ఆమె మధ్యాహ్నం పాడినపాట తరవాత చరణాలు.
కోరివచ్చిన వారికెల్లను కోర్కెలొసగే బిరుదుగదా అతిభారమూ నన్ను బ్రోవ తల్లి కృపాలవాల తాళజాలనే...
జోల పాడినట్లయి కిరణ్మయిమీద చెయ్యివేసి పసిపాపలా నిద్రపోయింది.
12
అప్పట్నుంచీ ఆనందమోహన్ రెండు మూడురోజులకోసారి వస్తూనే వున్నాడు. అనుభూతులు ప్రవహిస్తూనే వున్నాయి.
అవకాశం దొరికినప్పుడల్లా ఆత్మవిమర్శ చేసుకుంటూ వుండేది.
ఈ వంటరితనంలో ఒకతోడు....
ఇతరులకు చెప్పటానికి వీలుకాని ఈ బాధలో ఓదార్పు.
పిచ్చిపట్టినట్లు వెంటాడుతున్న ఈ అశాంతిలో ఒక లాలింపు.
ఆమె కళ్ళకతను ఎదిగిన పసివాడిలాగే కనిపించేవాడు. అతని కళ్ళల్లో, చూపుల్లో, మాటల్లో, స్వభావంలో నిర్మలత్వం తొణికిసలాడుతూండేది.
అతను తరుచు ఇక్కడికివస్తూ వుండటం ఆమెతో చనువుగా మాట్లాడుతూ వుండటం యిరుగు పొరుగువాళ్ళు గమనించారు. వాళ్ళిద్దరిగురించీ గుసగుసలాడుకోసాగారు. ఆమె బయటకు వస్తే ఎగతాళిగా, యీసడింపుగా చూసే వాళ్ళు.
చిన్మయికి అవన్నీ తెలుస్తూనే వుండేవి. కానీ ఆమె ఒక విచిత్రపరిస్థితిలో వుంది. అది మైకం కాదు. అమాయకతతో కూడిన ఆరాటం.
"మమ్మీ! అతను.... మనింటికి రోజూ వస్తాడెందుకు?" అనడిగింది కిరణ్మయి ఒకరోజు.
"అతను మన ఫ్యామిలీ ఫ్రెండమ్మా!"
కిరణ్మయికికూడా అతనంటే సదభిప్రాయమే కలిగింది. అతనొచ్చినప్పుడు తనువుంటే బాగానే మాట్లాడేది.
ఆనందమోహన్ ని "అంకుల్! అంకుల్!" అని పిలిచేది. ఒక్కోసారి అతనితో కలిసి బజారుకో, మార్కెట్ కో వెళ్ళేది.
ముగ్గురూ కలసి బయటకు వెళ్ళిన సందర్భాలు కూడా లేకపోలేదు.
* * *
ఓ రోజు కిరణ్మయి స్కూల్ నించి వచ్చేసరికి బాగా జ్వరంగా వుంది. మొహం బాగా నీరసంగా కనిపించింది.
చిన్మయి ఆమె వంటిమీద చెయ్యివేసి చూసి హడలిపోయి ఆటోలో డాక్టర్ గారి దగ్గరకు తీసుకెళ్ళింది. ఆయన ఎగ్జామిన్ చేసి వైరల్ ఫీవర్ కావచ్చునని చెప్పి మందులు రాసిచ్చి, యింజక్షన్ చేసి పంపివేశాడు.
ఆ రాత్రి పదిగంటలకు కిరణ్మయికి జ్వరం బాగా ఎక్కువయింది. ధర్మామీటర్ పెట్టి చూస్తే నూటనాలుగు డిగ్రీలదాకా వుంది. చిన్మయికి చాలా భయంవేసి ఆమె నుదుట తడిగుడ్డవేసి ఒళ్ళంతా కూడా స్పాంజ్ బాత్ చేయించి ప్రక్కన కూర్చుంది.
