Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 31

 

    అతన్ని దహించేస్తున్నట్లుగా చూసింది సరోజ. అతని నాటకం ఆమెకి అర్ధం అవుతూనే ఉంది.


    నవ్వుకుంటూ ఇంకో కస్టమర్వైపు తిరిగాడు దుకాణంవాడు.


    ఒక్క క్షణంలో ఒక నిర్ణయానికోచ్చేసింది సరోజ. చటుక్కున డబ్బాని డేగిసాలో ముంచేసి, అందినన్ని పాలు తీసుకుని, జనంలో కలిసి పోవడానికి ప్రయత్నించింది. కానీ షాపు ఓనరు చూడనే చూశాడు.


    "దొంగ! దొంగ! దొంగ!" అరె! అరె! దాన్ని పట్టుకొండ్రా! అని రంకె పెట్టాడు.


    షాపు అసిస్టెంటు రేచుక్కలా పరిగెత్తి సరోజ పైట పట్టుకుని ఆపేశాడు.


    ఆ సందడిలో పాలు కాస్తా మళ్ళీ నేలపాలయిపోయాయి!


    ఆ రోడ్డు మీద ఉండే షాపుల వాళ్ళకి వాళ్ళలో వాళ్ళకి ఎన్నెన్నో లుకలుకలున్నాయి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం అందరూ ఒక్కటైపోతారు.


    "అందరూ చూస్తుండగానే పట్టపగలే దొంగతనం చెయ్యడానికి నీకెన్ని గుండెలే?" అన్నాడు పాలదుకాణంవాడు ఆక్రోశంగా.


    "రెండు గుండెలు!" అన్నాడు ఇంకొకడు పుష్టిగా వున్న ఆమె వక్షం వైపు చూస్తూ!


    గింజుకోవడంలో సరోజ చీరె సగం చిరిగిపోయింది.


    "నా కొడుకేడీ> నా కొడుకేడీ?" అంటోంది రొప్పుతూ.


    ఆ సందట్లో సరోజ కొడుకుని చంకనిరికించుకూని పారిపోయాడు కొట్లాటల కోటిగాడు. పిల్లల్ని ఎత్తుకెళ్ళి బిచ్చగాళ్ళ గ్యాంగులకి అమ్మేయ్యడంలో వాడు ఎక్స్ పర్టు.


    "అయ్యో! నాకొడుకు! అమ్మో నా కొడుకు! నా కొడుకుని నాకిచ్చెయ్యండి!" అంటోంది సరోజ విహ్వలంగా.


    కానీ వినిపించుకునే వాడేడీ? అరుపులు, కేకలూ, ఉత్సాహం , ఈలల మధ్య ఆమెని పొలిసు స్టేషనుకి లాక్కెళ్ళారు.


    అప్పటికే - అంతకు కొద్ది రోజుల ముందునుంచి ఆ పోలీసు స్టేషను పరిధిలో దొంగతనాలు బాగా ఎక్కువైపోయాయిట. దొరికిన దొంగకి  అక్కడికక్కడే బుద్ది చెప్పదలుచుకున్నారు పోలీసులు. సరోజకి కాళ్ళు, చేతులూ కట్టేశారు. కింద పడేశారు. గిట్టలకి నాడాలు కొట్టడానికి పశువుని కాళ్ళు కట్టిపడేస్తారే - అలాగ! ఆ తరవాత పచ్చబొట్టు పొడిచే వాడిని పిలిపించి, సరోజ మొహం మీద "ఇది దొంగ!" అని పచ్చబొట్టు పోడిపించారు - జనం తెలుసుకుని జాగ్రత్తగా ఉండడానికి.


    ఆ షాక్ లో మతి చలించిపోయింది సరోజకి అన్నాడు మస్తాన్.


    అప్పటిదాకా ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్న రాజాకి గమనంలోకి వచ్చింది -


    తన ఒళ్ళు నిలువెల్లా వణికిపోతుందని.


    మాట్లాడబోతే గొంతు కూడా వణుకుతోంది.


