Previous Page Next Page 
రాకోయి అనుకోని అతిథి పేజి 31

   

     మృదువుగా నవ్వేశాడు "చూడండి ఆశ్రితా! నేను జీవితాన్ని ఈజీగా తీసుకుంటానేమోకానీ బాధ్యతల్ని కాదు.... అఫ్ కోర్స్... ఫెయిల్యూర్స్ కూడా నాకు కొత్తకాదు. అంతమాత్రం చేత నిరాశపడను. ఒక అద్భుతమైన గెలుపుకి ఓటమితో పొందిన అనుభవాన్ని ఆయుధంగా వాడుకుంటాను. ఇది నా లైఫ్ ఫిలాసఫీ... అయినా" వున్నట్టుండీ ఏదో గుర్తు చేసుకుంటూ అన్నాడు "ఇప్పుడు హఠాత్తుగా నన్ను అర్ధంచేసుకోటానికి నేను చేసిన ఘనకార్యం ఏమిటి?"
    
    బేరర్ టేబుల్ మీద డిన్నర్ ని ప్లేస్ చేసి వెళ్ళాక సాలోచనగా తింటూ అంది ఆమె "మీరేమిటి అన్నది తెలీటానికి మీరే చేసి తీరాలన్నది నేను రూలుగా అంగీకరించను వశిష్టా ఒక్కోమారు బాధ్యతగా ఏదో చేయడం కన్నా ఆత్మీయంగా పరామర్శించడం మనిషిని ఉత్తేజపరుస్తుంది. అలాంటి 'కన్ సర్న్' మేలు చేయడంకన్నా అంతకుమించి స్ఫూర్తికి కారణమవుతుంది. జబ్బుపడ్డ పేషెంట్ కి ఒక్కోమారు డాక్టరిచ్చే మందులకన్నా డాక్టర్ పే చేసే అటెన్షన్ చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది వశిష్టా. ఇప్పుడు మీరు నామీద చూపించిన ఇష్టమూ అలాంటిదే ఇష్టమూ అన్న పదాన్ని నేను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందీ అంటే మీ స్థాయి పోలీసాఫీసరు ఇష్టం అంటూ లేకపోతే నాకోసం ఇంత టైం స్పేర్ చేయరని తెలుసు కాబట్టి."
    
    ఆమె ఆగింది...
    
    కారణం అతని నవ్వు చూసి.
    
    ఆ నవ్వులో కృత్రిమత్వం లేదు..... స్వచ్చంగా కడిగిన ముత్యంలా వుంది... "అయిపోయిందా" అన్నాడు.
    
    "ఏమిటి?"
    
    "మీరు కృతజ్ఞత ప్రకటించడం" సీరియస్ గా అన్నాడు అతను... "ఇంత చెప్పారు కాబట్టి మీకు నా గురించి కొంత చెప్పడం తప్పనిసరి ఆశ్రితా! నేనూ జీవితంలో చాలా గాయపడ్డాను... మామూలుగా కాదు. చాలా బలంగా అయితే ఆ నష్టాన్ని బ్రతికేయడాన్ని అలవాటుచేసుకున్నాను. ఇలా చెబుతున్నది మిమ్మల్నీ నాలాగే గతం మరిచిపొమ్మని కాదు. నా కేరక్టరు గురించి చెప్పాను అంతే....సో ఇక నుంచీ మీరు నా ముందు ఇలా మాట్లాడ్డం మానేస్తే సంతోషిస్తాను."
    
    క్షణం ఆగింది ఆమె "ఇప్పుడు మీకూ నేనో పిట్టకథ చెప్పాలనుకుంటున్నాను."
    
    "వండర్ ఫుల్... చెప్పండి" ఉత్సుకతగా చూశాడు.
    
    "మార్క్ ట్వెయిన్ లాంటి ప్రముఖ రచయిత ఇంటి పక్కన ఓ పుస్తక ప్రియుడుండేవాడట... అతని దగ్గర పెద్ద లైబ్రరీ వుంటే ఒకసారి మార్క్ ట్వెయిన్ అతడి దగ్గరకు వెళ్ళి ఫలానా పుస్తకం కావాలని అడిగి ఓసారి ఇస్తే ఇంటి దగ్గర చదివి ఇస్తానన్నాడట... దానికి ఒళ్ళు మండిన ఆ వ్యక్తి 'నాకు పుస్తకాలను అరువు ఇవ్వటం అలవాటు లేదు. కావాలంటే ఇక్కడే కూర్చుని చదివేయండీ" అన్నాడట..."
    
    డిన్నర్ మధ్యలో ఆపి ఆసక్తిగా వింటున్నాడు అతను.
    
    "కొంత కాలానికి సదరు పుస్తక ప్రియుడికి ఇంటిలోని మొక్కల్ని కత్తిరించే కత్తెరతో అవసరం పడింది... అది మార్క్ ట్వెయిన్ దగ్గర వుందని తెలిసి అతడింటికి వచ్చి మార్క్ ట్వెయిన్ని అడిగాడు... వెంటనే కత్తెరని అతడి చేతికందించి 'ఇలాంటివి అరువు యివ్వడం నాకూ అలవాటులేదు. కావాలంటే దీన్ని ఇక్కడే ఉపయోగించండీ' అన్నాడట దెబ్బకి దెబ్బ తీస్తూ."
    
    ఫకాల్న నవ్వాడు అతను ఆ తర్వాత తేరుకుని "ఇదంతా ఏ కాంటెక్ట్స్ లో చెప్పినట్టు?" అన్నాడు.
    
