ఆనాడు పొలాల దగ్గరికి వెళ్ళినా, వీధిలో పంచాయితులు విన్నా అతనికి ఏవీ అర్ధం కాలేదు. ఆ రాత్రి సుమతిని అడిగేయ్యాలి. అది ఒక్కటే అతని మనసులో మసులుతుంది. అందుకు ఆ రోజంతా సిద్దం అయినాడు.
ఆ రాత్రి గదిలోకి పోయాడు.
సుమతి మెరిసిపోతుంది. ఏదో కొత్త సిగ్గు ఆమెను ముంచెత్తుతుంది. గదిలో అడుగుపెట్టగానే అడిగింది . "ఒక ముచ్చట చెప్పనా?"
రామయ్య గుండె దడల్లుమన్నది.
ముఖం పాలిపోయింది. "చెప్పు" అన్నాడు.
"కూచోండి'
కూర్చున్నాడు కాని ఏమి చెపుతుందోనని గుండె దడదడలాడింది. మంగమ్మ ముచ్చట కాదుకదా! మంగమ్మ వూరికి వస్తుందంటే ఆమె విషయమే చెప్పుకుంటుంది ఊరంతా . ఈమె దాకా రాలేదు కదా!
"మంచి ముచ్చట"
'చెప్పు' ఆ సిగ్గేమితో అర్ధం కాలేదతనికి.
'ఎట్ల చెప్పాలె' ఆమె తలవంచుకొని అన్నది.
ఈ తడవ ఆశ్చర్యపోయాడు రామయ్య.
'ఎందుకట్ల సిగ్గుపడ్తావ్. చెప్పు'
"మీరు తండ్రి కాబోతున్నారు' తలవంచుకొనే చెప్పింది సుమతి.
పిడుగు పడ్డది రామయ్య మీద. "ఏంది?" అడిగాడు ధ్వనిలో ఏదో భయం ఉంది. అనందం లేదు.
తలెత్తి చూసింది. అతనిలోని భయం ఆమెలో ప్రవేశించి , "ఆవు, నిజం, నీలుపోసుకున్న.'
"అట్లనా?" నిరామయంగా అన్నాడు.
"ఎందుకట్లున్నరు?"
"ఎట్లున్న? బాగనే ఉన్నకధ"
"నేనేమన్న తప్పు చేసిన్నా?" గొంతు పూడుకున్నది. కళ్ళలో నీరు నిండింది.
రామయ్య కలవరపడ్డాడు. అడుగుదామనుకున్నాడు.
సుమతి ఏడ్చేసింది.
కన్నీరు కట్టలు తెంచుకుంది. రామయ్య మళ్ళీ ఓడిపోయాడు.
* * *
వీరభద్రం ఊరికి వచ్చాడు. మంగమ్మ తన బిడ్డతో వచ్చింది. మంగమ్మ బిడ్డతో ఊరికి రావడం అదే మొదటిసారి. వీరభద్రం కూడా అదే రావడం మళ్ళీ. వారు ఊళ్ళో అమరవీరుల దినం జరిపించడానికి వచ్చారు. మంగమ్మ రావడంతో జగ్గయ్య ఇంటికి తిరునాళ్ళు సాగింది. మంగమ్మలో చాలా మార్పు వచ్చింది. అబలగా తనను అంతం చేసుకుందామనుకున్న మంగమ్మ కాదు. పట్నం నుంచి విజ్ఞానం మోసుకొని వచ్చింది. ఆమె ముఖంలో ఉత్సాహం ఉంది. కళ ఉంది. కారుణ్యం వుంది. వీరభద్రం ఆమెకు చదువు నేర్పాడు. కొద్దిరోజుల్లోనే చదవనూ, వ్రాయనూ నేర్చింది. పుస్తకాలు ఆమెకు నేస్తాలయ్యాయి. ఇంగ్లీషు కూడా కొంత చదవ నేర్చింది.
ఆమెను చూడవచ్చిన వారంతా ఆమెలోని మార్పును చూచి ఆశ్చర్యపోయారు. ఆమె ఎన్నెన్నో విషయాలను గురించి మాట్లాడుతుంది. అతి సామాన్యంగా మాట్లాడుతుంది. గంబీరంగా మాట్లాడుతుంది. "మనకు వెలుగు చూపారు, మన కోసం ప్రాణాలర్పించారు. వారిని స్మరించుకోవాదం మన విధి. వారి సందేశాన్ని మరిచిపోకుండడం మన కర్తవ్యం. ఈ అమరవీరుల దినం బ్రహ్మాండంగా జరపాలి అని బోధించింది. ఆడవారిలో ఉత్సాహం పొంగింది. , ఏర్పాట్లు ఘనంగా సాగించారు.