    వణుకుతున్న గొంతుతోనే అడిగాడు రాజా.


    "సరోజకి అంతటి పరాభవం జరుగుతుంటే అడ్డంపడ్డవాడు ఒక్కడూ లేకపోయాడా?"


    "లేకేం! ఒకతను అడ్డం పడ్డాడు" అన్నాడు మస్తాన్.


    "ఎవరు" అన్నాడు రాజా.


    "అదే పోలీసు స్టేషనులో పనిచేస్తున్న ఒక కానిస్టేబులు"


    "అప్పుడేమయింది?"


    "ఏమవుతుంది? లోకంలో నీతికి ఎదురు తిరిగితే ఏమవుతుంది - సిస్టంలో నుంచి నిన్ను బయటికి నెట్టేస్తారు - అధపాతాళానికి తొక్కేస్తారు!"


    "ఆ కానిస్టేబుల్ గతి అంతే అయిందా?"


    "ఆహా! సరోజకి జరుగుతున్న అన్యాయానికి అడ్డం పడబోయిన ఆ పోలీసు గతీ అంతే అయింది!"


    మస్తాన్ వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు రాజా.


    "ఆ పోలీసు కానిస్టేబుల్ పేరు?"


    "మస్తాన్! మస్తాన్!" అన్నాడు మస్తాన్.


    "నేనే ఆ పోలీసు కానిస్టేబుల్ ని! నేను గుడ్డివాడినేట్లా అయ్యానని అడక్కు! అదంతా వేరే కధ!"


    చటుక్కున మస్తాన్ పక్కన కూలబడిపోయాడు. అతని చేతిని పట్టుకున్నాడు రాజా.


    "మస్తాన్ మియా నువ్వు దయ గల తండ్రి లాగా ఉన్నావ్! నీకు నేను తోడుగా వుంటాను! నువ్వు ఈమెని పోషించు! నేను నిన్ను పోషిస్తాను" ఏమంటావు!"


    అదోలా నవ్వాడు మస్తాన్.


    "ఒకరోజు పెడతావు! రెండ్రోజులు పెడతావు! జీవితాంతం ఇద్దరూ మనుషులని పోషించడం మాటలా బాబూ?"


    "దేవుడి దయవల్ల నాకా సమస్యలేదు! ఇదిగో!" అని కొంత డబ్బు తీసి మస్తాన్ చేతిలో పెట్టాడు రాజా. "ఎప్పుడూ అవసరం ఉన్నా నా దగ్గరికి వచ్చెయ్యాలి సుమా! మనమందరం ఒకటి!" అన్నాడు ఆర్ద్రంగా.


    మస్తాన్ వారించబోతుంటే, ఇంక వినిపించుకోకుండా త్వరత్వరగా వచ్చేసి కార్లో స్టీరింగ్ ముందు కూర్చున్నాడు రాజా.


    అప్పటిదాకా ప్రతిమలాగా నిలబడిపోయి ఇదంతా చూస్తున్న మీనాక్షిలో కూడా చలనం వచ్చింది. తను కూడా వచ్చి రాజా పక్కన కులబడిపోయింది.


    రాష్ గా కారు స్టార్ట్ చేశాడు రాజా. తన టెన్షన్ అంతా డ్రయివింగ్ లోనే చూపిస్తున్నట్లు అతి స్పీడుగా కారుని ముందుకి ఉరికించాడు . స్పీడో మీటరులో ముళ్ళు వెర్రెత్తినట్లు తిరిగిపోతుంది. నలబై, యాభై, అరవై, డెబ్బయి, ఎనభై, తొంభై, వంద


    "స్పీడు .....ఎక్కువ......." అంది మీనాక్షి తడబడుతూ. అతని వాలకం చూస్తుంటే ఆమెకి భయం వేస్తోంది.


    స్పీడు మరింత పెంచాడు రాజా.


    "ప్లీజ్.....కంట్రోల్ యువర్ సెల్ఫ్......." అంది మీనాక్షి మళ్ళీ.


    సడెన్ బ్రేకుతో కారు ఆపాడు రాజా. ఉన్నట్లుండి స్టీరింగ్ మీద తలవాల్చేశాడు.