    "కొన్నింటిని కొందరు భరించి మరిచిపోవడం స్వభావంగా చేసుకుంటే మరికొందరు కౌంటర్ ఇచ్చేదాకా విశ్రమించరని చెప్పడానికి..." అంది ఆమె తన వ్యక్తిత్వం గురించి పరోక్షంగా తెలియచెబుతూ.
    
    "గూడ్" అభినందనగా చూశాడు "ఎవరికెప్పుడు ఏ కౌంటర్ ఇస్తారో తెలీదుకాని ఇందాక నేను చెప్పిన న్యూటన్ కథకి కౌంటర్ లా మీరు నాకు మార్క్ ట్వెయిన్ కథ వినిపించారు. చెప్పండి... ఇప్పుడు మీకు నేనేమన్నా సహకరించగలనా...?"
    
    ఒక ఆదేశం కోసం ఎదురుచూస్తున్నట్టుగా అడిగాడు.
    
    వెంటనే జవాబు చెప్పలేదామె... ఇందాక తన దగ్గరికి వచ్చి బెదిరించి వెళ్ళిన ఏకాంతకి ఇదే రాత్రి చిన్న గుణపాఠం చెప్పాలని వుంది.... ఆమె ఎవరికి ఉంపుడుకత్తెగా వున్నదీ తనకు తెలుసు. కాని ఆ నిజం వశిష్టకి తెలీడం యిష్టం లేదు. కాని వశిష్టని ఆమె పైన దాడికి పంపాలి.
    
    "ఓ.కె. మిస్టర్ వశిష్టా! నా తమ్ముడి విషయంలో మీరు నాకు సహకరించలేక పోవడానికి కారణం ఆధారాలు ప్రతికూలంగా వున్నాయి కాబట్టి అది సరే... ఒకవేళ ఆధారమున్న ఓ నేరానికి సంబంధించే నేను ఓ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకోండి...అప్పుడు మీరెలా రియాక్టవుతారు?"
    
    "మరెవరైనా అయితే అందులోని నిజానిజాలు ముందు ఆరా తీయడానికి ప్రయత్నిస్తాను. కాని అది మీరు చెప్పింది కాబట్టి సరాసరి అందులో జోక్యం చేసుకుని నేరస్థుల్ని నిర్భంధిస్తాను"
    
    ఇంత స్వల్ప పరిచయంలో అలాంటి నమ్మకాన్ని కలిగించడం తన శక్తో లేక అతని సహృదయతో ఆమె ఆలోచించలేదు. వెంటనే చెప్పింది "బంజారాహిల్సు లోని రోడ్డు నెంబరు టెన్ లోని ఓ ఇంటిలో బ్రోతల్ ఏక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆ ఇంటి నెంబరు."
    
    వివరాలన్నీ విన్న వశిష్టలో ఇందాకటి ప్రసన్నత లేదు. సీరియస్ గా తల పంకించి "ఇక వెళదామా" ఆనందు ఉద్విగ్నంగా పైకి లేస్తూ అతడెంత బలంగా రియాక్టయిందీ అర్ధం చేసుకున్న ఆశ్రిత అతన్ని అనుసరించింది.
    
    సరిగ్గా రాత్రి పది గంటల ప్రాంతంలో ఇంటి సమీపంలోని ఓ సందు దగ్గర జీపు దిగిన ఆశ్రిత వశిష్టకి 'థాంక్స్' చెప్పి ముందుకు నడిచింది.
    
    ఇంటి ఆవరణలో వున్న పోలీసుల్ని చూస్తూ నివ్వెరపోయింది.
    
    "నిన్ను అరెస్ట్ చేస్తున్నాం మిస్ ఆశ్రితా!" అన్నాడు సర్కిల్ ఇన్ స్పెక్టర్ ధనంజయ.
    
    "దేనికి?" అందోళనని అదిమిపెడుతూ అడిగింది.
    
    "నీ ఇంటిలో 'ఆర్ డి ఎక్స్' దొరికింది నిన్ను రెడ్ హేండెడ్ పట్టుకున్నాం...నీకు టెర్రరిస్టులతో సంబంధం వుంది కాబట్టి నిన్ను టాడా కింద కస్టడీలోకి తీసుకుంటున్నాను" తను అనుకున్నది అంతా చెప్పి జీపెక్కమన్నాడు.
    
    ప్రమాదం పొంచి వుందని ఆమె ముందే వూహించింది కాని ఇంత తొందరలో ఇలా ఎదుర్కోవలసి వస్తుందని ఆమె వూహించలేకపోయింది. అది కాదు ఆ క్షణంలో ఆమె ఆలోచిస్తున్నది... తాను టెర్రరిస్టులకి చెందిన వ్యక్తినంటూ 'ఆర్ డి ఎక్స్' తన ఇంటిలోనే తన దగ్గరే దొరికిందని చెబుతున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్ కనీసం తనను ఇంటిలోకి సైతం వెళ్ళనివ్వడం లేదు. రెయిడ్ లేదు... సాక్ష్యాలు లేవు అంతా టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా చెప్పి రోడ్డుమీద నుంచే తనను సరాసరి స్టేషన్ కి తీసుకువెళ్ళి పోవాలనుకుంటున్నాడు.
    
    చుట్టూ పరికించి చూసింది.....
    
    భయంతో కొందరు తలుపులు మూసుకుంటే, జాలితో మరికొందరు చూస్తున్నారు.

 Previous Page Next Page