"నైజాం నవాబు రోజుల్లో ప్రజలు పశువులుగా పరిగనించబడ్డారు. ఇప్పుడు ప్రజలకు హక్కులు వచ్చాయి . వారే శాసనాలు చేస్తున్నారు. అయితే శాసనసభల్లో నిజమైన ప్రజాపతినిధులు తక్కువ వున్నారు. సరియైన వారిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలమీద వున్నది. మనకు హక్కులు సాధించిపెట్టిన వారు జగ్గయ్య వంటి వీరులు . వారిని స్మరించుకోవడం మన విధి" అని చెప్పాడు వీరభద్రం.
"అది సరేలెండి. దొర భూములు మాకేప్పుడు పంచి పెడ్తారు?" అడిగాడు మల్లయ్య.
"ఒకరు పంచేదేమిటి? మనమే పంచుకోవాలి. మన శక్తిని పెంచుకోవాలి"
"పెరుగుతాదుండి ఈ రామయ్య వంటోడుండంగ మళ్ళీ తుపాకీ పట్టల్నేమో?"
"ఒక్కరోజులో ఏదీ రాదు. ఆకాశం నుంచి ఊడిపడదు. ప్రజలు తమ శక్తిని గుర్తించెట్లు చేయాలి. ప్రజాశక్తి విజ్రుంభించిందా ఆ పరమాత్ముడైనా దిగి రావాల్సిందే! మన వీరులు మనకు ఉత్తేజం కలిగిస్తారు"
వీరభద్రం అమరవీరులను గురించి చెపుతూ ఊరూరికి తిరిగాడు. ప్రజలందరిలో ఏదో ఒక చైతన్యం కలిగించాడు. రానున్న కాలంలో వెలుగుందని భోదించాడు. రానున్న వెలుగునే మనస్సులో నింపుకున్నారు ప్రజలు. ఆ వెలుగులో తమను చూచుకున్నారు. అమరవీరులను చూచారు. అమరవీరుల దినం కనుల పండువుగా జరుపుకోవడానికి కృతనిశ్చయులైనారు.
ఎదిరి చూచిన రోజు రానే వచ్చింది.
ఊరంతా పండుగ పసిడి పులుముకుంది.
ఇండ్లన్నీ అలిగి ముగ్గులు పెట్టుకున్నాడు. తోరణాలు కట్టుకున్నారు. వీదులకేదో కొత్త అందం వచ్చింది. ప్రజల్లో ఏదో అనందం తొంగి చూచింది. ఉదయం పాటలు పాడుతూ ఊరంతా తిరిగారు యువకులు. అసలు సంబరం సాయంత్రం ప్రారంభమైంది. .
ఊరు బయట సభ ఏర్పాటయింది.
ఊళ్ళో నుంచి ఊరేగింపు బయలుదేరింది. ముందు దప్పులు, కొమ్ములు సాగాయి. వెనక నడిచిన జనం పాటలు పాడుతున్నారు. ఆడవారు గుంపులు గుంపులుగా వస్తున్నారు. నినాదాలు చేస్తున్నారు. జనం ప్రవాహంలా సాగిపోతుంది. సభాస్థలికి చేరింది.
సభాస్థలం రమ్యంగా అలంకరించబడింది. వేదికకు బంతిపూల తోరణాలు కట్టారు. పెట్రోమాక్స్ లైట్లు వెలుగుతున్నాయి. మైకులు పాటలు వినవస్తున్నాయి. అనేక గ్రామాల నుంచి డప్పులు, తప్పెట్లతో ఊరేగింపుగా వచ్చి సభాస్థలికి చేరుకుంటున్నారు. సభాస్థలం జనర్ధకం అయిపొయింది. నగరం నుంచి వచ్చిన నాయకులతో మంగమ్మా వీరభద్రం మాట్లాడుకుంటున్నారు. కార్యక్రమం ప్రారంభం అయింది. వీరభద్రాన్ని సభకు అద్యక్షత్వం వహించాల్సిందని కోరాడు మస్తాన్.
