ఇప్పుడేం చెయ్యాలి?
ఇన్నిటికి గౌతమ్ ఏ ఊరు వెళ్ళాడు?
ఎందుకు వెళ్ళాడు?
ఎప్పుడు వచ్చేదీ చెప్పలేదు. రెండు మూడు రోజులు పట్టవచ్చునన్నాడు.
అందువల్లనే తను నోరు తెరవలేకుండా ఉంది.
గౌతమ్ ఆ పని చెయ్యలేదు__చెయ్యడుకాక చెయ్యడు___అని తనకు తెలుసు.
అంతేకాదు, అలాంటి వ్యక్తే మరొకడు ఉన్నాడని తనకు తెలుసు. అతణ్ణి పట్టుకుంటేగాని గౌతమ్ నిరపరాధి అని నిరూపించే అవకాశం ఉండదు.
అతణ్ణి పట్టుకోవడం ఎలా? అతడి ఉనికి తెలుసుకోవడం ఎలా?
ఇందుమతి బుర్రలో ఓ ఆలోచన తళుక్కున మెరిసింది.
చివ్వున లేచింది.
బయటికి వెళ్ళడానికి ముస్తాబవుతున్న ఇందుమతి దగ్గరకు వచ్చినిలబడింది వంటమనిషి.
"మళ్ళీ ఎప్పుడొస్తారమ్మా?" అని అడిగింది.
"ఏం? ఎందుకూ?
"అమ్మగారు మిమ్మల్ని క్యారియర్ తీసుకొని ఆసుపత్రికి రమ్మన్నారు.
"ఇప్పుడేం క్యారియర్?"
"ఇప్పుడు కాదమ్మా___మధ్యాహ్నం అన్నది వెంకటమ్మ.
"ఆ విషయం నాకు తెలుసులే." విసుగ్గా అంది ఇందుమతి.
"టిఫిన్ చెయ్యరా?"
"చెయ్యను." కరెక్ట్ గా అనేసింది ఇందుమతి.
"నన్ను క్షమించండమ్మా!"
ఇందుమతి చివ్వున తల తిప్పి వంటమనిషిని ప్రశ్నార్ధకంగా చూసింది.
"అమ్మగారు బలవంతం చేస్తే చెప్పానమ్మా!"
"ఏమిటి?" ఏదో ఆలోచిస్తూ యాంత్రికంగా అడిగింది ఇందుమతి.
"అదే......గౌతమ్ బాబు...."
"ఓ.....అదా? ఇన్నిటికీ నువ్వు నిజమే చెప్పావా? లేక రవి పన్నిన ప్లానా ఇది?"
"అయ్యో అదేంటి తల్లీ. గౌతమ్ బాబంటే నాకెంతో ఇష్టం. నోరారా పలకరించేవాడు. చాలా మంచివాడమ్మా ఆ బాబు అలాంటి వాడు కాదమ్మా.
ఇందుమతి ఆశ్చర్యంగా చూసింది.
"స్వయంగా అంత ఘోరం చెయ్యడం చూసిన దానివి అలా అంటావేం?" సాలోచనగా అన్నది ఇందుమతి.
"అదేనమ్మా అర్ధం కావడం లేదు. ఆ బాబుకు ఎవరో ఏదో చేశారమ్మా!"
"అంటే?"
"గిట్టనివాళ్ళు ఏ గాలినో ఆ తండ్రిమీదకు వదిలారమ్మా!" అన్నది వెంకటమ్మ.
"గాలా?"
"అదే తల్లీ! మీరు నమ్మరుగాని, ఉన్నయ్యమ్మా, ఉన్నయ్యి."
"ఏమిటన్నయ్య?" చిరాగ్గా అంది ఇందుమతి.
"అదేనమ్మా___మంత్రాలూ దయ్యాలూ-ఎవరో బాబూ మీద బాణామతి చేయించి ఉంటారమ్మా!" వంటమనిషి కంఠంలో నిజాయితీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అందువల్ల ఇందుమతికి ఆమె మీద కోపం రాలేదు.
గౌతమ్ ఇంత చెడ్డపని చేస్తాడని నమ్మలేని అమాయకురాలు అలా అనుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదనిపించింది ఇందుమతికి.
ఆమెకు వంటమనిషితో ఆ విషయం మీద చర్చ పెంచడం ఇష్టం లేదు. మరోసారైతే బాణామతి మీదా, మంత్రతంత్రాల మీదా వంటమనిషిని కూర్చోబెట్టి ఓ గంట సేపయినా లెక్చరిచ్చి ఉండేది.
ఇందుమతి "నేను త్వరగానే వస్తాలే" అంటూ బయటికి నడిచింది.
