Previous Page Next Page 
షా పేజి 31

 

    సృజన్ హోటల్ గెట్ దగ్గరకు నడిచాడు.
    "ఏయ్" అన్న పిలుపు వినిపించింది. మెత్తగా సన్నగా ........చటుక్కున వెనక్కు తిరిగి చూశాడు.
    కౌంటర్ దగ్గిర నిలబడినప్పుడు తనను చూసి నవ్విన యువతే తనవేపు వడివడిగా అడుగులు వేస్తూ వస్తోంది.
    సృజన్ ఆశ్చర్యంగా ఆమె వేపు చూడసాగాడు.
    అతనికి చాలా సమీపంగా వచ్చి నిలబడిందామే.
    "ఏమిటి......వెళ్ళిపోతున్నావ్.....? అడిగిందామె. అంతకుముందే పరిచయం ఉన్నట్లు.
    సృజన్ తడబాటు కలిగింది. "మీరెవరు.......? అన్నాడు సంకోచంగా.
    "ఎవరయితేనేంలే? నేనడిగినదానికి సమాధానం చెప్పకూడదా?" అడిగిందామె కవ్వింపుగా నవ్వుతూ.
    "రూమ్ కోసం వచ్చాను లేదన్నారు."
    "రూమ్ నిజంగా కావాలా నీకు?"
    "అంటే?"
    "అంటే....నిజంగా రూమ్ కోసమే ఈ హోటల్ కొచ్చావా అని......"
    "లేకపోతే ఇంక దేనికోసం వస్తాను."
    "ఇంకా చాలా వాటికోసం రావచ్చు కదా!"
    సృజన్ కి ఆమె మాటలు అర్ధమయాయ్. అతని ముఖం సిగ్గుతో ఎర్రబడింది. కొంచెం కోపం కూడా వచ్చింది.
    "నేను మాత్రం రూమ్ కోసమే వచ్చాను" అన్నాడు. విసురుగా అనేసి తన దారిన తను వెళ్ళిపోబోయాడు.
    "ఇంకోచోట రూమ్ ఇప్పిస్తాను కావాలా........?" అడిగిందామె వెనుకనుంచి.
    మళ్ళీ వెనక్కు తిరిగాడు సృజన్ "ఎక్కడ?"
    "ఈ స్ట్రీట్ లోనే ......? అప్పలమ్మ సత్రం అని ఒకటుంది. ఈ హోటల్ కంటె బాగానే ఉంటాయ్ లే ఆ రూమ్ లు.......మళ్ళీ కవ్వింపుగా నవ్వుతూ అందామె.
    "అక్కడ అద్దె ఎంత?"
    "నాతొ కలిసా? నేను లేకుండానా?" మళ్ళీ కవ్వింపు.
    సృజన్ అదిరిపడ్డాడు. తను అనుమానించినంతా అయింది. ఈ అమ్మాయి అందుకోసమే తనవెంట పడింది.
    "నువ్వూ అక్కర్లేదు నీ రూమూ "అఖ్ఖార్లేదు" అనేసి మళ్ళీ నడవబోయాడు.
    "అబ్బో! చాలా పాతివ్రత్యం ఉన్నట్లుందే నీకు........" నవ్వుతూ అందామె. రెండడుగులు వేసి చటుక్కున ఆగిపోయడతను. ఈ యువతికి  ఈ హోటల్ వాళ్ళకూ ఏవో సంభంద బందావ్యాలున్నట్లున్నాయ్.......అంచేత తన అన్నయ్య గదిలో కెళ్ళటానికి ఈమె ఇన్ ఫ్లియేన్స్ ఏమయినా ఉపయోగపడుతుందేమో.....? ఆమె అతనిని చూసి కొంచెం గట్టిగా నవ్విందీసారి.
    "మనసే మారేనా? తానే మారేనా" అంటూ పాడింది చిలిపిగా.
    సృజన్ ఆమెకు సమీపంగా నడిచాడు.
    "నువ్వో సహాయం చేయగలవా?" అడిగాడతను.
    "ఏమిటో అది"
    "ఈ హోటల్లోనే నాకు రూమ్ ఇప్పించగలవా?"
    "ఎందుకు? ఎక్కడయితేనేం.......? అప్పలమ్మ రూమ్స్ నిజంగా చాలా బాగుంటాయ్, ఫామిలీ రూమ్స్ లా గుంటాయ్."
    "నాకు ఇక్కడే కావాలి? ఇప్పించగలవా? ఇప్పించేట్లయితే నీకు డబ్బిస్తాను."
    "ఎంతిస్తావ్?"
    "పాతికరూపాయలిస్తాను"
    ఆమె మళ్ళీ నవ్వింది.
    "నీ సంగతి నాకు తెలుసులే.......! రూమ్ ఇప్పించాక పాతిక ఇచ్చి నన్నోదిలించుకుని ఇంకొక దాన్ని పిలుచుకోవాలను కుంటున్నావ్........? కదూ?"
    సృజన్ కీ నవ్వూ కోపమూ రెండూ వచ్చినాయ్.
    "నిజంగా చెపుతున్నాను. నాకు అమ్మాయిలు అవసరం లేదు."
    "అయితే ఇంకా రూమెందుకు నీ ముఖానికి, నీలాంటి పతివ్రతాగాడూ ఎక్కడ ఏ రోడ్ మీద పడుకున్నా ఫర్లేదు. వెళ్ళేళ్ళు-----"
    సృజన్ చకచకా ఆలోచించాడు.
    తను ఈ యువతినే మంచి చేసుకుంటే తప్ప తను అనుకున్న విధంగా తన అన్నయ్య గదిని చూడటం కుదరదు. ఈ అమ్మాయి చిరాకుపడి వెళ్ళిపోయిందంటే తనకున్న ఒకే ఒక్క అవకాశం కూడా పోతుంది.
    "సరే! రూమ్ ఇప్పిస్తే ఇద్దరం ఉందాం! ఇప్పిస్తావా మరి?" అడిగాడతను.
    "అలారా దారికి! అమ్మాయిలంటే తెలీదన్నట్లు పతివ్రతా ఫోజులు పెడతావెందుకు? పద! అప్పలమ్మ సత్రానికి కెళ్దాం" అతని చేయి పట్టుకుని బయటకు లాక్కెళ్ళబోయింది.
    "ముందు చెయ్యి వదులు" విదిలించి కొడుతూ అన్నాడు సృజన్.
    "మళ్ళీ ఏం రోగమొచ్చింది ? ఇప్పుడేగా ఒకే అన్నావ్?" చిరుకోపంతో అడిగిందామె.
    "నా కిక్కడే రూమ్ కావాలని ముందే చెప్పాను--"
    "ఎక్కడయితేనేం నీకు?"
    "నా కిక్కడే కావాలి" మొండిగా అన్నాడు సృజన్.

 Previous Page Next Page