Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 31

   
    అబ్బాయిల్లో రమణ కూడా వున్నాడు.

     "అదే తెలివితేటలంటే. రిలీజ్ సినిమాకి తప్ప మనం మరో సినిమాకు వెళ్ళమని  తెలుసు " చెప్పింది రాధ.

    వేదవతి అయినా వుంటే ధైర్యంగా ఉండేది.

     " అమె మొగుడ్ని తీసుకుని రూమ్ కెళ్ళింది " అన్న సమాచారంతో లేని ధైర్యం తెచ్చుకున్నాను.

    టికెట్లు తీసుకుని లోపలికెళ్ళాం.

    మేం సీట్లలో కూర్చోడం తరువాయి సినిమా మొదలైంది. మావెనుక అబ్బాయిలొచ్చారు.

    వాళ్ళు కావాలనే లైట్లు అరిపోయాక వచ్చారని అర్ధమైంది. అప్పుడైతే కనపడలేదన్న సాకుతో ముందున్న వాళ్ళమీద చేతులు వేయచ్చు.

    నాకు కరెక్టుగా వెనక రమణ కూర్చున్నట్టున్నాడు. అతని మాటలు నా చెవులకు విన్పిస్తున్నాయి.

    నేను సినిమాలో లీనం కాలేకపోయాను.

    అప్పుడప్పుడు చేతివేళ్ళు నా వీపుమీద పడి, దాని నునుపుకి మళ్ళీ జారిపోతున్నట్లు కదులుతున్నాయి. అలా జరిగినప్పుడల్లా ఏదో తెలియని పులకింత నా శరీరాన్ని ఊపుతోంది. దీనిని తప్పించుకోవాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. అయినా ముందుకు జరిగి సీటు అంచుమీద కూర్చుంటున్నాను.

    నా పక్కన సుచరిత వుంది. అమెకు పాతికేళ్ళు పైగానే వుంటాయి. ఇంకా పెళ్ళి కాలేదు. అమె వెనక రవీంద్ర వున్నట్టున్నాడు. వాళ్ళిద్దరూ లవర్స్ అనీ, తొందర్లో పెళ్ళి చేసుకోబోతున్నారని ప్రచారం అప్పటికి సంవత్సరం నుంచీ జరుగుతోంది.

    అమె రావడంవల్లే అతనూ సినిమాకు వచ్చాడు.

    థియేటర్ లోకి వచ్చేముందే ఎవరు ఎవరి వెనకాల కూర్చోవాలో డిసైడ్ చేసుకుని వచ్చుంటారు.

    పాపం సుజచరితకూడా అటూ ఇటూ కదులుతుండడంబట్టి చూస్తే అక్కడా ఏదో జరుగుతున్నట్టు నాకు తోచింది. పక్కకి  తిరిగి చూడాలని వున్నా పగ్గాలు వేసి బిగించినట్టు అటువైపుకి తిప్పలేదు.

     "జాకెట్టుకు ముళ్ళు వేయడం ఏమిటి నాన్నెన్స్ పాత యుగంలో రైకకు హుక్ లు లేకపోతే ఇలా ముడివేసేవారు ఛీ ఛీ  "రవీంద్ర విసుక్కోడం నాకు విన్పిస్తూ వుంది.  అతను ఏ సమయంలో ఆ మాటాలన్నాడో ఊహిస్తే సిగ్గు బుగ్గలమీద స్వారీ చేసింది.

    సుచరిత మాత్రం ఏం చేస్తుంది? హుక్ తేగిపోతే విధిలేక రెండు కొనల్నీ ఒకటిగా చేర్చి ముడేసుకుని వుంటుంది. ఇటువంటి విషయాల్ని పదిమందిలో అంత గట్టిగా రవీంద్ర చెప్పడం ఏమీ బాగాలేదు.

    ఓ నిముషం తరవాతనుకుంటాను. సుచరిత మెల్లగా నన్ను  అడిగింది.  "జాకెట్ హుక్ సాయంకాలం తెగిపోయింది! పిన్నీసుంటే ఇస్తావా?"

     "లేదే " అంది తను.

    ఇక సుచరిత ఎవర్నీ అడగలేదు. అల్లరైపోతుందని ఇంట్రవెల్ అయింది.

     "రండి- కూల్ డ్రింక్ తాగుదాం " అని మమ్మల్నందర్నీ పిలిచాడు రమణ.

     "వెళదాం రండే " రాధ ముందే లేచింది.

    ఇక మాకూ తప్పలేదు.

    అందరం కూల్ డ్రింక్ అంగడి దగ్గరికి వెళ్ళాం.

     "పన్నెండు పన్నీర్ షోడా " అర్డరిచ్చాడు రమణ.

    కూల్ డ్రింక్ అంటే మా దృష్టిలో షోడానే. ఇప్పట్లా థమ్స్ అప్ లూ, లిమ్కాలూ, కోకోకోలాలు, పెప్సీలు అప్పట్లో అంత ప్రాచుర్యంలో లేవు. ఎవరో మరీ గొప్పవాళ్ళు అవి తాగేవారనుకుంటా.

    పన్నీరు షోడా తాగాక మేం లోపలికెళ్లాం.

    రవీంద్రాలంటి వాళ్ళు సిగరెట్టు వెలిగించారు.

    తిరిగి సినిమా మొదలైంది.

    నేను మరింత జాగ్రత్తగా కూర్చోవడంవల్ల వేళ్ళు తగలడంలేదు. నేను రిలీఫ్ గా ఫీలయ్యాను.

    పాపం, రవీంద్ర, సుచరిత సినిమా అయిపోయేవరకు ఏదో అవస్ధలు పడుతూనే వున్నారు.

    సినిమా అయిపోయింది. తిరిగి సత్రానికి బయల్దేరాం.

    మేం వెళ్ళేసరికి పెళ్ళిపనులు జరుగుతున్నాయి. అక్షింతలు కలపడం, తాంబూలాలు, ఓ కొబ్బరికాయను, సంచిలో వేయడం, టిఫిన్లు, తయారుచేయడంలో పడిపోయారు. నాలుగ్గంటల ప్రాంతాన వేదవతి వచ్చింది.

 Previous Page Next Page