"దొరా! పీరిగాన్నిపట్టుకొచ్చినం. బిచ్చమెత్తుకు తిరుగుతాండు ఊరూరు" అని కేకవేశాడు మదార్‌సాబ్.
బెత్తం పట్టుకొని ఆకలిగొన్న సింహంలా లంఘించారు రెడ్డిగారు. పట్టుకొనివచ్చినవాళ్ళు పీరిగాన్ని వదిలి దూరం జరిగారు. "లంజకొడక, చింతకాయలెత్తుక పోతవులె" అని వీపుమీద కర్రతో లాగికొట్టారు రెడ్డిగారు.
"చస్తి దొరా! బుద్ది గడ్డితిన్నది, పిల్లలుగలోన్ని, చంపుకున్రి, నీ కాల్మొక్త బాంచను" అని కాళ్ళమీద పడ్డాడు పీరిగాడు. వాడు వంగడంతో కర్ర వీపుమీద కాక నేలమీదపడింది. "గాడ్దికొడక, కాళ్ళమీద పడ్తవులే" అని కర్రతో లాగి బాదారు వీపుమీద.
"అమ్మో, చస్తిని" అని వీపు తుడుచుకుంటూ లేచి ఉరుకు పుచ్చుకొన్నాడు పీరిగాడు గేటుదాటి.
"నిలబడి చూస్తాన్రేమిరా! గుంజ్కురాండి గాడ్దికొడుకును....ఇయ్యాళ్ళ తోల్లోలుస్త, దొరంటే ఏమనుకున్నడో, చింతకాయ లెత్కపోతాడు, చింతకాయలు" అని అరిచారు రామారెడ్డి దొరవారు.
మదార్‌సాబ్, మరొకడు పరిగెత్తి లాక్కొచ్చారు వాణ్ని.
"పిల్లలుగలోన్ని. చంపకురి నీ బాంచను" అని కాళ్ళుపట్టుకున్నా వినకుండా, "ఇగాడికి పరారైతావురా (పారిపోతావురా)" అని, "గేటు బంద్ చెయ్యిరి.... తడఖా చూపిస్త" అని ఆజ్ఞాపిస్తే గేటు మూసేశాడు మదార్సాబు. పీరిగాడోచ్చి కాళ్ళమీదపడి 'దొరా, చంపకండి. నీ కాల్మొక్త, పిల్లలగలోడ్ని, బాంచను" అని వలవలా ఏడ్చాడు. రెడ్డిగారు కాలితో ఒక్కతన్ను తన్ని, కర్రతో బాదారు. 'అయ్యో చస్తిని. అయ్యో చస్తిని' అని పరిగెత్తాడు వాడు. వెంబడించి బాదసాగారు రెడ్డిగారు. పరుగెత్తుతుంటే పౌరుషం ఎక్కువై వెంబడించి మరీ బాదుతున్నారు. పీరిగాడు పడిపోయాడు. లాగి దెబ్బలు కొట్టారు రెడ్డిగారు. వీపుమీద తగలాల్సిన దెబ్బ కణతమీద తగిలింది. కళ్ళెత్తి నోటితో ఊపిరి పీల్చుకున్నాడు పీరిగాడు. గమనించకుండా బాదేస్తున్నారు రెడ్డిగారు గొడ్డును బాదినట్టు.
పీరిగాడు మూడుసార్లు నోటితో శ్వాస పీల్చుకున్నాడు.
తల వ్రేలాడిపోయింది. ప్రాణం ఎగిరిపోయింది.
కర్రలా పడివున్న కళేబరాన్ని చూచి లిప్తపాటు రెడ్డిగారి గుండె ఆగిపోయింది. మరుక్షణంలో రాక్షసుడైపోయారు. కాలితో శవాన్ని తనిన 'పాతిపెట్టున్రి తోట్ల' అని వెనక్కు తిరిగి చకచకా నడుస్తూ మెట్లెక్కి వెళ్ళిపోయారు రెడ్డిగారు.
సూర్యుడు అస్తమించాడు. చీకట్లు వ్యాపించాయి.
పరిగెత్తినట్లు నడిచిపోయి మంచంమీద పడిపోయారు రెడ్డిగారు. ఆయాసం ఎక్కువైంది. రొప్పువచ్చింది. గుండె అతివేగంగా కొట్టుకోసాగింది. ఒళ్ళంతా చెమటలు పట్టింది. ఆయనకీ తెలియకుండానే కళ్ళవెంట జల జలా నీరు కారసాగింది. ఎంత తుడుచుకున్నా తగ్గలేదు. కళ్ళముందు ఏదో తెర ఏర్పడినట్లయింది ఏదో అయోమయం. అంధకారం ఆయనకీ, అంతకుముందు జరిగింది గుర్తుకురావడంకానీ, తక్షణం తర్వాత కాలం ఉందనే విషయం తెలియడంకానీ లేదు.
