"అంత అందమయిన అమ్మాయిని నా చేతులతో ఎలా చంపాలా అని బాధపడ్డాను. యిప్పుడు బ్లడ్ క్యాన్సరే ఆమెను చంపుతుంది" అన్నాడు రమణ.
"వెరీ బాడ్! అమ్మాయి అందం చూసి హత్యకు వెనుకాడతావా?" అన్నాడు నడివయస్కుడు.
"అప్పుడప్పుడు మనిషిలా ప్రవర్తించకపోతే జీవితంలో రుచి వుండదు."
"చరితను చంపకుండా వదిలావు. ఆమె నీ పథకానికే అడ్డు తగలబోయింది"
రమణ నవ్వి, "హత్య చేస్తే పాపం. అడ్డమైన వాళ్ళనీ చంపి పాపమెందుకూ మూటగట్టుకోవడం? ఓ హత్య చేస్తే అందువల్ల పెద్ద ప్రమాదమైనా తొలగిపోవాలి. గొప్ప ప్రయోజనమైనా వుండాలి. చరిత నాగుపాము కాదు. గండు చీమ. అది కుట్టినా ప్రాణం పోదు. అలాంటిదాన్ని చంపడం వృధా. చంపకుండా వదిలిపెడితే ఆ భగవంతుడు నా క్షమా గుణానికి సంతోషించి కొన్ని పాపాల్ని కడిగేయగలడు"
"అసలు నువ్వు చరిత జోలికెందుకెళ్ళావు?"
రమణ నవ్వాడు.
"చరిత వల్ల నువ్వే ప్రయోజనం సాధించావు?"
రమణ నవ్వి, "అది నా రహస్యం"
"నాకు తెలియని రహస్యాలు నీ దగ్గరుండకూడదు" గంభీరంగా అన్నాడు నడివయస్కుడు.
"చరితనే కాదు ఇంకా నలుగురమ్మాయిల్ని వల్లో వేసుకున్నాను నేను. వాళ్ళ ఫోటోలు నా జేబులోనే ఉంచుకుని తిరుగుతున్నాను. హాస లాంటి ఓ అమ్మాయిని వలలో వేసుకోవాలంటే ప్రాక్టీసు కావాలిగా!"
నడివయస్కుడతనివంక మెప్పుకోలుగా చూసి, "గుడ్! కానీ చరితతో సరిపెట్టుకోవాల్సింది. అంత అంది జోలికెందుకెళ్ళావు?" అన్నాడు.
"హాస ఎలాంటిదో? ఆడపిల్లల మీద ఎన్నిరకాల ట్రిక్కులుపయోగించాలో తెలుసుకుందుకు చరిత చాలదు."
"వెరీ గుడ్! బ్లడ్ కాన్సర్ ఆమెను కబళించేలోగా మీ వివాహం జరిగిపోవాలి. నువ్వు తొందరపడాలి."
రమణ నవ్వాడు
"నీ నవ్వే నీకు శ్రీరామరక్ష!"
"మీ మాటే నాకు శ్రీరామరక్ష!"
ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపులు ఆహారం వాసన పసిగట్టిన పులి చూపుల అసహనంతో నిండి వున్నాయి.
27
గౌతమ్ ఆలోచిస్తున్నాడు.
చరిత రమణ పేరు వినగానే తనంటే కూడా భయపడింది. అంటే రమణ అంతటి భయంకరమైన మనిషయుండాలి.
ఈ విషయం చెప్పి హాసను హెచ్చరిస్తే రమణ చలించనే లేదు. చరితతో పాటు మరో నలుగురి కథ బయటపెట్టి వాళ్ళే తనచుట్టూ వల పన్నుతున్నారని చెప్పాడు.
చరిత రమణపై వల విసిరి విఫలురాలయిందా?
అయుండొచ్చు. ఎందుకంటే....
"సర్ మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదూ అని అడగాలనుకుంటున్నాను. నేనూ మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటున్నాను" అనేసి పారిపోయిందామె.
