సుమతి మంచంలో ఉంది.
అదోలా చూచిందతన్ని.
రామయ్య కరిగిపోయాడు. మంచం మీద కూర్చున్నాడు. నొసలు తాకుతే వేడిగా ఉంది.
"జ్వరం వచ్చిందా?" అడిగాడు రామయ్య. ధ్వనిలో ఆతురత ఉంది. ఆవేదన ఉంది.
సుమతి చిరునవ్వు నవ్వింది. మళ్ళీ నొసట మీద చేయి వేశాడు. ఆ చేతిమీద సుమతి తన చేయి వేసింది.
"ఎంత చల్లగున్నది నీ చెయ్యి"
"నిజంగానా?"
"అవును, అబద్దం చెపుతానా?"
"వైద్యుణ్ణి పిలుస్త. నిజంగానే జరం వచ్చింది" అని వైద్యుని కోసం మనిషిని పంపాడు. రామయ్య సుమతిని చూస్తూ కూర్చున్నాడు. ఆమె కళ్ళు మూసుకుంది. ఎంత అమాయకంగా ఉన్ది౧ అంత పని చేయగలదా? చ. ఏమిటి తన ఆలోచనలు? అయినా అడగడం మంచిది కాదూ? ఇప్పుడా? ఇప్పుడేనా?
'సుమతీ!"
ఆమె కళ్ళు తెరిచింది. ఒక చిరునవ్వు నవ్వింది. ఏమిటీ? అన్నట్లు చూసింది.
రామయ్య కరిగిపోయాడు. అడగలేకపోయాడు. తికమక పడ్డాడు. అయినా అడిగేశాడు. "రాత్రి అట్ల చేస్తివి?"
చెంపలు జేవురించాయి. కళ్ళలో సిగ్గు తొణికిసలాడింది. ముఖం తిప్పెసుకుంది. మాట్లాడలేదు.
రామయ్యకు అర్ధం కాలేదు. మళ్ళీ అడిగాడు?
ఆమె రెప్పలడించింది. కళ్ళలో భయం, బెదురు కనిపించింది. ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
సిగ్గు.....భయం.....
మళ్ళీ దొంతరలు దొంతరలు సిగ్గు వచ్చింది.
ఇంక రామయ్య అడగలేకపోయాడు. అంతే అయ్యుంటుంది. అంతే అనుకున్నాడు. ఆ విషయం మరిచి పోవడానికి ప్రయత్నించాడు.
"తల నొప్పి గున్నదా?" అడిగాడు.
ఇంతలో వైద్యుడు వచ్చాడు.
"చేయ్యిట్ల ఇయ్యి. నాడి చూడాలే."
గాజులు గలగలలాడేయి.
"చెయ్యి చూడకుండా మందియ్యరాదా?" రామయ్య వైద్యుడ్ని అడిగాడు.
వైద్యుడు బిక్క ముఖం వేసి రామయ్యను చూచాడు. 'అదెట్ల కుదురుతుందండి. నాడి చూడాలే కదా" అన్నాడు వైద్యుడు.
"సరే కానియ్యి , డాక్టర్లయితే చూడరు అందుకని అన్న, జల్ది చూడు."
వైద్యుడు నాడి చూశాడు. నాలుక చూచాడు.
"వళ్ళు తిరిగినట్లుంటదా?"
అవునన్నట్లు తల ఊపింది.
"వాంతి ఆయె టట్లున్నదా?"
"అయిందండీ వాంతి...." రామయ్యే జవాబు చెప్పాడు. సుమతి మాట్లాడలేదు. చూస్తూ ఉండిపోయింది.
"పైత్య ప్రకోపం. బాగా పైత్యం చేసింది. జ్వరం తగిలింది. పైత్య జ్వరం - పైత్యంతకం ఇస్తున్న. తేనెలో కలిపి నాకించాలె. అప్పుడు తగ్గుతుంది. జ్వరం తగ్గటానికి నాలుగైదు రోజులు పట్టది" అని మందిచ్చి వైద్యుడు వెళ్ళిపోయాడు.
వాంతి పైత్యం వల్ల అనే మాట ఎంతో మనశ్శాంతి యిచ్చింది రామయ్యకు. వాంతులు కావూ? అవుతుంటాయి. ఎందుకు కావూ? అనుకొన్నాడు.