క్రమంగా ఆయాసం తగ్గింది. కానీ, ఆరాటం హెచ్చింది. శరీరం నిప్పుల్లో పెట్టినట్లవుతూంధి. ఎవరో విసిరి మంటను పెంచుతున్నట్లనిపిస్తూంది. కళ్ళనీరు తగ్గింది. కానీ, కళ్ళల్లో నిప్పులున్నట్లు మండిపోతూంది.
'దొర! చంపకుండ్రి, పిల్లలుగలోన్ని.' పీరిగాని మాటలు పదే పదే వినిపించసాగాయి. చెవుల్లో నూరు కంచు గంటలు మ్రోగుతున్నట్లనిపిస్తూంది.
పీరిగాడు కళ్ళలో ఆడాడు. ఎంత బ్రతిమలాడాడు వాడు. వాణ్ణి చంపాలనుకోలేదు తాను. నాలుగు బాది బుద్ది చెప్పాలనుకున్నాడు. కానీ దెబ్బ ఆయువు పట్టున తగిలింది. చల్లబడ్డాడు. తానైతే చంపాలని చంపలేదు. కానీ, పోలీసులు చేతులకు బేడీలు వేస్తున్నట్లనిపించింది. గుండె జల్లుమంది. న్యాయస్థానం, విచారణ...తరువాత తరువాత తరువాత ఉరికంబం, ఉరికంబం, ఉరికంబం! ఉలిక్కిపడ్డారు. మెడ చూసుకున్నారు.
వాడేంచేశాడు పాపం! చింతకాయలు కోసుకొనిపోయాడు, చింతకాయలు! 'చింతకాయలు అతి చిన్న విషయం. వాటికోసం మీరేవేవో చిక్కులలో ఇరుక్కోవద్దని నా మనవి' అన్న పాణి మాటలు గుర్తుకు వచ్చాయి. ఎంత దూరదృష్టితో చెప్పాడు! అతని మాటలు వింటే ఎంత బావుండేది! ఇప్పుడొక నిండు ప్రాణం తీశాడు తాను.
ఉరికంబం. తాను ఉరికంబాన్ని ఎక్కుతాడు. మంజరి, ఇందిర ఏమౌతారు? తాను లేకుంటే ఈ ఊరి జనం చీల్చుకొని తినేస్తారు వారిని. వారి గతి ఏం కావాలి? వీల్లేదు - తాను చావడానికి వీల్లేదు. బతకాలి. తనకోసం కాదు, మంజరికోసం బ్రతకాలి. ఇందిరమ్మకోసం బ్రతకాలి-బ్రతకాలి. కానీ, ఎలా?
ఈ చావే పోలీసులకు తెలియకుంటే? అవును, మంచి ఉపాయం. కాని, ఎలా? పటేల్ నిజామొద్దీన్ తో చెప్పాలి. రిపోర్టు కాకుండా చూడాలి- కాని వాడు తన మాట వింటాడా? వాడు కరణం మనిషి. కరణం తన మాట వింటాడా? ఒప్పుకుంటాడా? డబ్బు డబ్బు డబ్బు. ఎంత? వేయి, రెండువేలు, మూడువేలు, నాల్గువేలు. ఎంతైతే ఏం? ప్రాణం కంటే ఎక్కువా?
తను నేరంచేసి తప్పుకోవాలని చూస్తున్నాడు. పీరిగాడు చేసిన నేరం ఏమిటి? -ఏమిటి? ఎందుకు చంపాడు తాను? అవును - ఎందుకు చంపినట్లు? మెదడును ఎవరో గోళ్ళతో పట్టుకొని చీలుస్తున్నట్లనిపించింది.
ఎందుకు తానింత బాధపడాలి? వాడికి ఆయుస్షు మూడింది. చచ్చాడు. తనకు తప్పుకోదానికి డబ్బిచ్చాడు భగవంతుడు. అవును. తప్పుకోవాలి. భగవంతుడు రక్షిస్తాడా? ఏమో! అనేక మొక్కులు మొక్కారు.
గడీకి ఏదో మూడింది. అటు మంజరి అలా పడి ఉంది. ఇటు తానిలా అయిపోయాడు. తాను కరణాన్ని బ్రతిమలాడాలి. అధికారంనుంచీ దర్పంనుంచీ తొలగాలి. అయినా, లొంగుతాడా కరణం? ప్రయత్నించాలి. అతడు కోరిందల్లా ఇవ్వాలి.