ఇందుమతి ఆటో దిగి గబగబా లోపలకు వెళ్ళింది. ఇల్లంతా హడావిడిగా ఉన్నట్టుంది. పనివాళ్ళు హడావిడిగా తిరుగుతున్నారు.
పోర్టికోలో డాక్టర్ బాగ్ ను పట్టుకొని రవీ, అతడి వెనక హార్ట్ స్పెషలిస్టు పి.ఆర్. రావు ఎదురయ్యారు.
ఆమె బొమ్మలా నిల్చుండిపోయింది.
రవి డాక్టర్ను సాగనంపుతూ కార్లోకి వంగి "భయం లేదు కదా?" అన్నాడు.
"ప్రాణ భయం లేదు. హార్ట్ బాగా ఉంది. కేవలం షాక్ వల్లనే ఆమె అలా అపస్మారకంలో పడిపోయారు. ఆమె మనసు లోతుగా గాయపడింది. ఆమె ను జాగ్రత్తగా చూసుకోండి. స్పృహ వచ్చినప్పుడు ఏ అఘాయిత్యానికైనా పాల్పడే అవకాశం ఉంది."
"అలాగే డాక్టర్."
"ఐ యామ్ సారీ రవీ! ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు." డాక్టర్ దించిన కారు అద్దం మీద ఉన్న రవి చేతిని తడుతూ అన్నాడు.
రవి ముఖం విచారంగా పెట్టాడు.
"గౌతమ్ అలాంటి పనిచేశాడంటే నేను మాత్రం నమ్మలేకుండా ఉన్నాను. ఇదేదో అతడి మీద చేసిన కుట్రగా నాకు అనిపిస్తోంది.
రవి విచార భారంతో తల వంచేశాడు.
కరు వెనగ్గా నిల్చున్న ఇందుమతికి డాక్టర్ మాటలు వినిపించాయి.
రవి ముఖం చూస్తుంటే ఆమె ఒళ్ళు మండిపోయింది. అంతా 'నటన' అనుకుంది.
కారు సాగిపోయింది.
రవి తల దించుకుని ఇందుమతి ఎదురుగా రెండు నిముషాలు నిల్చున్నాడు. ఇందు అతడ్నే పరిశీలనగా చూసింది.
రవి నిజంగా బాధపడుతున్నాడా?
ఎందుకు?
అన్న ఇంత పని చేశాడనే భావంతో బాధ పడుతున్నాడా?
లేక తన భార్యకు జరిగిన అన్యాయనికి కుంగి పోతున్నాడా? హుఁ! భార్య! అరుణకు జరిగిన దారుణానికి అతడు బాధపడ్తాడంటే తను నమ్మదు.
దారుణం! తను దారుణంగా ఆలోచిస్తోంది. ఎంత లేదన్నా అరుణ అతడి భార్య. ఆమె గర్భంలో తన ప్రతిరూపం జీవం పోసుకుంటోంది.
"ఇందూ!"
ఇందుమతి మౌనంగా తల ఎత్తింది.
"లోపలకు రా!"
అతడి వెనకే లోపలకు నడిచింది.
రవి హల్లో సోఫాలో కూర్చుంటూ "కూర్చో!" అన్నాడు.
"నేను అర్జంటుగా ఆంటీతో మాట్లాడాలి."
"అమ్మ స్పృహలో లేదు. ఇప్పుడప్పుడే స్పృహ వచ్చే సూచనలు కూడా లేవు. కొడుకు చేసిన దారుణానికి ఆమె మనసు తట్టుకోలేక పోయింది. ఆమె దాదాపు చావుబతుకుల్లో ఉంది. డాక్టర్ ఈ రాత్రి గడిస్తే గాని చెప్పలేనంటున్నాడు."
"నో! నో! ఆమె బతకాలి. బతికితీరాలి." ఆక్రోశించింది ఇందుమతి.
రవి ఆమె ముఖంలోకి వింతగా చూశాడు.
"రవీ!"
"రవీ!"
"చెప్పు!"
"ఆంటీ బతకాలి."
"నేను చచ్చిపోవాలంటున్నానా?" తీవ్రంగా ఉంది రవి కంఠం.
"సారీ! నా ఉద్దేశం అది కాదు రవీ. నన్ను అర్ధం చేసుకో ఇంత దారుణం గౌతమ్ చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా?"
రవి మాట్లాడలేదు. నెల చూపులు చూస్తూ కూర్చున్నాడు.
"చెప్పు రవీ!"
"నమ్మలేకుండా ఉన్నాను. అన్నయ్యలాంటి వాడు అలాంటి నీచమైన పని చెయ్యడు. పైగా తన తమ్ముడి భార్యమీద దౌర్జన్యం చస్తే చెయ్యడు.