తనను ప్రేమకు ప్రోత్సాహించింది. దాన్నే వల విసరడ మంటారు.
అప్పుడు తనేం చేశాడు?
చరితను పార్కుకి తీసుకెళ్ళి అచ్చం రమణలా ప్రవర్తించాడు.
చరితకూ రమణకూ పూర్వ పరిచయముందని ముందుగా తనకు తెలియదు.
కానీ రమణ విషయం తనకు తెలిసిపోయిందని చరిత అనుమానించింది. తన్ను తాను సమర్ధించుకుని సంజాయిషీ యిచ్చుకునే బదులు ఎదురు తిరిగి తన్నే తప్పు పట్టింది.
రమణ రుజువులతో సహా తనకన్నీ చెప్పి ఉంటాడని ఆమె అనుమానం. అందుకని ఏదో వంకతో ఇప్పుడే తనతో తెగతెంపులు చేసేసుకుంది.
రేపు మరెవరయినా అమ్మాయి తన గురించడిగితే చరిత తన్నో మోసగాడిగా చిత్రిస్తుంది. ఆ విధంగా కొందరి దృష్టిలో నిష్కారణంగా మోసగాడైపోతాడు.
పాపం, రమణ కూడా అంతేనేమో!
"ఆడదాన్ని సులభంగా నమ్మకూడదు" అనుకున్నాడు గౌతమ్.
* * * *
ఆఫీసులో చరితను పలకరించాడు వెంకట్రత్నం.
"గౌతమ్ మంచివాడు కాదూ మోసగాడు" అంది చరిత ఆయనతో.
"ఇంపాసిబుల్" అన్నాడు వెంకట్రత్నం.
"నాది అనుభవం, మీది ఊహ"
"నా అనుభవం ఊహలోంచీ నిజాలు పుట్టిస్తుంది. నీ అనుభవం ఆవేశం కారణంగా అదృష్టాన్ని ఊహల్లోకి తరిమేస్తోంది"
చరిత ఆయన వంక ఆశ్చర్యంగా చూసింది.
"జరిగిందేమిటో చెప్పు" అన్నాడు వెంకట్రత్నం.
"అది నా దురదృష్టం. మీకు చెప్పుకోలేను" అంది చరిత.
వెంకట్రత్నం ఆమెను నొక్కించలేదు.
* * * *
గౌతమ్ ఆఫీసుకు వచ్చాడు. అతడు తన గదిలో తన పనులు చేసుకుంటున్నాడు. ఎవరితోనూ మాట్లాడే ఉద్దేశ్యం లేదని అతడి ముఖం చూడగానే తెలిసిపోతుంది.
అయినా వెంకట్రత్నం అతడిని చనువుగా పలకరించి, "అలాగున్నావేం?
"ఎలాగున్నాను?" అన్నాడు గౌతమ్.
"నన్ను కూర్చోమనలేదు"
"సారీ, కూర్చోండి" అన్నాడు.
వెంకట్రత్నం కూర్చుని, "అలాగున్నావేం?"
గౌతమ్ మాట్లాడలేదు.
"మనసు బాగోలేదా?"
కాదన్నట్లు తల అడ్డంగా వూపాడు.
"మనసు కాకపోతే ఏదో ఒకటి. బాగోలేదు."
"మీతో చాలా మాట్లాడాలి. చాలాసేప్పడుతుంది మీకు వీలవుతుందా?"
"క్యూజువల్ లీవా, ఎర్నేడ్ లీవా?" నవ్వుతూ అడిగాడు వెంకట్రత్నం.
"మీ వీలుని బట్టి."
* * * *
చాలా అందమైన పార్కది. అక్కడ వెలుగుతున్న దీపాలు బాగున్నాయి. నీళ్ళు చిమ్మే జలయంత్రాలు బాగున్నాయి. తిరుగుతున్న మనుషులు బాగున్నారు. అక్కడే ఒకచోట వెంకట్రత్నాని కెదురుగా కూర్చున్న గౌతమ్ కూడా బాగున్నాడు. కానీ అతడి మనసే బాగున్నట్లు లేదు.
