"ఏమిటి అబ్బాయిగారు చాలా హుషారుగా వున్నారు? సీత అడిగింది మంచం మీద కూర్చుంటు.
"ఇది అల్లాటప్పా విషయమా!" అన్నాడు రామకృష్ణ దొంగపిల్లా నీ విషయం నాకు తెలిసిందిలే అన్నట్లు ఫోజు పెట్టి.
"ఏ విషయం?" అంది సీత.
సీత చెపుతుందేమో అని అప్పటిదాకా చూశాడు రామకృష్ణ. అలాంటి పిచ్చిపని చేయలేదు సీత. అందుకని చూసి చూసి వేచి వేచి యింక రామకృష్ణ రంగంలోకి దిగాడు.
నీవు చేపుతావనుకుంటే నాచేత చెప్పిస్తావేమిటి సీతా?" అన్నాడు రామకృష్ణ.
"నేను చెప్పటం ఏమిటి?"
"అబ్బ ఏమి తెలియనట్లు ఏంటమ్మా?" ముద్దుగా అన్నాడు రామకృష్ణ.
"మిమ్మల్ని చూస్తుంటే నాకో అనుమానం వస్తున్నది."
"ఏమిటి?"
"తీర్ధం ఏమన్నా పుచ్చుకున్నారా అని......"
రామ రామ కృష్ణ కృష్ణ రామకృష్ణ రామకృష్ణ ఎంత మాటన్నావ్ సీతాకుమారీ!నేను ఈ జన్మలో తీర్ధం పుచ్చుకోటమా! అది కలలో మాట. పైగా యిప్పుడు బాధ్యతలు పెరిగాయి. తండ్రిని కాబోతున్నాను....." నోరు జారినందుకు రామకృష్ణ నాలుక కొరుక్కున్నాడు.
"వ్వాట్!" మంచంమీద యింతెత్తున ఎగిరిపడింది సీత.
"అదికాదు సీతా!" రామకృష్ణ ఏదో చెప్పబోయాడు.
"ఎవతది?"
"ఎవరు!"
"అదే మిమ్మల్ని తండ్రిని చేస్తున్న ఆ మహా ఇల్లాలు."
"ఏం జోకు పేల్చావు సీతూ!" అంటూ పడి పడి నవ్వి సీతని దగ్గరకు తీసుకుంటూ "నీవు చెప్పకపోయినా నేను గ్రహించాలే" అన్నాడు.
"ఏమిటి గ్రహించారు?" వ్యంగ్యంగా అడిగింది సీత.
"నేను మగవాడినే కావచ్చు సీతా! అలా అని ఆడవాళ్ళ విషయాలు నాకేం తెలియదని అనుకోకు. నీ విషయం ఈ వుదయమే కనిపెట్టాను. ఈ తియ్యని వార్త నీ నోటివెంట వినిపిస్తావేమో అప్పుడు నేను వెంటనే నిన్ను ఎత్తుకుని గిర గిర తిప్పి స్వీట్ కిస్ యిద్దామనుకున్నాను. పోనిలే సీతా! నాకు తెలిసింది కదా అది చాలు, మరీ యింత సిగ్గు పడుతున్నావనుకోలేదు. రేపటినుంచీ....."
సీత అయోమయంగ ముఖంపెట్టి నోరు తెరుచుకు వింటూ వుంటే రామకృష్ణ చెప్పుకుపోతున్నాడు. సీత కొద్దిసేపటిలో తెలివి తెచ్చుకుని "ఆగండాగండి" అంది.
రామకృష్ణ ఆగాడు.
"నా విషయం మీరు గ్రహించారన్నమాట!"
"ఓ....." అన్నాడు రామకృష్ణ.
"ఎలా! ఎలా గ్రహించారు?"
"ఆ మాత్రం తెలుసులేవోయ్."
"అదే ఎలాగో చెప్పరా!" ముద్దుగ అడిగింది సీత.
పెళ్ళాం ముద్దుగ అడిగితే విషయం చెప్పని మొగుడుంటాడా?
"ఉదయం నీవు......"
"ఊ..... ఉదయం నేను......"
"తొందరపడకు చెపుతున్నా కదా? ఉదయం నీవు పుల్లమామిడి ముక్కలు పర పర నమిలి తినటం చూశాను. నీవు తింటుంటే నా పళ్ళు పులిశాయి అనుకో! కడుపుతో వున్న వాళ్ళే కదా పుల్ల పుల్లనివి తింటారు! ఈరోజు అయినా నేను చూశా కాబట్టి సరిపోయింది. నీవు నాలుగు రోజులబట్టి వంట్లో సరిగా లేదని చెపుతూనే వున్నావ్. నేనే గ్రహించలేకపోయాను. సీతా! నీవు చాలా విషయాలలో డేరింగ్ గ వుంటావు గాని ఈ విషయం నాతో చెప్పలేకపోయావు అవునా?" రామకృష్ణ గొప్ప సత్యం కనిపెట్టిన వాడిలా అన్నాడు.
"చూడండి రామకృష్ణ పరమహంసగారూ!" అంది సీత.
"ఆయనెవరు?" అన్నాడు రామకృష్ణ.
"మీరే. మీ పరిశోధనకి మెచ్చి పరమహంస బిరుదు నేనే యిచ్చాలెండి."
"ధన్యుడను మనోహరీ! ధన్యుడను. తండ్రిని కాబోయే ఈ శుభ సమయంలో...."
"ఆపండి. ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగంలా వుంది."