ఆ స్థితిలో కిరణ్మయిని పెట్టుకుని ఇంట్లో ఒక్కతే వుండాలంటే భయంగా వుంది. ఈ స్థితిలో తల్లి, తండ్రి, అత్త, మామ, భర్త అందరిమీదా కోపమొచ్చింది. ఎవరైనా తోడువుంటే బావుండును అని మనసు తెగ ఆరాటపడింది.
ప్రక్కింట్లో లైట్లు వెలగడంలేదు. ఆనందమోహన్ ఇంట్లో లేడా? ఎన్నోసార్లు ఆ ఇంటివైపు ఆశగా చూసింది.
ఓ అరగంట తర్వాత, బయట స్కూటర్ చప్పుడయింది. చిన్మయి అతనే నేమో అనుకుంది. అయిదునిముషాలు గడిచాయి. బయట్నించి ఎవరో బజర్ నొక్కారు.
కిరణ్మయి తలను మెల్లగా ఒళ్లోంచి తీసి మంచంమీద పడుకోపెట్టి, లేచి తలుపు దగ్గరకు వెళ్ళింది.
"ఎవరు?" అని అడిగింది తలుపు తియ్యకుండా.
"నేను..." బయట్నుంచి ఆనందమోహన్ గొంతు.
చిన్మయి డోర్ తెరిచింది.
"ఇంట్లో లైట్లన్నీ వేసివుంటే ఏమిటో కనుక్కుందామని వచ్చాను" అన్నాడు.
"కిరణ్ కు బాగా జ్వరంగా వుంది. భయమేసి లైట్లన్నీ వేసివుంచాను" అంది చిన్మయి.
"అరె! జ్వరంగా వుందా?" అంటూ ఆనందమోహన్ లోపలకు వచ్చాడు.
కిరణ్మయి బెడ్ మీద వళ్ళు తెలీని స్థితిలో పడుకుని వుంది.
ఆనందమోహన్ ఆమె వంటిమీద చెయ్యివేసి "అరె! చాలా ఎక్కువగా వుందే, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారా?" అనడిగాడు ఆందోళనగా.
చిన్మయి జరిగింది చెప్పింది.
"మీరు... ఇక్కడే వుండండి. నాకు చాలా భయంగా వుంది" అనడిగింది దుఃఖాన్నాపుకుంటున్న కంఠంతో.
* * *
రాత్రి పన్నెండు దాటింది. చిన్మయి కిరణ్మయి చుట్టూ చెయ్యివేసి పడుకుని వుంది. మంచినిద్రలో వుంది.
ఆనందమోహన్ బయటి హాల్లో కూర్చుని వున్నాడు. అతనికెంతకూ నిద్రపట్టలేదు. కాసేపు లేచి అటూ ఇటూ తిరిగాడు. ఏమీ తోచలేదు.
కిరణ్మయికెలా వుందో చూద్దామని లోపలకు వచ్చాడు.
కిరణ్మయి మీద చెయ్యివేసి అమాయకంగా నిద్రపోతున్న చిన్మయి ముఖం వాడివుంది. జుట్టు రేగివుంది. ఒక్కనిముషం ఆమెవంక చూస్తూ అలానే నిలబడ్డాడు.
ఆమె గృహిణి. ఒక పరాయివ్యక్తి భార్య. ఒక చిన్నపిల్ల తల్లి.
ఆమె అందాలను తాను గమనిస్తున్నాడా? 'కాదు' అనుకుంటే ఆత్మవంచన అవుతుంది. ఆమెకు దగ్గరవాలనే కోరిక బలపడుతున్నదా? "లేదు" అనుకుంటే అబద్దమవుతుంది.
ఆమె తనను కొంతవరకూ ఎందుకు దగ్గరకు రానిచ్చింది?
తనలో ఆమె ఇష్టపడిన సంగీతాన్ని చూసి లేకపోతే ఆమె తనవైపు కన్నెత్తి అయినా చూసేది కాదు.