సభలో కరతాళధ్వనులు మ్రోగాయి.
వీరభద్రం అధ్యక్షత వహించాడు.
మంగమ్మ సహితంగా పెద్దలంతా వేదిక మీద కూర్చున్నారు.
వీరభద్రం కొత్త దొరలను గురించి మాట్లాడారు. "ప్రభుత్వం దొరలను కొత్త దొరలను నమ్ముతుంది. ప్రజలను వారికి అప్పగించి పరాకు చిత్తగించింది. దొరలు కల్లు, సారాయి ఆశ్రయంగా చేసుకున్నారు. దుండగులను పోషిస్తున్నారు. దుండగులు ప్రజలను నానా హింసలు పెడ్తున్నారు. వారు నేరాలు చేస్తున్నారు. మంచి మీద చేస్తున్నారు. దొరలే మళ్ళీ ప్రభుత్వానికి ఏజంట్లయినారు. వారే హుకూమత్ సాగిస్తున్నారు. మొన్నటి తుఫానుకు కొంపలు కూలినవారు ఏదుస్తుండగా వారి కోసం ప్రభుత్వం ఇచ్చినది ఈ ఏజెంట్లు స్వాహ చేశారు."
"ఆవు! రామయ్య డబ్బు తిన్నడు" అనే కేకలు సభలోంచి వినిపించాయి.
"పేదల కొంపలు కూలుతున్నాయి. కాదు కూలుస్తున్నారు. దొంగ సొమ్ముతో బంగాళాలు కడ్తున్నారు. దోచుకుంటున్నారు. ఆడదాని శీలం సైతం వారికి లెక్కలేదు" మంగమ్మ కాస్త ఉద్రేకంగా మాట్లాడింది.
ఉపన్యాసాల తరవాత బుర్రకధ జరిగింది. సభా కార్యక్రమం ముగిసే వరకు అర్ధరాత్రి అయింది.
ఇంకా సభ జరుగుతుండగానే ఉరికి వచ్చాడు యాదగిరి రామయ్య ఇంటికి. తనుస్తూ చెప్పాడు. "అందరు నిన్ను తిడ్తున్నారు. గుడిసెల కోసం ఇచ్చిన డబ్బు మింగినవట. కక్కిస్త మంటున్రు."
"కుక్కలు శాన మొరురుగుతాయి! శాన బుగులు పద్తున్నట్లున్నవు. ఇదో గ్లాసు గటగటా మింగు" అని గ్లాసు అందించాడు.
యాదగిరి వెర్రిగా రామయ్యను చూశాడు. గ్లాసు ఖాళీ చేసి దగ్గాడు.
"ఏదో గడబిడ అయ్యేటట్లున్నది, మంది ఉడికి పోతాన్రు!"
ఈ తడవ జంకాడు రామయ్య.
"ఏమను కుంటాన్రక్కడ?"
"ఏమంటాన్లెందుండి . దొరల్ను దొంగలంటాన్రు. గుడిసెల డబ్బు మింగినవట. సర్కారుకు గుంజి కక్కిస్తనంటాండను వీరభద్రం.
రామయ్య గుండెలో మరికాస్త భాయం చేరింది. వీరభద్రం శాసనసభలో లేవదీస్తాడేమో ఈ విషయం. కలెక్టరుకు తాను అంగుష్టాలు వేసిన రశీదు లిచ్చి డబ్బు తెచ్చాడు. వాస్తవంగా ఎవరికీ ఇవ్వలేదు. జనం ఇంత తెలిసి మీరరనుకోలేదు. కాక వీరభద్రం మళ్ళీ ఈ ఊరికి వస్తాడనుకోలేదు. మంగమ్మను వెంట బెట్టుకొని పబ్లిగ్గా వచ్చాడు. సిగ్గులేని వాడిని ఏమంటే ఏం లాభం? అసలు వీరభద్రం ఎన్నిక కావడమే తన ప్రాణం మీదకి వచ్చింది. తాను ఏమీ చేయలేకపోతున్నాడు. చేతులు ముడుచుకొని కూర్చోవాల్సి వచ్చింది. ఆలోచనలో మునిగి ఉండగా శేషయ్య వచ్చాడు.
"అబ్బ! మంగమ్మ ఏం మాట్లాడిందుండి. ఏం...."
"ముయ్ నొర్! ఏళ్ళు ఈడనుంచి " కేక పెట్టాడు రామయ్య.