"ప్రేమ సమస్యా?" అన్నాడు వెంకట్రత్నం.
తలూపాడు గౌతమ్.
"అమ్మాయి అపార్ధం చేసుకుందా?"
తలడ్డంగా ఊపాడు గౌతమ్.
"అసలు సంగతి చెప్పు...." విసుగును దాచుకుంటూ అన్నాడు వెంకట్రత్నం.
"చాలా విచిత్రమైన విశేషమది!" అన్నాడు గౌతమ్.
వెంకట్రత్నం ఊరుకున్నాడు. గౌతమ్ కొనసాగించాడు.
విశ్వామిత్రుడి గురించి, సీత గురించి, హాస గురించి, చరిత గురించి అన్నీ చెప్పాడతడు. హాస ఎవరో మాత్రం చెప్పలేదు.
"కాశీమజిలీ కథలాగుంది" అన్నాడు వెంకట్రత్నం.
"ఇది కథకాదు. వాస్తవం...."
"వాస్తవ వేమిటో నేను చెబుతాను. నువ్వా అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నావు" అన్నాడు వెంకట్రత్నం.
"అంతేకాదు, ఇక్కడే వుండి ఆమెతో మాట్లాడుతున్నాను...."
"అదంతా నీ భ్రమ!"
"విన్నారు కాబట్టి మీరలాగంటున్నారు. అది భ్రమ కాదనడానికెన్నో ఋజువులున్నాయి...."
"ఆ ఋజువులతో నాకు పనిలేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను."
గౌతమ్ ఊరుకున్నాడు. వెంకట్రత్నం కొనసాగించాడు.
"జీవితంలో ఏదో సాధించాలన్న కోరిక నీలో వుంది. విశ్వామిత్రుడు కనిపించాడు. నీకు సంసార జీవితంమీద మోజుంది. అందుకే టాబ్లెట్ ను విశ్వామిత్రుడు నీకిచ్చాడు. సీతను నువ్వు తాత్కాలికంగానే బంధించావు. అందుకే ఆ టాబ్లెట్ ను ఆమెకోసం మింగలేదు. ఓ అమ్మాయి తొలి చూపులో నిన్నాకర్షించింది. ఆమె కోసం టాబ్లెట్ మింగావు. ఆమె గురించి సమాచారం సేకరిస్తున్నావు. విశేషాలు తెలుసుకుంటున్నావు. అవన్నీ టాబ్లెట్ మహిమతో తెలుసుకున్నట్లు భ్రమ చెందుతున్నావు. నీ మనసామెను కోరుతోంది. అందుకనే మనసు శరీరం నుండి వేరుపడింది. శరీరం చేసే పని మనసుకు తెలియడం లేదు. కొంతకాలం పాటు నువ్వు మనసునీ, శరీరాన్నీ కలిపి చూడు.... చాలా చిక్కు సమస్యలు విడిపోతాయి...."
గౌతమ్ అదోలా నవ్వాడు. "నేను భ్రమ పడుతున్నాననే మీరాలోచిస్తున్నారు. ఒకవేళ నేను చెప్పింది వాస్తవమేమో ఆలోచించి చూడలేరూ?"
"ఇది వాస్తవమే అయినా దాన్ని వాస్తవమనరు. అద్భుతమంటారు. అలాంటి అద్భుతాలు సహజం కాకపోయినా అసాధ్యం కాదు. మనసుకెన్నో అద్భుత శక్తులుంటాయి. నీ ప్రేమకున్న అపూర్వశక్తి ఈ అద్భుతాన్ని సాధ్యం చేసి వుండొచ్చు. కానీ నువ్వు భ్రమ పడుతున్నావనే నా అనుమానం...."
"ఎందుకని?"