Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 31

    సూర్యముఖి వచ్చిన పని సగం అయింది. ఆ సాయంత్రం రచయితే స్వయంగా వనజను కలుసుకుని - "సుబ్బారావునూ, సుహాసినినీ ఒకటి చేయాలన్న మా సంకల్పానికి అనుకోకుండా మీ అండ కూడా లభించినట్లు తెలిసింది. దయతో అదేదో శీఘ్రంగా జరిగేలా చేయండి. మీకు వెయ్యి నూట పదార్లు బహుమతిగా ఇప్పించుకుంటాను" అన్నాడు.   
    "ఏమిటి మీ అందరికి ఈ పెళ్ళిమీద ఇంత ఆసక్తి!" అంది వనజ.   
    "వాళ్ళు అవతార మూర్తులు" అన్నాడు రచయిత.   
    వీళ్ళిద్దరూ తనను కలుసుకున్నాక వనజ వెళ్ళి అరుణను కలుసుకుంది. "మీ అన్నయ్య మీద ఏదో పెద్ద గూడు పుఠాణి జరుగుతోందని నా నమ్మకం" అంటూ తనకు తెలిసినదంతా పూసగ్రుచ్చినట్లు తెలిపిందామె.   
    అరుణ భయంగా - "శాఖాంతర వివాహమే - మా యింట్లో రక్తాలు కారిపోతాయి" అంది.   
    వనజ చిరాకుపడి - "నేను చెప్పినదాంట్లో నువ్వు గ్రహించినదిదా" అంది. శాఖాంతర, వర్ణాంతర, మతాంతర, దేశాంతర వివాహాలను సమర్ధిస్తూ ఆమె అరుణకో పెద్ద ఉపన్యాసం ఇచ్చి - "అసలు మన యువతరమే ఇలాంటి వాటిని సమర్ధిస్తూ ముందుకు రావాలి. నేను చెప్పేదేమిటంటే-ఎవరో మీ అన్నయ్యతో నాటకమాడుతున్నారు" అంది.   
    వనజ వెళ్ళిపోయాక అరుణ ఆలోచనలోపడింది. సుహాసిని, సుబ్బారావు ఒకరి నొకరు ప్రేమించుకోవడం కోసం వనజ శంకర్ ని ప్రేమించాలా? ఇదంతా ఎవరి మేలుకోసం?   
                                               14   
    మర్నాడు సుబ్బారావు సుహాసినిని కలుసుకున్నాడు. సుహాసిని వనజ సంగతి చెప్పకుండా "ఈరోజు కథ చెబుతారా?" అనడిగింది.   
    సుబ్బారావు మాత్రం ఆమెను సూటిగా "మీకు నేను ఎన్ని కథలయినా చెబుతాను. ముందు మీరు నాకో విషయం చెప్పాలి. మీ బామ్మ సంగతీ, మా అమ్మ సంగతీ తెలిసి కూడా మీరు నన్నెందుకు ప్రేమిస్తున్నారు?" అనడిగేడు.   
    ఈ ప్రశ్నకు సుహాసిని బుగ్గలు ఎర్రబడ్డాయి. ప్రేమిస్తున్నది. తను కాదనీ వనజ అనీ చెప్పాలనిపించింది. అయితే అలా చెప్పేస్తే అతను తనకు శాశ్వతంగా దూరమైపోతాడు. అది తనకిష్టంలేదు. "ఏమో-నాకు తెలియదు" అన్నదామె.   
    సుబ్బారావు తీవ్రంగా ఆమె వంక చూసి "ప్రేమిస్తే పెళ్ళి చేసుకోవాలని మీకు తెలుసా, తెలియదా?" అన్నాడు.   
    సుహాసినికి ఏమనాలో తెలియక. "నాకేమీ తెలియదు" అంది.   
    "పోనీ, నేనూ మిమ్మల్ని ప్రేమిస్తున్నానని తెలుసా?" అన్నాడు సుబ్బారావు.   
    సుహాసిని ఉలిక్కిపడి తలెత్తి సుబ్బారావు వంక చూసింది. ఇద్దరి కళ్ళూ కల్సుకున్నాయి. ఇద్దరికీ ఆ క్షణంలో అంతవరకూ ఎరుగని ఓ వింత అనుభూతి కలిగింది. అలా కొంతసేపు ఉండిపోయారు.  
    సుబ్బారావు నెమ్మదిగా అన్నాడు. "ఆలోచిస్తూంటే నాకు గ్రహింపు అయింది. మీరంటే నాకెంతో యిష్టం. మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరు తోడుగా వుంటే న అజీవితం హాయిగా ఉంటుంది. మీ కోసం నేను నా వాళ్ళందర్నీ వదిలిపెట్టేయగలను. మీరు కూడా నా కోసం మీ వాళ్ళందర్నీ వదులుకుని రాగలరా?"   
    సుహాసిని మళ్ళీ ఉలిక్కిపడింది. వనజ మాటలు ఆమె చెవిలో ప్రతిధ్వనించాయి. అతడి కోసం నేను ఈ ప్రపంచమంతా ఏకమై ఎదురు నిలిచినాధైర్యంగా ఎదుర్కొంటాను."   
    "ఊఁ" అంది సుహాసిని.   