చూస్తే దీపాలు వెలుగుతున్నాయి గదిలో. అది గమనించనే లేదు తాను. దీపాలు కంట్లో మండుతున్నట్లనిపించింది. కండ్లు మూసుకున్నారు. ఎంకటిని పిలిచి కరణాన్ని పిలుమని చెప్పారు. ఎంకటి తిరిగివచ్చి కరణం రేపు వస్తానన్నాడని చెప్పాడు. కరణం నెత్తి కెక్కుతున్నాడని గ్రహించారు రెడ్డిగారు. అవసరం ఏర్పడినప్పుడు వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళుపట్టుకున్నాట్ట. తానొక లెక్కా? పని పడింది తనకు. పిలిపిస్తే కరణం ఎందుకు వస్తాడు? తానే వెళ్ళాలనుకున్నారు. ఉదయం అంతా చూస్తుండగా వెళ్ళిందానికంటే ఈ రాత్రే వెళ్ళడం మంచిదనుకునారు. వంకీకి ఉన కర్రనందుకొని బైల్దేరారు. గడీని కాపలా కాస్తున్న యమభటుల్లాంటి పదిమంది రెడ్డిగారిని చూచి సలాములు చేశారు. రెడ్డిగారు గేటుదాటితే ఇద్దరు వారివెంట వెళ్ళారు.
కరణంగారు చుట్ట కాలుస్తూ బయటికి వచ్చి అన్నాడు : "ఓహో దొరవారా? దారితప్పి వచ్చిన్రే! అయినా, దొరలు ఊరికెందుకు వస్తరుగని రాండ్రి కూచోండ్రి."
ఇద్దరూ బల్లమీద కూర్చున్నారు.
ఎలా ప్రారంభించాలో తోచలేదు రెడ్డిగారికి. తాను ముందెందుకడగాలి? అని వూరుకున్నాడు కరణం. కొన్నిక్షణాలు మౌనమే రాజ్యం చేసింది.
'చింతకాయల చోరి ఇన్నరు కద!' రెడ్డిగారు ప్రారంభించారు.
'ఆ. మీరు చెపిన్రా గని. ఊళ్ళ చెప్పుకుంటూంటే ఇన్న.'
మాటలోని వెటకారాన్నీ, కాఠిన్యాన్ని గ్రహించారు రెడ్డిగారు. కానీ, ఏంచేస్తారు? పని తనది.
పెరిగాడు తప్పించుకు తిరుగుతాండిన్నొద్దుల్నుంచి'
'దొర్క పట్టుకొచ్చి చావగొట్టిన్రట.' పూర్తిచేశాడు కరణం. ఆ ప్రవర్తన వింతగా ఏమీ తోచలేదు రెడ్డిగారికి.
'చంపాల్నని కొట్టిన్రనుకున్రా, దెబ్బ ఆయుపట్టు...
'ఆవు. ఖతల్ ముకద్దమే (ఖూనీ కేసు).'
'చాకలాన్ని చంపినందుకు నాకు పాసీ (ఉరిశిక్ష) ఏత్తరనుకో. మందెంతా నెత్తికెక్కుతరొ జర ఆలోచించురి. ప్రభుత్వము చేస్తున్నమా? ఇంకేమన్నణా? నేను జేలు పోయిననక ఊళ్ళోళ్ళు నీ మాటింటరా? చేతులుంటారా? నువ్వు ఊళ్ళ ఉండలేస్తవా? ఈ మందున్నరే గట్ల దబాయించి పెట్టినన్ని దినాలే చేతులుంటరు. లేకుంటే నిన్ను నన్ను నవిలి మింగుతరు. నువ్వు గౌండ్లోన్ని ఖతల్చేయించి తోట్ల పాతిపెడ్తే నేనేమన్న మాట్లాడిననా?'
'నేనెక్కడి గౌండ్లోన్ని చంపిన..?' తత్తరపాటుతో అడిగాడు కరణం.
'అవు. చంపలేగని. ఇద్దరు లంబాడోల్లను చంపిస్తె నేనేమన్న అడ్డమొచ్చిన్నా. ఇగ చూడు ప్రభుత్వం అంటే నువ్వు, నేను. ఇద్దరం ఆపస్లో (ఒకరి కొకరు) అడ్డం తగలొద్దు.'
'మరి నేనేమడ్డ మొస్తాన్నా మీకు?'
"ఖతల్ (ఖూనీ) సంగతి పోలీస్‌కు ఇత్తలా (వర్తమానం చేయుట) చెయ్యకుండాలె.'
'నిజామొద్దీన్కు చెప్పురి. నన్నేం చెయ్యకుండాలె.'
'పెద్ద మనిషని నీతాని కెందుకొచ్చినట్లు? నువ్వెదంటే అదిస్త.'
'ఏమిస్తరు?' ఈ మాట కోసమరే ఎదిరి చూస్తున్నాడా అన్నట్లు అడిగాడు.
"నాతానున్న దేమన్న అడుగు ఇస్త!"
వాయిద (వాగ్దానం) తప్పరు గద!"
"ఎప్పుడన్న వాయిద తప్పిన్నా?"
"నిజంగనా?"
"నిజంగ!"
"నాకు పైకమొద్దు. జమీనొద్దు (భూమి వద్దు) ఇంకేమన్న అడుగుత ఇస్తరా?"
"ఇస్తనన్న గద. ఎన్నిసార్లనమంటవ్?"


