next Page