Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 32

    "రోగమేమీ కనిపించటంలేదు. నీరసం రోజురోజుకూ పెరుగుతున్నది. మహామహా ఔషదాలు కూడా బూడిదలో పోసినట్లు అవుతున్నవి. గాలిదోషం ఏమన్న ఉన్నదేమోనని అనుమానంగున్నది. వ్యాధి వచ్చిన గడియకూడా దుష్టగడియ. బ్రాహ్మడిచేత శనిజపం చేయించండి. గాలి దోషానికి చికిత్స చేయించాలె" అని చెప్పి వెళ్ళిపోయాడు వైద్యుడు.
    రెడ్డిగారి హృదయంలో సంక్షోభం చెలరేగింది. తనకున్నది ఒక్కగానొక్క కూతురు. సంపదకు అధికారానికి కొదువలేదు. ఆమెకోసం తన సంపద యావత్తూ దానం చేయడానికీ, ఆమెకోసం బిచ్చం ఎత్తమన్నా ఎత్తడానికీ తయారుతారు. ఎంత సంపద ఉండి ఏం ప్రయోజనం - తన మంజరి మంచం పట్టి ఉంటే? మంజరి గంతులువేస్తూ తన ముందుంటే తన కేమీ అక్కర్లేదనుకున్నారు. ఇంకేవేవో ఆలోచనలు వచ్చాయి. బైండ్లవాణ్ని పిలిపించాలి. అప్పటికీ తగ్గకుంటే బస్తీకి తీసికెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు. మనఃక్షోభం కలిగినప్పుడల్లా పాణి దగ్గరికి వెళ్ళడం ఆయన అలవాటు. అయితే, ఇప్పుడాయన సంగీతం వినే స్థితిలో లేరు. తన క్షోభ తెలియపర్చుకోడానికి పాణి గదికి వెళ్ళారు.
    "ఏమైంది?" కలవరపాటుతో అడిగాడు.
    జరిగిందంతా చెప్పారు రెడ్డిగారు.
    "దొరవారూ! నిష్ఠురం అయినా నిజం చెప్పనా?" అన్నాడు పాణి.
    ఇలాంటిమాటే ఇదివరకేదో చెప్పాడు పాణి అనే విషయం గుర్తుకు తెచ్చుకుంటే పీరిగాడు. చింతకాయలూ గుర్తుకు వచ్చాయి. నాడు పారిపోయిన పీరిగాడు మళ్ళీ కనిపించనేలేదు. వాని కారణంగా చింతలకు కాపుంచాల్సి వచ్చింది. ఎక్కడున్నా పట్టుకొనిరమ్మని మనుషుల్ని పంపించారు. ఇంకా దొరకనే లేదు. ఎన్నాళ్ళు తప్పుకొని తిరుగుతాడు? ఇంతలో మంజరి గుర్తుకు వచ్చింది. "చెప్పు" అన్నారు.
    "ఈ దయ్యాలూ, భూతాలూ వట్టి భ్రమ. మూర్ఖం. వాటివల్ల ప్రయోజనం ఏమీ లేదు. వైద్యుడు శరీరం బాగానే ఉందంటున్నాడు. అంటే మంజరి మనసు బాగాలేదని అర్ధం. ఏదో చిరాగ్గా ఉన్నట్టుంది. మనసులో ఏముందో తెలుసుకునే వైద్యుడు ఇంతవరకు పుట్టలేదు. మనసుకు శాంతి లభిస్తే బహుశా: వ్యాధి తగ్గు రూపం పట్టవచ్చు. చిరాకుగా ఉన్న మనసుకు శాంతినీ, ఉల్లాసాన్ని ఇవ్వడంలో సంగీతాన్ని మించింది లేదు. ఒక పాట వినిపించి చూతాం. సంగీతంవల్ల కోలుకుంటుందా సరేసరి, లేదా బస్తీకి తీసికెళ్ళడం వైద్యం చేయించడమే మంచిది."
    పాణి చెప్పిందాన్లో ఆయనకీ అభ్యంతరం ఏమీ కనిపించలేదు. బాధపడినపుడల్లా సంగీతం ఆయనకీ ఎంతో ఆనందాన్నీ, ఉల్లాసాన్నీ ఇచ్చింది. పాట వినిపించి దాని ప్రభావం చూడ్డంలో తప్పు లేదనుకున్నారు.