    "మిస్టర్ రాజా.....ఏమయింది?" అంది మీనాక్షి సంకోచంగా.


    అతను వినీవినబడనట్లు ఏదో గొణుక్కుంటున్నాడు. హటాత్తుగా అతని గొంతు పెద్దది అయింది.


    "పిల్లాడి కోసం గుక్కెడు పాలు తీసుకుంటే అది దొంగతనమా? మరి ఆ లెక్కన దేశాన్ని దోచుకుతింటున్న వాళ్ళని ఏమనాలి?"


     భోఫోర్స్ భోక్తల బంగారం బయటపడలేదు!


    వేల కోట్లు స్వాహ చేసిన హర్షద్ మెహతా బాగానే ఉన్నాడు.


    కుటీరాల పేరుతొ కబ్జాలు చేసినవాళ్ళు రాజయోగాలు అనుభవిస్తున్నారు.


    గుక్కెడు పాలు...........పసిబిడ్డ ఆకలి తీర్చడానికి గుక్కెడు పాలు దొంగిలించిన నిర్భాగ్యురాలు ఒక్కతి మాత్రమే ఈ దేశంలో దొంగనా?


     మగలోకం తనని దోచుకోవడానికి అభ్యంతరం పెట్టినందుకుగానూ ఆమె దొంగ అని ముద్రా!


    అందుకనే ఆమెకి అతి భయంకరమైన శిక్ష!


    భారతమాతకి బట్టలు ఊడదీసినట్లు లేదూ ఈ పిచ్చితల్లిని చూస్తూ ఉంటే?


    అయ్యో! అయ్యో! అయ్యో!


    ఊపిరిబిగపట్టి చూస్తోంది మీనాక్షి. రాజా మొహం ఆమెకి కనబడటం లేదు....


    కానీ.....


    ఆమెకి క్రమంగా అర్ధం అయింది.


    అతని వీపు ఎగిరెగిరి పడుతోంది.


    అంటే..........


    భయంగా అతని వేపే చూస్తోంది మీనాక్షి.


    ఈ రాజా.........ఏడుస్తున్నాడా?


    తను చూస్తున్నది నిజమో కాదో ఆమెకి అర్ధం కాలేదు.


    సంకోచంగా చేతిని ముందుకు జాపింది మీనాక్షి.


    మృదువుగా అతని భుజం మీద తన చేతిని వేసింది.


    "ఊరుకోండి!" అంది మృదువుగా.


    మరుక్షణంలో.


    తనేం చేస్తున్నాడో తనకి తెలియకుండానే తన మొహాన్ని ఆమె గుండెల్లో దాచేసుకున్నాడు రాజా.


    తన అనుమానం నిజమైనందుకు షాక్ అయిపొయింది మీనాక్షి.


    నిజమే!


    రాజా మొహం తన గుండెల్లో పెట్టగానే తన జాకెట్ తడిసి పోవడం మొదలెట్టింది!


    ఏం చేస్తున్నాడు ఇతను?


    కొద్ది నిమిషాల క్రితం.......


    యుమకింకరుల్లాంటి గుండాలని నదురు బెదురూ లేకుండా చావగొట్టిన మొనగాడేనా, ఇప్పుడు ఒక ఆడపిల్ల కష్టం చూడలేక దుఃఖిస్తున్నాడు.


    ఇందాక రోడ్డు రోలర్ నే ఒడుపుగా పక్కకి నేట్టేయ్యగలిగిన మహా బలశాలేనా..........


    ఇప్పుడు ఇలా దేశం కోసం రోదిస్తున్నాడు!


    ఇంత బలం వెనకా, ఇంతటి సాహసం వెనకా ఇంతటి సుతి మెత్తని మనసా?


    ఈ క్షణంలో ఇతను........


    అమ్మ గుండెల్లో తలదాచుకున్న పసి పాపడిలాగే ఉన్నాడు.


