Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 32

    "ఆవిడ నిన్నవతలకు పొమ్మంటే!"   
    "పోతాను..." అన్నాడు సుబ్బారావు.   
    అతడి కంఠంలోని దృఢ నిర్ణయం అర్ధం చేసుకున్న రాయుడు, "సరే. నువ్వో మంచి పని చేస్తున్నావు. నీకు తప్పక నేను సాయపడతాను" అన్నాడు.   
    సుబ్బారావు సంతోషంగా వెళ్ళిపోయాడు.   
    మర్నాడు సుబ్బారావు, రాయుడు, రచయిత రిజిస్ట్రాఫీసు దగ్గరకు వెళ్ళారు. అయితే అక్కడ ఎంతసేపు ఎదురు చూసినా సుహాసిని రాలేదు.   
    "నీ ప్రియురాలు రాలేదు-" అన్నాడు రాయుడు.   
    "ఏమయిందో ఏమో - ఎలా కనుక్కోవాలో తెలియదు" అన్నాడు సుబ్బారావు.   
    ఆరోజు సాయంత్రం పార్కుకుకూడా రాలేదు. సుహాసిని. ఆ తర్వాత వారం రోజులు గడిచినా సుహాసిని నుంచి సుబ్బారావుకి ఎటువంటి సమాచారమూ అందలేదు.   
    రచయితకూ, రాయుడికీ కూడా అసలు కారణం తెలియక మతిపోయింది.   
    ఆఖరికి రచయిత వేరే దారిలేక వనజ నాశ్రయించాడు.   
    వనజకు కథ ఇంతదూరం వచ్చిందని తెలియదు. ఆమె చాలా ఆశ్చర్యపడి సుహాసినికి ఇంటికి వెళ్ళి అసలు విషయం చెప్పింది.   
    పెద్దపులి అడవిలో ఉంటే ఆకలి వేసినపుడల్లా వేటాడుతుంది. మనిషి కనబడితే మీద పడుతుంది. కానీ అదే పులి సర్కస్ బోనులో ఉంటే యజమాని పెట్టినపుడు మాత్రమే తింటుంది. మనిషి ఆజ్ఞలకు తలవంచుతుంది. సమాజంలోని మనిషి సర్కస్ లోని పులిలాంటివాడు. ప్రేమమైకంలో అతడు స్వేచ్చాజీవి అయినప్పటికి ఆ మైకం వదలగానే అతను మళ్ళీ యధాస్థితికి వచ్చేస్తాడు. సుహాసిని ఇంటికి చేరుకున్నాక ఈ విషయమై అంతవరకూ ఏర్పడిన ధైర్యమంతా పోయింది. ఈ పని తనవల్ల కాదనీ, సుబ్బారావుకు తన క్షమార్పణలందజేయమనీ ఆమె వనజకు చెప్పింది.   
    "చచ్చాం, కథ మళ్ళీ మొదటికి వచ్చింది" అన్నాడు రాయుడు.   
    "సుహాసినిని బోన్లోంచి బైటకు తీసుకురావాలి. అంటే మరోసారి వాళ్ళిద్దరికీ ఏకాంతం కల్పించాలి" అన్నాడు రచయిత.   
    ఇందుకు వనజ ఒప్పుకుంది. వనజ ఒక రోజున ఏదో వంకతో ఆమెను ఇంట్లోంచి బయల్దేరదీసింది. నేతాజీసుభాష్ చంద్రబోస్ పార్కుకు అయితే ఆమె రాదని తెల్సు. అందుకని బీచ్ కి తీసుకు వెళ్ళింది. అక్కడ సుబ్బారావామెకు తగిలాడు. వాళ్ళిద్దరూ పరస్పరం కల్సుకునే ముందు వనజ ప్రేమ ఔన్నత్యం గురించి ఓ పెద్ద ఉపన్యాసం దంచి, సుహాసిని చేసిన పనిని గర్హించింది. సుబ్బారావు కనబడితే క్షమార్పణ చెప్పుకోడమేకాక, పెళ్ళికి ఒప్పుకోమంది. సుహాసిని అంతా విని ఊరుకుంది.   