    "సరే, అట్లనే కానియ్యి" అన్నారు రెడ్డిగారు.
    ఇద్దరూ గదిలో ప్రవేశించారు. మంజరి కళ్ళు మూసుకుని ఉంది. ఎక్కడుందో ఆమె మనసు మరి! ఎవరు గదిలోకి వచ్చిందీ గమనించలేదు.
    పాణి వీణకు శ్రుతి పెడ్తుంటే హృదయవీణకు శ్రుతి పెడ్తున్నట్లు అనిపించింది. కళ్ళు తెరిచింది.
    "గ్o గ్o గ్0"
    "ప|| నా జీవాదారా! నా నోము ఫలమా!            ||నా జీవా||
    అ|| రాజీవలోచనా! రాజరాజ శిరోమణి              ||నా జీవా||
    చ|| నా చూపు ప్రకాశమా!   
        నా నాసికా పరిమళమా!
    నా జపవర్ణరూపమా!
    నాదు పూజాసుమమా
    త్యాగరాజనుత"
    గొంతెత్తి పాణి పాడుతూంటే ఆనందంతో ఏకాగ్రంగా వినసాగింది. పాత హృదయానికి ఉల్లాసం కలిగిస్తూంది. పాణి తనవైపుచూచినప్పుడల్లా ఆ చూపుల్ని పరీక్షించసాగింది. అవి స్వచ్చంగా ఉన్నాయి. శరచ్చంద్రికల్లా ఉన్నాయి. ఆ చూపుల్లో ఆమెకు వలపు చినుకులు కనిపించాయి.
    పాణి తనవాడేని నిశ్చయించుకుంది. దాంతో శరీరంలో సత్తువ చేరుతున్నట్లు అనిపించింది.
    తనకోసం ఎంత చక్కగా పాడుతున్నాడు!
    వీణ ఆగిపోతే గుండె ఆగినంత పనైంది. మబ్బుల్లోంచి మట్టిలో పడినట్లయింది. లేచి కూర్చుంది.
    రెడ్డిగారి ఆశ మొలకెత్తింది.
    "ఇంకొక్క పాట" అన్నది మంజరి.
    పాణి అలసిపోయి ఉన్నాడని గమనించిన రెడ్డిగారు "పంతులూ! ఇంకొక్కపాట పాడు" అన్నారు యాచిస్తున్నట్టు. ఆ దీనత్వం చూచి చిరునవ్వు నవ్వుకున్నాడు పాణి. ఆ ధ్వనిలో అధికారంగానీ, దర్పంగానీ లేదు. అదియాచన. ఎవరిని? పాణిని. ఎవరు? గ్రామ ప్రభువు!

    ప||    చక్కని రాజమార్గమే యుండగ
        సందుల దూరనేలా ఓ మనసా        ||చక్కని||    
    అ||    చక్కని పాలుమీగడ యుండగ
        ఛీయు(కల్లు) గంగాహర మేలా
    చ|    కంటికి సుందర కరమగు రూపమే
        ముక్కంటి నోట చెలగే నామమే
        త్యాగరాజింటనే బాగ నెలకొన్న ఆదిదైవమే
        ఇటువంటి శ్రీ సాకేతరాముని భక్తీయనే    ||చక్కని||
    ఈసారి రెడ్డిగారు కూడా తన్మయంగా విన్నారు. పాట ముగించి "మళ్ళీ రేపు పాడ్తా" అన్నాడు పాణి, మరొక పాట పాడమన్నా పాడలేననే ధ్వనిని వ్యక్తపరుస్తూ.
    "ఇప్పుడెట్లున్నది?" అడిగారు రెడ్డిగారు పాణిని.
    వీణ పక్కకు పెట్టాడు పాణి.
    "నాకేమైంది?" మంజరి అడిగింది.
    సత్తువ వచ్చేసింది.
    'పాలు తాగుతావు?'
    'తాగుత!'
    పాలు తెప్పించడానికి వెళ్ళారు రెడ్డిగారు.
    'ఎందుకు మంజరీ! అలా అయినావు?' అడిగాడు పాణి.
    'నీకోసం,' తల వంచుకొని అన్నది. పెదవులమీది చిరునవ్వు దాచుకున్నా దాగలేదు.