జ్వరం మూడు నాలుగు రోజుల వరకు తగ్గలేదు. పెరుగుతుందే గాని తగ్గుముఖం పట్టడం లేదు. సుమతి తండ్రిబెదిరిపోయాడు. రామయ్య అడిరిపోయాడు. మామ తన కూతురును పట్నం తీసికు వెళ్తా అంటే కాదనలేకపోయాడు.
సుమతి పట్నం వెళ్ళిపోయింది.
డాక్టర్లు "టైఫాయిడ్" అన్నారు. రామయ్య కూడా వెళ్ళి చూచివచ్చాడు.
సుమతి జ్వరం తగ్గింది. బాగా నీరాసపడిపోయింది. విశ్రాంతి కావాలన్నాడు డాక్టరు. తన ఇంటికి పంపించవలసిందని కాస్త కోలుకున్నాక పంపిస్తానని రామయ్యను వేడుకున్నాడు సుమతి తండ్రి.
"మా ఇంటి కాడ ఏం తక్కువ ఉన్నది గనక" రామయ్య అన్నాడు. సుమతిని తన ఇంటికే తీసి కెళ్ళాలని ఉందతనికి.
"ఒక్కతే బిడ్డ, గారాబంగా పెంచుకున్న. నవిసిందని అన్న' దీనంగా అన్నాడు తండ్రి.
రామయ్య సుమతిని అడిగాడు.
"మీ ఇష్టం. ఎక్కడుండమంటే అక్కడుంట నాదెంది" అన్నాడు సుమతి.
తండ్రి ముఖం వాడిపోయింది. ఎంత త్వరగా తెంచుకుంటారు బంధం అడపిల్లలు! అనుకున్నాడు. కని పెంచి పెద్ద చేసిన వాణ్ణి ఇట్టే మరిచిపోతారు. క్షణంలో కట్టుకున్న వాడ్ని తన వాణ్ణి చేసుకుంటారు. మెట్టిన ఇంటినే తమ ఇల్లు చేసుకుంటారు. పుట్టిల్లు దూరం అవుతుంది. పరాయి ఇల్లు అవుతుంది. కూతురుతో తన బంధం తెగిపోయినట్లే ఒక అయ్యా చేతిలో పెట్టాడు. అల్లుని ఔదర్యానికై కళ్ళప్పగించి చూడసాగాడు.
ఇక రామయ్య సుమతి మాటలు విని మురిసిపోయాడు. తన అజ్ఞ కోసం ఎదురు చేసే ఆడది దొరికింది. గుండెలో గిలిగింతలు పెట్టినట్లయింది. సుమతి తన ఇంటికి రావాలి. తన లోగిని వైభవం పెంచాలి. తనకూ భార్య ఉంది. తన భార్య తన ఇంటికే రావాలి. అనుకున్నాడు. భార్య అనగానే ఏదో అధికారం వచ్చేసినట్లు.
"అయితే ఇంటికే పోదాం' రామయ్య నిర్ణయం చెప్పేశాడు.
తండ్రి హతాశుడైనాడు.
సుమతి కళ్ళు కన్నీళ్ళతో నిండాయి.
"సరే" అన్నదామె. అక్కణ్నుంచి వెళ్ళిపోయింది. సామాను సర్దుకొనడానికి.
సుమతి తండ్రి సంచి సర్దుకొని చేతికర్ర తీసుకొని వెళ్తున్నానని కూతురితో చెప్పాడు.
సుమతి తండ్రిని కౌగలించుకొని బావురుమంది.
"అమ్మా౧ నీ ఇంటికి నువ్వు పోతున్నావు. ఆడపిల్ల ఎన్నటికైనా అత్తింటిదేనమ్మా! ఏడవకు తప్పు" అని కండువాతో తన కళ్ళు తుడుచుకుంటూ ఓదార్చి బయలుదేరాడు. బయటికి వచ్చి రామయ్య చేతులు పట్టుకొని "అయ్యా! బిడ్డను నీ చేతుల పెట్టిన. ఎట్ల చూచుకుంటవో" అని ఏడ్చేశాడు.
రామయ్య స్థాణువులా నుంచున్నాడు. ఏం చేయాలో అర్ధం కాలేదతనికి.
కండువాతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు వృద్దుడు. చుపందినంత సేపు చూస్తూ నుంచున్నాడు రామయ్య - గుమ్మంలో.
సుమతి రామయ్య ఇంటికి వచ్చేసింది. - తెచ్చుకున్నాడు రామయ్య - రామయ్య ఇంట్లో కొత్త వెలుగు ప్రవేశించింది. సుమతి కొద్ది రోజుల్లోనే రామయ్య ఇంటిని తన ఇల్లు చేసుకుంది. ఇల్లంతా చక్కగా సర్దింది. ఇంటికి కొత్త శోభ తెచ్చింది. ఒక క్రమశిక్షణ ఏర్పరిచింది. పని మనుషులు ఆటలు కట్టాయి. ఆమె ఆ ఇంటికి అధికారిణి అయింది.
ఇంట్లో వసంతం విరిసినట్లు అయింది రామయ్యకు. ఎన్నడూ కనని అనందం అతనిలో పరచుకుంది. అతని బట్టల విషయంలోనూ, భోజనాదుల విషయంలోనూ సుమతి తీసుకుంటున్న శ్రద్ధ అతనికే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకు ఆనందమే కాదు కొంత గర్వంగానూ ఉంది రామయ్యకు.
సాయంకాలం కాగానే పూలు తురుముకుని తాయారు అవుతుంది సుమతి. రాత్రులు గదిలో గంటలు క్షణాల్లో గడిచిపోతున్నాయి రామయ్యను. అడుగు పెట్టగానే ఒక చిరునవ్వు నవ్వుతుంది సుమతి. రామయ్య ఆ చిరునవ్వులో కరిగిపోతాడు. మునిగిపోతాడు. ఉక్కిరిబిక్కిరి అవుతాడు. ఆమె ఏవేవో ముచ్చట్లు చెపుతుంది. నవ్విస్తుంది. రామయ్య పరవశుడు అవుతాడు. తెల్లవారుతుంది. అడుగుదామనుకున్న విషయం అడగలేడు.
తొలిరాత్రి రామయ్య గుండెలో గుచ్చుకున్నముల్లు అలానే వుంది. అప్పుడప్పుడూ అది కెలుకుతుంది. కదిలిస్తుంది. బాధ పెడుతుంది. ప్రతిరోజూ ఆ విషయం అడగాలనే స్థిర నిశ్చయంతో గదిలో అడుగు పెడ్తాడు. రోజూ ఓడిపోతున్నాడు. సుమతి దగ్గర ఏదో మత్తు మందుంది. అలా నమ్మేస్తుందామె అంతే.
కాలం ఆగుతుందా? కరిగిపోతూనే ఉంది.
ఆనాడు అతని గుండెలోని ముల్లు కాస్త ఎక్కువ కెలికింది. అందుకు కారణం లేకపోలేదు. వీరభద్రం ఊరికి వస్తున్నాడు. మంగమ్మనూ, ఆమె కొడుకు ప్రకాశాన్ని తీసుకొని వస్తున్నాడు. ఆ ఊళ్ళో జరాగాల్సిన అమరవీరుల స్మారక దినానికి వారు వస్తున్నారు. ఆ వార్త అతనిలో సంచలనం కలిగించింది. వచ్చేవాడు తన కొడుకు అని ఎక్కడో తన మనసు లాగసాగింది. దాంతో ముల్లు కాస్త ఎక్కువ కెలికింది. సుమతిని ఆ రాత్రి అడిగేయాలనుకున్నాడు. అసలు భోజనాలప్పుడే అడుగు దామనుకున్నాడు. అవకాశం లభించలేదు. పైగా సుమతి కాస్త చిన్న బిచ్చుకొని ఉంది. ముఖం కాస్త వాడిపోయినట్లుంది. అయినా అడుగుదామని చాలా ప్రయత్నించాడు. సుమతికి తన రహస్యం తెలిసిపోలేదు కదా అనుకున్నాడు. దాంతో ఖంగుతిన్నాడు. అడగలేకపోయాడు. అందుకు కూడా మానసికంగా ఎంతో కృంగిపోయాడు. అన్నం తిన్నాననిపించి లేచాడు.