    అప్పటికి రాయుడు డైలాగ్ రైటర్ ను రప్పించారు. సుహాసినిని తనదారికెలా మళ్ళించుకోవాలో, డైలాగులు రాసిచ్చాడు. అవన్నీ బాగా కంఠస్థం చేసుకుని మరీ కల్సుకున్నాడు సుబ్బారావు సుహాసినిని.  
    "ఆరోజు నువ్వెందుకు రాలేదు? వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కానీ ఏదో ఆశ నన్నింకా బ్రతికించింది."   
    "ఈరోజు నేనింక ఆగలేను. నువ్వు వచ్చేదీ రానిదీ చెప్పు. నేను బ్రతికేదీ లేనిదీ తేల్చుకుంటాను."   
    "ఆత్మహత్య మహాపాతకమంటారు. అయితే నువ్వు నాకు లభించకపోతే ఆ విరక్తిలో నేను చేయగలిగిన పాతకం అదొక్కటే!"   
    వనజ తనకు ఏర్పరచిన ఏకాంతంలో సుబ్బారావు డైలాగులన్నీ వల్లించాడు. సుహాసిని అన్నీ వింది. ఆఖరున "రేపు మన పెళ్ళి జరుగుతుంది" అంది.   
    ఇద్దరూ కలిసి టైము నిశ్చయించుకున్నారు.   
    తర్వాత రచయిత వనజకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు. రిజిష్ట్రాఫీస్ కి అనుకున్న టయింకు వెళ్ళాడు రాయుడు, రచయిత అక్కడ అప్పటికే వచ్చి ఉన్నారు వనజ, సుహాసిని అంతా కలిసి సుబ్బారావు కోసం ఎదురు చూశారు. ఎంత ఎదురు చూసినా సుబ్బారావు రాలేదు. రాయుడు విసిగిపోయి రచయితను ఆఫీసుకు పంపించాడు. సుబ్బారావు ఆరోజుకు సెలవు చీటీ పంపించాడని తెలిసింది. సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు రచయిత. సుభద్రమ్మ తలుపు తీసింది. రచయితను చూచి, "మీరా?" అని __ "ఉండండి మావాణ్ణి పిలుస్తాను" అంది.   
    సుబ్బారావు వచ్చాడు. రచయిత అతన్ని కాస్త ఎడంగా తీసుకు వెళ్ళి చెడామడా తిట్టాడు.   
    అవతల సుహాసిని తనకోసం ఎదురు చూస్తోందనగానే సుబ్బారావు ఆశ్చర్యపడ్డాడు. కానీ అతను రావడానికి అంగీకరించలేదు - "చినప్పట్నించీ మా అమ్మ నన్ను కంటికి రెప్పలా పెంచింది. ఆమెను నేను మోసగించలేను. నాకోసం తన సుఖాలన్నీ  త్యాగం చేసింది. అమ్మకోసం నా సుఖాల్ని త్యాగం చేస్తాను" అన్నాడతను.   
    "అలాంటప్పుడు ఆమెను రమ్మని ఎందుకు చెప్పావ్?"   
    "ఒకప్పుడలాంటి ఆవేశం నన్ను కమ్మింది. కానీ సుహాసిని వస్తానని రాలేకపోయేసరికి నా ఆవేశం బలం తగ్గిపోయింది. నిన్న ఆమెతో వస్తానన్నాను. కానీ అప్పుడే నాకు నమ్మకంలేదు" న్నాడు సుబ్బారావు.   
    రచయిత హతాశుడై రిజిష్ట్రాఫీసు వెళ్ళి __ "సుబ్బారావు తల్లికి అనారోగ్యంగా ఉంది. అందుకని రాలేకపోయాడు" అని అబద్దం చెప్పాడు.   
    "అయితే మరి ఈ పెళ్ళెప్పుడు?" అంది వనజ.
    "నాకీ పెళ్ళి వద్దు" అని సుహాసిని అక్కణ్ణించి చర చరా వెళ్ళిపోయింది.

 Previous Page Next Page