Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 31

    "కరణం మంగమ్మంటే?"
    "మన కరణం పెండ్లం!"
    "వెంకట్రావుగారి భార్యా?"
    "అవు!"
    "పిచ్చిదెందుకైంది?"
    'గదంత శాన పెద్ద కతలే, తింటుండు, చెప్త' అంది. ఇద్దరూ గదిలో ప్రవేశించారు. పాణి ఫలహారం చేస్తున్నంతసేపు కథ చెప్పింది వనజ.
    కరణం తండ్రి యతీంద్రరావుగారు గౌరవ కుటుంబపు ఆడపడుచు అయినా మంగమ్మనిచ్చి పెండ్లి చేశారు వెంకట్రావుకు. పెండ్లిండ్లు సాధారణంగా బాల్యంలో జరిగేవి. పిల్లా, పిల్లవాడు డేగాటకు(దండాడింపు) సరిపోయున వయసులో ఉండాలనుకునేవారు వధూవరుల తల్లిదండ్రులు. మంగమ్మ సుందరి. సాధు స్వభావురాలు. వెంకట్రావు మీసకట్టు రాకముందే పోకిరి తిరుగుళ్ళు ప్రారంభించాడు. ఎప్పుడూ బోగందాని ఇంట్లోనే కనిపించేవాడు. అంతే కాదు-గోడలు దూకి తన్నులు కూడా తిన్నాడు కొన్నిసార్లు. మంగమ్మ ఆలస్యంగా రజస్వలైంది. ఆవిడ సుకుమారమైన శరీరంగలదేకాక, ఆవిడ హృదయం సహితం కుసుమ సుకుమారమైంది. ఆచారం ప్రకారం శోభనం ఏర్పాటు చేశారు. మంగమ్మకు మొగుణ్ణిచూస్తే మొదట నుంచే వణుకు, శోభనపు గదిలో ప్రవేశించిన వెంకట్రావును చూచి బెదిరిపోయింది మంగమ్మ. కరణం బాగా తాగాడు. కళ్ళు ఎర్రవారినాయి. అందమైన మంగమ్మ అతన్ని అంధున్ని చేసింది. ఆమెను కౌగలించుకొన్నాడు. పాడు సారాయి వాసన. విడిపించుకోవటానికి ప్రయత్నించింది. విఫలురాలయి కేకలు వేసింది. కాని, ఆమెను రక్షించడానికి వచ్చినవారు కనిపించలేదు. 'అరుస్తన్నవులే' అని వెంకట్రావు ఆమెను మరీ గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆడది అంటే ఆటవస్తువు అని అతని అనుభవం. ఆడదానికి హృదయం ఉంటుందని అతనికి తెలియదు. అసలు ఆడది జంగమం అని కూడా తెలీదేమో!
    తెల్లవారింది. మంగమ్మ రాలిపోయిన పూవులా వాడిపోయింది. ఆమెను చూచి అంతా ఆశ్చర్యపడ్డారు. కొందరు వెంకట్రావునూ, కొందరు మంగమ్మనూ దూషించారు. వెంకట్రావును చూచి సింహాన్ని చూచిన లేడిలా వణికిపోయింది మంగమ్మ.
    మూడు రాత్రులు గడిచినాయి.
    పూర్తిగా పాలిపోయింది మంగమ్మ.
    తల్లిదండ్రులకేకాక అందరికీ అది విపరీతం అనిపించింది. అంతా ఆచారాలకు లొంగాల్సే వచ్చింది.  వెంకట్రావు ఇంట్లో సహితం మూడు రాత్రులు గడిచాయి.
    మంగమ్మ బాగా నీరసించిపోయింది. తల్లిదండ్రుల గుండెలు "డక్కు" మన్నాయి. మంగమ్మ తల్లిగారింటికి వెళ్ళింది. మందులూ, మాకులూ ఇప్పించడమే కాక, మంత్రాలూ, తంత్రాలూ కూడా చేయించారు. మంగమ్మ కొద్దిగా కోలుకుంది. అత్తవారింటికి పంపుతానంటే హడలిపోయింది. అయినా అత్తవారింట్లో వదలివెళ్ళాడు తండ్రి. నరకంలో కాపురం పెట్టినట్టుంది మంగమ్మకు. తప్పుకొని ఎక్కడెక్కడో పడుకునేది. అయినా, వెతికి పట్టుకునేవాడు వెంకట్రావు. పశువులా ప్రవర్తించేవాడు. ఇటు యతీంద్రరావుగారికీ, అటు మంగమ్మ తల్లిదండ్రులకూ గుండెమీద కుంపటిలా తయారైంది వ్యవహారం.
    ఒకరాత్రి కాళ్ళు పట్టుకొని ఏడ్చింది మంగమ్మ.