    ఏదో అనబోయాడు. రెడ్డిగారు ప్రవేశించారు. పాలగ్లాసు తీసుకొని వనజ ప్రవేశించింది. వనజను చూచి ఒళ్ళు మండింది మంజరికి. చేతులు వణికాయి.
    వనజ పాలగ్లాసు అందించింది.
    మంజరి అందుకుంది.
    చేయి జారింది.
    'ఘణ్' మని పాలగ్లాసు క్రింద పడిపోయింది. తెల్లని పాలు నేల మీద పర్చుకున్నాయి.
    క్షణం క్రిందికి చూచి పైకి చూచింది మంజరి. వనజ అక్కడే నుంచుంది మౌనంగా. మంజరి కళ్ళు రక్తం కక్కాయి. "గలాసు ఇడ్చిపెడ్తవులె" అని లాగి చెంపమీద కొట్టింది వనజను.
    వనజ జలజలా కన్నీరు రాల్చింది.
    చెంప పట్టుకొని దూరం జరిగి నుంచుంది.
    ఎన్నాళ్ళనుంచో ఆ పని చేయాలనుకుంటుంది మంజరి. పాల నెపంతో చేయగలిగింది. పక్కకు చూస్తే మళ్ళీ వనజ కనిపించింది. దయ్యం కనిపించినట్లయింది. "ఫో" అని గద్దించింది.
    పాణి గుండె చెరువైంది. చిత్రంగా తోచిందంతా. వనజ చెంప 'చెళ్ళు' మంటే తన చెంప 'చెళ్ళు' మన్నట్లనిపించింది. వనజను 'ఫో' అంటే తన్ను 'ఫో' అన్నట్లు అనిపించింది. రక్తం ముఖంలోకి ఎగబ్రాకి దిగిపోయింది. చివాలున లేచి వెళ్ళిపోయాడు.
    గదిలోకి వెళ్ళిపోయాడు.
    కూతురు ప్రవర్తన విచిత్రంగా తోచింది రెడ్డిగారికి. దగ్గర కూచుని తల నిమురుతూ "గలాస నీ చేతిలోంచి జారిపడే. వనజ నట్లెందుకు కొట్టినవు, పాపం?" అని అడిగారు.
    తండ్రి సైతం వనజ పక్షం వహించాడనుకుంది.
    వెంటనే కళ్ళల్లో నీళ్ళు నిండాయి.
    జలజలా కన్నీరు రాలింది.
    "నాయ్నా!" అని బావురుమంది తండ్రిమీదపడి.
    వనజను చూస్తే మంజరి ఎందుకు మండిపోతూందో గ్రహించాడు పాణి. వనజకూ తనకూగల సంబంధం చెపుతే బాగుపడుతుందనుకున్నాడు. ఆ విషయం ఏకాంతంగా చెప్పడానికి ఆవకాశం కోసం ఎదురుచూడసాగాడు.   
                                                                     19
    గడీముందున్న వేపచెట్టు కొమ్మమీదికి రోజూ ఒక వడ్లపిట్ట వచ్చి తొలుస్తూంది. పిట్ట వేపకొమ్మను తొలిచేప్పుడు ఫోటో తీయాలని రోజూ ప్రయత్నిస్తున్నాడు పాణి. కాని, పడ్డం లేదు. ఒకరోజు ఆకులు అడ్డం వస్తాయి. సరిగ్గా పోజు కుదిరేసరికి పిట్ట ఎగిరిపోతూంది. దాంతో సతమతం అవుతున్నాడు. ఈ రోజు ఎలాగైనా ఫోటో తీయాలనే పట్టుదలతో నుంచున్నాడు పాణి మేడమీద.
    "దొరకండ్ల పడ్తె చంపుతడు, నీ కాల్మొక్త ఇడువురి" అన్న ఏడ్పు వినిపిస్తే క్రిందికి చూచాడు పాణి. మదార్ సాబ్, మరొకడు ఒకణ్ణి రెక్కపట్టుకొని లాక్కొస్తున్నారు. విడిపించుకోవడానికి గింజుకుంటూ ప్రయత్నిస్తున్నాడు వాడు. ఇద్దరూ రెండు చేతులు పట్టుకొని ఎత్తారు. అతడు వ్రేలాడాడు. అలాగే ఎత్తి గేట్లోంచి లోపలికి తీసుకొని వచ్చారు.
    పాణి ఫోటో తీశాడు.

 Previous Page Next Page