    "అయితే మనం రేపే రిజిస్ట్రాఫీసుకి వెడదాం" అన్నాడు సుబ్బారావు.   
    "ఆఁ" అని నోరు తెరిచింది సుహాసిని.   
    పొదలమాటున్న రాయుడు, రచయిత కొయ్యబారి పోయారు. రామగోపాల్, మోనికా మాత్రం అన్ని భావాలకూ అతీతులై తమ పని చేసుకుపోతున్నారు.   
    "జాప్యం నాకు నచ్చదు. రేపే మన పెళ్ళి. ముందు తెలిస్తే పెద్దలు దీనికి ఒప్పుకోరు. పెళ్ళయ్యాకే పెద్దలకు చెబుదాం" అన్నాడు సుబ్బారావు.   
    సుహాసిని ఇంకా అలా నోరు తెరిచే ఉండిపోయింది.   
    "ఇది కలా, నిజమా?" అన్నాడు రాయుడు.   
    వాళ్ళు చూస్తూండగా సుబ్బారావు, సుహాసిని అక్కణ్ణించి వెళ్ళిపోయారు. ఫలానా టైముకి రిజిస్ట్రాఫీసుకి రమ్మనమని సుహాసినికి చెప్పాడు సుబ్బారావు.   
    "కలో, నిజమో కానీ - ఇలాంటి కధను ఏ ప్రేక్షకుడూ ఒప్పుకోడు" అన్నాడు రచయిత.   
    "అవునయ్యా! చాలా పేలవంగా ఉంది. హఠాత్తుగా ఏమయింది సుబ్బారావుకి."   
    "ఏమో నాకూ తెలియడం లేదు" అన్నాడు రచయిత.   
    రాత్రి కబురు పెట్టకుండానే సుబ్బారావు రాయున్ని కల్సుకుని "సార్! మీరు నా శ్రేయోభిలాషులు. రేపు రిజిష్ట్రాఫీసర్ లో నా పెళ్ళి, మీరు సాక్షి సంతకాలు పెట్టాలి" అన్నాడు.   
    రాయుడాశ్చర్యంగా "పెళ్ళి రిజిస్ట్రాఫీసులో ఎందుకు? మీ అమ్మ చేయదా?" అన్నాడు.   
    "చెయ్యదు. శాఖాంతార వివాహం" అన్నాడు సుబ్బారావు.   
    "మరి ముందుగా మీ అమ్మ నడగొద్దూ" అన్నాడు రాయుడు.  
    సుబ్బారావు గంభీరంగా ఇలా అన్నాడు, "చిన్నప్పట్నించి నన్నో చవటలా పెంచింది. మా అమ్మ నేనలా పెరుగుతున్నట్లు నాకు తెల్సు. కానీ ఆవిన్నెదిరించే శక్తి నాకు లేదు. ఆవిడ వద్దన్న పని ఇంతవరకూ చేయలేదు. స్కూల్లో చదువుకునే నన్ను చూసి కుర్రాళ్ళు వెటకారం చేసేవారు. బాధగా ఉన్నా సహించేవాణ్ని. ఉద్యోగం వస్తే ఇప్పుడు సాటి ఉద్యోగులు గెలి చేస్తున్నారు. లోపం నాలో ఉన్నదని తెల్సు. అమ్మ శిక్షణ నన్ను అపహాస్యం పాలు చేస్తున్నదని తెల్సు. కానీ నేను అసహాయున్ని. చిన్నతనం నుంచి నాలో పేరుకు పోయిన అలవాట్లు ఒక్కసారిగా మారిపోవు. జీవితమంతా ఇలాగే గడిచిపోతుందని నేననుకున్నాను. నాకు నలుగురిలోనూ కలిసి తిరగాలన్నా, మాట్లాడాలన్నా భయం. అలాంటి నన్ను సుహాసినివంటి అందమైన అమ్మాయి పిలిచి ప్రేమించానని చెప్పింది. జీవితంలో ఊహించని సంఘతన అది. ఇప్పటికీ నమ్మడం కష్టంగా ఉంది నాకు. ఏమైతే నేం అది జరిగింది. ఈ ప్రేమ బహుశా నా జీవితంలో ఒక మలుపు అనుకుంటాను. ఇలాంటి అవకాశాలు ఎవరికో ఎప్పుడోగానీ రావు. ఇవి నేను వదులుకోదల్చుకోలేదు. నన్ను రౌడీల బారినుండి రక్షించిన సుహాసిని ఈ మనస్తత్వం బారినుంచికూడా రక్షించి నన్ను నలుగురి మగాళ్ళలాగే తయారుచేయగలదని నా ఆశ అదీగాక ఆమె నన్ను ప్రేమించాననడం నాకో పెద్ద గౌరవం. ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకోదలిచాను. అయితే ఈ పెళ్ళికి అమ్మ ఒప్పుకోదు. ఆవిడ వద్దన్న పని చేయలేను. ఈ పెళ్ళి ఆవిడ వద్దన్న పని కాకూడదనే విషయం నేనావిడకు చెప్పలేదు. ఆవిడ చేత వద్దనిపించుకోకుండానే నేనీ పెళ్ళి చేసుకోబోతున్నాను. చేసుకుని ఆవిడవద్దకు దీవెనల కోసం వెడతాను."

 Previous Page Next Page