`    తన్ని వెళ్ళిపోయాడు ఇంట్లోంచి వెంకట్రావు.
    యతీంద్రరావుగారు మంగమ్మను పుట్టింటికి పంపించారు.
    వెంకట్రావుగారి జీతగాడు వీరిగాడు పెండ్లిచేసుకొని పెండ్లాంతోకూడా వచ్చాడు స్వామికి దండం పెట్టటానికి. వీరిగాని పెండ్లాం పుల్లిని చూచి కన్ను కుట్టింది కరణానికి. "చక్కని చుక్కను కట్టుకున్నావురా" అన్నాడు. గౌండ్ల పుల్లి తలవంచుకుంది. నాటినుంచే దానివెంట పడ్డాడు. వారిద్దరి మనసులూ కలిశాయి. వీరిగాడు లేనప్పుడల్లా గుడిసెకు వెళ్ళి వస్తుండేవాడు కరణం. గర్భవతి అయింది పుల్లి. కరణం వస్తున్నాడని కనిపెట్టాడు వీరిగాడు. పిల్లిని చావబాదాడు. కరణం కొలువు చాలించుకున్నాడు.
    తెల్లారి గౌండ్ల పుల్లి కరణం ఇంటికి వచ్చేసింది. వీరిగాడేమైనాడో తెలియలేదు ఊరివాళ్ళకు. నక్కలు బొందతోడి శవాన్ని తింటుంటే చూశాడొకడు. ఊరంతా చాటించాడు. పుల్లి కరణం ఇంటికి రావడాన్ని బట్టి కరణమే వీరిగాన్ని చంపాడని గ్రహించినప్పటికీ మాట్లాడే ధైర్యం లేకపోయింది ఎవ్వరికీ.
    మంగమ్మకు జ్ఞానం వచ్చింతర్వతః తల్లిదండ్రులుండమన్నా తల్లిగారింట్లో ఉండనన్నది. "వాడి కంటపడితే చస్తావు-వద్దు" అన్నాడు తండ్రి. అయినా వినలేదు. మొండిపట్టు పట్టింది. కోపం వచ్చింది తండ్రికి. ఒంటిగానే పంపించాడు అత్తవారింటికి.
    చీకటి పడింతర్వాత చేరింది బండి వెంకట్రావుగారింటికి. బండిదిగి లోపలికి ప్రవేశిస్తే కరణం కౌగిలిలో ఉన్న పుల్లి కనిపించిందావిడకు. అది చూచి కెవ్వున కేకపెట్టి పడిపోయింది మంగమ్మ. కరణం వచ్చి బాదాడు.  దెబ్బలుతింటూంటే "హ,హ,హ,హ" అని నవ్వుతూ పుల్లిమీద పడ్డది మంగమ్మ. పిచ్చికుక్కలా రక్కింది, కొరికింది, గీరింది. అంత బలహీనురాలిని సహితం బలవంతులైన ఇద్దరూ ఎదిరించలేకపోయారు. ఎలాగోలాగు ఇద్దరూ మంగమ్మను లాక్కుపోయి బయటవేసి తలుపు వేశారు
    "అంత దగా అంత దగా" అంటూ ఊరిమీదపడింది. నాటినుంచి కరణం ఇల్లు తొక్కలేదు. తండ్రివచ్చి తీసికెల్తానంటే గిచ్చుతుంది, కొరుకుతుంది. బలవంతంగా తీసికెళ్ళాడొకసారి. పారివచ్చింది అక్కణ్నుంచి.
    నాటినుంచి ఊరిమీద పడి తిరుగుతూంది. ఇష్టం వచ్చిన ఇంటికి వెళ్ళి "అన్నం పెడ్తారా, అందరూ పోతారా?" అంటుంది. ఎవరింటికి ఏవేళ వెళ్ళినా అన్నం పెడతారు. కరణం కనిపిస్తే దూరంగా నుంచొని చూస్తుంది.
    కొన్నాళ్ళనుంచీ ఈ కుక్కసైతం ఆవిడ వెంటనే ఉంటూంది. అది ఎక్కడినుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు.
    తాయారు గౌండ్ల పుల్లి కూతురు. తండ్రి వీరిగాడో, వెంకట్రావో ఎవరికీ తెలియదు.
                                                 18
    మంజరికి స్పృహ వచ్చినమాట వాస్తవమేకాని, మనిషి పూర్తిగా మారిపోయింది. అమాంతంగా పది సంవత్సరాలు పైన పడినట్లయిపోయింది. పాణి వనజకు అడ్డువచ్చి దెబ్బలు తినడాన్ని తల్చుకున్నప్పుడల్లా ఆమె గుండెల్లో బల్లాలు గుచ్చుకున్నట్లవుతూంది. అలా అయినప్పుడల్లా సత్తువ జారిపోయినట్లు అవుతూంది. పాణి వనజను ప్రేమించాడా?