    తనకి తెలియకుండానే తన చేతిని రాజా మెడ చుట్టూ వేసి, అతన్ని గాడంగా తన గుండెల్లో పోదువుకుంది మీనాక్షి. రెండో చేతితో అతని జుట్టు నిమురుతూ "ఊరుకోండి! ప్లీజ్! మీరు ఏదైనా పూనుకుని చెయ్యాలి గాని, ఇలా అధైర్యపడితే ఎలా? ఊరుకొండి! ఏం ఫర్వాలేదు......ఎవ్విరి థింగ్ విల్ బీ అల్ రైట్. ఐ లవ్ యూ.........తెలిసిందా ఐ లవ్ యూ సో మచ్.........." అంది అలా అంటుంటే ,


    మీనాక్షి గొంతు గద్గదికమయింది.


    "ఐ లవ్ యూ డియర్.........ఊరుకోండి!" అంది మళ్ళీ.


    ఆమెకి తెలియకుండానే , ఆమె కళ్ళు వర్షించడం మొదలెట్టాయి.


    తన పెదిమలతో అతని నుదుటిని రాస్తూ, "ఇక నుంచి మనిద్దరం ఒకటి.......కష్టాల్లో.....సుఖాల్లో కూడా........ఏం?" అంది.


    "ఐ లవ్ యూ మీనా!" అన్నాడు రాజా.


    అలా దేశం కోసం దుఃఖిస్తూ వాళ్ళిద్దరూ ఆ క్షణంలో ప్రేమికులయిపోయారు! తమకి తెలియకుండానే!


    మరుక్షణంలో .....షాక్ కొట్టినట్లు అతనికి దూరంగా జరిగిపోయింది మీనాక్షి.


    అప్పటిదాకా మర్చిపోయిన సంగతి హటాత్తుగా గుర్తు వచ్చింది ఆమెకి.


    ఆ విషయం గుర్తు రాగానే కోటి ఓల్టుల షాక్ తగిలినట్లు నిలువెల్లా చలించిపోయింది మీనాక్షి!


    అవును!


    తను ట్రస్టీ సుందరంతో ఒక ఒప్పందానికి వచ్చింది.


    ఏమని?"


    తను ఆ సుందరం దగ్గర అయిదు లక్షలు తీసుకుని ఆ డైమండ్ రాజాతో ప్రేమ నటిస్తానని!


    రాజాని తనతో తీవ్రమైన ప్రేమలో పడేలా చేసి తనకి దాసోహం చేసుకుంటానని..............


    అలా తనతో ప్రేమలో పడ్డ డైమండ్ రాజా, "నాకు పదివేల కోట్లు ఆస్తి అక్కర్లేదు! ఈ అమ్మాయి కావాలి!" అనేటంత స్థితికి తెస్తానని!


    కానీ జరిగింది ఏమిటి?


    డైమండ్ రాజాతో ప్రేమ నటించి అతన్ని తన పాదాక్రాంతుడిగా చేసుకునే ప్రయత్నం మొదలెట్టి పూర్తిగా ఒక గంట గడిచి గడవక ముందే తనే అతనితో అతి తీవ్రమైన ప్రేమలో పడిపోయింది!


    ఎంతటి విచిత్రమైన పరిస్థితి ఇది!


    ఎంతటి విచిత్రమైన పరిస్థితి ఇది!


    ఇది అసలు కన్నుమూసి తెరిచేటంతలోనే ఎలా జరిగిపోయింది? పదకొండు గంటల ప్రాంతంలో డైమండ్ రాజా డాన్సు చేస్తున్న తన దగ్గరికి వచ్చాడు. వందరూపాయల కట్ట ఇవ్వబోయాడు!


    ఆ డబ్బు తను తీసుకోలేదు!


    అదే క్షణంలో అతనంటే అదోవిధమైన అలర్జీ మొదలయింది తనకి!


    సరిగ్గా పదకొండు గంటల ప్రాంతంలో అతని మీద తనకి ఉన్న ఏకైక భావం అలర్జీ! అసహ్యం! అసహ్యం! అతనంటే అతని డబ్బంటే కూడా!

 Previous Page Next Page