    మర్రిచెట్టు
    జోరున వాన
    తాను, పాణి...
    అదేమిటి? అలా ఎందుకు పల్కరించాడు తనను? విజయదశమినాడు తన కళ్ళల్లోకి అలా ఎందుకు చూచాడు? అవును-అతడు ప్రేమించాడు. అయితే, వనజకు అడ్డుపడి దెబ్బ లెందుకు తిన్నాడు? అవును. ఎందుకు తిన్నాడు? ఎందుకు తిన్నాడు? అది తల్చుకుంటే ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటూంది. జుట్టు పీక్కోవాలనీ, తల మంచానికి కొట్టుకోవాలనీ అనిపిస్తోంది.
    ఆడది దెబ్బలు పడ్తుంటే ఆదుకొన్నాడు. తప్పా? అవును, తప్పేం? అబ్బ! ఎంత మెత్తని గుండె గలవాడు? ఒక ఆడదానికోసం అది అతనికేమౌతుంది అడ్డు తగిలి దెబ్బల్తిన్నాడే? ఎంత మంచివాడు! అల్లాంటివాణ్ని ప్రేమిస్తోంది తాను. ఆమె గర్వంతో పొంగిపోతూంది.
    వెంటనే పాణిని లేవదీసి చెయ్యి పట్టుకొని తీసుకొని వెడుతున్న వనజ కనిపిస్తే గుండు గుండెలోంచి దూసుకొని పోయినట్లనిపించేది.
    మళ్ళీ కోపం, దుఃఖం, చిరాకు, వనజ....వనజ....వనజ....పళ్ళు పటపటా కొరికింది. వనజ పీక నులిమేస్తే? వనజను తరిమేస్తే? పాణి సరసన నుంచొని వనజను ఏడిపిస్తే ఎంత బావుండును! వనజను మసి చేయాలి. ఎందుకూ - పాణి నడిగేస్తే? పాణి ప్రేమిస్తున్నానంటే మాత్రం! ఎలా? తన తండ్రి, తల్లి, బంగాళా, దాసదాసీలు, సౌఖ్యం ఇవన్నీ అవసరమా! ఇవన్నీ ఉన్నాయిగా ఇప్పుడు? మరి సౌఖ్యం ఏది? ఆనందం ఏది? మరి అవెక్కడ ఉన్నాయి? పాణి దగ్గర, పాణి...తండ్రి....పాణి....తండ్రి. తండ్రి ఒప్పుకుంటాడా?
    అడుగుల చప్పుడు విని మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది మంజరి. వైద్యున్ని తీసుకొని తండ్రి ప్రవేశించాడు. మంజరి స్థితి చూస్తే వైద్యునికే భయమైంది. నాడి చూచాడు. జబ్బేమీ కనిపించలేదు. నీరసంగా ఉంది. నీరసం రోజు రోజుకూ పెరుగుతూంది. తన మందులు పనిచేయడంలేదు. అతనికేమీ అర్ధం కాలేదు జబ్బు.
    "నిద్రొస్తున్నదా?" అడిగాడు వైద్యుడు.
    తల ఊపింది వస్తున్నదన్నట్లు.
    "ఆకలి అవుతున్నదా?"
    తల ఊపింది అవుతున్నదన్నట్లు.
    "కాళ్ళు, చేతులు గుంజుతాయా?"
    తల అడ్డంగా ఊపింది.
    కళ్ళు చూచాడు. నాలుక చూచాడు. అయినా, ఏమీ అర్ధంకాలేదు. సానమీద కుప్పె అరగదీసి, గిన్నెలోకి కలిపి తాగించాడు. కష్టంగా మింగింది. చేదు!
    వైద్యునితోపాటు రెడ్డిగారూ నడిచారు కొంత దూరం. మౌనంగా నుంచున్నారిద్దరూ. "దొరవారూ! ఈ రోగం నాకేమీ అంతు చిక్కటం లేదు" అని వైద్యుడనేసరికి రెడ్డిగారి గుండె జల్లుమంది. శాల్మలీకంద కందాళ ప్రసన్న వెంకట వరదాచార్యులవారి వైద్యం ఆ చుట్టుపట్ల ప్రఖ్యాతం అయింది. ఆయన నాడి చూచి సర్వం చెప్పగలడనీ, ఆయనిది అమృతహస్తమనీ ప్రఖ్యాతి. పెద్ద పెద్ద సన్నిహిత వ్యాధులూ, పక్షవాతాలూ కుదిరించాడాయన. అల్లాంటివాడు తనకు వ్యాధి అర్ధంకాలేదంటే- అదీ వైద్యుడు గుండె జల్లుమనడంలో అబ్బురం లేదు.

 Previous Page Next Page